సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 355వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  • అనుగ్రహించిన బాబా

యు.కె. నుండి సాయిభక్తురాలు అంజలి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

కొన్నిరోజుల క్రితం మా పెంపుడు కుక్క 'రూబీ' ప్రసవించాల్సిన సమయం కన్నా రెండు మూడు వారాల ముందుగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ముందుగా పుట్టినందువలన ఆ పిల్లలు చాలా బలహీనంగా ఉన్నాయి. అప్పుడు నేను 'రూబీ' కోసం బాబాను ప్రార్థించమని తోటి సాయిభక్తులను అభ్యర్థించాను. అయితే దురదృష్టవశాత్తూ కుక్కపిల్లలన్నీ మరణించాయి. నేను, నా భర్త, మా అబ్బాయి చాలా బాధపడ్డాము. రూబీ కూడా ఏడుస్తూ చాలా విచారంగా ఉండేది. దాన్ని చూస్తుంటే నా మనస్సు తరుక్కుపోతుండేది. కనీసం రూబీనైనా కాపాడినందుకు బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. తరువాత నేను నా స్నేహితులతో, కుటుంబసభ్యులతో రీసెంట్‌గా జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ, "బాబా! మేమెందుకు అది కర్మ అనుకుని బాధపడాలి?" అని పలురకాలుగా బాబాను ప్రశ్నించాను. బాబా సమాధానం ఇచ్చారు: "బిడ్డలకు ఏది మంచిదో తల్లికి బాగా తెలుసు. ఆమె పిల్లలకి చేదు మాత్రలు ఇస్తుంది. అది బిడ్డ అర్థం చేసుకోలేదు. కానీ తల్లి ఎప్పుడూ పిల్లలకోసం ఉత్తమమైనదే చేస్తుంది" అని. అంతేకాదు, బాబా అద్భుతరీతిన అనుగ్రహించారు కూడా. మూడు కుక్కపిల్లలు చనిపోయిన నాలుగు రోజుల తరువాత రూబీ మరో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది విని డాక్టర్ ఆశ్చర్యపోయి, "సాధారణంగా ఇలా జరగదు, పిల్లలన్నీ 24 గంటల్లోనే పుడతాయి" అని అన్నారు. రూబీ ఆ బిడ్డను చూస్తూ చాలా ఆనందంగా ఉంది. మేము కూడా చాలా సంతోషించాము. అంతా బాబా ఆశీర్వాదమే.

మరో అనుభవం:

నా స్నేహితులలో ఒకరి అబ్బాయి గత ఏడు నెలలుగా ఆసుపత్రిలో ఉన్నాడు. పది సంవత్సరాల వయస్సున్న ఆ బాబు గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. అలాంటి బాబు హఠాత్తుగా మూర్ఛిల్లిపోతుండేవాడు. ఏమి చేసినా అది నియంత్రణలోకి వచ్చేది కాదు. మూడు నెలలపాటు తను ఐ.సి.యు లో ఉన్నాడు. ఇది జరగడానికి ముందు తను ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందాడు. కానీ ఈరోజు తను తన సొంత ప్రపంచంలో ఉన్నాడు. మాట్లాడలేడు, స్పందించలేడు. తను ఎంతవరకు చూడగలుగుతున్నాడో,  వినగలుగుతున్నాడో కూడా తెలియదు. ఈ పరిస్థితి కారణంగా ఆ కుటుంబంలోని వారి జీవితాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి. వారికోసం ప్రార్థించమని సాయిభక్తుల గ్రూపులో నేను అభ్యర్థించాను. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా మహాపారాయణ, సాయి వ్రతం చేశారు. శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనల మేరకు అన్ని రకాల పూజలు కూడా చేశారు. కానీ పరిస్థితిలో మార్పు కనపడలేదు. ఆ అబ్బాయి తండ్రి తన బాబుకి రీహాబిలిటేషన్ సెంటర్లో స్థానం కోసం వేచి ఉన్నాడు, కానీ ఆరోజు ఎప్పుడన్నది తెలియలేదు. అయితే మూడు వారాల క్రితం మూర్ఛల కారణంగా బాబు పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. దాంతో తల్లిదండ్రులు బాగా కృంగిపోయి, బాబు మళ్ళీ కోలుకుంటాడన్న ఆశను కోల్పోసాగారు. ఆ పరిస్థితి అలా ఉంటే ఆ బాబు తండ్రి మూడు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా అదృష్టం కలిసి రావడం లేదు.

బాబు పరిస్థితి కారణంగా చాలా విసుగు చెంది వున్న అతని గురించి కలత చెందుతూ నిస్సహాయస్థితిలో ఉన్న మేము తనని ఆశీర్వదించమని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఒకరోజు నేను, నా స్నేహితురాలు శ్రీహిత మాట్లాడుకుంటూ, 'ఆ కుటుంబానికి బాబా సహాయం అత్యంత అవసరం. మరి బాబా ఎందుకు సహాయం చేయడం లేద'ని అనుకున్నాము. తరువాత శ్రీహిత ఆ కుటుంబ శ్రేయస్సు కోసం సాయి వ్రతాన్ని ప్రారంభించింది. నేను కూడా బాబాతో, "బాబా! ఆ చిన్నబాబు కోసం, తన తండ్రి ఉద్యోగం కోసం వారం రోజులపాటు సచ్చరిత్ర చదవాలని ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు, బాధ్యతల వలన చదవడం నాకు చాలా కష్టమని మీకు తెలుసు. ఒకవేళ నేను చదవాలని మీరు అనుకుంటే నాకు ఏదైనా సంకేతం ఇవ్వండి బాబా" అని చెప్పుకున్నాను. మరుసటిరోజే ఒక సాయిభక్తురాలు సాయి దర్బార్ గ్రూపులో ఒక వారం సచ్చరిత్ర పారాయణ గురించి వివరాలు షేర్ చేసింది. నేను అది బాబా సంకేతంగా తీసుకుని ఆ పారాయణ గ్రూపులో చేరాను.

ఇక బాబా అనుగ్రహం చూడండి. శ్రీహిత మొదటి గురువారవ్రతం నాడు బాబు రీహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళబోతున్నట్లు మాకు వార్త వచ్చింది. దేనికోసమైతే మేము మూడు నెలలుగా ఎదురుచూస్తున్నామో అది బాబా ఇచ్చారు. రెండవ వారం వ్రతం నాడు తను రీహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్తున్నట్లు తెలిసింది. ఇకపోతే నేను సప్తాహ పారాయణ మొదలుపెట్టినరోజే బాబు తండ్రికి ఇంటర్వ్యూకి పిలుపు రావడం, ఉద్యోగం ఖరారు కావడం కూడా జరిగింది. "క్షమించండి బాబా, నేను ఈ అద్భుతాన్ని పంచుకోవడానికి ఆలస్యం చేశాను. ఎందుకంటే ఆ ఉద్యోగ విషయంలో మళ్ళీ ఏదైనా జరుగుతుందేమోనని, పిల్లాడికి మళ్లీ మూర్ఛలు వస్తే తనని రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపడం ఆగిపోతుందేమోనని చాలా భయపడ్డాను. అందువలన ఆ విషయాలు పూర్తిగా నిర్ధారణ అయ్యేవరకు వేచి ఉన్నాను. మీరు చూపిన కృపకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".

అంత కఠిన కాలంలో బాబాపై విశ్వాసాన్ని కొనసాగించిన నా స్నేహితునికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే తను నాకన్నా దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు.

రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్సకు ఆ చిన్నబాబు బాగా స్పందించి తన తల్లిదండ్రులను గుర్తించి, మాట్లాడగలిగి మళ్లీ సాధారణస్థితికి చేరుకోవాలని దయచేసి మీరందరూ బాబాని ప్రార్థిస్తూ ఉండమని వేడుకుంటున్నాను.

సేకరణ: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.


5 comments:

  1. May saibaba bless the entire family with good health and happiness

    ReplyDelete
  2. Chala naaga raasavu sai..Baba bless u.sai..

    ReplyDelete
  3. Baba please shower your cartload blessings on the boy and on his family members.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo