సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 67వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • ప్రేమమూర్తి అయిన శ్రీసాయిబాబా తమ భక్తులను పరీక్షించిన వైనం

ప్రేమమూర్తి అయిన శ్రీసాయిబాబా తమ భక్తులను పరీక్షించిన వైనం

సాయిభక్తుడు సచిన్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

కాలంతోపాటు వెనుకకు (భూతకాలంలోకి) ప్రయాణించి శ్రీసాయిబాబాను నా కళ్ళతో స్వయంగా చూడాలని నా ఆకాంక్ష. ప్రతి సాయిభక్తుని మదిలో ఇలాంటి కోరిక అజ్ఞాతంగా దాగి ఉంటుంది. నేను సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్న ప్రతిసారీ నా మనస్సు బాబా జీవించివున్న ఆ కాలంలోకి వెళ్ళిపోతుంది. భూలోక స్వర్గమయిన బాబా వారి ద్వారకామాయి ఎలా ఉండివుండేదోనని నేను ఆశ్చర్యపడుతుండేవాడిని. శ్రీసాయిబాబా అనుగ్రహవీక్షణం అసంఖ్యాక సాయిభక్తుల దురదృష్టాలను తొలగించి, ఎందరో దుర్మార్గులను సన్మార్గులుగా మార్చి, చివరికి వారికి ముక్తిని ప్రసాదించింది (ఆధ్యాత్మిక గమ్యాన్ని సిద్ధింపచేసింది). వారి అనుగ్రహవీక్షణానికై గుంపులు గుంపులుగా వచ్చే సాయిభక్తులను చూడాలని నా కళ్ళు ఎదురుచూస్తున్నాయి. బాబా సర్వకాల సర్వావస్థలలోనూ ఉన్నారనే విషయంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు, కానీ సాయిబాబాను సశరీరంతో చూడాలనే కోరిక మాత్రం నా మదిలోనుంచి ఎన్నటికీ పోదు.

బాబా ఇలా అనేవారు - “ఏదో ఒక కారణం లేనిదే, లేదా ఏదన్నా సందేశం ఇవ్వదలుచుకోనిదే నేను ఎవరికీ స్వప్నంలో దర్శనమివ్వను” అని. కానీ ఆ స్వప్నదర్శనం మన కోరికకు లేదా ఆనందానికి అనుగుణంగా లేకపోతే, మనం దానిగురించి పట్టించుకోము. అటువంటి అనుభవమే ఒకటి నాకు కలిగింది. సాయిబాబా స్వప్నదర్శనమిచ్చి మనకేమైనా బోధిస్తే దానిని మనం తప్పకుండా పాటించాలని నాకు బాగా తెలుసు.

నేను అప్పుడప్పుడు మద్యం (ఆల్కహాలు) తీసుకుంటుండేవాడిని. మద్యపానం జీవితంలో భాగమేనంటూ నా స్నేహితులతో కలిసి మందు తీసుకుంటుండేవాడిని. మందు త్రాగటం సాయిబాబాకు ఇష్టంలేదని నాకు బాగా తెలుసు. కానీ అది నా ఇష్టానికి విరుద్ధంగా ఉండటంతో, నేను “అప్పుడప్పుడు కొంచెం మద్యం సేవిస్తే ఏమీ కాదులే” అని అనుకొనేవాడిని. నేను మా ఇంటికి దూరంగా ఉండటంతో, అప్పుడప్పుడు తీసుకొనే ఈ అలవాటు ఒక వ్యసనంగా మారిపోయింది. దానివల్ల, ప్రతి రెండురోజులకొకసారి 2-3 బీర్లు తీసుకోవడం, లేదంటే 2-3 రోజులు వరుసగా మద్యం సేవించటం మొదలుపెట్టాను.

ఒకరోజు నేను స్టార్ ప్లస్ టి.వి.లో శిరిడీ సాయిబాబా సీరియల్ చూస్తున్నాను. ఆ ఎపిసోడులో, ఒక బాబా భక్తుడు తాను విపరీతంగా త్రాగడమే కాకుండా, తాత్యాను (బయజాబాయి కుమారుడు) కూడా త్రాగమని బలవంతం చేస్తుంటాడు. సాయిబాబా దానిని ఆమోదించలేదు. అంతేకాకుండా, ఆ భక్తునికి అతడు పూర్తిగా త్రాగుడు మానివేస్తానని వాగ్దానం చేసేదాకా అతని ఛాతీపై కూర్చున్నట్లు బాబా స్వప్నదర్శనమిచ్చారు. ఆ ఎపిసోడ్ నామీద బాగా ప్రభావం చూపింది. అయినా నేను త్రాగుడు మానలేదు. ఒక వారం తరువాత నుండి మళ్ళీ నా స్నేహితులతో కలిసి మందు తీసుకోవటం మొదలుపెట్టాను. వారాలకు వారాలు గడిచిపోతున్నాయి. ఆ అలవాటు దురభ్యాసంగా మారిపోయింది.

కానీ ఒకరోజు రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు, బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. నాకు పూర్తిగా గుర్తులేదు కానీ, ఆ స్వప్నంలో బాబా నా త్రాగుడు వ్యసనం గురించి నాకు ఏవో సూచనలు ఇస్తున్నారు. నిద్రలేచాక ఆ స్వప్నాన్ని గుర్తుతెచ్చుకున్నాను. కానీ నా అజ్ఞానంతో బాబా ప్రసాదించిన ఆ స్వప్నానుభవాన్ని “కేవలం కలే కదా!” అని నిర్లక్ష్యం చేశాను. నా త్రాగుడు అలవాటును కొనసాగించాను. కొద్దిరోజుల తరువాత అటువంటి స్వప్నానుభవాన్నే బాబా మళ్ళీ ప్రసాదించారు. స్వప్నంలో నేను బీరు బాటిల్ పట్టుకొనివుండగా, బాబా నా ముందు నిలబడి నాతో ఏదో చెబుతున్నారు. ఈసారి సూచనలు ఇస్తున్నట్లు కాకుండా, త్రాగుడు వ్యసనాన్ని మానమని బాబా నన్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నేను నిద్ర మేల్కొన్న తరువాత ఆ స్వప్నాన్ని గుర్తుచేసుకున్నాను. కానీ బాబా స్వప్నంలో ఇచ్చిన మోతాదు ఇంకా చాలలేదు.

కొద్దిరోజుల తరువాత నా సోదరుడు గౌరవ్ పూనాకు వచ్చినప్పుడు మా గ్రూపుతో కలిసి మళ్ళీ నేను మద్యం తీసుకున్నాను. ఆరోజు రాత్రే 102-103 డిగ్రీల జ్వరంతో నేను జబ్బుపడ్డాను. సమయానికి దగ్గరలో డాక్టరు ఎవ్వరూ అందుబాటులో లేకపోవటంతో ఆ రాత్రి నాకు కాళరాత్రి అయ్యింది. అప్పుడు సమయం తెల్లవారుఝామున 3 గంటలయింది. నేను బాబా ఫోటో దగ్గర పడుకొని ఉన్నాను. బాబాను ప్రార్థించి నన్ను మన్నించమని వేడుకున్నాను. నా పరిస్థితి బాగా విషమించింది. నేను వరుసగా వాంతులు చేసుకుంటున్నాను. జ్వరతీవ్రత వల్ల నా ఒంట్లోనుంచి సెగలు వస్తున్నాయి. నేను బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు.

నా తమ్ముడు పంజాబు నుంచి వస్తున్నందున, ప్రక్కరోజు అతనిని తీసుకొని మేము శిరిడీకి  వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నాము. నేను అంత జ్వరంలోనూ బాబాను స్మరించుకుంటూ శిరిడీకి బయలుదేరాను. శిరిడీకి చేరుకున్న తరువాత కూడా జ్వరంవల్ల నేను బాబామీద మనసు లగ్నం చెయ్యలేకపోయాను. సమాధిమందిరానికి వెళ్ళటానికి క్యూలో వెయిట్ చేస్తున్నప్పుడు కూడా సమయం గడిచేకొద్దీ నాలో అసహనం పెరుగుతున్నదే కానీ బాబాపై మాత్రం మనసు లగ్నం చెయ్యలేకపోయాను. నన్ను క్షమించమని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. కానీ నా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు.

మేము ప్రక్కరోజే పూనాకు చేరుకుని సాయిభక్తుడైన ఒక డాక్టరును కలిసాము. ఆయన క్లినిక్‌లో బాబా ఫోటోను చూసినప్పుడు కూడా బాబాను క్షమించమని వేడుకున్నాను. చిట్టచివరకు డాక్టర్ ఇచ్చిన మొదటి డోస్ తీసుకున్నప్పటినుండి జ్వరం తగ్గుముఖం పట్టటం మొదలుపెట్టి రెండురోజులలో నేను పూర్తిగా మామూలు మనిషినయ్యాను. అప్పటినుండి మళ్ళీ మందు ముట్టనని బాబాకు ప్రమాణం చేసాను. ఇంత జరిగినా నాలాంటి దౌర్భాగ్యుడికి బుద్ధి రాలేదు.

ఒక నెల తరువాత మళ్ళీ ప్రతిరోజూ త్రాగటం మొదలుపెట్టాను. దాంతో బాబా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు సాయంత్రం నా వ్యక్తిగత జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది (దాన్ని నేను ఇక్కడ ప్రస్తావించటం లేదు). సాయిభక్తుడైన నా స్నేహితుడు వరుణ్ ని కలిసినప్పుడు, నేను బాబాకిచ్చిన వాగ్దానాన్ని పూర్తిచేయకపోవటమే నా దురదృష్టానికి కారణం అని నేను అనుకోసాగాను. అప్పుడు జరిగినదంతా వరుణ్ తో పంచుకున్నాను. బాబాను క్షమించమని అడగటానికి కూడా సిగ్గుతో కృంగిపోయాను. కానీ వరుణ్ మాత్రం, బాబా చాలా దయార్ద్రహృదయులని, మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉన్నట్లయితే (మద్యం ముట్టటం) వారు తప్పక అతడిని క్షమిస్తారని చెప్పాడు.

తరువాత వరుణ్ తనతో పాటు నన్ను బాబా మందిరానికి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో మందిరంలో ఎవ్వరూ లేరు. నేను బాబా పాదాలపై పడి నన్ను క్షమించమని మళ్ళీ వేడుకుని, దీనదయాళువు, దయామయి అయిన బాబావైపు చూశాను. బాబా నన్ను దయతో క్షమించారు. మందిరంనుంచి ఇంటికి వెళుతున్నప్పుడు, నాకు జరిగిన దురదృష్ట సంఘటన వల్ల ఏదైతే పొరపాటు జరిగిందో అదంతా ఇప్పుడు బాగయిందని మా ఇంటి దగ్గర నుండి నాకు ఫోను వచ్చింది. ఇది జీవితంలో నేను నేర్చుకున్న విలువైన పాఠం. అప్పటినుండి నేను త్రాగుడు పూర్తిగా మానివేసాను.  ఇప్పటికి 8 నెలలయింది. బాబా దయవల్ల ఇకమీదట కూడా నేను ఇలాగే ఉండగలను. నాలో ఉన్న దుర్గుణాలను నెమ్మది నెమ్మదిగా తొలగించమని బాబాను ప్రార్థిస్తున్నాను.

సచిన్ ఈ సంఘటనను తన స్నేహితులతో మరియు తన సహోద్యోగులతో పంచుకున్నాడు. వాళ్ళల్లో సాయిభక్తుడైన సతీష్ సౌరవ్ ఇలా అన్నారు – “మనమందరం సచిన్ షామాకు తన వ్యక్తిగత అనుభవాన్ని మనతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎప్పటికప్పుడు మన చెడు వ్యసనాలను తొలగించుకోవటానికి బాబా మనకు సూచనలు ఇస్తూనే ఉంటారు. పై సంఘటన మనకందరికీ కనువిప్పు కావాలి.  పంచుకున్నందుకు కృతజ్ఞతలు”

source: https://www.shirdisaibabaexperiences.org/2009/04/loving-sai-babaji-sometimes-punishes-us.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo