ఈ భాగంలో అనుభవం:
- తనను తాను రక్షించుకొని ప్రేమతో నా బాధను తీసేసిన బాబా
ఇటీవల ఒక సాయి భక్తుడికి జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నా అనుభవాన్ని వివరించే ముందు విరిగిపోయిన విగ్రహానికి సంబంధించి బాబా ఏమి చెప్పారో తెలుసుకుందాం.
ఒకసారి తర్ఖడ్ ఇంటిలోని వినాయక విగ్రహం యొక్క కుడిచేయి మోచేయి దగ్గర నుండి విరిగిపోయింది. హిందూమత సిద్ధాంతం ప్రకారం విరిగిపోయిన విగ్రహాన్ని పూజించకూడదు. అందువలన వాళ్ళంతా చాలా భయపడ్డారు. ఏమయినప్పటికీ ఆ విగ్రహం వారి కుటుంబంలో ఒక భాగమైపోయినందువల్ల దానిని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకని వారు వినాయకచవితి ఉత్సవాలు కొనసాగించాలని, ఆ తరువాత శిరిడీ వెళ్ళి వినాయకుడి విగ్రహం గురించి శ్రీసాయిబాబా సలహా తీసుకుందామని నిర్ణయించుకొన్నారు. అనుకున్నట్లుగానే వాళ్ళు తరువాత శిరిడీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమీ చెప్పకముందే బాబా వారిని దగ్గరకు పిలిచి శ్రీమతి తర్ఖడ్‌తో, "తల్లీ! మన పిల్లవాడికి చేయి విరిగితే అతణ్ణి ఇంటినుండి వెళ్లగొట్టము కదా! దానికి బదులు వాడికి దగ్గరుండి తినిపించి, అతడు త్వరగా కోలుకొని, తిరిగి మామూలు మనిషి అయ్యేలా ఇంకా ఎక్కువ ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాము, అవునా!” అన్నారు. బాబాతో ఒక్కమాటైనా చెప్పకుండానే, బాబా మాటల ద్వారా వారి సమస్యకు పరిష్కారం లభించడంతో, వారు వెంటనే బాబా పాదాలపై పడి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. బాబా ఎంత స్పష్టంగా చెప్పారో చూశారా!
చాలారోజుల క్రితం మేము శిరిడీ వెళ్ళినప్పుడు సమాధిమందిర ప్రాంగణంలో బాబా విగ్రహమొకటి నాకు, నా స్నేహితుడికి కనిపించింది. 'ఇంత అందమైన బాబాను ఎవరు ఇక్కడ వదిలేశారో' అని అనుకుంటూ విగ్రహాన్ని నా చేతిలోకి తీసుకొన్నాను. చూస్తే, అది విరిగిపోయి ఉంది. దాన్ని అలా విడిచిపెట్టడానికి నా మనసు ఒప్పుకోలేదు. పోనీ ఇంటికి తీసుకొని వెళదామంటే, మావాళ్ళు విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో పెట్టొద్దంటారని ఆలోచిస్తుంటే, నా స్నేహితుడు, "గమ్‌తో అతికించవచ్చు" అన్నాడు. "అవునా! అతికిస్తే దృఢంగా అతుక్కుంటుందా?" అని అడిగాను. అతను, "అతుక్కుంటుంది" అని బదులిచ్చాడు. ఆ మాటతో నాకు సంతోషంగా అనిపించినా ఇంట్లో ఏమంటారోనని భయపడి నా స్నేహితునితో, "దీనిని తీసుకొని వెళదాం. నువ్వు అతికించి నీ దగ్గర వుంచు. మరలా నేను శిరిడీ వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొని వెళ్తాను" అని చెప్పాను. అందుకు తను అంగీకరించడంతో ఆ బాబాను మాతోపాటు తెచ్చుకున్నాము. కానీ కొన్నిరోజుల తరువాత ఆ విగ్రహం గురించి నా స్నేహితుని ఇంట్లో తెలిసి, "విరిగిన విగ్రహం ఇంట్లో ఉండకూడదు, గుడిలో వదిలిపెట్టేయమ"ని గోల చేశారు. దాంతో నా స్నేహితునికి ఏమి చేయాలో తోచక వాళ్ళు చెప్పినట్లే చేసి, తరువాత నాకీ విషయం చెప్పాడు. అది విని నా మనసుకు బాధగా అనిపించినా, చేసేదేమీ లేక ఊరుకున్నాను. అప్పటినుండి ఆ విషయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా నా మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది.
2020, జూన్ 22, ఉదయాన నేను మా ఇంటిలో ఉన్న రెండు బాబా విగ్రహాలకి అభిషేకం చేశాను. తరువాత విగ్రహాలను ఎప్పుడూ పెట్టే ఆసనం మీద పెట్టి, పెద్ద బాబా విగ్రహానికి వస్త్రధారణ చేస్తుండగా అనుకోకుండా నా చేయి చిన్న బాబా విగ్రహానికి తగిలి, ఆసనం మీద నుండి క్రిందకు జారింది. గాబరాగా పట్టుకొనే ప్రయత్నం చేశాను గానీ విగ్రహం క్రింద పడిపోయింది. నా మనస్సు చివుక్కుమంది. బాబాకి ఏమైందో ఏమిటోనని ఆదుర్దాగా చూస్తే, విగ్రహం రెండు ముక్కలుగా విడిపోయి ఉంది. బాబా రాయి మీద నుండి లేస్తే ఎలా ఉంటుందో అలా బాబా దేహం, క్రింద ఉన్న రాయి వేరుగా అయిపోయాయి. అతి బాధాకరమైన విషయం ఏమిటంటే, క్రిందకు పెట్టి ఉన్న బాబా ఎడమకాలు మధ్యలో విరిగిపోయింది. అది చూసి నా ప్రాణం విలవిలలాడింది. "అయ్యో బాబా, ఎంత పని జరిగింది! మా ఇంటిలో ఎవరికైనా రానున్న అపాయాన్ని తప్పించడానికి ఆ కష్టాన్ని మీ మీదకు తీసుకున్నారా బాబా? ఎందుకిలా చేశారు? ఇదంతా నా అశ్రద్ధ వల్లే జరిగింది. నన్ను క్షమించండి బాబా" అని చాలా బాధపడ్డాను. నిజంగానే ఈ దుర్ఘటన వెనుక అలాంటి కారణమేదో ఉండి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే, బాబాకు మన మీద అమితమైన ప్రేమ. మన క్షేమం కోసం ఆయన ఎంతటి బాధనైనా సంతోషంగా స్వీకరిస్తారు. ఇందుకు సచ్చరిత్రలోని కొలిమిలో పడబోయే బిడ్డను బాబా రక్షించిన ఉదంతమే పెద్ద ఉదాహరణ. సమాధి చెందాక కూడా బాబా తమ భక్తుల కష్టాలను తమ విగ్రహం లేదా చిత్రపటాల మీదకి తీసుకొని భక్తులపై వారికి గల ప్రేమను చాటుతున్న ఎన్నో లీలలను సాటి సాయిభక్తుల అనుభవాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము కూడా.
ఇకపోతే, మా ఇంటిలో ఎవరిని ఏ అపాయం నుండి బాబా కాపాడారో అర్థం కాలేదు గానీ, నాకొచ్చిన మరో ఆలోచన నన్ను తీవ్రంగా కలవరపరిచింది. మూఢనమ్మకాలకి ప్రాధాన్యతనిచ్చే మావాళ్ళు విరిగిపోయిన విగ్రహం ఇంటిలో ఉండకూడదని బాబా విగ్రహాన్ని ఏమి చేస్తారోనని భయం పట్టుకుంది. ఆ భయంతో జరిగిన దుర్ఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేక, ఏమి చేయడానికీ తోచక బిక్కుబిక్కుమంటూ మౌనంగా చూస్తుండిపోయాను. విరిగిన విగ్రహానికి సంబంధించి బాబా అభిప్రాయాన్ని చెప్పినా మావాళ్లు సమాధానపడతారో లేదో తెలీదు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ నమ్మకాలకే విలువనిచ్చి విగ్రహం ఇంట్లో ఉండకూడదంటే నేను అస్సలు తట్టుకోలేను. 'బాబా చెప్పింది తెలిసి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోవడం కంటే దారుణం ఉందా? అలా జరిగితే నా బ్రతుకెందుకు?' అని అనిపించింది. అందువలన నేను బాబాతో, "బాబా! ఈ విగ్రహాన్ని అతికించడానికి ఏ గమ్ ఉపయోగపడుతుందో నాకు తెలియదు. తొందరగా అతుక్కుంటుంది కాబట్టి ఫెవిక్విక్ పెట్టొచ్చేమో అనిపిస్తోంది. కానీ అది కూడా ఇంట్లో ఎక్కడుందో, అసలు ఉందో, లేదో నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళని అడిగితే, విషయం చెప్పాల్సి వస్తుంది లేదా అబద్ధం చెప్పాలి. ఆ రెండూ నాకు ఇష్టం లేదు బాబా. ఈ విషయంలో మీ అభిప్రాయం స్పష్టంగా తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను పూర్తిగా నిస్సహాయుడిని. ఈ స్థితిలో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి బాబా. ఈరోజు, రేపు వాళ్ళు పూజగదిలోకి రారు. ఎల్లుండి మాత్రం వాళ్లే నాకంటే ముందు వస్తారు కాబట్టి వాళ్ళకు కనపడకుండా మిమ్మల్ని దాచిపెట్టే అవకాశం కూడా నాకుండదు. అందువల్ల ఈ రెండు రోజుల్లో నాకు ఇంట్లో ఏదైనా గమ్ దొరికేలా చేయండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి బాబా" అని బాధగా చెప్పుకున్నాను.
గమ్ దొరకకుండానే ఆరోజు గడిచిపోయింది. రెండవరోజు పూజాసమయంలో నేను, "బాబా! ఒకరోజు గడిచిపోయింది. ఈరోజు సంధ్య ఆరతిలోపు ఎలాగైనా గమ్‌ని చూపించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి" అని మళ్ళీ వేడుకున్నాను. మనసులో గమ్ గురించి ఇంట్లో అడగాలని అనిపిస్తున్నా, 'బాబాకు చెప్పుకున్నాను కదా, ఆయనే చూపిస్తార'ని వేచి చూస్తున్నాను. చాలా సంవత్సరాలుగా ఇంట్లో వున్న ఒక గమ్ మనసులో మెదులుతోంది. అయితే అది నా అవసరానికి పనికొస్తుందో లేదో కూడా తెలీదు. సాయంకాలం 5 దాటిన తరువాత ఎప్పుడూ ఆ గమ్ ఉండే అలమరాలో చూశాను. బాబా దయవలన అది అక్కడే ఉండడంతో దాన్ని తీసుకొని నా జేబులో వేసుకున్నాను. మనసులోనే, "బాబా! గమ్ అయితే నా చేతికిచ్చారు. ఇక ఎవరికీ తెలియకుండా అతికించే అవకాశం కూడా మీరే ఇవ్వాలి" అని చెప్పుకున్నాను. తరువాత కాళ్ళుచేతులు, ముఖం కడుక్కొని బాబాకు సంధ్య ఆరతి ఇవ్వడానికని పూజగదికి వెళ్ళాను. విరిగిపోయిన బాబా విగ్రహాన్ని నెమ్మదిగా చేతిలోకి తీసుకొని చూస్తే, లోపల చీమలు చాలావరకు గుల్ల చేశాయి. గమ్ రాయాల్సిన అంచులను తడిమితే ఇసుక రాలినట్లు పొడి రాలిపోతోంది. దాంతో, 'విగ్రహం పరిస్థితి ఇలా ఉంది. ఈ గమ్‌తో అతుక్కుంటుందా?' అని సందేహపడి, "బాబా! ఈ గమ్‌తో విగ్రహం అతుక్కుంటుందని నాకు అనిపించడం లేదు. కానీ గమ్ అనేది కేవలం నిమిత్తమాత్రమే, దాని అతుక్కునే శక్తి మీ అనుగ్రహమే. కాబట్టి మీరు ఏమి చేస్తారోగానీ మీ విగ్రహం అతుక్కోవాలి" అని చెప్పుకొని, గమ్ రాసి విగ్రహాన్ని అతికించి, బాబాకు ఆరతి ఇచ్చి బయటకు వచ్చేశాను. కానీ అతుక్కుంటుందో, లేదో అని మనసులో ఆందోళన కొనసాగుతోంది. తెల్లవారి లేచిన తరువాత 'విగ్రహం అతుక్కుందో లేదో చూద్దాం, అతుక్కోకుంటే విగ్రహాన్ని దాచేద్దాం' అని అనిపించింది. తరువాత ఎవరూ లేకుండా చూసుకొని పూజగది లోపలికి వెళ్లి విగ్రహం తీసి చూశాను. బాబా నాపై ప్రేమతో తనను తాను అతికించుకున్నారు! అది చూసి నా మనసు చాలా తేలికపడింది. నా ఆనందానికి అవధులు లేవు. రోజువారీ పనులు చేసుకుంటూ లోలోపల చాలా ఆనందించాను.
అయితే మరో సందేహం మొదలైంది. 'విగ్రహం అతుక్కోవడమైతే అతుక్కుందిగానీ, గురువారం అభిషేకం చేసినప్పుడు మళ్ళీ విడిపోతుందేమో' అని భయం పట్టుకుంది. మరుసటిరోజే గురువారం వచ్చింది. భయపడుతూనే అభిషేకం మొదలుపెట్టాను. బాబా కృపవలన విగ్రహం ఏమీ కాలేదు. దయామయులైన బాబా నాలో ఉన్న ఆ భయాన్ని కూడా తీసేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు నెలరోజులవుతోంది. ప్రతి గురువారం బాబాకి అభిషేకం చేస్తున్నప్పటికీ అతుకు విడిపోలేదు. పైగా ఇప్పుడు గమ్ రాసిన ఆనవాలు కూడా లేనంతలా కలిసిపోయింది. ప్రియమైన బాబా నాపై ప్రేమతో నాకు బాధ లేకుండా తనను తాను రక్షించుకున్నారు. తన భక్తులకోసం ఆయన ఏమైనా చేస్తారు. ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
చివరిగా ఒక మాట, "బాబా విగ్రహం విరిగిపోయింది, ఏమి చేయాలి? అటువంటి విగ్రహాన్ని ఉంచుకుంటే తప్పు కాదా?" అనే పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా వస్తే, ఆ విషయంలో బాబా మాటే మనకు ప్రమాణం. ఇంకే శాస్త్రాల, పండితుల అభిప్రాయాలూ మనకు అవసరం లేదు.
🙏🌷🙏 సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై🙏🌷🙏
ReplyDeleteహర శంకర జయ శంకర శివ శంకర హే గిరిజా భవాని
శివ శంకర జయ శంకర హర శంకర జయ హే గిరిజా భవాని....శివ సాయినాథ నమోస్తు దేవాది దేవ 🙏🌷🙏
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram
ReplyDeleteomsairam,love u sai,baba nannu marchava pls,malli intaku mundu laga nee daggaraku teesuko deva,ee thoughts nundi nannu bayatiki vey sai,love u so much........................
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏