సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 807వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పునర్జన్మ ప్రసాదించి, నింద పడకుండా నా కోరిక నెరవేర్చిన బాబా
2. బాబా ఆశీర్వాదబలం వల్ల నొప్పి నుండి ఉపశమనం
3. నా మొర ఆలకించిన బాబా

పునర్జన్మ ప్రసాదించి, నింద పడకుండా నా కోరిక నెరవేర్చిన బాబా


తరచి చూస్తే, నా జీవితంలో బాబా లీలలు కోకొల్లలు. అసలు నా జీవితంలో బాబా లీలలు లేని రోజంటూ లేదని అనవచ్చు. నాకు అంత దగ్గరగా ఉంటారు బాబా. మా పిల్లలు కూడా అదే మాట అంటారు: "సాయితాత ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా నాన్నా! అందుకే నీకు భయం అన్నదే వేయదు" అని. ఆ చిన్నారులు అలా అంటుంటే నాకు గర్వంగా ఉంటుంది. నా పేరు శ్రీనివాస్. నా వయస్సు 36 సంవత్సరాలు. మేము హైదరాబాదులో ఉంటాము. ఈమధ్యనే జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


2021, మార్చి 27న నేను బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి మహారాష్ట్రలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. నిజానికి 3 నెలల ముందే కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్లాలని మేము టిక్కెట్లు బుక్ చేశాము. కానీ కుటుంబాన్ని అపాయంలో పెట్టడం ఎందుకని, అందరినీ వదిలేసి నేను, మా తోడల్లుడు మాత్రమే శిరిడీ వెళ్ళాము. బాబా దర్శనం చేసుకుని అప్పటికే ఒకటిన్నర సంవత్సరం అయింది. అందుకే ఆగలేక బాబా మీద భారం వేసి వెళ్ళాము. బాబా దయవలన దర్శనం బాగానే అయింది. శిరిడీ వెళ్ళినప్పుడల్లా రక్తదానం చేసే అలవాటున్న నేను ఈసారి కూడా రక్తదానం చేశాను. తరువాత ఇద్దరమూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. తరువాత ఏప్రిల్ 12న నాకు జ్వరం వచ్చింది. రెండురోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి అనుమానమొచ్చి టెస్టు చేయిస్తే, నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసి నా శ్రేయోభిలాషులు, "ఈ సమయంలో నువ్వు శిరిడీ వెళ్లడమే తప్పు అంటే, బ్లడ్ డొనేషన్ కూడా చేశావు. నీకు కరోనా రావడానికి అదే కారణం అయుంటుంది" అని నాపై ప్రేమ కొద్దీ నిందించారు. కోవిడ్ కారణంగా నా పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఏ క్షణంలో అయినా నేను నా శరీరం వదిలేయవచ్చు అనిపించింది. ఆ స్థితిలో మంచం మీద ఉంటూనే నా మనసులో ఇలా అనుకున్నాను: "బాబా! ఇప్పుడు నాకు ఏమైనా జరిగితే, నేను చేసిన పని తప్పనే భావన అందరికీ రావచ్చు. ‘ఎప్పుడూ 'బాబా, బాబా' అంటాడు వీడు, వీడికే ఇలా జరిగింద’నే నింద నీ మీద పడవచ్చు. అలా నువ్వు నిందలు పడటం నాకు ఇష్టం లేదు. ఆ పైన నీ దయ" అనుకుని నిద్రపోయాను. అలా బాబాను వేడుకున్న రెండవరోజు, అంటే కరోనా పాజిటివ్ అని తెలిసిన ఐదవరోజు నుంచి మెల్లగా నా శరీరం తేలికపడటం, కోలుకోవడం నాకు తెలుస్తూ వచ్చింది. పదవరోజు టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. అది తెలిసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, ‘నా బాబా నాకు ఏది సరైనదైతే అదే చేస్తార’ని నాకు నమ్మకం. మొత్తానికి బాబా నాకు పునర్జన్మను ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. నా కోరిక మన్నించి మీపై నిందలు పడకుండా అనుగ్రహించారు".


బాబా ఆశీర్వాదబలం వల్ల నొప్పి నుండి ఉపశమనం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


"సాయినాథా! నీకిదే నా హృదయపూర్వక వందనం. నిన్ను కొలుచుట మా పూర్వజన్మభాగ్యం". నా పేరు అనురాధ. ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. బ్లాగును చాలా చక్కగా నిర్వహిస్తున్న బృందానికి హృదయపూర్వక అభినందనలు. ప్రతిరోజూ బ్లాగులో వచ్చే అనుభవాలను చదువుతుంటే, మనసుకు శాంతి చేకూరి ఆత్మస్థైర్యం రెట్టింపు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


2021, మే నెల మొదటివారంలో నా పొత్తికడుపు క్రిందిభాగంలో నొప్పి మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకి వెళ్లి డాక్టరుని సంప్రదించాలంటే చాలా భయంగా ఉంటోంది. అందువలన నేను సర్వేశ్వరుడు, పరమ కరుణామయుడైన మన సాయినాథుని ప్రార్థించి, కొద్దిగా బాబా ఊదీని నీళ్లలో వేసి త్రాగి, మరికొంత ఊదీని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకున్నాను. తరువాత, "తండ్రీ, సాయిదేవా! ఈ నొప్పి తగ్గేలా చేయండి, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మనసారా బాబాను ప్రార్థించాను. అంతే, ఆ తండ్రి అమోఘమైన ఆశీర్వాదబలం వల్ల నొప్పి నుండి నాకు ఉపశమనం కలిగింది. "తండ్రీ, సాయినాథా! ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలి. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ".


సర్వేజనాః సుఖినో భవంతు|

లోకాః సమస్తాః సుఖినోభవంతు||


నా మొర ఆలకించిన బాబా


సాయిబంధువులకు మరియు ఈ బాబా బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇటీవల ఉన్నట్టుండి మా అమ్మకు వాసన తెలియలేదు. అయితే రుచి మాత్రం తెలుస్తుండేది. కానీ మాకు భయం వేసి తనకు కోవిడ్ పరీక్ష చేయించి, "బాబా! అమ్మకు వైరస్ సోకి ఉండకూడదు. కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వస్తే, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అమ్మకు నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు చూసి నాకు ప్రాణం లేచివచ్చినట్లు అనిపించింది. నా మొర ఆలకించి అమ్మకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా చేసిన ఆ తండ్రి దయకు మురిసిపోయాను. "శతకోటి వందనాలు బాబా. థాంక్యూ సో మచ్ తండ్రీ. అమ్మకు తొందరగా వాసన తెలిసేలా అనుగ్రహించండి. ఆమె శరీరంలో ఎటువంటి వైరస్ ఉండకుండా చూడు తండ్రీ. అలాగే అమ్మకి ఉన్న యూరాలజీ సమస్యను తొందరగా నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ. ఈ కరోనాని త్వరగా అంతం చేయండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


10 comments:

  1. ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 16, 2021 at 10:08 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram❤❤❤

    ReplyDelete
  5. Udi power is very nice. That udi cures all health issues.udi is sai.sai takes care of all devotees.om sai ram❤❤❤❤

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  7. Baba ee gadda ni tondarga karginchu thandri sainatha

    ReplyDelete
  8. Baba santosh ki salary hike ayyi day shifts ravali thandri please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo