గజానన్ మహాదేవ్ కులకర్ణి చిప్లూణ్ గ్రామ నివాసి. 1906-1908 మధ్యకాలంలో అతను అహ్మద్‌నగర్‌లోని తన మావయ్య వద్ద ఉండి చదువుకుంటున్నప్పుడు, అతనికి దేశ్‌ముఖ్ అనే ఫోటోగ్రాఫర్‌తో పరిచయం ఏర్పడింది. దేశ్‌ముఖ్ నగర్ కోర్టులో సెక్షన్ రైటర్‌గా పనిచేస్తుండేవాడు. అతను ఖాళీ సమయాల్లో ఫోటోగ్రఫీ చేస్తూండేవాడు. ఆ సమయంలో నగర్లో ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్లు లేరు. కంటోన్మెంట్ ప్రాంతంలో 'నరసయ్య' అనే ఒక పాత ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఊరిలో మాత్రం ఎవరూ లేరు. అందువల్ల దేశ్‌ముఖ్‌కి ఫోటోగ్రాఫర్‌గా మంచి అవకాశాలు దొరికేవి. ఒకరోజు దేశ్‌ముఖ్ వద్ద కూర్చుని ఉన్నప్పుడు, అతను తీసిన ఫోటోల ఆల్బమ్ గజానన్ మహాదేవ్ కులకర్ణి తిరగేయసాగాడు. అతను అలా తిరగేస్తుండగా అందులో ఒక అవధూత(ఫకీరు) ఫోటో కనిపించింది. రాయిపై కూర్చున్న ఆ విలక్షణమైన రూపాన్ని చూడగానే గజానన్ మహాదేవ్ కులకర్ణి దృష్టి అటువైపు ఆకర్షించబడింది. ఆ ఆకర్షణ ఎంత బలంగా ఉందంటే, దానిని వర్ణించడం సాధ్యం కాదు. అతను అలాగే ఎంతో సేపటి వరకు ఆ ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాడు. "ఈ ఫోటో ఎవరిది?" అని దేశ్‌ముఖ్‌ని అడిగితే, “అది 'శిరిడీ సాయిబాబా'దని అతను చెప్పాడు(ఆ ఫోటో అతను తీశాడా లేక ఎక్కడినుండైనా తెచ్చాడా అనే విషయం స్పష్టంగా తెలీదు). ఏదేమైనా అదే గజానన్ మహాదేవ్ కులకర్ణికి బాబా మొదటి దర్శనం. ఆ రోజు నుండి అతనికి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనిపించసాగింది, కానీ 1913 వరకు అది సాధ్యం కాలేదు. ఎందుకంటే కొద్దిరోజుల్లోనే అతను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు. ఆ తర్వాత చదువు పూర్తయ్యాక అతనికి ముంబాయిలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక మళ్ళీ బాబా వద్దకు వెళ్లాలనే ఆలోచన బలంగా మొదలైంది. నిజానికి గడిచిన ఐదేళ్ళలో బాబా పేరు కూడా గుర్తు రానంతగా అతను గతంలో జరిగిన సంఘటనను మర్చిపోయాడు. అలాంటిది అంతకాలం తర్వాత బాబా గురించి గానీ, వారి లీలల గురించి గానీ ఎవరూ గొప్పగా వర్ణించి చెప్పకపోయినా అతనికి బాబా వద్దకు వెళ్లాలనే ఉత్సాహం కలిగింది. అకస్మాత్తుగా ఆ ఆలోచన (బుద్ధి) ఎందుకు కలిగిందో బాబాకే తెలియాలి!
గజానన్ మహాదేవ్ కులకర్ణి మనసు బాబా వద్దకు వెళ్లాలని నిరంతరం లాగుతూ ఉండటంతో చివరికి శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కానీ అతనికి మరో అడ్డంకి ఎదురైంది. అతని తండ్రి ఆచారవ్యవహారాలలో చాలా కఠినమైన వ్యక్తి అయినందున శిరిడీ వెళ్ళడానికి అనుమతిస్తారని అతనికి అనిపించలేదు. అసలు తండ్రి ముందు నిలబడటమే అతనికి కష్టం, ఇక అనుమతి అడగడం అనేది చాలా దూరమైన విషయం. అయినా చివరికి మనసులో ధైర్యం తెచ్చుకుని తన తండ్రికి విషయం చెప్పాడు. వెంటనే ఆయన ఎంతో సంతోషంగా అనుమతి ఇవ్వడమే కాకుండా ప్రయాణ ఖర్చులకోసం పదిహేను రూపాయలు కూడా తీసి ఇచ్చారు. ఇది ఎలా జరిగిందని గజానన్ మహాదేవ్ కులకర్ణికి చాలా ఆశ్చర్యమేసింది. సరే, అతను ఇక బయలుదేరాలని నిశ్చయించుకున్నాక, ‘మనం ఒక్కరమే వెళ్లకుండా ఎవరైనా తోడు దొరుకుతారేమో చూద్దామని’ తన స్నేహితులైన లక్ష్మణ్ మహాదేవ్ ప్రధాన్, కాశీనాథ్ కోర్డేలను అడిగాడు. వాళ్లిద్దరూ వెంటనే అతనితోపాటు వెళ్ళడానికి సిద్ధమవ్వడమే కాకుండా, “ఎప్పుడు బయలుదేరుతున్నావు?" అని అతన్నే తిరిగి అడిగారు. ‘ఇదేమిటని’ అతనికి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే, అతని తండ్రి ధనవంతుడు కాబట్టి అతని ప్రయాణానికి డబ్బు దొరకడంలో వింతేమీ లేదు. కానీ అతని మిత్రులిద్దరి పరిస్థితి అలా కాదు. వాళ్లిద్దరూ అప్పుడే తాత్కాలిక గ్రామ కరణాలుగా ఉద్యోగంలో చేరారు. ఇంకా శాశ్వతం (పర్మనెంట్) కూడా కాలేదు. జీతం అంతంతమాత్రమే, వాళ్ళ వద్ద 10-12 రూపాయల పొదుపు ధనం ఉండటమే అసాధ్యం. అలాంటిది విచిత్రంగా, వాళ్లిద్దరూ డబ్బు గురించి ఎలాంటి ఆందోళన ప్రదర్శించలేదు, అతనిని కూడా ధన సహాయం అడగలేదు.
బహుశా 1913, మార్చిలో వాళ్ళు ముగ్గురూ నిర్ణయించుకున్న రోజున, నిశ్చయించుకున్న రైలులో శిరిడీ వెళ్ళడానికి బయలుదేరారు. అయితే వాళ్ళ ముగ్గురికీ శిరిడీ కొత్త, శిరిడీకి సంబంధించి ఎలాంటి సమాచారం వాళ్లలో ఎవరికీ తెలియదు, కేవలం కోపర్గావ్ స్టేషన్లో దిగాలనే విషయం మాత్రమే తెలుసు. అయితే వాళ్ళు మర్నాడు ఉదయం 7-8 గంటలకు కోపర్గావ్ చేరుకొని, స్టేషన్లో దిగగానే శిరిడీ వెళ్లే చాలామంది కలిశారు. అందువల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, శిరిడీ చేరుకున్నాక ఎక్కడ బస చేయాలో వాళ్ళకి తెలియనప్పటికీ, అక్కడికి వెళ్లగానే ఒక సజ్జనుడు వాళ్ళకి ఎంత సహాయం చేశారంటే మాటల్లో చెప్పలేము. అతన్ని అందరూ 'అణ్ణా' అని పిలిచేవారని, బహుశా అణ్ణా చించణీకర్ లేదా శామా కాబోలునని గజానన్ మహాదేవ్ కులకర్ణి చెప్పాడు. అణ్ణా వాళ్ళు ఉండటానికి బస చేసే ఏర్పాట్లు చేశాడు, బాబా దర్శనం చేయించాడు, చాందోర్కర్కి చెప్పి అతని భోజనశాలలో వాళ్ళ భోజనానికి ఏర్పాటు చేశాడు, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఉన్నంతవరకు అన్ని రకాల సహాయం చేసి వాళ్ళని రుణపడిపోయేలా చేశాడు. అణ్ణా వాళ్లతో, “బాబా ఆజ్ఞ లేకుండా మీరు వెళ్లడానికి వీలు లేద”ని హెచ్చరించాడు. అందువల్ల వాళ్ళు 2-3 రోజులు శిరిడీలోనే ఉన్నారు. ఉండటానికి మంచి చోటు, భోజనానికి ఇబ్బంది లేకపోవడం, ప్రతిరోజూ బాబా దర్శనం, అణ్ణా లాంటి సహాయకుడు వంటివన్నీ కలిసి రావడం వల్ల శిరిడీ నుండి తిరిగి వెళ్లాలంటే వాళ్ళ ప్రాణానికి కష్టంగా అనిపించింది. కాకపోతే, ప్రధాన్, కోర్డేలు సెలవు పెట్టకుండా వచ్చినందువల్ల కాస్త ఆందోళనపడ్డారు. మూడో రోజు బాబా వాళ్లకు ఊదీ, ప్రసాదం ఇచ్చి తిరిగి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. దాంతో వాళ్ళు భారమైన హృదయంతో తిరిగి వెళ్లక తప్పలేదు. బాబా దయవల్ల రానూపోనూ వాళ్ళ ప్రయాణం సుఖంగా సాగింది. 'ఈ అనుభవంలో ప్రత్యేకత ఏముందని ఎవరికైనా అనిపించవచ్చు కానీ, జాగ్రత్తగా గమనిస్తే ఇందులో బాబా లీలలు అనేకం కనిపిస్తాయని, వాటిని భక్తులకు విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదని, భక్తులకు అవి సులభంగానే అర్థమవుతాయని' గజానన్ మహాదేవ్ కులకర్ణి వ్యక్తపరిచారు.
సోర్స్: సాయిలీల పత్రిక 1940, సంచిక 9

