సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 510వ భాగం....


ఈ భాగంలో అనుభవం:


  • అండగా ఉంటూ, సహాయాన్ని అందిస్తూ పరివర్తన తీసుకొస్తారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: 

అందరికీ నమస్కారం. నేను చాలాకాలంగా నా అనుభవాలలో కొన్నింటిని వ్రాయాలని అనుకుంటున్నాను, కానీ నాకు అంత బాగా వ్రాయడం రాదని ఆలస్యం చేస్తూ వచ్చాను. మా స్వస్థలం కేరళ అయినప్పటికీ నేను బెంగళూరులో స్థిరపడ్డాను. నేను టీచర్‌గా పనిచేసి, ప్రస్తుతం కొంత విరామం తీసుకున్నాను. నేను కేవలం రెండేళ్ళుగా బాబా భక్తురాలిని. ఈ తక్కువ కాలంలోనే ఆయన నాకు అండగా ఉంటూ చాలా అనుభవాలు ఇచ్చారు. నేను గతంలో కొన్ని మంచి కర్మలు చేసి ఉండి ఉంటాను. అందుకే నాకు ఆయన అనుగ్రహం లభించిందని నేను భావిస్తున్నాను. నేను కఠినమైన సమయాన్ని అనుభవిస్తూ నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు బాబా నన్ను తన దగ్గరికి తీసుకున్నారు. బహుశా ఆయన నా విశ్వాసాన్ని, సహనాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించారనుకుంటాను. పలు సందర్భాలలో నేను ఆయన ముందు ఏడుస్తూ, నా జీవితంలో జరుగుతున్న చెడు పరిణామాలు తట్టుకోలేక ఆయనను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వెబ్‌సైట్‌లోని భక్తుల అనుభవాలను చదవడం ఖచ్చితంగా నాపై మంచి ప్రభావాన్ని చూపించింది. భక్తుల యొక్క కొన్ని అనుభవాలు నా హృదయానికి దగ్గరగా ఉండేవి. మరికొన్ని నా జీవిత పరిస్థితిని ప్రతిబింబించేలా ఉండేవి. కష్ట సమయంలో ఆ భక్తుల విశ్వాసం, పూర్తిగా బాబాకి శరణాగతి చెందడం చూసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ అనుభవాలు నాపై చాలా ప్రభావం చూపించాయి. అందువలనే నేను బాబాను వదలకుండా పట్టుకోగలిగాను. ఇతర భక్తులకు ఉపశమనం కలిగిస్తాయనే ఆశతో నా అనుభవాన్ని పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను.

బాబాతో పరిచయం ఏర్పడిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను అనవసరమైన చర్చలకు, ఊసుపోని కబుర్లకు, ఏ విషయంలోనైనా జడ్జ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నిరంతరం నన్ను బాబా గమనిస్తున్నారని, నేను వేసే ప్రతి అడుగును సరిదిద్దుతున్నారని నేను భావిస్తున్నాను. జీవితంపై నా దృక్పథం మారిపోయింది. నేను ఇంకా పరిపూర్ణంగా మారలేదుకానీ, రోజురోజుకూ నన్ను నేను మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదంతా బాబా వలనే జరుగుతోంది.

ఇప్పుడు నా అనుభవంలోకి వస్తాను. నా భర్త ఉద్యోగరీత్యా మేము కొన్నినెలల క్రితం వేరే రాష్ట్రానికి మకాం మార్చాము. 13 సంవత్సరాల వయస్సున్న మా అబ్బాయిని బాబా ఆశీస్సులతో కొత్త పాఠశాలలో చేర్చాము. ఆ అనుభవాన్ని ఇంకోసారి పంచుకుంటాను. ఒక సబ్జెక్టుని బోధించే టీచర్ యొక్క బోధనాపద్ధతి వలన కొన్ని సమస్యలు వచ్చాయి. నేను, నా భర్త ఆ టీచర్‌తో ఆ విషయం గురించి చర్చించాము. అయితే ఆ టీచర్ మా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకోలేదు. అప్పటినుండి ఆమె క్లాసురూములో మా అబ్బాయిని అందరిముందూ అవమానపరుస్తూ, వచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా వాడిని తిడుతూ వాడి పరిస్థితిని దుర్భరం చేసింది. ఆ కారణంగా అంతకుముందు ఆ సబ్జెక్టులో అద్భుతమైన స్కోరింగ్ తెచ్చుకునే మా అబ్బాయి ఆ సబ్జెక్టుని ద్వేషించడం మొదలుపెట్టాడు. దాంతో తన స్కోరింగ్ రోజురోజుకీ దిగజారిపోయింది.

ఆ సమస్యను ఎలా సరిచేయాలో అంతుచిక్కకుండా అయిపోయింది. ఎందుకంటే, నేను ఈ విషయం గురించి స్కూలులో ఎక్కువగా చర్చిస్తే, ఆమె మా అబ్బాయిని ఇంకా బాధపెడుతుంది. అందువలన నేను "నిరుత్సాహపరిచే ఆమె మాటల నుండి నా బిడ్డని రక్షించమ"ని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కానీ ఆమె మాటల హింస అలాగే కొనసాగుతూ ఉండేది. ఆమె మా అబ్బాయిపై క్రూరమైన పదజాలాన్ని వాడిందని తెలిసిన ప్రతిసారీ నాకు చాలా కోపం వచ్చేది. ఈ సమస్య నా మానసికస్థితిపై ప్రభావం చూపింది కూడా. కానీ చివరికి బాబా అనుగ్రహించారు. ఒకరోజు ఆమె మమ్మల్ని సమావేశానికి రమ్మని మెయిల్ పెట్టింది. ఆ మెయిల్ కూడా చాలా మొరటుగా ఉంది. అది చూశాక నేను ఆమెతో తన ప్రవర్తనవల్ల మా అబ్బాయి పరిస్థితి ఎలా అయ్యిందో, తరగతిలో ఎదురయ్యే అనేక ఇతర సమస్యలను గురించి కూడా చెప్పాలని వివిధ రకాలుగా ప్లాన్ చేశాను. కానీ ఆ సమావేశం సరిగా ముగియదని, మా అబ్బాయి మరింత బాధపడబోతాడని నాకు తెలుసు.

గురువారం ఉదయం నేను, "బాబా! నాకు మార్గనిర్దేశం చేయండి. నా బిడ్డను రక్షించండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నా అలవాటు ప్రకారం క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూశాను. "ఒకరు నిన్ను ఇబ్బందిపెడుతున్నారు. కానీ అంతా సర్దుకుంటుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే పని పూర్తవుతుంది. బాబా దయతో వివాదాలు పరిష్కరించబడతాయి" అని వచ్చింది. బాబా సమాధానం చూశాక నాకు మనశ్శాంతి కలిగింది. అప్పుడు నేను, "బాబా! మీరు నా మదిలో కొలువై ఉండి, నా బిడ్డ, టీచర్ ఇద్దరూ సంతృప్తిపడేలా, ఇంతటితో సమస్య ముగిసేలా సమావేశంలో నా తరపున మాట్లాడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత జరిగిన మా సమావేశం ఊహించని విధంగా బాగా జరిగింది. తరువాత ఆమె మా అబ్బాయితో మాట్లాడింది. ఆమె వాడి సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తనతో బాగా మాట్లాడుతోంది. మా అబ్బాయి కూడా స్కూల్ నుండి సంతోషంగా వస్తున్నాడు. తనలో సానుకూలమైన మార్పు చాలా కనపడుతోంది. ఈ అనుభవం ద్వారా జీవితంలో ఎవరిపట్లా శాశ్వత ద్వేషం ఉండకూడదని, నచ్చకపోతే వారినుండి దూరంగా వెళ్లిపోవాలని, చర్యకు ప్రతీకారం తీర్చుకోకూడదని బాబా నాకు నేర్పించారు.   

మరో అనుభవం: 

ముందు పంచుకున్న అనుభవంలో టీచర్ మమ్మల్ని సమావేశానికి రమ్మని పిలిచిన సమయంలోనే ఈ అనుభవం జరిగింది. మా అత్తగారు సాధారణ హెల్త్ చెకప్ కోసం డాక్టర్ని సంప్రదించారు. స్కానింగులో ఆమె గుండెలో కొద్దిగా సమస్య ఉందని తేలింది. దాంతో డాక్టర్, రెండు వారాలలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించి పూర్తి పరీక్షలు చేయించుకోమని, శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆమె వయస్సు దృష్ట్యా గుండెకు శస్త్రచికిత్స చేయించడం అంత తేలికైన విషయం కాదని నేను చాలా భయపడ్డాను. అప్పటినుండి నేను బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఆమెకు ఇస్తూ, 'ఆమెకు నయం చేయమ'ని బాబాను ప్రార్థించసాగాను. ఆమె డాక్టర్‌ని సంప్రదించడానికి వెళ్ళిన సమయంలో నేను స్తవనమంజరి చదవడం మొదలుపెట్టాను. బాబా కృప చూపించారు. స్తవనమంజరి చదవడం మధ్యలో ఉండగా మా అత్తగారి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె, "సమస్య ఏమీ లేదు, అందువలన మందులు కూడా అవసరం లేదని చెప్పారు" అని చెప్పింది. ఆ మాట వింటూనే నా మనస్సు చాలా తేలికపడింది. ఇది పూర్తిగా నా బాబా ఆశీర్వాదమే. ఈ అనుభవం బాబా ఊదీ శక్తిని ఋజువుచేసింది. ఈ అనుభవం నాకు పూర్తి విశ్వాసంతో, హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించటం నేర్పించింది.

బాబాతో నాకున్న ఈ కొద్దిపాటి అనుబంధం, నేను పొందిన అనుభవాలు బాబాకి ఎటువంటి ఆచారాలు, పూజలు అవసరం లేదని, ఆయన ఎప్పుడూ వాటిని ఆశించరని నాకు అర్థమైంది. (నేను ఇంట్లో కనీసం ఒక దీపమైనా వెలిగించను.) ఆయనకు కావలసిందల్లా స్వచ్ఛమైన విశ్వాసం, సహనం. బాబా భక్తులైన నా స్నేహితులు కొందరు 'బాబా పక్షపాతి అని, వారి ప్రార్థనలకు ఎప్పుడూ సమాధానం చెప్పర'ని అంటుంటారు. వాళ్ళకు నేను చెప్పగలిగేది ఏమిటంటే - బాబా నా ప్రార్థనలన్నింటినీ మంజూరు చేయలేదు. దీర్ఘకాలంలో మనకు ఏది ఉత్తమమో అది ఆయనకు తెలుసు, ఆ దృష్ట్యా ఆయన మనకు శ్రేయస్కరమైనదే ఇస్తారని నేను విశ్వసిస్తాను. అయినా నేను బాబాను కోరికలు తీర్చే కల్పవృక్షంగా చూడను. కానీ నేను ఆయనను 'నన్ను మంచి వ్యక్తిగా మలచమని, నా జీవితం నుండి ప్రతికూల ఆలోచనలను, అభద్రతాభావాలను తొలగించమని, నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచమని' కోరుకుంటున్నాను. అనవసరమైన చర్చలలో, కబుర్లు చెప్పుకోవడంలో, తప్పులు ఎంచడంలో ఎప్పుడూ పాల్గొనకండి, సమయాన్ని ఏదైనా మంచిపని చేయడానికి ఉపయోగించుకోండి. మీరు ఏ పని చేస్తున్నా బాబా నామాన్ని జ్ఞప్తియందు ఉంచుకోండి. ప్రతి ఒక్కరికీ శుభ, అశుభ ఘడియలు వస్తాయి. సమయం ఎటువంటిదైనా బాబాపై విశ్వాసం ఉంచుకోండి. ఆయన చేత ఎన్నుకోబడ్డ మనమంతా చాలా అదృష్టవంతులం. ఆయనతో ఋణానుబంధం పెంచుకోండి. ఏమి జరిగినా ఆయనపై నమ్మకాన్ని కోల్పోకండి, ఆయనను గట్టిగా పట్టుకోండి. ఒక తల్లి తన బిడ్డను పట్టుకున్నట్లు ఆయన మనలను తన చేతుల్లో పట్టుకొని రక్షించుకుంటారు.

ఓం సాయిరామ్….!



5 comments:

  1. om sai ram baba can change anone to rigth path.om saima

    ReplyDelete
  2. Baba please my mother health problem ni cure cheyi thandri neku shatakoti namaskaralu thandri sai

    ReplyDelete
  3. ఓం సాయిరామ్….!

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo