సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 135వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబాకు చెప్పుకున్నంతనే సమస్యలు పరిష్కారం 
  2. సాయి దీవెనలు

బాబాకు చెప్పుకున్నంతనే సమస్యలు పరిష్కారం

సద్గురు సాయినాథునికి, పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ గారికి నా నమస్కారాలు.

నా పేరు సత్య. ఒకటిన్నర నెల క్రితం నేనొక అనుభవాన్ని బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇంత తొందరగా మళ్ళీ మీ ముందుకు వస్తానని నేను అనుకోలేదు. అంతా బాబా దయ. జులై నెలలో నాకొక సమస్య వచ్చింది. బాబా, గురువుగారు ఏ విధంగా నా కష్టం తీర్చారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

మేము బంగారం కుదువపెట్టి లోన్ తెచ్చుకున్నాం. గత సంవత్సరమంతా వడ్డీ కట్టాము. ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగిద్దామని అనుకున్నాం. ఆ విషయమై మా నాన్నగారు ఆఫీసుకు వెళితే, "మేనేజరుగారు ఒప్పుకోవడం లేదు, మీరు మొత్తం కట్టాల్సిందే" అన్నారు. మరునాడు నేను బాబా, గురువుగారి పాదాలు పట్టుకుని, "ఈ గండంనుంచి కాపాడమ"ని ప్రార్థించాను. తరువాత మేనేజరుగారి కాళ్ళు పట్టుకునైనా ఒప్పించుదామని అనుకుని బాబా, గురువుగారికి దండం పెట్టుకుని ఆఫీసుకు వెళ్ళాను. అద్భుతం! అసలు మేనేజర్ వద్దకు వెళ్లకుండానే పని అయిపోయింది. బయటవున్న వ్యక్తి 'వడ్డీ కడితే చాలు' అన్నారు. నేను, 'ఆగష్టులో ఒకటి కట్టాలండీ' అన్నాను. 'అది కూడా ఇప్పుడే కట్టేసుకోమ్మా' అన్నారాయన. అలా నన్ను కాపాడారు బాబా, గురువుగారు.

రెండవ అనుభవం:

కొన్ని కారణాల వల్ల నేను ఇంటినుంచి బయటకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంటి పరిసరాలు నచ్చక వేరే ఇల్లు చూసుకుంటూ, ఒక ఇల్లు దొరికాక ఉంటున్న ఇంటి ఓనర్స్‌కి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పేశాను. తీరా సమయం దగ్గరకి వచ్చేసరికి కొత్త ఇంటి ఓనర్, "ఇల్లు ఖాళీ అవలేదు" అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిస్సహాయస్థితిలో బాబా, గురువుగారికి, "ఇల్లు దొరికితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అద్భుతంగా ఒక ఫ్రెండ్ తక్కువ అద్దెకు చిన్న ఇల్లు చూపించింది. అలా ఆ కష్టాన్ని కూడా తీర్చారు బాబా, గురువుగారు. వారిరువురికీ చాలా చాలా ధన్యవాదాలు. "సాయిదేవా! నాకున్న ముఖ్యమైన కోరిక మీకు తెలుసు. నా భర్త నా దగ్గరకి రావాలి. ఆయన రాకకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాను. మేము కలవడం చాలామందికి ఇష్టం లేదు బాబా. అద్భుతంగా మీరే ఆయనను తీసుకుని రావాలి".

సాయి దీవెనలు

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సాయి బిడ్డని. నాకు ముందునుండి సాయి తెలిసినప్పటికీ ఎప్పుడూ ఆయనను అనుసరించలేదు. రెండు సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒకరు తను చేసిన సాయివ్రత అనుభవాలను పంచుకున్నప్పటినుండి నేను బాబాను ప్రార్థిస్తున్నాను. తరువాత నేను చాలా అనుభవాలు పొందాను. వాటిలో కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నెలసరి సమయంలో నాకు వివిధ రకాలుగా కడుపునొప్పి వస్తుండేది. అందువలన నేను ఆరోజు సెలవుపెట్టి రోజులో చాలాసార్లు మందులు వేసుకోవాల్సి వచ్చేది. 2018 మార్చిలో ఒకరోజు నిద్రలేస్తూనే నాకు చాలా నొప్పిగా అనిపించి, నెలసరి వచ్చిందని అనుకున్నాను. కానీ ఆరోజు క్షణం తీరిక లేకుండా గడిపేలా పనులు ఉన్నాయి కాబట్టి, సెలవు పెట్టే పరిస్థితి లేదు. ఆ స్థితిలో ఆఫీసుకు వెళితే నొప్పిని భరిస్తూ స్థిమితంగా పనిచేయలేను. ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను, "సాయీ! నాకెందుకు ఈ పరిస్థితి? నేను ఇంత నొప్పితో ఎలా పనిచేయగలను?" అని ప్రార్థించాను. సాయి అద్భుతం చేసారు! నేను స్నానానికి వెళ్ళాను. నెలసరి సమస్య ఏమీలేదు, నేను చాలా పరిశుభ్రంగా ఉన్నాను. తరువాత నేను ఫేస్‌బుక్ పేజీ చూస్తున్నాను. అందులో, "నీ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరికిందా?" అన్న సాయి మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను. రోజంతా ఎటువంటి సమస్య లేకుండా పని చేసుకున్నాను. మరుసటిరోజు నాకు సెలవురోజు. ఆరోజు నా నెలసరి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. నా సాయి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు.

మరోసారి నేను ఆఫీసులో ఉండగా నాకు నెలసరి వచ్చింది. ఆరోజు నేను తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉన్నాను. నొప్పి చాలా తీవ్రంగా ఉండి, తట్టుకోలేక అలా కూర్చుండిపోయాను. సాయిని తలచుకుని, "సాయీ! నేను ఈరోజు ఏ మందూ తీసుకోదలచుకోలేదు. ఏ కష్టం లేకుండా మీరే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పుకున్నాను. ఇది జరిగి ఇప్పటికి 11 నెలలు గడించింది. రోజులో ఎన్నోసార్లు టాబ్లెట్లు వేసుకునే నేను ఆరోజునుండి ఇప్పటివరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నొప్పి రావడం లేదు అని నేను చెప్పడంలేదు. కానీ ఆ సమయంలో కొంచెం ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగి, మరికొంత నా కడుపుపై రాసుకుని నుదుటికి పెట్టుకుంటాను అంతే! దానితో ఏ ఇబ్బంది లేకుండా బాబా చూసుకుంటున్నారు.

ఒకసారి నా ఫ్రెండ్ ఆఫీసులో పెద్ద పొరపాటు చేశాడు. అందువలన ఉన్నపళాన తనని ఉద్యోగం నుండి తీసివేసే అవకాశం ఉంది. అలా జరగకపోయినా సస్పెండ్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అతను చాలా భయపడిపోయాడు. నేను సాయినే నమ్ముకున్నాను. "సాయీ! తనకి గాని, తన ఉద్యోగానికి గాని ఏ ఇబ్బంది లేకుండా చూడండి" అని ప్రార్థించాను. ఏమీ జరగదని తనకి కూడా ధైర్యం చెప్పి తన నుదుటన బాబా ఊదీ పెట్టాను. అద్భుతం! కేవలం ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారంతే. నిజానికి ఇటువంటి తప్పులు చేసినందువలన చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది సాయి చేసిన లీల. "సాయీ! నేను ఏమైనా తప్పులు చేసి ఉన్నా, తెలిసిగాని, తెలియకగాని ఎవరికైనా నేను కష్టం కలిగించి ఉన్నా నన్ను క్షమించండి. మీరే నాకు తండ్రి. నన్ను, మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. మీ పట్ల విశ్వాసంతో మీ నామస్మరణ చేస్తూ సహనంతో ఉండేవారిని సంరక్షించండి. నా మనసు మీకు తెలుసు, దయచేసి నన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టకండి. దయచేసి మంచిపనులు చేసేందుకు తగిన బలాన్ని ఇవ్వండి. ఇంకా శ్రద్ధ, సబూరీతో ఉండేలా నన్ను ఆశీర్వదించండి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo