సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 39వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 39వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -63

శిరిడీలో రామ్ గిర్ బువా అనే పేరు కలిగిన గోసావి నివసిస్తాడు. తనకు ఒకసారి బాబా, నానాసాహెబ్ చందోర్కర్ వద్దకు ఊదీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. అప్పట్లో నానాసాహెబ్ జామ్నేరులో మామ్లేదార్ గా పనిచేస్తున్నారు. ఆ రోజులలో జామ్నేరుకు రైల్వేలైను లేదు. జల్గావ్ వరకు రైలులో వెళ్ళి, అక్కడ నుండి నడక దారిలో జామ్నేరుకు చేరవలసి ఉంటుంది. రామ్ గిర్ బువా  వద్ద కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాంతో తాను బాబాను “నా దగ్గర నున్న డబ్బులతో జామ్నేరు వరకు వెళ్ళడం ఎలా కుదురుతుంది?” అని అడిగాడు. అప్పుడు బాబా “బాపుగిర్ (తనను బాబా ఎప్పుడూ బాపుగిర్ అని పిలుస్తారు) నువ్వు బయల్దేరు. అన్నీ ఏర్పాట్లు జరుగుతాయి” అని అన్నారు. బాబా ఆ మాటలను అనేటప్పుడు మాధవరావు అక్కడే ఉన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం తాను బయలుదేరాడు. జల్గావ్ వరకు అయిన ఖర్చులు పోగా తన వద్ద కేవలం రెండు అణాలు మాత్రమే మిగిలాయి. “తరువాత ఏం చేయాలి?" అనే ఆలోచనతో స్టేషను నుండి బయటకు వచ్చాడు. అంతలో ఒక బంట్రోతు “శిరిడి నుండి వచ్చిన బాపుగిర్ గోసావి ఎవరు?” అని కేకలు వేయసాగాడు. అప్పుడు రామ్ గిర్ బువా  వెళ్ళి “నేనే బాపుగిర్ గోసావిని, విషయం ఏమిటి?” అని అడిగాడు. అందుకు ఆ బంట్రోతు “నన్ను నానాసాహెబ్ చందోర్కర్ టాంగా ఇచ్చి పంపించారు. అందువలన టాంగాలో కూర్చోండి, జామ్నేరుకు వెళదాం” అని చెప్పాడు. రామ్ గిర్ బువా ఎంతో  ఆనందించాడు. “బాబా, మాధవరావ్ ద్వారా నానాసాహెబ్ చందోర్కర్‌‌కు కబురు పంపించి ఉంటారు” అని అనుకోని బువా టాంగాలో కూర్చొని, జామ్నేరుకు వెళ్ళాడు. టాంగాను మామ్లేదారు  కార్యాలయం వద్ద ఆపి, రామ్ గిర్ బువా ను లోపలకి  వెళ్ళమని చెప్పాడు. రామ్‌‌గిర్‌‌బువా లఘుశంక కోసమై, కూర్చొన్నాడు. లఘుశంక  తీర్చుకుని లేచిచూస్తే గుఱ్ఱం, బంట్రోతు ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళి విచారిస్తే నావాసాహెబ్ ఇంట్లో ఉన్నారని తెలిసింది. అప్పుడు బువా వెతుక్కుంటూ నానాసాహెబ్ ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే నానాసాహెబ్ రామ్‌‌గిర్‌‌బువా కలిసారు. అప్పుడు బువా ఊదీని నానాసాహెబ్ ముందర ఉంచారు. నానాసాహెబ్ ఆ ఊదీని తీసుకొని ఆయన శ్రీమతికి ఇచ్చారు. అదే సమయంలో నానాసాహెబ్ కూతురు ప్రసూతి వేదన పడుతూ, ఆమెకు కాన్పు కావడం లేదు. ఊదీ కలిపిన నీటిని ఆ అమ్మాయికి తాగించి, నుదిటిపై ఊదీ పెట్టారు. తరువాత మూడు నిముషాల లోపే ఆ అమ్మాయికి సుఖప్రసవం జరిగింది. నానాసాహెబ్ రామ్‌‌గిర్‌‌బువాను చక్కగా సత్కరించి, మంచి సంభావనను బహుకరించారు. టాంగా విషయమై విచారించగా తాను టాంగాను కానీ, బంట్రోతుని కానీ పంపలేదని నానాసాహెబ్ రామ్‌‌గిర్‌‌బువాకి చెప్పారు. అంటే ఇదంతా శ్రీ సాయిబాబా లీల. ఆయనే టాంగాగా, గుఱ్ఱంగా, టాంగా వాలాగా, బంట్రోతుగా అయ్యారు.

అనుభవం -64

పార్లేలో నారాయణ్ మహాదేవ్ ఠోసర్ అనే పేరు కలిగిన బాబా భక్తుడు ఉండేవారు. ఆయన బాబాను హనుమంతునిగా భావించి ఉపాసనను చేసేవారు. అందువలననే తాను ఎంతో ఖర్చు పెట్టి పార్లేలో దేవాలయం కట్టించి, అందులో హనుమంతుని స్థాపన చేసారు. ఆ విగ్రహ స్థాపన 1-4-1918వ రోజున జరిగింది. విగ్రహంపై “శ్రీ” అనే అక్షరాన్ని, కుడివైపున “సాయి” అని, ఎడమవైపున “హనుమాన్” అనే అక్షరాలను చెక్కించారు. పార్లేలో స్థాపన జరిగిన రోజు శిరిడీలో బాబా బర్ఫీ తెప్పించి తమ చేతుల ద్వారా అందరికీ పంచారు. అంతేకాదు, అదే రోజు ద్వారకామాయిలో శ్రీ సత్యనారాయణపూజ జరిగింది. ప్రసాదాన్ని అందరికీ పంచడం జరిగింది. సారాంశమేమంటే ఏరోజైతే పార్లేలో ఆనందంగా ప్రసాదవినియోగం జరిగిందో, అదేరోజు శిరిడీలో కూడా ఎంతో సంబరంగా ప్రసాదవినియోగం జరిగింది.

అనుభవం - 65

శిరిడీలో దాజీ వామన్ చితంబర్ అనే పేరు కలిగిన హెడ్ మాస్టర్ ఉండేవారు. అయన ఇక్కడకు వచ్చిన కొద్దిరోజులకు ఆయన, నేను కలుసుకోవడం జరిగింది. అప్పుడు  ఆయన "నేనింతవరకు శిక్షకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నా పేరు ఇక్కడ నాశనమైపోయేటట్లు ఉంది. ఇక్కడ పిల్లలు ఎవరూ చదవరు. ఏం చేస్తారని అడిగితే 'మేము అప్పుడు బాబా వద్ద ఊదీ తీసుకొని వస్తాము, పరీక్షలో ఉత్తీర్ణులవుతాము' అంటారు” అని చెప్పి బాధపడ్డారు. ఆ తరువాత 5,6  నెలలకు వార్షికపరీక్షలు జరిగాయి. ఆ తరువాత హెడ్ మాస్టరు నన్ను కలిసినప్పుడు, తానే స్వయంగా “పిల్లల వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. వారు చెప్పినట్లే జరిగింది. పిల్లలందరూ బాబా వద్ద ఊదీ తీసుకొని వచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు” అని అన్నారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo