సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 320వ భాగం


ఖపర్డే డైరీ - ఆరవ భాగం

🌹సుదీర్ఘమైన రెండవ మజిలీ🌹

6-12-1911

దీక్షిత్ కొత్తగా నిర్మించిన ఇంటి వద్దకు నా టాంగా వచ్చాక నేను కలుసుకొన్న మొట్టమొదటి వ్యక్తి మాధవరావ్ దేశ్‌పాండే. నేను టాంగా నుంచి దిగకముందే దీక్షిత్ ఈరోజు తనతో భోజనం చేయమని అడిగాడు. అప్పుడు నేను మాధవరావు దేశ్‌పాండేతో కలిసి సాయి మహారాజుకి నా గౌరవ అభివాదాలు తెల్పేందుకు వెళ్ళి దూరం నుంచే నమస్కారం చేసుకున్నాను. వారు ఆ సమయంలో తమ కాళ్ళూ, చేతులూ కడుక్కుంటున్నారు. ఆ తరువాత నేను కాళ్ళు, చేతులు కడుక్కుని ప్రార్థనలో నిమగ్నమయ్యాను. అందువల్ల సాయి మహారాజ్ బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కారం చేసుకోలేకపోయాను. 

తరువాత మేమంతా కలిసి వెళ్ళి మశీదులో బాబా వద్ద కూర్చున్నాం. మంచి ఆహారం అంటే ఎంతో ఇష్టపడే ఒక ఫకీరు వద్ద తాము ఉండటం గూర్చిన ఒక కథను చెప్పారు వారు. ఒకసారి ఈ ఫకీరు సాయి మహారాజుతో కలిసి భోజనానికి వెళ్ళారు. బయలుదేరేముందు ఫకీరు భార్య సాయి మహారాజుని పండుగకని కొంత ఆహారం తెమ్మని అడిగి అందుకోసం ఒక పాత్రను ఇచ్చింది. ఫకీరు చాలా ఎక్కువగా తినేయటం వలన ఆ ప్రదేశంలోనే నిద్రించేందుకు నిర్ణయించుకున్నాడు. సాయి మహారాజు రొట్టెలను వీవుకు కట్టుకుని, ద్రవాహారాన్ని పోసుకున్న పాత్రను తలమీద పెట్టుకుని తిరిగి వచ్చారు. మార్గం చాలా సుదీర్ఘమైనదిగా తెలుసుకున్నారు సాయి. ఆయన దారితప్పి ఒక హరిజనవాడ దగ్గర కొద్దిసేపు విశ్రాంతి కోసం కూర్చున్నారు. కుక్కలు అరవటం మొదలుపెట్టేసరికి ఆయన లేచి తన గ్రామానికి తిరిగి వచ్చి రొట్టెలను, ద్రవాహారాలను ఫకీరు భార్యకిచ్చారు. అప్పటికి ఫకీరు కూడా రావటం వల్ల వారంతా కలిసి చక్కటి భోజనం చేశారు. మంచి ఫకీర్లను కనుక్కోవటం చాలా కష్టమని చెప్పారాయన. 

క్రిందటి సంవత్సరం నేను నివసించిన వాడాను నిర్మించిన సాఠే ఇక్కడే ఉన్నాడు. అతన్ని నేను మొదట మశీదులోనూ, తరువాత భోజనాలవద్ద చూశాను. దీక్షిత్ చాలామందికి భోజనాలు పెట్టాడు. కీర్తిశేషులు మాధవరావు గోవింద రానడే గారి చెల్లెలి కొడుకు తోసర్ కూడా వారిలో ఉన్నాడు. తోసర్ బాంబేలోని కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నాడు. అతను చాలా మంచివాడు. మేం మాట్లాడుతూ కూర్చున్నాం. నాసిక్ నుంచి వచ్చిన ఈ పెద్దమనిషే కాక ఇంకా చాలామంది ఉన్నారక్కడ. వారిలో టిప్నిస్ అనే ఆయన తన భార్యతో వచ్చాడు. ఆమె కొడుకుని ప్రసవించింది.

బాపూసాహెబ్ జోగ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన భార్య కులాసాగా ఉంది. నూల్కర్ మరణించాడు. అతను లేని లోటు నాకు బాగా కనిపిస్తుంది. వారి కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేరు. బాలాసాహెబ్ భాటే ఇక్కడే ఉన్నాడు. అతని భార్య దత్తజయంతి రోజున మగబిడ్డను ప్రసవించింది. మేం ఉంటున్న దీక్షిత్ వాడా చాలా అనుకూలంగా ఉంది.

7-12-1911.

రాత్రి బాగా నిద్రపోయాను. మా అబ్బాయి, భార్య భీష్మతో బాగానే ఉన్నారు. విష్ణు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈరోజు మేం చాలామందికి సంతర్పణ చేశాం. ఇక్కడి నిత్యకృత్యాలకు నేను అలవాటుపడిపోయాను. సాయి మహారాజు బయటకు వెళ్ళే సమయంలోనూ, తరువాత వారు మశీదుకి తిరిగి వచ్చేటప్పుడూ, మళ్ళీ సాయంకాలమూ, అటుతరువాత ఆయన 'చావడి'కి నిద్రించటానికి వెళ్ళే సమయంలోనూ ఆయనకి నేను నమస్కరించాను. భజన కొద్దిసేపే సాగింది. మేం శేజారతి నుంచి తిరిగి వచ్చాక భీష్మ తన మామూలు భజన చేశాడు. తోసర్ తను స్వయంగా వ్రాసిన కొన్ని శ్లోకాలు, కొన్ని ఇతరులు రాసినవీ, కొన్ని కబీరు, దాసగణు రాసినవీ పాడాడు. క్రిందటి సంవత్సరం ఇక్కడే ఉన్న దాసగణు భార్య బాయీ ఇప్పుడు వాళ్ళ తండ్రిగారింట్లో ఉంది. చాలా రాత్రి వరకు మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం. రాత్రి మాధవరావు దేశ్‌పాండే, దాదాకేల్కర్‌కి బాబు అనే మేనల్లుడు ఉన్నాడని చెప్పాడు. సాయి మహారాజు అతణ్ణి చాలా దయగా చూసేవారు. ఈ బాబు చనిపోయాడు. అతణ్ణి ఈరోజు వరకూ సాయి మహారాజు గుర్తుపెట్టుకున్నారు. ముంబాయిలో లాయరుగా ప్రాక్టీసు చేస్తున్న మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్ సాయి మహారాజుని చూడటానికి వచ్చాడు. అతని భార్యని చూడగానే 'ఆమె బాబుకి తల్లి' అని చెప్పారు బాబా. తరువాత ఆమె గర్భం ధరించింది. బాంబేలో ఆమె ప్రసవించే రోజున నొప్పులు పడుతున్నప్పుడు ఇక్కడ సాయి మహారాజు 'ఆమె కవలల్ని ప్రసవిస్తుందని, అందులో ఒకరు చనిపోతార'ని చెప్పారు. అలాగే జరిగింది. శ్రీమతి ప్రధాన్ తన రెండు నెలల బిడ్డని ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు సాయి మహారాజు అతన్ని తమ ఒడిలోకి తీసుకుని, "ఏం బాబూ, ఇక్కడికొచ్చేశావా మళ్ళీ?" అనగానే ఆ పిల్లవాడు "ఊఁ" అన్నాడు స్పష్టంగా.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sairam 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo