కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 82వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 145
శ్రీ కృష్ణారావ్ నారాయణ్ పరూల్కర్, ఆనరరీ మెజిస్ట్రేట్ గారు (హార్ద ) 1-9-1925 న వ్రాసిన ఉత్తరంలోని సారాశం.
మాకు ఇక్కడ మా తండ్రిగారి కాలం నుండి, ప్రతి సంవత్సరం శ్రీ దత్త మహారాజ్ గారి ప్రీత్యర్థం వందమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయడం పరిపాటి. ఆ విధంగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఏదైనా సంవత్సరం, ఏదైనా సమస్య వలన అన్నసంతర్పణ చేయలేకపోతే, మరుసటి సంవత్సరం రెండువందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేస్తాము. శ్రీ సమర్థ సాయిబాబా సమాధి చెందిన మరుసటి సంవత్సరం రెండువందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయవలసి ఉంది. దానికి సంబంధించిన ఆలోచన చేసి, ఒక శనివారం రెండు వందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసేందుకు నిర్ణయించుకున్నాము. నిర్ణయం సోమవారం తీసుకున్నాము. మరుసటిరోజు మంగళవారం ఉదయం ఐదు గంటలకు నిత్యనియమం ప్రకారం లేచి నామస్మరణ చేసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా హృదయం నుండి ఏమని మాటలు వినిపించాయంటే “బ్రాహ్మణ పంక్తిలో నేను కూడా వచ్చి భోజనం చేయాలని నీ కోరిక అయితే, ముంబాయి నుండి కాకాను (శ్రీ హరి దీక్షిత్ ను బాబా కాకా అని పిలిచేవారు) పిలువు” అని! కానీ, కేవలం భోజనం కోసం శ్రీ కాకాను ఇంత దూరం ఎలా పిలవాలి? అని మనసులో అనిపించసాగింది. ఈ ఆలోచనే మధ్యాహ్నం 12 గంటల వరకు నా మనసులో కదలాడసాగింది. 12 గంటలకు పూజ చేసుకుంటుండగా “అరే, నీవు అంత గందరగోళానికి ఎందుకు గురవుతున్నావు? నీవు కాకాకు ఉత్తరం వ్రాసావంటే, నా ఆజ్ఞతో తాను వస్తాడు. తనకు బ్రాహ్మణులందరితో కలిపి భోజనం పెట్టు. తాను భోజనం చేసాడంటే, నేను వచ్చి భోజనం చేసినట్లుగా అర్థం చేసుకో” అనే స్ఫూర్తిని బాబా కలిగించారు. ఆ విధంగానే మధ్యాహ్నం కాకాసాహెబ్ కు జరిగిన విషయమంతా ఉత్తరం వ్రాసి, ఆహ్వానించాను. కానీ మనసులో ఒకటే ఆందోళన. “ఒకవేళ కాకాసాహెబ్ రాకపోతే ఈ బ్రాహ్మణ భోజనమంతా వ్యర్థమవుతుంది” అని అనిపించసాగింది. శనివారం ఉదయం వరకు కాకాసాహెబ్ వద్ద నుండి ఎటువంటి కబురు రాకపోవడంతో మనసులో ఒకటే బాధ కలుగసాగింది. బాబా చిత్రపటం ముందుకు వెళ్ళి బాబాను ప్రార్థించసాగాను. “బాబా, నేను పాపిని. మా ఇంట్లో మీరు అడుగుపెట్టి భోజనం చేయడం నా నుదిటిపై వ్రాసి లేదు” అని బాధపడసాగాను. కన్నులనుండి అశ్రుధారలు కారసాగాయి. సాష్టాంగనమస్కారం చేసుకుని అనన్యభావంతో శరణు వేడుకున్నాను. ఇంట్లో ఏర్పాట్లు పూర్తయి, పీటలపై ముగ్గులు వేయసాగారు. నేను స్నానం చేసి, సంధ్య వార్చుకోవడానికి కూర్చొన్నాను. ఇంతలో పోస్టుమాన్ టెలిగ్రామ్ తీసుకొని వచ్చాడు. టెలిగ్రామ్ చింపి చూస్తే, అందులో కాకాసాహెబ్ దీక్షిత్ గారు “నేను మరియు మాధవరావు దేశ్ పాండే ఢిల్లీ ఎక్సప్రెస్ లో వస్తున్నాము” అని వ్రాసారు. ఆ టెలిగ్రామ్ చదివాక నాకు కలిగిన ఆనందాన్ని వ్యక్తపరచడానికి నా వద్ద మాటలు లేవు. వెనువెంటనే శ్రీ సాయిబాబా చిత్రపటానికి సాష్టాంగనమస్కారం చేసుకున్నాను. స్నేహితులందరితో కలిసి స్టేషన్ కు వెళ్ళి కాకాసాహెబ్ ను మరియు మాధవరావును ఇంటికి తీసుకువచ్చాము. ఆయనతో పాటుగా బ్రాహ్మణ భోజన సమారంభం పూర్తి కావడంతో, "శ్రీ సమర్థ సాయిమహారాజ్ మా ఇంటికి వచ్చి భోజనం చేసారు” అనే భావనతో మనసుకు సమాధానం కలిగింది. శ్రీ సాయిబాబా ఆజ్ఞతోనే కాకాసాహెబ్ ఇంతదూరం వచ్చారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
ఈ భక్తుల అనుభవాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది సాయిరాం
ReplyDeleteఈ భక్తుల అనుభవాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది సాయిరాం
ReplyDelete🕉 sai Ram
ReplyDelete