సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 631వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా రక్షణ కల్పించే చల్లని తండ్రి

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నమస్కారం. తన భక్తుల పట్ల అడుగడుగునా కరుణాకటాక్షాలు చూపే ఆ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబాకి పాదాభివందనాలు, కోటానుకోట్ల నమస్కారాలు. నా చిన్నతనంలో, అంటే నాకు 12 లేక 13 సంవత్సరాల వయసున్నప్పుడు మా ఇంటి ప్రక్కన నివసించేవారింట్లో మొదటిసారి నా సాయితండ్రి ఫోటో చూశాను. బాబా కన్నుల నుండి ప్రసరించే కరుణకు నేనెంతో ఆకర్షితురాలినయ్యాను. “ఎవరో ఈ సాధువు, చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నారు. ఈ ఆంటీ అంత భక్తిగా పూజిస్తారు. ఆయన పేరు సాయిబాబా అట” అని అనుకుంటూ తరచుగా బాబా ఫోటోను చూస్తూ ఉండేదాన్ని. అలా బాబా నన్ను తన భక్తురాలిగా చేసుకున్నారు. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.


మొదటి అనుభవం:


1991లో ఒకసారి బి.ఇడి సీటు కోసం కౌన్సిలింగ్‌కి మేము ఏలూరు వెళ్ళాము. అప్పుడు అక్కడున్న సాయిబాబా గుడికి వెళ్లి నాకు బి.ఇడి లో సీటు వచ్చేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించాను. కానీ, మనసులో మాత్రం సీటు వస్తుందో రాదోనన్న అనుమానం ఉంది. చివరికి బాబా అనుగ్రహంతో నాకు భీమవరంలో బి.ఇడి సీటు కేటాయించారు. ఫీజు కట్టి, అర్థరాత్రి సమయంలో తిరిగి వచ్చేటప్పుడు రైల్వేస్టేషన్ బయట బాబా దర్శనమిచ్చారు. బాబాకు నమస్కరించుకుని, బి.ఇడి లో సీటు ప్రసాదించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బి.ఇడి లో చేరిన తరువాత ఆ సంవత్సరం చివర్లో పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ, నేను ఒక పరీక్షకు సరిగా ప్రిపేరవలేదు. ఆ సమయంలో మా హాస్టల్‌కి కొద్ది దూరంలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి బాబాకు నమస్కరించుకుని, “బాబా! మిమ్మల్ని మొట్టమొదట బి.ఇడి సీటు కోరుకున్నాను, మీరు ఇచ్చారు. ఇప్పుడు నా నిర్లక్ష్యంతోనూ, తెలియనితనంతోనూ నేను ఒక పరీక్షకి సరిగా ప్రిపేరవలేదు. ఇప్పుడు నేను ఈ పరీక్షలో ఫెయిలైతే నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. దయచేసి పాస్ మార్కులతోనైనా సరే నన్ను ఈ పరీక్ష పాస్ చేయించండి తండ్రీ!” అని ప్రార్థించాను. తరువాత బాబాపైన భారం వేసి పరీక్ష వ్రాశాను. ఫలితాలు వచ్చాక చూసుకుంటే, ఆశ్చర్యం! ఆ పరీక్షలో కాలేజీలో ఫస్ట్ మార్క్ నాకే వచ్చింది. నిజంగా నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఆ పరీక్షలో కేవలం పాస్ మార్కులు వస్తే చాలనుకున్న నన్ను కాలేజీలోనే మొదటి స్థానంలో నిలిపిన నా సాయితండ్రికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ తర్వాత నా ఉద్యోగం, పెళ్లి, సంతానం.. ఇలా అన్ని విషయాల్లోనూ బాబా అడుగడుగునా నాకు తోడు ఉన్నారు.


రెండవ అనుభవం:


2004లో నేను ఎమ్.ఎ ఇంగ్లీషు పరీక్ష కోసం సరిగా ప్రిపేర్ కాలేక చాలా బాధపడ్డాను. ఈ విషయం గురించి బాబాను ప్రశ్నిస్తే, “బీదవారికి మజ్జిగ దానం చెయ్యమ”ని సమాధానమిచ్చారు బాబా. బాబా చెప్పినట్లు మజ్జిగ దానం చేసిన గంటలోనే మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక లెక్చరర్ గురించి నాకు తెలిసేలా చేశారు బాబా. ఆమె సహకారంతో చక్కగా ప్రిపేరై అన్ని పరీక్షలూ ఒకేసారి వ్రాశాను, బాబా అనుగ్రహంతో అన్ని పరీక్షలలోనూ పాసయ్యాను. అంతేకాదు, వెంటనే ఉద్యోగంలో ప్రమోషన్ పొందేలా ఆశీర్వదించారు బాబా. బాబా చేసిన సహాయాన్ని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. “మీకు శతకోటి ధన్యవాదాలు సాయితండ్రీ!”


మూడవ అనుభవం:


ఒకరోజు సాయంత్రం పెద్ద వర్షం కురిసి నేలంతా జలమయమైంది. కాసేపటి తర్వాత వర్షం తెరిపివ్వటంతో, నేను, మావారు రెండు సంవత్సరాల వయసున్న మా పాపను తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళాము. హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ ఫ్యాన్సీ స్టోర్లో చిన్న పనుండి పాపను మావారి చేతికిచ్చి నేను షాపులోకి వెళ్ళాను. మావారు పాపను బైక్ మీదనుండి దింపగానే పాప ఆ ఫ్యాన్సీ షాపు బయటవున్న బొమ్మల్ని చూసి సరదాగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ వచ్చి ఆ బొమ్మల్ని అందుకోబోయింది. ఇంతలో అనుకోకుండా తన చిన్ని పాదాలు గట్టుపై నుండి జారి పాప క్రిందనున్న లోతైన కాలువలో పడిపోయింది. అది చూసి నా గుండె ఆగినంత పనైంది. మావారు తక్షణం స్పందించి దాదాపు నేలపై బోర్లాపడి ఆ కాలువలో చేయి పెట్టి పాపను బయటికి లాగేశారు. ఆరోజు కురిసిన వర్షం వల్ల చెత్త, గాజుపెంకులు ఏవీ లేకుండా కాలువ శుభ్రంగా ఉంది. గాజుపెంకులు లాంటివి ఉండుంటే పాప గాయపడేదే. ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా పాప ఆ ప్రవాహంలో కొట్టుకుపోయివుండేది. అంతేకాదు, అక్కడికి సమీపంలోనే పెద్ద రాయి ఉంది. ఆ రాయికి తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంది. నా సాయితండ్రే ఆరోజు మా పాపను కాపాడారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ పాపకి స్వెట్టర్, మంకీ క్యాప్ ఉండటం వల్ల చిన్న గాయం కూడా కాలేదు. బాబా ప్రేరణతో మావారు తక్షణమే స్పందించటం, పాప జారుతుండగానే తన రెక్క పుచ్చుకుని పైకి లాగటం, కాలువలోని నీరు మురికి, చెత్త లేకుండా ఉండటం.. ఇవన్నీ పాపను కాపాడటానికి బాబా చేసిన ప్రణాళికలే. అలనాడు కమ్మరి కొలిమిలో పడిపోయిన బిడ్డను కాపాడిన రీతిలోనే ఆరోజు బాబా మా పాపను కాపాడారు. “సాయీ! మీకు సహస్రకోటి వందనాలు”.


నాలుగవ అనుభవం:


మా తాతగారి ద్వారా మాకు వారసత్వ ఆస్తిగా సంక్రమించిన ఒక పాత ఇల్లు ఎన్నో గొడవల వల్ల అనేక సంవత్సరాలుగా నివాసయోగ్యం కాకుండా, అమ్ముడవకుండా ఉంది. అలాగే, 2012లో మాకు చెందిన ఒక స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించాలని చూశారొకరు. ఈ కోర్టు కేసుల విషయంలో ముందుగానే శుభసంకేతాలిచ్చి మాకు విజయాన్ని అందజేశారు బాబా. అది ఎలా జరిగిందో వివరిస్తాను. విశాఖపట్నంలోని ఈస్ట్ శిరిడీ దేవాలయంలో బాబాకు ఆరతి ఇచ్చిన తరువాత అక్కడి భక్తుల పేర్లను లాటరీ తీస్తారు. ఆ లాటరీ వచ్చినవారికి బాబా ప్రసాదంగా పెద్ద లడ్డూని ఇస్తారు. సాధారణంగా నాకెప్పుడూ ఏ లాటరీ రాదు. అలాంటిది ఆశ్చర్యకరంగా ఒకసారి నాకు ఆ లాటరీలో లడ్డూ ప్రసాదం లభించింది. ఎప్పుడూ లేనిది బాబా అనుగ్రహంతో నాకు లాటరీలో బాబా ప్రసాదం వచ్చిందని ఎంతో ఆనందించాను. కొద్ది రోజుల తర్వాత మరోసారి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మందిర నిర్వాహకులు లాటరీ తీస్తుండగా, “ఏదో ఒకసారి అంటే వచ్చిందిగానీ, అసలు నాకు ఎప్పుడైనా లాటరీ వచ్చిందా ఏంటి, ఈసారి కూడా రావడానికి?” అనుకున్నాను. ఇంతలో నా టోకెన్ నెంబర్ పిలవటంతో విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంత తక్కువ వ్యవధిలో రెండుసార్లు లాటరీలో నా పేరు రావటం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, అప్పుడు నాకు అర్థం కాలేదు, కోర్టు కేసుల విషయంలో అది బాబా నాకు ప్రసాదించిన శుభశూచకమని. ఎన్నో సంవత్సరాలుగా మేము అమ్ముకోలేక, అనుభవించలేక గొడవల్లో ఉన్న మా వారసత్వపు ఆస్తి అయిన ఆ పాత ఇంటిని బాబా అనుగ్రహంతో 2019, ఏప్రిల్ నెలలో ఏ గొడవలూ లేకుండా అమ్ముకోగలిగాము. అలాగే, ఆ నెలాఖరున మా స్థలవివాదంలో కూడా కోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ స్థలాన్ని మా ఆధీనంలోకి తీసుకోమని శుభవార్త చెప్పారు. “శతకోటి నమస్కారాలు తండ్రీ!”


అయితే, నా అజ్ఞానం వల్ల ఇదంతా నా సాయితండ్రే అనుగ్రహించారని గుర్తించలేక, నెరవేరని మరో కోరిక కోసం బాధపడుతూ, “సాయీ! నాకు లాటరీలో రెండుసార్లు రెండు లడ్డూలు ప్రసాదించారు. దీని అర్థం ఏమిటి? దీని ద్వారా నా కోరికలేమైనా నెరవేరాయా?” అని నేను అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా, “ఒకే నెలలో రెండు అతి పెద్ద సమస్యలు తీర్చాను కదా!” అనే సమాధానం లభించింది. అద్భుతం! అత్యద్భుతం!! నా కళ్ళు తెరచుకున్నాయి. ఈ కేసులలో విజయం లభిస్తుందని నా సాయితండ్రి ముందే నాకు శుభసంకేతాలు ఇచ్చారని అప్పుడు అర్థమైంది. “బాబా! మీకు వేలకోట్ల నమస్కారాలు”.


అయిదవ అనుభవం:


ఈమధ్య విపరీతమైన నడుమునొప్పితో బాధపడుతూ మా ఫ్యామిలీ డాక్టరుకి చూపించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆరోజు శనివారం. నాకు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. కానీ ఆరోజు మా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో లేరు. అందువల్ల ఆదివారంనాడు మరో తెలిసిన డాక్టరుకి రిపోర్టులు చూపిస్తే సర్జరీ చేయాల్సివుంటుందని చెప్పారు. నా పైప్రాణాలు పైనే పోయాయి. బాబాకు నమస్కరించుకుని, నా బాధను విన్నవించుకుని, సర్జరీ అవసరం లేకుండా చేయమని ప్రార్థించి, మా ఫ్యామిలీ డాక్టర్ని కలిసేవరకు ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ బాబా స్మరణలోనే ఉన్నాను. మా డాక్టర్ వచ్చాక రిపోర్టులు పరిశీలించి, సర్జరీ ఏమీ అవసరం లేదని చెప్పి, నడుమునొప్పి తగ్గటానికి మందులు ఇచ్చి పంపించారు. తనను నమ్మిన భక్తులను బాబా ఎంతగా రక్షిస్తారో చూడండి. బాబా నాపై చూపిన కరుణకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


ఆరవ అనుభవం:


2017లో నాతోపాటు మరికొంతమంది టీచర్లను మేముంటున్న ప్రాంతం నుంచి చాలా దూరప్రాంతాలకు బదిలీ చేశారు. ఇంటినుండి అంతదూరం బస్సులో ప్రయాణించాలంటే కనీసం 2.30 నుండి 3 గంటల సమయం పడుతుంది. పైగా బస్సుకోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తొమ్మిదిమంది టీచర్లం కలిసి ఒక క్యాబ్ ఏర్పాటు చేసుకునేలా బాబా అనుగ్రహించారు. బాబా దయవల్ల బస్సు కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి ఆందోళనా లేకుండా మేమంతా మా ప్రాంతం నుండి సుమారు 100 కి.మీ. దూరమున్న స్కూలుకి రెగ్యులర్‌గా వెళ్లి వస్తున్నాము. క్యాబ్ నడిపే అబ్బాయి ఒక క్రిస్టియన్. అయినప్పటికీ క్యాబ్ వెనుక డోర్ గ్లాస్ మీద బాబా స్టిక్కర్ ఉండేది. ఆ 100 కిలోమీటర్ల హైవే ప్రయాణంలో మాకు ఎలాంటి ఆపదా కలుగకుండా నా సాయితండ్రే కాపాడారు. అంత దూరప్రయాణంలో మేము ఏనాడూ ఇబ్బందిపడలేదు. ఎప్పుడైనా క్యాబ్ బ్రేక్‌డౌన్ అయినప్పటికీ, అది మేము దాదాపు మా ఇళ్లకు దగ్గరగా వచ్చాకే అయ్యేది. అక్కణ్ణించి ఏ ఇబ్బందీ లేకుండా మేము ఆటోల్లో మా ఇళ్లకు చేరుకునేవాళ్ళం. ఆ దూరప్రయాణంలో ఎటువంటి ప్రమాదమూ జరుగకుండా మమ్మల్ని నిరంతరం కాపాడిన బాబాకు సహస్రకోటి వందనాలు.


ఏడవ అనుభవం:


ఒకసారి బాబాకు నైవేద్యం సమర్పించి, తరువాత భక్తులకు పంచడం కోసం ఒక క్యాన్ నిండా నైవేద్యం సిద్ధం చేసి బాబా గుడికి బయలుదేరాము. ఇంట్లోనుండి బయటకు రాగానే బాబా క్యాలెండర్లు అమ్ముతూ ఒక అబ్బాయి ఎదురయ్యాడు. బాబానే ఎదురొచ్చి స్వయంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారని మేమెంతో సంతోషించాము. తరువాత బస్టాపులో నిలుచుని బస్సుకోసం నిరీక్షిస్తుండగా ఒక కారు వచ్చి మా ముందు ఆగింది. ఆ డ్రైవర్ కారు దిగి మా వద్దకు వచ్చి నన్ను పలకరించారు. నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. దాంతో ఆయన తనను తాను పరిచయం చేసుకుని, “మీరు చిన్నప్పుడు ఫలానా చోట ఉండేవారు కదా? మీరు ఫలానావారి అమ్మాయి కదా?” అని అడిగారు. అప్పుడు గుర్తుపట్టాను ఆయన్ని. ఎప్పుడో నా చిన్నప్పుడు మేము ఆడుకుంటున్న వయసులో ఒక ట్యాక్సీ డ్రైవరు మా ఇంటిముందు కారు ఆపి భోజనానికి వెళ్లొస్తుండేవారు. ఆయనే ఈయన. చాలా సంవత్సరాల తరువాత చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టి పలకరించారు. “ఎక్కడికి వెళుతున్నారమ్మా? రండి నేను దింపుతాను” అని చెప్పి మమ్మల్ని కారు ఎక్కించుకుని భద్రంగా బాబా గుడి దగ్గర దించారు. ఆ విధంగా మేము ఏమాత్రం బరువు మోయకుండా, బస్సు ఎక్కి, దిగి, నడిచి కష్టపడకుండా బాబానే ఏర్పాట్లు చేశారు. ఎంత అద్భుతమైన లీలో చూడండి.


ఎనిమిదవ అనుభవం - అమ్మకి సాయి రక్ష:

 

2007వ సంవత్సరంలో ఒకరోజు మా అమ్మ దివాన్ కాట్ మీద నుంచి క్రిందపడితే తుంటి ఎముక విరిగి తనకు మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆనాడు అమ్మ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ సాయిసచ్చరిత్ర గ్రంథాన్ని తన ప్రక్కనే ఉంచి తను త్వరగా కోలుకోవాలని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో త్వరలోనే తిరిగి చక్కగా నడవగలిగింది అమ్మ. ఇంటికి తిరిగి వచ్చాక బాబా చిత్రపటాన్ని అమ్మ నిద్రలేవగానే కనపడేలా పెట్టి అమ్మ క్షేమాన్ని బాబాకే అప్పజెప్పాను. ఇప్పుడు, 2020, నవంబరు 30వ తారీఖు సాయంత్రం అమ్మ బాత్రూం నుండి వస్తూ కాలుజారి పడిపోయింది. నొప్పితో నడవలేకపోయింది. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సలహా మేరకు హుటాహుటిన అమ్మను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. డాక్టర్ వెంటనే అమ్మకు X-Ray తీసి చూశారు. ఆ కాస్త సమయంలో అమ్మను కాపాడమని గగ్గోలు పెట్టి బాబాను ప్రార్థించాను. ‘ఓం ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే సాయినామాన్ని మా పాపతో విడవకుండా చెప్పించాను. ఆశ్చర్యం! X-Ray రిపోర్టులో అమ్మకు ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని తెలిసింది. 74 ఏళ్ల వయసులో బలహీనంగా ఉన్న మా అమ్మ కాలుజారి పడిపోయినప్పటికీ ఎలాంటి ఫ్రాక్చర్ అవలేదంటే అది ఆ సాయితండ్రి రక్షణ కాక మరేమిటి? “బాబా! మా అమ్మను నువ్వే కాపాడావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ! కరుణతో అందరినీ ఎల్లప్పుడూ ఇలాగే కాపాడు బాబా!”

 

“అడుగడుగునా మమ్మల్ని రక్షించే ఓ చల్లని తండ్రీ! నీ కృప, కరుణాకటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ మాపై ప్రసరింపజేయి. ఎన్నటికీ నీ పాదాలు విడిచిపెట్టని అనంతమైన భక్తిని మాకు ప్రసాదించు తండ్రీ!” 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



12 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete
  6. Om sai ram������

    ReplyDelete
  7. Om sai ram baba ma amma arogyam bagundale cheyi thandri

    ReplyDelete
  8. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏💐🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo