సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 817వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అది బాబా ప్రేమ
2. బాబా రక్షణ ఉండగా భయమెందుకు?
3. కుటుంబమంతటినీ కరోనా నుండి కాపాడిన బాబా

అది బాబా ప్రేమ


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. మాది విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట గ్రామం. ప్రస్తుతం మేము కొత్తవలసలో నివాసముంటున్నాము. నాకు ఊహ తెలిసినప్పటినుండి మా ఇంట్లో అందరూ బాబానే నమ్ముతుండేవాళ్లు. నేను 'ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ బాబానే' అన్న నమ్మకంతో ఉంటాను. మా ఇంట్లో మా వారికి గానీ, పిల్లలకు గానీ ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా బాబా ఊదీ పెడతాను. బాబా దయవలన కొద్దిసేపట్లో వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. 'సాయీ' అని పిలవగానే తక్షణమే బాబా ప్రత్యక్షమైనట్లు అక్కడ పరిస్థితి మనకు అనుభవమవుతుంది. ఇకపోతే, ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మా పెద్ద తమ్ముడు వాళ్ళు బొబ్బిలిలో ఉంటారు. 2021, మే మూడవ వారంలో తన కొడుకుకి జ్వరం వచ్చింది. డాక్టర్ సలహామేరకు మందులు వాడుతున్నా జ్వరం తగ్గలేదు. తమ్ముడు నాకు ఫోన్ చేసి, "అక్కా! జ్వరం తగ్గినట్లే తగ్గి, మళ్లీ వస్తోంది" అని చెప్పాడు. బాబుకి అలా జ్వరం తగ్గకపోవడంతో చుట్టుప్రక్కలవాళ్ళు కరోనా ఏమోనని తమ్ముడు వాళ్లతో మాట్లాడటం మానేశారు. ఇక మూడవరోజు రాత్రి 12 గంటలకు తమ్ముడు నాకు ఫోన్ చేసి, "అక్కా! బాబుకి జ్వరం 104 డిగ్రీలు ఉంది. నాకు భయమేస్తోంది. ఈ రాత్రివేళ ఏ డాక్టరూ చూడరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి?" అంటూ బాధపడ్డాడు. అది విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, నా బాధను వాళ్ళకు తెలియనివ్వకుండా నేను తనతో, "భయపడొద్దు, తడిగుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండండి. అదే తగ్గుతుంద"ని ధైర్యం చెప్పాను. ఆ తరువాత నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించు తండ్రీ. అలాగే, వాడికి కరోనా కాకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకుంటూ, "అలా జరిగితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. మరుసటిరోజు తమ్ముడు ఫోన్ చేసి, "బాబుకి జ్వరం తగ్గి, సాధారణ స్థితికి వచ్చాడు. అలాగే కరోనా పరీక్ష చేయిస్తే 'నెగిటివ్' వచ్చింది" అని చెప్పాడు. అది బాబా ప్రేమ! భక్తుల బాధలు తనవిగా తీసుకునే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! మనందరినీ కరోనా బారినుండి రక్షించమని మనసా, వాచా, కర్మణా ఆ సచ్చిదానంద సద్గురువుని ప్రార్థిస్తున్నాను.


బాబా రక్షణ ఉండగా భయమెందుకు?


ముందుగా సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2021, ఏప్రిల్ నెలలో మా పెద్దబ్బాయి, చిన్నబ్బాయి తప్పనిసరై వేరే ఊళ్ళకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన నేను చాలా భయపడుతూనే బాబా ఊదీ ప్యాకెట్లను వాళ్ళకు రక్షగా ఇచ్చి పంపాను. మన బాబా దయవలన వాళ్ళు ఊర్లు వెళ్లొచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా హాయిగా ఉన్నారు. బాబా రక్షణ ఉండగా మాకు భయమెందుకు?


మరో అనుభవం:


ఇటీవల నా పాదాలు వాచి నడవడానికి ఇబ్బందిగా ఉండటంతో నేను చాలా కష్టాన్ని అనుభవించాను. అప్పుడు నా కష్టాన్ని బాబాకు చెప్పుకుని, ఊదీని పాదాలకు రాసుకుంటూ, ఊదీ నీళ్ళు త్రాగుతూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు రాత్రి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. నేను బాబాను తన్మయత్వంతో చూస్తుండగా ఆయన తమకు నమస్కారం చేసుకోమని అన్నారు. అంతేకాదు, బాబా బలవంతంగా నా చేతులు పట్టుకుని, తమ పాదాలను తాకించి నాచేత నమస్కారం చేయించారు. ఆశ్చర్యంగా ఆరోజు నుండి నా పాదాల వాపు, నొప్పులు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులలో బాబా దయవలన పూర్తిగా తగ్గిపోతాయని నా నమ్మకం.


ఇంకో అనుభవం:


ఇటీవల మా చిన్నకోడలు తనకున్న అసిడిటీ సమస్య గురించి డాక్టరును సంప్రదిస్తే, తనకు కోవిడ్ టెస్ట్ చేయించారు. నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, "రిపోర్టు నెగెటివ్ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని వేడుకున్నాను. బాబా మమ్మల్ని  కరుణించారు. ఆయన కృపవలన 2021, మే 20న రిపోర్టు నెగెటివ్ అని వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు ఎల్లవేళలా మా కుటుంబంపై ఇలాగే వర్షించు తండ్రీ".


మరో చిన్న అనుభవం:


ఈమధ్య మా మనవడికి, మనవరాలికి వ్యాక్సిన్ వేయించాం. ఆ సాయంకాలానికి పిల్లలిద్దరికీ 102 డిగ్రీల జ్వరం వచ్చింది. టాబ్లెట్స్ వేసినా రాత్రి వరకు జ్వరం తగ్గలేదు. నాకు చాలా భయమేసి, బాబా ఊదీని నీళ్లలో కలిపి పిల్లల చేత రెండుసార్లు త్రాగించి, మరికొంత ఊదీని పిల్లల  నుదుటన పెట్టి, "రేపు ఉదయానికల్లా పిల్లలిద్దరికీ జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు దణ్ణం పెట్టుకుని పడుకున్నాను. ఉదయానికి జ్వరం పూర్తిగా తగ్గి పిల్లలు బాగున్నారు. అంతా సాయినాథుని కృప. "ధన్యవాదాలు తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


కుటుంబమంతటినీ కరోనా నుండి కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా పేరు సునీల్. ఇటీవల మా కుటుంబమంతా కరోనా మహమ్మారి బారినపడ్డాము. ఒక పని మీద మేము మా ఊరు వెళ్ళవలసి వచ్చింది. అయితే మేము ఊరు వెళ్లొచ్చినరోజు నుంచి మాకు జ్వరం, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. లక్షణాలను బట్టి కరోనా ఏమోనని గృహనిర్బంధంలో ఉంటూ మందులు వాడటం మొదలుపెట్టాము. నేను నా మనసులో సాయిని ధ్యానించి, "మా కుటుంబమంతా ఈ మహమ్మారి నుండి బయటపడేలా అనుగ్రహించమ"ని ఆయననే శరణువేడాను. మేమంతా రోజూ బాబా ఊదీ ధరిస్తూ ఉండేవాళ్ళం. మూడు రోజుల తరువాత మా అత్తగారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. నేను సాయిని వేడుకుని, ఆయనపై విశ్వాసముంచాను. నిజంగా నేను ఆ సమయంలో చాలా టెన్షన్ పడి, "బాబా! ఆమె పరిస్థితి బాగుంటే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని సాయితో చెప్పుకున్నాను. అప్పటినుండి బాబా దయవలన మా అత్తగారి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. క్రమంగా ఆమె పరిస్థితి మెరుగుపడింది. తరువాత ఒక్కొక్కరిని కరోనా మహమ్మారి నుండి బయటపడేశారు బాబా. ఇప్పుడు బాబా కృపవల్ల మా కుటుంబమంతా క్షేమంగా ఉంది. ఇదంతా సాయిబాబా మరియు వారి ఊదీ మహిమ.


ఓం శ్రీ సాయినాథాయ నమః.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.



11 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😊

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 26, 2021 at 12:59 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🌷🌺⚘🌸🙏🙏🙏🙏🙏🌸⚘🌺🌷

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo