సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- మూడవ భాగం


1915లో బాబా కన్నీళ్లు పెట్టుకుంటూ నాచ్నే భార్యకు కొబ్బరికాయను ప్రసాదించిన తరువాత 1919లో ఆ దంపతులకు మొదటి సంతానంగా మూలానక్షత్రంలో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకి 'కాలూరాం' అని పేరు పెట్టారు. 1921లో కాలూరాంకి మూడేళ్ల వయస్సు వచ్చాక మూలానక్షత్ర ప్రభావం వలన పిల్లవాని తల్లి మరణించింది. ఆమె చనిపోతుందని తెలిసే బాబా కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు కన్నీరు కార్చారని నాచ్నేకు అప్పుడు అర్థం అయ్యింది. కాలూరాం మూడవ ఏట నుండి 'రామ్ హరిరామ్' అనే మంత్రాన్ని జపిస్తుండేవాడు. 

పక్కింటిలో ఉన్న హెగ్డే అనే ధర్మవర్తనుడైన పండితుడు పిల్లవాణ్ణి పరిశీలించి, పిల్లవాడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకరని చెప్పాడు. “కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతను నా వీపుపై ఎక్కేవాడు. నేను అతని కాలు గిచ్చి పైకి చూసేసరికి అతను పెరుగు కుండను నాపై బోర్లించేవాడు. అంతలో ఆ ఇంటి గోపిక వచ్చేది" అంటూ శ్రీకృష్ణుని లీలల గురించి కాలూరాం చెప్తుండేవాడు. కాలురాం చెప్పేవన్నీ అదేరోజు హెగ్డే చేసే హరివిజయం పారాయణలో వచ్చేవి. ఒకరోజు కాలూరాం తలపై ముసుగు వేసుకుని చలనం లేకుండా యోగిలా ఒక మూలన కూర్చుని ఉండటాన్ని నాచ్నే చూశాడు. తండ్రి ఆ ముసుగు తొలగించి చూస్తే, వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. "తలపై ముసుగెందుకు వేసుకున్నావ"ని అడిగితే, వాడు "నేనెప్పుడూ ఇలాగే చేస్తుంటాన"ని చెప్పాడు. "ఎందుకు ఇలాంటి సాధన చేస్తున్నావు?" అని అడిగాడు నాచ్నే. అందుకు వాడు నవ్వాడు. వాడి వయస్సుకు మించిన పరిణతి అతన్ని ఆశ్చర్యపరిచింది. ఒకసారి వాడు సందేశ్ అనే మాసపత్రికను తండ్రి చేత తెప్పించి, దాని అట్టమీద ప్రణవంలోనున్న శ్రీకృష్ణుని బొమ్మ కత్తిరించి గోడకి అంటించాడు. ఆ పుస్తకంలో  “హిజ్ మాస్టర్స్ వాయిస్ (తన యజమాని స్వరం)” అనే గ్రామ్ఫోన్ రికార్డుల ప్రకటన ఉంది. ఆ ప్రకటలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మను చూపిస్తూ, "ఇది ఏమిటి?" అని తండ్రిని అడిగాడు కాలూరాం.

నాచ్నే: అది గ్రామ్‌ఫోన్ రికార్డుల వారిచ్చిన ప్రకటన.
కాలూరాం: ఇది శ్రీకృష్ణుని ప్రత్యేక సందేశం.
నాచ్నే: ఏమిటా ప్రత్యేక సందేశం?
కాలూరాం: కుక్క ఏం వింటోంది?
నాచ్నే: గ్రామ్‌ఫోన్ నుండి వచ్చే సంగీతం.
కాలూరాం: కుక్క తన యజమాని స్వరాన్ని వింటోంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చుని ఎంత శ్రద్ధగా వింటోందో! మనం కూడా అలాగే స్థిరంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చున్నానో, మీరు కూడా అలాగే కూర్చుని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు మీకు బాబా గొంతు వినిపిస్తుంది.
నాచ్నే: బాబా గొంతు నీకెలా తెలుసు?
కాలూరాం: నాకు తెలుసు. నేను మీకు చెప్పను. అనుభవం ద్వారా మీరే తెలుసుకోండి.

కాలూరాం "రామ్ హరిరామ్" అనే మంత్రాన్ని జపించడమేకాక కాగితాలపై వ్రాస్తూండేవాడు. ఉపాసనీ బాబా అంధేరీ వచ్చినప్పుడు ఆ కాగితాలను అడిగి నాచ్నే వద్దనుండి తీసుకున్నాడు. 1924లో కాలూరాంని చూడటానికి గాడ్గీబాబా వంటి మహాత్ములెందరో నాచ్నే ఇంటికి వచ్చారు. 1927లో కాలూరాం ఒంటికి నీరుపట్టి జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వాడికి పవిత్రమైన బాబా ఊదీ మాత్రమే ఇచ్చేవారు. ఈ వ్యాధి కొంతకాలం కొనసాగి చివరికి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కాలూరాంకి అంతిమ ఘడియలు సమీపించాయి. వాడు తండ్రిని తన పడక దగ్గరకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మని అడిగాడు. ఆ పుస్తకాన్ని అందుకుని 13వ అధ్యాయం తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకుంటున్నందుకు నాచ్నేకు దుఃఖం ఆగలేదు. కాలూరాం తండ్రిని ఓదార్చుతూ, “ఇందులో దుఃఖించడానికి ఏముంది? నాకోసం ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదవండి. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను” అని అన్నాడు. దుఃఖభారంతో నాచ్నే అది చదవలేకపోయాడు. అప్పుడు కాలూరాం ఆ పుస్తకాన్ని తన ముందు ఉంచుకుని తుదిశ్వాస విడిచాడు. పసితనంలోనే చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ కాలురాం వంటి ఉత్తమజీవికి కార్తీక ఏకాదశినాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టే ఆయన 1915లో కొబ్బరికాయ ఇస్తూ కన్నీరు కార్చారు.

కాలూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం, అంటే 1922లో నాచ్నే తల్లిదండ్రులు అతనికి రెండవ వివాహం చేయాలని తలచారు. ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేశారు. వాళ్లలో ఒక అమ్మాయి ధనిక కుటుంబానికి చెందినది, రెండవ అమ్మాయి పేదింటిది. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న సమస్య ఎదురైంది. ధనవంతురాలైన అమ్మాయి తండ్రి 600 రూపాయల వరకు కట్నకానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నాచ్నే తండ్రి ఆ సంబంధానికి అనుకూలంగా ఉన్నాడు. కానీ అందుకు నాచ్నే సుముఖంగా లేడు. అటువంటి స్థితిలో నాచ్నే తల్లికి బాబా కలలో కనిపించి, "ఈ అమ్మాయిని నీ కొడుకుకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించకు" అని చెప్పారు. అదే కలలో ఆమె ఒక పేదింటి అమ్మాయిని చూసింది. "నాచ్నే ఆమెను వివాహం చేసుకోవాల"ని బాబా చెప్పారు. తరువాత కొద్దిరోజులకి ఒక పేదింటి అమ్మాయి పినతండ్రి నాచ్నేను సంప్రదించి ఆ అమ్మాయిని అతనికిచ్చి వివాహం చేయాలనే ఉద్దేశాన్ని వెలిబుచ్చాడు. నాచ్నే ఆ విషయాన్ని తన తల్లితో చెప్పాడు. ఆమె వెళ్లి ఆ అమ్మాయిని చూసి, తనకు కలలో కనిపించింది ఈ అమ్మాయే అని గుర్తించింది. ఆ అమ్మాయినే నాచ్నే 1922లో వివాహం చేసుకున్నాడు.

1923, డిసెంబరు 3న నాచ్నే అంధేరీలో ఉన్న తన ఇంటి వరండాలో కూర్చుని ఎదురుగా ఉన్న రోడ్డుపై వచ్చే పోయే వాహనాలను చూస్తున్నాడు. మిస్టర్ నోయెల్ అనే అతడు రోడ్డుపై కారు నడుపుతున్నాడు. హఠాత్తుగా ఆ కారు విట్టల్ గారి చిన్నపాపను ఢీకొట్టింది. అది చూస్తూనే నాచ్నే, "బాబా, బిడ్డను కాపాడు" అని ప్రార్థించాడు. మరుక్షణంలో కారు ఆగిపోయింది. నాచ్నే పరుగున వెళ్లి ఆ పాపను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆ పాప కారు కిందపడి నలిగిపోయే లోపల కారు ఆగటం నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే ఆ సమయంలో కారు బ్రేకులు పనిచేయడం లేదు. మరి కారు ఎలా ఆగిందా అని గమనిస్తే, ఎలా చేరిందో గానీ ఒక రాయి గేరులో ఇరుక్కున్నందువల్ల బ్రేకులు వేయకుండానే సమయానికి కారు ఆగింది. పాపకు అయిన గాయాలు చూసి సబ్-అసిస్టెంట్ సర్జన్ ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, ప్రాణానికి అపాయమని భయపడ్డాడు. కానీ నాచ్నే అతనితో, "సాయిబాబా పాపను రక్షిస్తారు" అని చెప్పాడు. పాప పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత కోలుకుంది; కానీ తన మాటపడిపోయింది. ఆ పరిస్థితి తొమ్మిది నెలలపాటు కొనసాగింది. అప్పుడొకరోజు దాసగణు అంధేరీకి వచ్చినప్పుడు నాచ్నే జరిగిన విషయాన్ని అతనితో చెప్పాడు. అది విన్న దాసగణు పాపకు మళ్ళీ బాబా ఊదీ ఇవ్వమని సలహా ఇచ్చాడు. నాచ్నే అలాగే చేశాడు. మరుసటిరోజే పాప మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది బాబా చేసిన అత్యద్భుతమైన లీల.

1926లో నాచ్నే కుమారుడు సాయినాథ్ అలియాస్ హరేశ్వర్ ఎనిమిది, తొమ్మిది నెలల వయస్సు పిల్లాడు. కాలూరాం టపాసులు, బెంగాల్ అగ్గిపెట్టెలు తెచ్చుకున్నాడు. పిల్లలందరూ వాటిని కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల విసిరేశాడు. అది వెళ్లి సాయినాథ్ మీద పడింది. దాంతో వాడి ఒంటిమీద తొడిగి ఉన్న బట్టలు అంటుకుని మంటలు రాజుకోసాగాయి. ఆ సమయంలో నాచ్నే భార్య ఇంటి బయట ఏదో పనిలో నిమగ్నమై ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు కనిపించి, పిల్లలు ఆడుకుంటున్న మిద్దె వైపు వేలు చూపిస్తూ, "అక్కడ ఏమి జరుగుతుందో చూడు" అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్లి సాయినాథ్ బట్టలు అంటుకుని ఉండటం చూసింది. వెంటనే ఆమె సమయస్ఫూర్తితో పిల్లాడి వద్దకు వెళ్లి ధైర్యంగా తన చేతులతో బట్టలు నలిపి మంటలు ఆర్పేసింది. పిల్లాడి ఒంటి మీద ఉన్న బట్టలు దాదాపు డబ్భై ఐదు శాతం కాలిపోయినప్పటికీ బిడ్డ ఒంటి మీద కాలిన ఛాయలేవీ కనిపించలేదు. సరైన సమయానికి ఫకీరు వచ్చి హెచ్చరించబట్టే తన బిడ్డకు ఏమీ కాలేదని తలచి ఆమె ఆ ఫకీరుకు కృతజ్ఞతలు చెప్పాలని బయటకు వెళ్ళింది. కానీ ఆ ఫకీరు జాడలేదు. సాయిబాబాయే ఆ ఫకీరు రూపంలో వచ్చి బిడ్డని రక్షించారని నాచ్నేకు అర్థమైంది.

1926వ సంవత్సరంలో ఒకసారి నాచ్నేకు కలలో బాబా కనిపించి, "తాను చేయాలనుకున్నది చేయకూడద"ని బారిస్టర్ కొఠారేతో చెప్పమన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం ఏమిటో నాచ్నేకు అర్థం కాలేదు కానీ, ఆ సందేశాన్ని బారిస్టర్ కొఠారేకు అందించాడు. అతడు నాచ్నేకు కృతజ్ఞతలు తెలిపి, తను తన కుటుంబాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలని అనుకున్నట్లుగా చెప్పాడు. బాబా నుండి వచ్చిన ఆ సందేశంతో అతడు తన మనస్సు మార్చుకున్నాడు.

నాచ్నే తల్లి 1926వ సంవత్సరంలో 70 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఆమె చివరి శ్వాస విడిచేంతవరకు సాయిబాబా ఫోటోను తన ముందుంచుకుంది. చనిపోయేముందు నాచ్నేను పిలిచి పక్కన కూర్చుని విష్ణుసహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. అతడు చదవడం పూర్తిచేసిన తర్వాత ఆమె "రామ్ రామ్" అంటూ కన్నుమూసింది.

1927లో కాలూరాంకి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వాడిని తీసుకుని నాచ్నే శిరిడీ వెళ్ళాడు. 1915లో 'దేవపూర్ వెళ్ళమన్న' తమ ఆదేశాన్ని అప్పటివరకు నిర్లక్ష్యం చేస్తున్న నాచ్నేను ఆ సమయంలో శిరిడీ వచ్చివున్న మరొక మహాత్ముడి ద్వారా ఆ ఆదేశాన్ని నెరవేర్చేలా బాబా ప్రోత్సహించారు. 

ఆ మహాత్ముని పేరు శ్రీపాద నర్సోబా పాంచ్‌లేగాంకర్. వారు 'నానూమహరాజ్' గా వ్యవహరింపబడేవారు. వారి వయసు పదిహేను సంవత్సరాలు. ఆయనకి నాచ్నే ఎవరో, అతనితో ఉపదేశం గురించి బాబా ఏమి చెప్పారోనన్న విషయాలు తెలియవు. అసలు వారివురు అంతకుముందెన్నడూ కలుసుకోలేదు. అయినా ఆయన తమంతటతామే నాచ్నేను "దేవపూర్ వెళ్ళావా?" అని అడిగారు. అందుకతను విస్తుపోతూ, "వెళ్ళలేద"ని బదులిచ్చాడు. ఆయన, "ఎందుకు వెళ్ళలేదు?" అని అడిగాడు. అతను, "దేవపూర్ లోని మా గురుపరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు" అని చెప్పాడు. అందుకాయన, "అయితేనేం? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు 'దోయిపోడే'. నీ గురువు పేరు భగవత్" అని అన్నారు. తరువాత ఆయన తన గురువును నాచ్నేకు చూపిస్తానని వాగ్దానం కూడా చేశారు. ఆవిధంగా బాబా ఆదేశాన్ని నానూమహరాజ్ గుర్తుచేశాక నాచ్నే దాన్ని నెరవేర్చడానికి దేవపూర్ వెళ్లి ఉపదేశం పొందాడు. 

మరుసటి సంవత్సరం నానూమహరాజ్ బొంబాయి వస్తున్నారని నాచ్నేకి తెలిసి వారిని దర్శించేందుకు విక్టోరియా స్టేషనుకి వెళ్ళాడు. రైలు వచ్చి ఆగింది. నానూమహరాజ్ ఒక బోగీలో ఉన్నారు. వారిని దర్శించడానికి వచ్చిన జనసమూహం మధ్యలో ఉన్న నాచ్నేను ఆయన పిలిచి తమ గురువైన ఎనిమిదేళ్ల శ్రీపాద రామకృష్ణ దోయిపోడేను చూపించారు. 1928 తరువాత నాచ్నే నానూమహరాజ్‌ని మళ్ళీ కలవలేదు. ఆయన గురువు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న గుంటూరులో మెట్రిక్యులేషన్ విద్యనభ్యసించారు.

1928లో రెండేళ్ల వయస్సప్పుడు సాయినాథ్‌కు ఒక ప్రమాదం జరిగింది. ఒకరోజు వాడు ఎప్పటిలాగే పరుగులు పెడుతూ హఠాత్తుగా మేడ మెట్ల మీదనుండి క్రిందకి పడిపోయాడు. క్రింద పెద్ద చెత్త కుప్ప ఉంది. నాచ్నే ఆదుర్దాగా పరుగున వెళ్లి కొడుకు ఎటువంటి గాయాలు లేకుండా నిలబడి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తండ్రితో, "భయపడకండి. క్రిందపడకుండా బాబా నన్ను పట్టుకున్నారు" అని చెప్పాడు.

1929లో నాచ్నే రెండవ భార్య మరణించింది. ఆమె ఆత్మకు సద్గతి చేకూర్చేందుకు అవసరమైనదంతా చేయదలచి, ఆమె అస్థికలను, చితాభస్మాన్ని తీసుకుని నాసిక్ వెళ్లి అక్కడి గోదావరినదిలో కలిపి శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు జరిపించాలని అనుకున్నాడు నాచ్నే. ఇంతలో అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. భార్యపోయిన దుఃఖంతో పాటు ఆ తరువాత చేయవలసిన కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు అవసరమైన డబ్భులు సమకూర్చుకోవటం వంటి భారాలు తనపై పడటంతో నాచ్నేకు ఏమి చేయాలో తోచలేదు. చివరికి ఎలాగో 80 రూపాయలు తీసుకుని, 3 సంవత్సరాల కొడుకును ఇంట్లో విడిచిపెట్టి నాసిక్ వెళ్ళడానికి రైలులో బయలుదేరాడు. విక్టోరియా స్టేషన్‌లో అతనికి తోటి ప్రయాణికునితో పరిచయం అయ్యింది. ఆ ప్రయాణికుడు నాచ్నే పట్ల ఎంతో ఆదరణ చూపించాడు.

ప్రయాణీకుడు: మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
నాచ్నే: నాసిక్.
ప్రయాణీకుడు: మీరెందుకు కంబళి తీసుకుని వెళ్లడం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది.
నాచ్నే: అంత అవసరమనిపించలేదు. అయినా అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. మూడు సంవత్సరాల బిడ్డను వదిలి ఎనిమిది రోజుల క్రితం నా భార్య చనిపోయింది.

ఈ మాటలు విన్న వెంటనే ఆ ప్రయాణీకుడు నాచ్నేను కాసేపు నిరీక్షించమని చెప్పి, ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి, రగ్గు తెప్పించి నాచ్నేకి ఇచ్చాడు.

నాచ్నే: మీరు ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు?
ప్రయాణీకుడు: ఈ రైల్వేస్టేషనుకి అతి దగ్గరలో ఉన్న బొంబాయి ఆర్ట్ స్కూల్లో నేను నివాసముంటున్నాను. ఈ చుట్టను కాల్చండి. (అంటూ ఒక చుట్ట ఇచ్చాడు.)
నాచ్నే: (ఆ చుట్ట తీసుకుని) మీ పేరేమిటి? మీరు ఏమి చేస్తుంటారు?
ప్రయాణీకుడు: నా పేరు గణపతి శంకర్. నేను ఆ స్కూల్లో ప్యూనుగా పనిచేస్తున్నాను. మీరిక దేని గురించీ చింతించకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళ్తున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను.
నాచ్నే: మీరు నాసిక్‌ ఎందుకు వెళ్తున్నాను?
ప్రయాణీకుడు: ఊరికే చూడటానికి వెళ్తున్నాను. మా సాహెబ్ సిమ్లా వెళ్లినందున నాసిక్‌ దర్శించే అవకాశం నాకు దొరికింది.

తరువాత నాచ్నే నిద్రకు ఉపక్రమిస్తుండగా అతను, "మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి. లేదా నా చేతికిస్తే నా ట్రంకుపెట్టెలో భద్రపరుస్తాను" అని అన్నాడు. అప్పుడు నాచ్నే తన వద్ద ఉన్న 80 రూపాయలు అతనికిచ్చి నిద్రపోయాడు. నాసిక్‌కి సమీపంలో ఉన్న ఘోటి స్టేషన్లో అతను నాచ్నేను నిద్రలేపాడు. ముఖం కడుక్కుని ఇద్దరూ టీ త్రాగారు. ఆ టీ కి డబ్బులు అతనే ఇచ్చాడు. తరువాత నాసిక్‌రోడ్ స్టేషన్లో వారిద్దరూ దిగి బస్సులో నాసిక్ పట్టణానికి చేరుకున్నారు. అప్పుడతను నాచ్నేతో, "మీరు దేనికీ శ్రమపడకండి. మీరు పూజారి(భట్‌జీ) వద్దకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేను చూసుకుంటాను" అని చెప్పాడు.

ఉత్తరక్రియల విషయంలో అతనికి ఉన్న ప్రత్యేక జ్ఞానాన్ని వాటిని నాచ్నే చేత జరిపించడంలో కనబరిచాడు. అతను ఒక పూజారిని ఏర్పాటు చేసి పిండప్రదానం చేయడానికి నాచ్నేను రామ్‌కుండ్ వద్దకు తీసుకెళ్ళమన్నాడు. ఆ పూజారి అశుభకార్యాలకు ముందు విఘ్నేశ్వరపూజ అనవసరమని తలచి, ఆ పూజ చేయకుండానే కార్యాన్ని మొదలుపెడుతుంటే, గణపతి శంకర్ జోక్యం చేసుకుని అది సరియైన పద్ధతి కాదని విఘ్నేశ్వరపూజ చేయమని చెప్పాడు. ఇంకా ఆ బ్రాహ్మణుడు సందేహిస్తుంటే, ఎవరైనా పండితుడిని అడగమని చెప్పాడు. ఒక పండితుని అడిగితే అతడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. అప్పుడా పూజారి నాచ్నేతో, గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికెంతో శాస్త్ర పరిజ్ఞానముందని మెచ్చుకున్నాడు. తరువాత రామ్‌కుండ్ దగ్గర ఉన్న గోదావరిలో దిగి ప్రవాహవేగానికి కొట్టుకుని పోకుండా అస్థికలను ప్రత్యేక రీతిలో ఎలా పట్టుకోవాలో నాచ్నేకు వివరించాడు గణపతి శంకర్. అతను చెప్పినట్లే నాచ్నే వాటిని తన చేతులను గుల్లగా ఉండేలా పెట్టుకుని, ఆ మధ్యలో అస్థికలను ఉంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా అవి పంచదార పలుకుల్లా క్షణాల్లో కరిగిపోయాయి.

పన్నెండవరోజు ముంబాయి తిరిగి రావలసిందిగా గణపతి శంకర్‌కు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడతను నాచ్నే నుండి తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్కచెప్పాడు. ఆ తరువాత నాసిక్‌లో ఉన్న ప్రధాన దేవాలయాలన్నింటికీ నాచ్నేను తీసుకుని వెళ్లి దర్శనం చేయించాడు. అప్పుడొక దేవాలయంలో ఉన్న ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను ఆ సన్యాసికి తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. తరువాత అతను నాచ్నేకు తన చిరునామా ఇచ్చి, అంధేరీలో మళ్ళీ కలుస్తానని చెప్పి అదేరోజు తిరిగి వెళ్ళిపోయాడు. పన్నెండవరోజు చేసే కర్మకాండ పూర్తయ్యేవరకు ఒక ప్యూనులా నాచ్నే వెంట ఉండి అన్నీ తనే చూసుకున్నాడు గణపతి శంకర్. నాచ్నే కూడా తిరిగి ముంబాయిలో తన ఇంటికి చేరుకున్నాడు.

తనకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ తనని మళ్ళీ కలవకపోవడంతో అతనే స్వయంగా బొంబాయి ఆర్ట్ స్కూలుకి వెళ్ళాడు. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అనే పేరుగల వారెవరూ ప్యూనుగా ఆ స్కూల్లో పనిచేయడం లేదని ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. దాంతో నాచ్నే ఆశ్చర్యపోయాడు. "నా నుండి ఏమీ ఆశించకుండా అంత శ్రమ తీసుకుని నా భార్య సద్గతికి సహాయపడిన ఆ 'మనిషి' ఎవరు? సాయిబాబా తప్ప మరెవరూ కాదు" అనుకున్నాడు.

source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo