సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 78వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. 'నేనున్నాన'ని నిదర్శనమిచ్చిన బాబా
  2. భక్తులు కష్టంలో ఉంటే బాబా తప్పక సహాయం చేస్తారు

సాయిబంధువులందరికీ సాయిరామ్! నేను భువనేశ్వర్ నుండి మాధవిని. చాలారోజుల తరువాత ఈ బ్లాగు కోసం రెండు లీలలను వ్రాసే అవకాశం బాబా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయినాథుని లీలలు సాయిభక్తులందరినీ దగ్గర చేస్తాయి. బాబా లీలలతో నేను పొందిన ఆనందాన్ని మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. అందరికీ బాబా ఆశీస్సులు లభించుగాక!

'నేనున్నాన'ని నిదర్శనమిచ్చిన బాబా

ముందుగా నాకు 2019 జూన్ 15 ఉదయాన బాబా ఇచ్చిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మావారు హఠాత్తుగా 2019, జనవరి మొదటివారంలో అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నారు. దాదాపు ఐదు నెలలు మేము చాలా యాతన అనుభవించాము. తప్పనిసరి పరిస్థితిలో నేను సంబల్పూర్ వెళ్లి డ్యూటీలో జాయినయ్యాను. 2019, జూన్ 14 రాత్రి నేను వీడియో కాల్ చేసి మావారితో మాట్లాడాను. ఐదు నెలల అనారోగ్య కారణంగా బక్కచిక్కిపోయి వున్న మావారిని చూసి నాకు దుఃఖం ఆగలేదు. బాబా ముందు కూర్చుని, "ఐదు నెలలు దాటింది, సమస్య ఇంకా అలాగే ఉంది బాబా. ఎప్పుడు నీకు నా మీద దయ కలుగుతుంది? గురువుగారు(లక్ష్మోజీ) 'ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉన్నావ'ని అంటూ ఉంటారు. మరి ఎక్కడ ఉన్నావు బాబా?" అని చాలా ఏడ్చాను. తరువాత నిద్రపోయాను. తెల్లవారి 5 గంటలకు మెలకువ వచ్చింది. ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. ఏమిటిది? నా భ్రమా? అని అనుకున్నాను. ఈసారి ఇంకా గట్టిగా వినిపించింది. ఇక మంచం మీద నుంచి లేచి శబ్దం ఎటునుండి వస్తుందా? అని గమనించాను. మంచానికి కొంచెం దూరంలో బాబా విగ్రహం ఉంది. అటువైపునుంచే ఆ ఊపిరి తీస్తున్న శబ్దం వస్తుండటంతో ఆశ్చర్యపోతూ దగ్గరగా వెళ్ళాను. బాబా విగ్రహం నుంచే ఊపిరి శబ్దం వస్తోంది. దాంతో బాబా నాకు తోడుగా వున్నారని అర్థమై ఎంతో ఆనందించాను. ఊపిరి శబ్దాన్ని రికార్డ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే నా మనసులో "బాబా నాకు తోడుగా ఉన్నారు" అని అనుకున్నానో, మరుక్షణం ఆ శబ్దం ఆగిపోయింది. ఈ లీలతో ఎన్ని కష్టాలున్నా బాబా తోడుగా ఉన్నారని ధైర్యం వచ్చింది. నా కష్టాలు తీరుతాయో, లేదో నాకు తెలీదు. కానీ బాబా తోడుగా ఉండి అన్నీ గమనిస్తున్నారని మాత్రం అర్థం అయింది.

క్రింద ఉన్న మరో అనుభవాన్ని కూడా చదవండి...  

భక్తులు కష్టంలో ఉంటే బాబా తప్పక సహాయం చేస్తారు

ఇప్పుడు నేను చెప్పబోయే బాబా లీల నా స్నేహితురాలు దుర్గేష్ జీవితంలో ఇటీవలే జరిగింది. దుర్గేష్ జైపూర్, రాజస్థాన్‌కి చెందినది. ఆమెకు ఒకడే అన్నయ్య. ఆమె తన అన్నావదినలతో కలిసి ఉంటుంది. ఆమెకు 41 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటికీ వివాహం కాలేదు. మంచి మంచి సంబంధాలు వచ్చేవి. కానీ, ఏదో ఒక కారణంచేత వివాహం నిశ్చయం అయ్యేది కాదు. చుట్టుపక్కలవాళ్ళు, "నీకు ఇక పెళ్లి కాదు, అన్నావదినల దగ్గర పనిమనిషిలా ఉండిపోతావు" అని గేలి చేస్తుండేవారు. అటువంటి మాటలు ఆమె మనసుకెంతో కష్టంగా అనిపించేవి. అందువలన ఎంతో బాధపడుతూ ఉండేది. బాబా కృపవలన 2019, జనవరిలో ఒక మంచి సంబంధం వచ్చింది. అన్నీ చక్కగా కుదిరి మే 6న వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి గ్వాలియర్‌లో చేయడానికి నిర్ణయించారు. తన ఒక్కగానొక్క అన్నయ్యే ఏర్పాట్లన్నీ చక్కగా చేశాడు. పెళ్లి సమయం దగ్గరపడుతోంది. పెళ్లికొడుకు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అప్పుడు దుర్గేష్ అన్నయ్యకు గుర్తు వచ్చింది, "పువ్వులు, పూలమాలలు సిద్ధం చేయలేద"ని. రాజస్థాన్ వాళ్ళ ఆచారం ప్రకారం మగపెళ్లివాళ్ళు వచ్చినప్పుడు, వాళ్లందరినీ పూలమాలలతో సత్కరించాలి. అది వాళ్ళ అతిముఖ్యమైన ఆనవాయితీ. దానినే అతడు మర్చిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, అప్పటికప్పుడు 80 మాలలు ఎక్కడ దొరుకుతాయి? పెద్ద సందిగ్ధంలో పడిపోయాడతడు. ఆ స్థితిలో అతనికి బాబా గుర్తుకొచ్చారు. వెంటనే, "శరణు, శరణు బాబా! నువ్వే గండం గట్టెక్కించాలి" అని ప్రార్థన చేసాడు. దుర్గేష్ కు కుదరక, కుదరక కుదిరిన పెళ్లి చివరిక్షణాల్లో ఆగిపోతే, ఇక ఆమెకు జీవితంలో పెళ్లి కాదు. బాబా అతని బాధ అర్థం చేసుకున్నారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యలేదు. వెంటనే బాబా మూడు రూపాలలో వచ్చారు. ఎవరో తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె అన్నయ్య వద్దకు వచ్చి, "మీ వాళ్లెవరో 80 పూలమాలలు ఆర్డర్ చేశారు. వాటిని మేము తెచ్చాము. వాటితోపాటు రోజా పువ్వులు కూడా తెచ్చాము. ఇక మీరు కానివ్వండి. మా ఆశీస్సులు మీ చెల్లికి ఉంటాయని చెప్పండి" అని చెప్పి వెళ్లిపోయారు. అతనికేమీ అర్థం కాలేదు. అతను పువ్వులు ఆర్డర్ చేయలేదు. అసలు ఆ సంగతే మర్చిపోయాడు. ఖచ్చితంగా 80 మాలలే కావాలని వాళ్లకు ఎలా తెలుసు? అంతా బాబా ఆడిన నాటకం. ఆయన ఆడిస్తాడు.. మనం ఆడతాము. పరమపదసోపానపటంలోని పావులలాగా మనం ఈ జీవిత నాటకంలో ఎన్నోసార్లు జారిపోతుంటాము. బాబాయే ఏదో రూపంలో వచ్చి మనల్ని పైకి లేపుతుంటారు. ఈ ఆట నిరంతరం సాగుతూనే ఉంటుంది. అలా బాబా కృపతో మగపెళ్ళివాళ్ళు వచ్చే లోపలే మాలలు చేరిపోయాయి. లేకుంటే ఎంతో అవమానం జరిగుండేది. తరువాత దుర్గేష్ పెళ్లి వైభవంగా జరిగింది. వాళ్లకు ఒకటే బాధ, 'బాబాను గుర్తించలేకపోయామే' అని. ఏది ఏమైనా బాబా తోడు నీడగా ఉండి అన్నీ జరిపించారు. 'భక్తులు కష్టంలో ఉంటే ఆయన తప్పక సహాయం చేస్తారు' అనడానికి అది చాలు.

సర్వం సాయినాథార్పణమస్తు! 

4 comments:

  1. Chala thanks sai..Baba leelalu thoti sai bandhuvu latho penchukune avakaasam echavu.sada baba neeku thoduga vundi,ninnu asirvadinchalani korukuntunnanu.sairam

    ReplyDelete
    Replies
    1. నాదేముంది ఆంటీ. ఈ బ్లాగు బాబాదే.

      ఏది ఏమైనా మీ ఆశీస్సులకు ధన్యవాదాలు ఆంటీ

      Delete
  2. om sai ram,
    i belived sai always with me.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo