సాయి వచనం:-
'నాకు పేరు లేదు, ఊరు లేదు, నేను నిర్గుణుడను. కర్మవశాన ఈ శరీరం ధరించాను. ఇదే నా ఉనికి. బ్రహ్మ నాకు జన్మనిచ్చినవాడు. మాయ నా తల్లి. వారి సంయోగం వల్ల నాకు ఈ శరీరం ప్రాప్తించింది.'

'ఊదీ బాబా కృపకు గుర్తు. ఊదీ సాయి అవ్యాజ కరుణకు వాహకం. అది నా సద్గురు స్పర్శ' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 130వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సామాన్య భక్తుల ప్రార్థనలను కూడా బాబా వింటారు
  2. బాబాను తలచుకోగానే మొబైల్ పనిచేసింది

సామాన్య భక్తుల ప్రార్థనలను కూడా బాబా వింటారు

నేను బాబాకు సామాన్య భక్తురాలిని. నాకు ముందునుండి బాబా గురించి తెలిసినప్పటికీ ఒకటిన్నర సంవత్సరం నుండి బాబాకు దగ్గరయ్యాను. మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ బాబా గుడికి వెళ్ళడం చూసి నేను కూడా వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే మొదట్లో ఆ గుడి ప్రాంగణంలో ఉన్న నవగ్రహ, హనుమ మందిరాలకు మాత్రమే వెళ్ళేదాన్ని. ఆ తరువాత అక్కడ ప్రధాన దైవం బాబాయే అని దర్శనానికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాను. అలా క్రమంగా బాబాకు దగ్గరయ్యాను.

గత ఏడాది(2018) మా అమ్మాయి చదువుతున్న కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ పెట్టారు. తను మొదట ఒక కంపెనీ ఇంటర్వ్యూకి హాజరైంది కానీ, ఎంపిక కాలేదు. మరొకరోజు తను నాతో తనకి ఒక కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ ఉందని, అందువలన తనకి టెన్షన్‌గా ఉందని చెప్పింది. నేను తనతో, "అది చాలా మంచి కంపెనీ. నువ్వేమీ ఆందోళనపడకు. నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి" అని చెప్పాను. తరువాత నేను రోజువారీ అలవాటు ప్రకారం బాబా గుడికి వెళ్ళి, "నా బిడ్డకు సహాయం చేయండి బాబా" అని ప్రార్థించి, మా అమ్మాయి పేరు, కంపెనీ పేరు ఒక పేపర్ మీద వ్రాసి బాబా పాదాల వద్ద పెట్టాను. మా అమ్మాయి సాయంత్రం కాలేజీ నుండి వచ్చి, "వ్రాత పరీక్షలో సెలెక్ట్ అయ్యాను, రేపు టెక్నికల్ రౌండ్, హెచ్.ఆర్ రౌండ్ ఉన్నాయి" అని చెప్పింది. ఆ మాటలు విని నేను ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నావంటి సామాన్య భక్తురాలికి కూడా బాబా సహాయం చేస్తున్నారనిపించి నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేశాయి. మరుసటిరోజు సాయంత్రం మా అమ్మాయి ఫోన్ చేసి, "ఇంకా ఇంటర్వ్యూ కాలేదు. దానికోసమే వేచి ఉన్నాను. అసలు ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుందో, లేదో తెలియడం లేదు" అని చెప్పింది. తరువాత కొంతసేపటికి తను కాలేజీ నుండి వచ్చి, "నిజానికి నా నెంబర్ మొదట్లోనే ఉన్నప్పటికీ టెక్నికల్ రౌండుకి నన్ను పిలవలేదు. బహుశా రేపు పిలుస్తారేమో" అని చెప్పింది. ఆ రాత్రి తను చాలా ఆందోళనపడుతూ, "వేరే ఇతర కంపెనీల సెలక్షన్ ప్రాసెస్‌కు నాకు అనుమతిలేదు. ఈ కంపెనీలో నేను ఎంపిక అవుతానో, లేదో?" అని ఏడవడం మొదలుపెట్టింది. నేను తనతో, "ఏడవకు, భగవంతుని ప్రార్థించు" అని చెప్పాను. మరుసటిరోజు నేను బాబా గుడికి వెళ్లి మళ్ళీ మా అమ్మాయి పేరు, కంపెనీ పేరు పేపర్ మీద వ్రాసి ఆయన పాదాల చెంత పెట్టి, "బాబా! నా బిడ్డకు అండగా ఉండండి" అని ప్రార్థించాను. తరువాత నేను ఆఫీసుకు వెళ్ళి రోజంతా సమయం దొరికినప్పుడల్లా 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ గడిపాను. సాయంత్రం మా అమ్మాయి కాలేజీ నుండి శుభవార్తతో వచ్చింది. అతితక్కువమంది ఎంపిక కాబడితే, అందులో తను కూడా ఉంది. ఆరోజు నాకు బాబా మహిమ ఏమిటో మొదటిసారి తెలిసింది. అప్పటినుండి నేను ఆయనకు పూర్తిగా శరణాగతి చెందాను. ప్రతిరోజూ చిరునవ్వుతో ఉన్న బాబా ముఖం చూస్తుంటే, "నేను ఇక్కడ ఉండగా భయమెందుకు?" అని బాబా నా హృదయంలో నుంచి చెబుతున్నట్లుంటుంది. ఇప్పుడు ఎందరో అంకిత భక్తులలో నేను కూడా ఒకదాన్ని. కానీ పై అనుభవం జరిగే నాటికి ప్రపంచంలో ఏ మాత్రం విలువలేని, కొత్తగా ఆయన వద్దకు చేరిన నాలాంటి సామాన్య భక్తురాలి ప్రార్థనలను కూడా ఆయన మన్నించారని తలచుకుంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. "ధన్యవాదాలు బాబా".


బాబాను తలచుకోగానే మొబైల్ పనిచేసింది

నేను గత పదేళ్లుగా సాయిభక్తురాలిని. నేను యు.ఎస్‌.ఏలో నివాసముంటున్నాను. ఒకరోజు నా దగ్గర ఉన్న ఐఫోన్-7 నీళ్లగిన్నెలో పడిపోయింది. నేను వెంటనే మొబైల్‌ను బయటకు తీసి, కవర్ తీసి నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాను. తరువాత మొబైల్ సరిగా పని చేస్తుందో, లేదో చూడటానికి ఒక వీడియో ప్లే చేశాను. సౌండ్ అస్సలు బాగా రాలేదు. నేను చాలా బాధపడ్డాను. బాబాను తలచుకోవడం ద్వారా మొబైల్ పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుని, "బాబా! మొబైల్ సక్రమంగా పని చేయాలి" అని చెప్పుకున్నాను. కాస్త కూడా ఆలస్యం లేకుండా నా మొబైల్ పనిచేయడం ప్రారంభించింది. కానీ నేను నా ఇంటిపనుల్లో పడి బాబాకు ఇచ్చిన మాటను మరచిపోయాను. కొన్నిరోజులకి నా మొబైల్ మళ్ళీ నీటిలో పడిపోయింది. అప్పుడు నేను బాబాకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, "బాబా! నా మొబైల్ సక్రమంగా పనిచేస్తే ఆలస్యం చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా మొబైల్ బాగా పనిచేస్తోంది. "ధన్యవాదాలు బాబా".

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo