సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 352వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆప్యాయంగా పేరుపెట్టి పిలిచిన సాయి  
  2. శిరిడీ దర్శనంతో నా భర్తకు వచ్చిన ఉద్యోగం

ఆప్యాయంగా పేరుపెట్టి పిలిచిన సాయి  

ఓం సాయిరామ్!!!

ఓం సద్గురు సాయినాథాయ నమః. 

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ, సద్గురు సాయి నాకు సంశయ నివృత్తి చేసిన అనుభవాన్ని నేనిప్పుడు తోటి సాయిబంధువులతో పంచుకుంటాను.

నా వివాహానికి ముహూర్తం నిర్ణయించే సమయంలో నా తల్లితండ్రులు నాకు పెట్టిన పేరును మావారు 'సంధ్య'గా మార్చారు. అప్పటినుండి ఆయన నన్ను సంధ్య అనే పిలుచుకుంటున్నారు. అయితే, "ఒక అమ్మాయికి తన జీవితకాలంలో ఒకే పేరు ఉండొచ్చుగా; పెళ్ళికి ముందు ఒక పేరు, పెళ్లి తరువాత మరో పేరు ఎందుకుండాలి?" అనే ప్రశ్న ప్రతిరోజూ నాలో తలెత్తుతుండేది. ఇలా ఉండగా ఒకసారి గురువారం, పౌర్ణమి కలిసొచ్చాయి. దాంతో నేను ఇంట్లో పూజ ముగించుకొని సాయిబాబా మందిరానికి వెళ్ళాను. బాబాని కనులారా దర్శించుకొని, బాబా దివ్యపాదాలపై నా శిరస్సు ఉంచి మ్రొక్కుతుండగా ఎవరో 'సంధ్యా' అని ఆప్యాయంగా నాకు పరిచయమున్న స్త్రీ గొంతుతో పిలుస్తున్నట్లుగా స్పష్టంగా వినిపించింది. 'ఎవరా!' అని చుట్టూ చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు అలా పిలిచినది నా సాయిమాతేనని అర్థమై మాటలకు అందని అనుభూతి కలిగింది. నా మనసు ఎరిగిన సాయిబాబా అలా పిలిచి వివాహ ముహూర్తంలో పెట్టిన పేరునే ఖరారు చేశారని గ్రహించాను. ఆయన నా సంశయాన్ని తీర్చడమే కాకుండా 'సంధ్యా' అని ఆప్యాయంగా పిలిచి నా పేరును నేను ఇష్టపడేలా చేశారు. అప్పటినుండి నా పేరు నాకు చాలా అందంగా కనిపిస్తోంది, శ్రావ్యంగా వినిపిస్తోంది. బాబా పిలిచినప్పుడు కలిగిన అనుభూతి నా మదిలో ఇంకా అలాగే గుర్తుండిపోయింది. అలా నా భర్త పెట్టిన పేరును ఇష్టపడేలా బాబా నన్ను అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" అంత మంచి పేరు పెట్టి, బాబాతో పిలిపించుకొనే భాగ్యాన్ని కలిగించిన మావారికి కూడా కృతజ్ఞతలు. 

బాబా నన్ను 'సంధ్యా' అని పిలిచిన సంతోషంతో ఇప్పుడు నా పేరు 'సంధ్య' అని పరిచయం చేసుకుంటూ మరొక అనుభవాన్ని పంచుకుంటాను.

ఒకరోజు నా భర్తతో ఇంటికి వచ్చేటప్పుడు అరటిపండ్లు తీసుకురమ్మని చెప్పాను. అయితే మావారు వచ్చేటప్పుడు అరటిపండ్లు తేవడం మరచిపోయారు. పూజ సమయంలో నైవేద్యం పెడదామంటే అరటిపండ్లు కనిపించలేదు. దాంతో విషయం తెలిసి, 'అరటిపండ్లు ఎందుకు తేలేదని, ఎందుకు మరచిపోయారని' మావారిని గట్టిగా నిలదీశాను. మా మధ్య కాసేపు వాదన జరిగింది. ఇక చేసేదిలేక అలాగే ఇంట్లో పూజ ముగించుకొని, ఆరోజు గురువారమైనందున సాయిబాబా గుడికి వెళ్ళాను. బాబాను దర్శించుకున్న తరువాత అక్కడ ఉన్న పూజారి నాకు రెండు అరటిపండ్లు ప్రసాదంగా ఇచ్చారు. ఇంట్లో బాబాకు అరటిపండ్లు నివేదించలేకపోయానని కలత చెందిన నా మనస్సుకు ఊరటనిచ్చేలా బాబా వాటినే నాకు ప్రసాదంగా ఇవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నా మనసు ఎరిగిన బాబా అరటిపండ్ల వివాదానికి ఇంత అద్భుతం చూపించారని అనుకున్నాను. ఇంటికి వస్తూనే మావారితో నా సంతోషాన్ని పంచుకొని, ఒక అరటిపండు మావారికి ఇచ్చి, రెండవది నేను తీసుకున్నాను.

"బాబా! మీ దయ, కృప ఎల్లప్పుడూ మా కుటుంబంపై కురిపించండి. మీ బిడ్డలమైన మేము మీ పాదాలు విడువకుండా మీకు సర్వస్య శరణాగతి చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి గురుదేవా!"

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సద్గురు శరణం సర్వ పాపహరణం.

శిరిడీ దర్శనంతో నా భర్తకు వచ్చిన ఉద్యోగం

USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను 2013 నుండి సాయిభక్తురాలిని. అప్పటినుండి ఎప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నా సాయిని ప్రార్థిస్తాను. ఆయన ప్రేమతో నా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన చూపిన ఎన్నో అద్భుతాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. 2018 ఆగస్టులో నా భర్త ఉద్యోగం కోల్పోయారు. అది గురువారం. నాభర్త ఆరోజే తన చివరి పనిదినమని చెప్పారు. ఈ వార్త విన్నప్పుడు నేను నిజంగా భయపడి బాబా ముందు ఏడ్చాను. 

తరువాత నా భర్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి చాలా కంపెనీలకు దరఖాస్తు చేశారు. కానీ ఏమీ ఫలితం కనపడలేదు. నేను 22 వారాలు సాయి వ్రతం చేశాను. తరువాత ఐదు వారాలు సాయి దివ్యపూజ చేశాను, శ్రీ సాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేశాను. అప్పటికీ ఫలితం కనిపించలేదు. దాదాపు 9 నెలలు గడిచిపోయాయి, ఇంకా నా భర్తకు ఉద్యోగం లేదు. బ్రతకడానికి ఏదైనా మార్గం చూపమని నేను తరచూ బాబాను అడుగుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఆయన ముందు బాధతో ఏడుస్తూ ఉండేదాన్ని. అయినా నేను బాబాపట్ల విశ్వాసంతో సహనంగా ఉండేదాన్ని.

ఒకరోజు ఉదయం నా భర్త ఇండియా వెళదామని అన్నారు. అప్పుడు నేను శిరిడీ వెళ్లొచ్చని అనుకున్నాను. అనుకున్నట్లుగానే శిరిడీ వెళ్ళాము. బాబా చక్కని దర్శనం ప్రసాదించారు. శిరిడీ నుండి తిరిగి వచ్చాక నా భర్త ఇంటర్వ్యూలకి హాజరుకావడం మొదలుపెట్టారు. బాబా ఆశీస్సులతో మంచి జీతంతో ఒక పెద్ద సంస్థలో ఉద్యోగానికి నా భర్త ఎంపికయ్యారు. నాకు ఇంకేమి కావాలి? "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" దయచేసి అందరూ మన బాబాపై విశ్వాసముంచి సమస్యలను ఆయనకు వదిలేయండి. ఆయన ఎంతో జాగ్రత్త తీసుకుని, తగిన సమయంలో అన్నీ ఇస్తారు.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2586.html


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo