సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 621వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. నేను నమ్మిన సాయినాథుడు చూపిన అనుగ్రహం
  2. సచ్చరిత్ర ద్వారా బాబా సందేశం 

నేను నమ్మిన సాయినాథుడు చూపిన అనుగ్రహం

సాయిభక్తురాలు దీప్తిరెడ్డి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు దీప్తి. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.

మేము అపార్టుమెంటులో ఒక ఇల్లు తీసుకున్నాము. ఆ ఇంట్లోకి మారి ఒకటిన్నర సంవత్సరం అయింది. 2020, మార్చిలో కరోనా కారణంగా అపార్టుమెంట్ వాచ్‌మెన్ ఊరికి వెళ్లిపోయాడు. జూన్ 20న ఒక క్రొత్త వ్యక్తి వాచ్‌మెన్‌‌ పనిలో చేరాడు. అతను ఆ పనిలో చేరినప్పటినుండి మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. అతను ఎప్పుడూ మద్యం తాగుతూ, అందరి మధ్య గొడవలు పెట్టించసాగాడు. అంతవరకు కలిసిమెలిసి ఉన్నవాళ్ళంతా అతని మాటలు విని ఒకరిమీద ఒకరు కోపం పెంచుకున్నారు. ఆ ప్రభావం మాపై మరీ ఎక్కువగా పడింది. ఆ వాచ్‌మెన్‌ని పనిలో పెట్టిన ల్యాండ్ ఓనర్లు మాపై వేరేవాళ్లకు చెడుగా చెప్పి, మా భార్యభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. పరిస్థితులు నా మనసుకెంతో కష్టంగా అనిపించి భారమంతా బాబాపై వేసి, సాయి నామజపం చేసుకుంటూ, “నాలుగురోజుల్లో ఏదో ఒక పరిష్కారం చూపమ”ని అనుక్షణం ఆయననే వేడుకున్నాను. నేను నమ్మిన సాయినాథుడు తమ అనుగ్రహాన్ని చూపించారు. నాలుగు రోజుల్లో ల్యాండ్ ఓనర్, వాచ్‌మెన్ గొడవపడ్డారు. అయినా నేను అతన్ని వాచ్‌మెన్ ఉద్యోగం నుంచి తొలగించమని బాబాను వేడుకుంటూ ఉన్నాను. అంతలో మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ‘సంకల్పసిద్ధిసాయి’గా బాబా కొలువైయున్న విశ్వసాయి నిలయానికి వెళ్లాలని నాకనిపించింది. నేను, నా స్నేహితురాలు కలిసి అక్కడికి వెళ్లి సాయిని వేడుకున్నాము. బాబా దగ్గరికి వెళ్లి ప్రార్థించినంతనే, ఆయన అద్భుతం చేశారు. ఆ వాచ్‌మెన్‌ని ఉద్యోగం నుండి తొలగించి పంపేశారు. సరిగ్గా అదే సమయంలో నేను అదివరకు ఒక క్విజ్‌లో పాల్గొన్నందుకుగాను బహుమతిగా ‘సాయిసచ్చరిత్ర’, ‘బాబా ఊదీ’ నాకు బాబా ఆశీస్సులుగా లభించాయి. ఎంతో ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

మరొక అనుభవం:

వరుసకి తమ్ముడైన మా దూరపు బంధువు పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెబుదామని నేను తనకి ఫోన్ చేస్తే, తనకు ఆరోగ్యం బాగాలేదని, పాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వచ్చిందిని చెప్పాడతను. బాబా ఊదీ పెట్టుకొని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగమని నేను తనతోను, తన భార్యతోను చెప్పాను. కానీ వాళ్లు అలా చేయలేదు. మూడు నెలల్లో రెండు హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. నొప్పి, ఆయాసంతో పాటు, బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అప్పుడు హైదరాబాదులోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అడ్మిట్ అయ్యారు. అక్కడి వైద్యులు, “రోజుకు పదివేల రూపాయల విలువగల మందులు వాడుతూ సర్జరీ చేయాలి, పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంద”ని చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లి వాళ్ళకు బాబా ఊదీ ఇచ్చి, “ఏమి త్రాగినా అందులో ఊదీ కలిపి త్రాగండి. బాబాను నమ్ముకోండి” అని చెప్పాను. ఈసారి వాళ్ళు నేను చెప్పినట్లే చేశారు. నేను కూడా తమ్ముడి గురించి సంకల్పసిద్ధిసాయిని ప్రార్థించాను. రోజూ మన బ్లాగులో వచ్చే బాబా మెసేజీలను నాలుగురోజులపాటు తమ్ముడికి ఫార్వర్డ్ చేశాను. నాల్గవరోజు, “బాబా దయవల్ల నేను డిశ్చార్జ్ అవుతున్నాను” అని తన వద్దనుంచి నాకు మెసేజ్ వచ్చింది. అది చూసి నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. ఆ సాయినాథుని దయవల్ల తమ్ముడు త్వరగానే కోలుకుంటున్నాడు. ఇదంతా బాబా మహిమ కాకపోతే మరేమిటి? మూడు నెలల పాటు ఎన్ని మందులు వాడినా నయం కానిది, బాబా ఊదీ ప్రభావం వలన సరిగ్గా నాలుగురోజుల్లో తమ్ముడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అంతా బాబా దయ. ఆయనే నా తమ్ముడికి నయం చేశారు.

చివరిగా, మావారి ఆఫీసులో తనతో తన ప్రక్కనే పనిచేసే 30 మందికి కరోనా వచ్చినా కూడా ఆ మహమ్మారి మా దరిచేరకుండా బాబా కాపాడారు. “బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. మీ దయవలన తొందరలోనే అవి సమసిపోతాయని ఆశిస్తున్నాను తండ్రీ!”

జై సాయిరామ్!

సచ్చరిత్ర ద్వారా బాబా సందేశం 

సాయిభక్తురాలు శ్రీమతి భావన తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ నమస్కారం. నా పేరు భావన. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, ఫిబ్రవరి నెలలో నా వివాహం జరిగింది. నా భర్త కెనడాలో ఉంటారు. పెళ్లికి ముందే టెంపరరీ వీసాకి అప్లై చేశాము, కానీ వీసా రిజెక్ట్ అయింది. పెళ్లయిన తరువాత మార్చి నెలలో లాక్డౌన్ వల్ల డిపెండెంట్ వీసాకి అప్లై చేయడం ఆలస్యం అయింది. నా భర్త ఇండియాలో ఉండిపోవలసి వచ్చింది. దానివల్ల తన ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుందేమోనని మేము కంగారుపడ్డాము. కానీ బాబా దయవల్ల అలాంటిదేమీ జరగలేదు. తన ఆఫీసు మేనేజర్ చాలా సహాయం చేశారు. అంతేకాకుండా, పెళ్లయిన వెంటనే మేమిద్దరం మూడు నెలలు కలిసి ఉండేలా బాబా ఆశీర్వదించారు. ఆ తరువాత నా భర్త కెనడా వెళ్ళారు.

కోవిడ్ కారణంగా కెనడా వీసా ఆఫీసులు క్లోజ్ చేసివుండటం వల్ల మరియు మేము ఆలస్యంగా అప్లికేషన్ పంపడం వల్ల మా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా మొదలుపెట్టలేదు. డిపెండెంట్ వీసా ప్రాసెస్ మొత్తం పూర్తయి వీసా రావడానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది. కనుక 2021, ఫిబ్రవరికి డిపెండెంట్ వీసా రావడం సాధ్యం కాదు. 2021, ఫిబ్రవరి నెలలో మా మొదటి వివాహ వార్షికోత్సవానికి మేము కలిసి ఉండాలని అనుకున్నాము. అందుకని మేము బాబాను ప్రార్థించి, ఆగస్టు నెలలో ఇంకొకసారి టెంపరరీ వీసాకి అప్లై చేశాము. కానీ మళ్ళీ రిజెక్ట్ అయింది. 
 
దాంతో నా భర్త 2021, ఫిబ్రవరిలో ఇండియాకి రావాలని నిర్ణయించుకొని ఆఫీసులో సెలవులకి దరఖాస్తు చేశారు. కానీ 2020, మార్చి నెలలో లాక్డౌన్ కారణంగా ఇండియాలో మూడు నెలలు ఉండిపోవడం వల్ల తనకు ఆఫీసులో సెలవులు ఇస్తారో లేదో అని చాలా భయపడ్డాము. నెల రోజులు గడిచినా మేనేజ్మెంట్ ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. ఎలాగైనా మా పెళ్లిరోజుకి మమ్మల్ని కలపమని మేము బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాము. సెలవులు ఆమోదిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను ప్రార్థించాను.

నవంబరు 10వ తేదీ, సోమవారం రోజున నేను, మా అమ్మ బయటికి వెళ్ళాము. మా అమ్మ తన పని పూర్తి చేసుకుని వచ్చేలోగా నేను బాబాను దర్శించుకోవాలని బాబా గుడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్నాక నాకు సాయిసచ్చరిత్రలో ఏదైనా ఒక అధ్యాయం చదవాలనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను అంతకుముందే ఒక పారాయణ రీడింగ్ వెబ్సైట్లో సచ్చరిత్ర 15వ అధ్యాయం చదవాలనుకుని ఇంకా చదవలేదని. వెంటనే బాబా ముందు కూర్చొని 15వ అధ్యాయం చదివాను. అది చదవగానే, బాబానే నాతో ఆరోజు తన ముందు ఆ అధ్యాయం చదివేలా చేశారని నా మనసుకు అనిపించింది. ఎందుకంటే, నేను చదివిన అధ్యాయంలో రెండు బల్లుల కథ ఉంది. ఆ కథలోని బల్లులను కలిపినట్లే మమ్మల్ని కూడా త్వరలో కలపబోతున్నానని బాబా నాకు చెబుతున్నారని అనిపించింది. ఆ వారంలో బాబా ఏదో ఒక పరిష్కారం చూపిస్తారని ఎదురుచూశాను. శుక్రవారంరోజు నా భర్త నాకు ఫోన్ చేసి, “మా మేనేజర్ సెలవులు మంజూరు చేశార”ని చెప్పారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ విధంగా సచ్చరిత్ర ద్వారా ముందుగానే మమ్మల్ని కలపబోతున్నానని నాకు తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదించారు బాబా.


5 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Baba ma amma ki problem cure cheyi thandri nenne namukuna thandri

    ReplyDelete
  3. జై సాయిరామ్!

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo