సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 72వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఈగ రూపంలో బిస్కెట్ ఆరగించిన శ్రీసాయి. 
  2. బాబా అనుగ్రహం ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది.

ఈరోజు నాకు జరిగిన రెండు స్వీయ అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు సాయి తాము  సర్వజీవ స్వరూపుడనని తెలియజేసిన సాయి లీలామృతంలోని ఒక లీలను మీ ముందుంచుతాను.


ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానాచందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటిమీద ఈగలు, చీమలు చేరాయి. అపుడు సాయి నానాతో, “నేను ఆరగించాను. నీవు తీసుకో!” అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నం గూడ తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, “నానా, 18 సం||లు నా దగ్గరుండి నీవు గ్రహించినదిదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో!” అన్నారు. “వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు ఋజువేమిటి?” అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే వున్నారని నాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. ఇక నా అనుభవానికి వస్తే, 

ఈగ రూపంలో బిస్కెట్ ఆరగించిన శ్రీసాయి.

2019, మే15 ఉదయాన, కాసేపట్లో నా పూజ పూర్తవుతుందన్న సమయంలో మా తమ్ముడు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి, బాబాకు పెట్టమని ఒక బిస్కెట్ నా చేతికిచ్చాడు. నేను అది అందుకుంటూ నా మనసులో, "పూజ పూర్తయ్యే సమయంలో ఇచ్చాడు, ఇలా బాబా ముందు పెట్టి, ఆయనకి చూపించి అలా తీసినట్లుంటుంది. కనీసం ఆయన తినే సమయమైనా ఇవ్వాలి కదా!" అని అనుకున్నాను. తరువాత బాబా ముందున్న ప్లేటులో ఆ బిస్కెట్ పెట్టాను. సాధారణంగా మా ఇంటి ప్రాంగణంలో చాలా అరుదుగా ఈగలు కనిపిస్తాయి. అలాంటిది బిస్కెట్ పెట్టిన వెంటనే ఒక ఈగ వచ్చి దాని మీద వాలింది. నేను ఆశ్చర్యపోతూ, "అరే! బాబా తినకముందే బిస్కెట్ తీసెయ్యాలా అని అనుకుంటే, మరుక్షణంలో ఈ ఈగ వచ్చి వాలింది. ఈ రూపంలో వచ్చింది బాబా కాదు కదా?!" అని అనుకున్నాను. ఆ రూపంలో వచ్చింది బాబానో కాదో తెలుసుకుందామని ఇలా అనుకున్నాను: "బాబా! ఆ రూపంలో వచ్చింది మీరే  అయితే నా పూజ పూర్తయ్యేవరకు అక్కడే ఉండాలి" అని. తర్వాత నేను ముందుగా దాని ప్రక్కనే ఉన్న దీపం తీసుకుని బాబాకి హారతి ఇచ్చాను. తర్వాత అక్కడే ఉన్న ఆరతి స్టాండ్, గంట తీసుకుని, గంట వాయిస్తూ బాబాకి హారతి ఇచ్చాను. నేను ఇన్ని చేస్తున్నా అది అక్కడినుంచి కాస్త కూడా కదలలేదు. మామూలుగా ఈగలు స్థిరంగా ఒక క్షణం కూడా ఉండవు. కానీ నేను అటు ఇటు కదులుతూ అంత అలికిడి చేస్తున్నా అది అక్కడనుండి కదలనేలేదు. బిస్కెట్ మీదనే కదులుతూ ఉంది. నా పూజ పూర్తై ఇక నేను బయటకు వచ్చేస్తానన్న క్షణంలో అది ఎగిరిపోయింది. మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దాంతో నిజంగా బాబాయే వచ్చారని నాకు నిర్ధారణ అయ్యింది. ఇక నేను పొందిన ఆనందాన్ని ఎవరైనా ఊహించవచ్చు. రోజంతా అదే ఆనందంలో ఉన్నాను. ఏదో మాములుగా, 'బాబా తినకుండా బిస్కెట్ తీసేయాలా?' అని అనుకున్నందుకు "ప్రేమతో భక్తులు పెట్టేది ఏదైనా స్వీకరిస్తాన"ని బాబా నిరూపిస్తూ నన్ను ఆనందంలో ముంచేశారు. "థాంక్యూ సో మచ్ బాబా! ఈగ రూపంలో వచ్చింది మీరేనని నిదర్శనమిచ్చి నాకు అమితమైన ఆనందాన్నిచ్చారు".

బాబా అనుగ్రహం ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది.

బాబా అనుగ్రహిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి అనుగ్రహ చిహ్నమైన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను.

2011వ సంవత్సరంలో మా ఇంటిపై ఫస్ట్ ఫ్లోర్‌లో గృహ నిర్మాణం మొదలుపెట్టాము. నిర్మాణం పూర్తయ్యాక ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలన్నది మా ఆలోచన. అయితే నిర్మాణం మొదలైనప్పటినుండి నా మనసులో ఒక ఆందోళన మొదలైంది. అదేమిటంటే, ఇంటి ఓనర్స్, అద్దెకు ఉండేవాళ్లు ఒకేచోట ఉంటే, వాళ్ళు గేటు సరిగా వేయలేదనో, గోడకు మేకులు కొట్టారనో, ఇలా చీటికీ మాటికీ రకరకాల సమస్యలు వస్తుంటాయని. అలాంటివి ఇదివరకు మా స్వానుభవమే. 2012 నాటికి మొదటి అంతస్తులో ఇల్లు, ఆ పైన ఒక సింగిల్ రూమ్ నిర్మాణం పూర్తై, ఫిబ్రవరి మొదటివారంలో చిన్ని బాబా విగ్రహంతో గృహప్రవేశం చేసుకున్నాము. తర్వాత టు-లెట్ బోర్డు పెట్టాము. ఎవరో ఒకరు వచ్చి, చూసి వెళ్తుండేవారు. అలా ఫిబ్రవరి నుండి జూన్ వరకు నాలుగు నెలలు గడిచినా అద్దెకు దిగడానికి ఎవరూ కుదరలేదు. దాంతో నెలలు గడుస్తున్నా అద్దెకు ఎవరూ కుదరడం లేదేమిటని అనిపించినా, "బాబా ఉన్నారు, ఆయన సరైన వారిని చూపిస్తారు. ఆందోళనపడాల్సిందేమీ లేద"ని అనుకునే వాళ్ళం. ఈలోగా ఆషాఢ మాసం కూడా వచ్చింది. అది శూన్యమాసమని ఎవరూ ఇంట్లో దిగరు. కాబట్టి ఆ నెల కూడా ఖాళీగానే ఉంటుందని మావాళ్లు అన్నారు. బాబా అద్భుతం చేసారు. జూన్ 28న ఇల్లు చూడటానికి ఒక ముగ్గురు వచ్చారు. వాళ్ళకి ఇల్లు బాగా నచ్చి, రెంట్ మాట్లాడుకుని, 'జులై 3 గురుపూర్ణిమనాడు ఇంట్లో దిగుతామ'ని చెప్పారు. ఆషాఢమాసంలో ఎవరూ ఇంట్లో దిగరని అనుకుంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ బాబా అనుగ్రహించారు. పైగా గురుపూర్ణిమనాడే వాళ్ళు ఇంట్లో దిగడం బాబా అనుగ్రహానికి స్పష్టమైన చిహ్నం. ఇంకోవిషయం, వాళ్లు శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల గ్రానైట్ బిజినెస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి ఉండటానికి, ఆఫీస్ వర్క్ చూసుకోవడం కోసం మా ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఏ రెండునెలలకో, మూడునెలలకో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడు కూడా అసలు మనుషులు ఉన్నారా లేదా అన్నట్లు ఉంటారు. నేను ముందు భయపడినట్లు వాళ్లతో ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తుండటం వలన ఇప్పటికీ మా ఇల్లు కొత్త ఇల్లు లాగానే ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అద్దెకి దిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఖాళీ చేయడం, కొత్తవాళ్లు దిగేవరకు ఆ ఇళ్ళు ఖాళీగా ఉండటం జరుగుతున్నా, బాబా అనుగ్రహం వలన మాకు అటువంటి సమస్యలు కూడా లేవు. ఈ గురుపూర్ణిమకి వాళ్ళు మా ఇంట్లో దిగి ఏడేళ్లు పూర్తవుతుంది. బాబా అనుగ్రహిస్తే అంత అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని ప్రలోభాలకు లోనై ఆయన అనుగ్రహించిన దానిని మనమే దూరం చూసుకుంటామేమోగానీ, ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది.

2 comments:

  1. శ్రీ వాణిJune 15, 2019 at 7:08 PM

    సాయిరాం. .ఇలాగే ఒకసారి, బాబా కి బిస్కెట్ నైవేద్యం గా పెట్టాను.ఎందుకో ఆరోజు బాబా నువ్విరోజు తప్పకుండ బిస్కెట్ తినాలి అనుకున్నాను .కాసేపయ్యాక చూస్తే బిస్కెట్ ఎవరో కొంచం కొరికి తిన్నట్లు గా వుంది. బాబా తిన్నాడేమో అని ఆనందపడుతుండగా,పూజా పీఠం పై చిన్న జల్లిపురుగు కనిపించింది.జల్లిపురుగు బిస్కెట్ తిన్నది కానీ బాబా తినలేదు అని బాధ paపడ్డాను. కానీ మళ్ళీ బాబా ఆ జల్లిపురుగు రూపం లో వచ్చారేమో, ఎప్పుడూ లేనిది ఈరోజు ప్రసాదం తినమని అడిగినప్పుడే జల్లిపురుగు పీఠం పై వచ్చి తిన్నది కాబట్టి బాబా నే ప్రసాదం తిన్నారని ఆనందపడ్డాను ..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo