సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1736వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఇచ్చిన నిదర్శనాలు
2. బాబా దయవలన తగ్గిన కంటి దురద

బాబా ఇచ్చిన నిదర్శనాలు


నా పేరు హాసిని. బాబా సర్వజీవులలో తామున్నామని, తమకు నివేదించిన నైవేద్యాలను ఆయా జీవుల రూపాలలో స్వీకరిస్తామని ఎన్నో అనుభవాల ద్వారా తెలియజేశారు. అందుకే నేను బాబా చీమ రూపంలో వచ్చి నైవేద్యం స్వీకరిస్తారని రోజూ బాబాకి నైవేద్యం పెడతాను. ఒకసారి కిస్మిస్, ఇంకోసారి పటికబెల్లం. అయితే చీమలు వచ్చినా పటికబెల్లం తినేవి కానీ, కిస్మిస్ తినేవి కాదు. 2023, డిసెంబర్ 15న నేను బాబాకి కిస్మిస్ పెడుతూ, "బాబా! మీరు ఎప్పుడూ కిస్మిస్ తినలేదు, పటికబెల్లం మాత్రమే తింటున్నారు కదా! నేను కిస్మిస్ పెడతాను, మమ్మీ పటికబెల్లం పెడుతుంది" అని అనుకున్నాను. తర్వాత బాబా లీల చూడండి. నేను నైవేద్యం పెట్టి, ధూపం వేస్తుంటే నైవేద్యం దగ్గరకి ఒక చీమ వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నేను పూజ చేస్తుండగానే బాబా చీమ రూపంలో ఖచ్చితంగా వస్తారు. సరే, నేను ఆ చీమ రావడం చూసి, 'చీమ రూపంలో బాబా వచ్చారు. ఆయన ప్రసాదం తింటార'ని వెంటనే పటికబెల్లం తీసి అదివరకు పెట్టిన కిస్మిస్ పక్కన పెట్టాను. కాని ఆ చీమ(బాబా) మొట్టమొదట నేను ముందు పెట్టిన కిస్మిసే తింది. అలా నువ్వు చూడకపోతే నేను తిననట్టు కాదు, నేను తింటున్నానని మొదట కిస్మిసే తిని చూపించారని నాకు అనిపించింది. ఇంకా ఆవిధంగా బాబా తమ ఉనికిని నాకు తెలియజేస్తున్నారని అర్థమై చీమ లోపల తియ్యదనాన్ని స్వీకరిస్తుందని కిస్మిస్ కొంచం ఒలిచి పెట్టాను(నిజానికి ఆ చీమలు కిస్మిస్ తినడం నేనెప్పుడూ చూడలేదు. ఎందుకో అప్పుడే అలా అనిపించింది. బాబాయే తెలిపారేమో!). తర్వాత చీమ పటికబెల్లం తినడానికి వెళ్ళింది. ఆ ఫొటో కింది ఇస్తున్నాను మీరూ చూడండి. 

ఒకసారి శివాలయంలో అన్నదానం జరిగేటప్పుడు మా బాబాయ్ తన ఫోన్ ఎక్కడో పడేసుకున్నారు. ఆ విషయం అదేరోజు సాయంత్రం మా పిన్ని మా మమ్మీతో చెప్తుంటే నేను విన్నాను. ఆ రోజు రాత్రి పడుకునేముందు నేను, "బాబా! బాబాయ్ ఫోన్ దొరికేలా చూడండి. మొబైల్ దొరికాక మీ గుడిలో కొబ్బరికాయ, రవ్వకేసరి సమర్పించుకుంటాను. అలాగే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించి నిద్రపోయాను. మరుసటిరోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ "బాబాయ్ ఫోన్ దొరికిందట" అని చెప్పింది. ఏం జరిగిందంటే వేరే నంబర్ నుండి బాబాయ్ తన ఫోన్‌కి కాల్ చేస్తే, ఎవరో లిఫ్ట్ చేసి తాము ఎక్కడున్నది చెప్పారు. వాళ్ళు చెప్పింది మా బాబాయ్ వాళ్ళ ఊరు కాదు, వేరే ఊరు. అక్కడికి వెళ్లి బాబాయ్ తన ఫోన్ తెచ్చుకున్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్ దొరికితే ఎవరూ తిరిగి ఇవ్వరు, అమ్మేయడం లాంటిది చేస్తారు. కానీ బాబా దయవల్ల మా బాబాయ్ ఫోన్ దొరికింది. ‘సాయీ’ అంటే ‘ఓయ్’ అని పలుకుతారన్న మాటను బాబా ప్రతిరోజు, ప్రతి క్షణం నిదర్శనం ఇస్తున్నారు. "ధన్యవాదాలు సాయినాన్న. నేను పరీక్షలు పాస్ అయ్యేలా ఆశీర్వదించండి బాబా".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


బాబా దయవలన తగ్గిన కంటి దురద


నా పేరు లలిత. మాది రాజాం. నా రెండు కళ్ళకి ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొన్ని రోజులకి నా కళ్ళు దురద పెట్టసాగాయి. నాకు చాలా భయమేసి డాక్టర్ దగ్గరకి వెళ్లాలనుకున్నాను. కానీ నా భర్తకి ఖాళీ సమయం దొరకలేదు. అందుకని నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఈ కళ్ళు దురద తగ్గితే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల కొంచెం దురద తగ్గింది. కాని పూర్తిగా తగ్గలేదు. ఆలోగా నా భర్తకి ఖాళీ సమయం దొరికి నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్ళారు. డాక్టరు చూసి, "కళ్ళుకి పెద్ద సమస్యేమీ లేదు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది" అని డ్రాప్స్ వ్రాసి ఇచ్చారు. బాబా దయవలన ఆ డ్రాప్స్ వాడాక దురద తగ్గింది. ఇప్పుడు మరే ఇబ్బంది లేదు. "ధన్యవాదాలు బాబా. మీ పాదాలందు నాకు స్థిరమైన భక్తిశ్రద్దలు కలిగేటట్లు అనుగ్రహించండి బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo