సాయిబాబా ప్రసాదించిన ఒక మధురమైన అనుభవం
నా పేరు శ్రీదుర్గ. మా అమ్మాయి పేరు సాయిహసిత. 2026, విజయదశమి పర్వదినం సందర్భంగా నేను, మా పాప సాయిబాబా దర్శనం కోసం శిరిడీ వెళ్లాము. ఆ ప్రయాణంలో బాబా మాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మేము మధ్యాహ్నం సుమారు 4 గంటలకు బెంగుళూరులో ట్రైన్ ఎక్కాము. నాకు సైడ్ అప్పర్ బెర్త్ వచ్చింది. అయినా ఇబ్బంది లేదు కానీ, మా పాపకు కూడా అప్పర్ బెర్త్ వచ్చింది. అదీకాక ఏసీ ఎక్కువగా ఉంది. అంత చల్లగా, చలిగా ఉంటుందని మేము అస్సలు ఊహించలేదు. శిరిడీలో ఎండలు ఎక్కువగా ఉంటాయని మేము స్వెటర్లు కూడా తీసుకెళ్లలేదు. ఈ కారణాల వల్ల నాకు ఆందోళనగా అనిపించింది. మనసులో పాపకు మిడిల్ బెర్త్ ఉంటే బాగుంటుంది, చలికి ఇబ్బంది లేకుండా హాయిగా పడుకుంటుంది అని అనుకున్నాను.
మేము ఎవరినీ ప్రత్యేకించి అడగకపోయినా మాకు ఏది అనుకూలంగా ఉంటుందో, ఏది అవసరమో తెలిసిన బాబా ఏం చేసారో చూడండి! రాత్రి 8 గంటలు దాటింది. ఇక నిద్రపోవడానికి మేము సిద్ధమవుతుండగా సుమారు 8:30 అప్పుడు ఒక స్టేషన్ వచ్చింది. కొంతమంది ప్రయాణికులు మా బోగీలోకి వచ్చి తమకి పక్క బోగీలో కొన్ని బెర్తులు వచ్చాయని, అక్కడికి వెళ్లగలరా అని ప్రయాణికులను అడుగుతూ మమ్మల్ని కూడా అడిగారు. సాధారణంగా అయితే, లగేజ్ అంత తీసుకుని మరో బోగీకి ఎందుకు వెళ్లాలి అని ఆలోచించేదాన్ని కానీ, ఆరోజు ఎందుకో తెలియదు, వెంటనే సరే అని వాళ్లతో చెప్పేశాను. తర్వాత మేము పక్క బోగీలోకి వెళ్లి చూస్తే, అక్కడ ఏసీ చాలా తక్కువగా ఉంది. పైగా మాకు మిడిల్, సైడ్ అప్పర్ బెర్తులు వచ్చాయి. నేను మనసులో అనుకున్నట్లుగానే మిడిల్ బర్త్ రావడం, ఏసీ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల పాప వెచ్చగా, హాయిగా పడుకోగలిగింది. బాబా ఎంత అద్భుతంగా మా ప్రయాణాన్ని సులభతరం చేసారో అనిపించి చాలా సంతోషించాను. బాబాకి మా మనసులోని ప్రతి ఆలోచన తెలుసు. మా అవసరాలను మేము చెప్పకముందే అర్థం చేసుకుంటారని ఈ అనుభవం ద్వారా మరోసారి నిరూపితమైంది. బాబా మీద నాకున్న నమ్మకాన్ని మరోసారి మరింత బలపరిచింది. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హాయిగా శిరిడీ చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ మా వెంటే ఉండండి. నిరంతరం మీ నామస్మరణ చేసేలా మా మనసులను అనుగ్రహించండి. జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, వాటన్నింటినీ దాటే శక్తిని ప్రసాదించండి. మీ మీద మాకున్న నమ్మకం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా ఆశీర్వదించండి". ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పించిన సాయిబాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
సాయి స్మరణతో కఠినమైన సబ్జెక్టులో అత్యధిక మార్కులు
నా పేరు సాయిహాసిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. 2026, విజయదశమి ముందు నాకు క్వార్టర్లీ పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో సాయిబాబా నన్ను ఎలా ఆశీర్వదించారో తెలియజేసే ఒక అందమైన అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒక రోజు ఉదయం నేను ఆరోజు వ్రాయబోయే హిందీ పరీక్ష గురించి నాకు చాలా కంగారుగా అనిపించింది. ఎందుకంటే, ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడూ జటిలమైనది. అందుకే ఆ పరీక్ష ఎలా వ్రాస్తానో అని చాలా భయపడ్డాను. నా కంగారు చూసిన మా అమ్మ నాతో, “నువ్వు పరీక్ష వ్రాయడం మొదలు పెట్టే ముందు, అనుమతి ఉంటే నీ రఫ్ ప్యాడ్‌పై ఐదుసార్లు 'సాయిబాబా' అని వ్రాయడానికి ప్రయత్నించు. ఆపై బాబాను, 'పరీక్షను సులభతరం చేయమ'ని మనస్ఫూర్తిగా ప్రార్థించు” అని చెప్పింది. తర్వాత కొద్దిసేపటికి నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. పేపర్ చదవడానికి మాకిచ్చిన పది నిమిషాల సమయంలో నేను అందులో ఉన్న ప్రశ్నలు చదివినప్పుడు పేపర్ చాలా కష్టంగా ఉన్నట్లు అనిపించింది. వాటికి తగిన సమాధానాలు నాకు గుర్తు రాలేదు. అసలు నేను చదివిన దానికి, ప్రశ్నలకు సంబంధం ఉన్నట్టు కూడా ఏ మాత్రం అనిపించలేదు. నేను ఎంతగా భయపడిపోయానంటే, 80 మార్కులకు కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేమోననిపించింది. ఆ క్షణంలో, నాకు అకస్మాత్తుగా మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను వెంటనే హృదయపూర్వకంగా సాయిబాబాను తలుచుకొని, నా రఫ్ ప్యాడ్‌పై ఆయన నామాన్ని ఐదుసార్లు వ్రాశాను. తర్వాత, “బాబా! దయచేసి నాకు సహాయం చేయండి. ఈ పరీక్షను నాకు సులువుగా చేయండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో నాకు తెలియడం లేదు, దయచేసి నాకు మార్గదర్శనం చేయండి, ఈ పరీక్షను బాగా వ్రాసేలా నాకు శక్తిని ఇవ్వండి” అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. ఆపై పూర్తి నమ్మకంతో నేను నా పరీక్ష వ్రాయడం ప్రారంభించాను. బాబా అనుగ్రహంతో అంతా చాలా అందంగా మారిపోయింది. నన్ను అంతగా కంగారు పెట్టిన సబ్జెక్ట్ నాకొక అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. ఫలితాలు వెలువడినప్పుడు, హిందీలో నాకే అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయని తెలిసి నేను సంతోషంతో ఉప్పొంగిపోయాను! నేను ఏ సబ్జెక్ట్ చూసి అయితే అంతగా భయపడ్డానో, అదే నా సంతోషానికి కారణమైంది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు అత్యంత అవసరమైన సమయంలో మా అమ్మ మాటలు, బాబా నామం నాకు ఎంతో ఊరటనిచ్చాయి. ఆ క్షణంలో నాకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని బాబాయే నాకు ఇచ్చారని నేను భావించాను. నా మనసంతా బాబా పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ అనుభవం మనం నిజాయితీతో హృదయపూర్వకంగా సాయిబాబాను స్మరించి, ఆయనపై నమ్మకముస్తే కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఆయన మనకు ఇస్తారని నాకు నేర్పింది. నా కష్టసమయంలో నాకు అండగా ఉండి, నన్ను ఆశీర్వదించినందుకు నేను సాయిబాబాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతురాలినై ఉంటాను. బాబా ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండుగాక!
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!