సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 340వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మా ఇంటికి బాబా వచ్చి అనుగ్రహించిన తీరు
  2. రానున్న పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడారు

మా ఇంటికి బాబా వచ్చి అనుగ్రహించిన తీరు

సాయి భక్తుడు సాంబశివరావు చాలారోజుల తరువాత మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

జై సాయిరామ్! ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. బాబా లీలలను సాటి సాయిభక్తులతో పంచుకోవటానికి వారు చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతం. వారి ద్వారా ఆ సాయినాథుడు ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇక నా అనుభవంలోకి వెళ్తే..

ఇంతకుముందు చెప్పినట్లుగా మాది గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. పల్లెటూరే అయినప్పటికీ మా ఊరికి అన్ని రకాల వృత్తులవారు వస్తుంటారు. వారిలాగే‌, ఇంట్లో పెట్టుకోవటానికి ఫ్రేమ్ చేసిన పెద్ద దేవుడి ఫోటోలను లాటరీ ద్వారా అమ్ముకుని పొట్టపోసుకునే ఒక వ్యక్తి పొరుగూరినుండి వచ్చేవాడు. అతను ఎన్నోసార్లు మమ్మల్ని కూడా లాటరీ తీయమని అడిగేవాడు. మేము ఎందుకనో అయిష్టత చూపేవాళ్ళం. కానీ ఎందుకో తెలియదు, అకస్మాత్తుగా ఒకరోజు ఉదయాన్నే బాబా ఫోటో తీసుకొని వచ్చాడు.  ఆ ఫోటో ఎంతో బాగుంది. ఆ ఫోటోలో పైభాగాన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విడివిడి ప్రతిమలున్నాయి, కాస్త క్రిందుగా బాబా తమ సింహాసనమైన రాయిపై కూర్చొని అభయముద్ర దాల్చి ఉన్నారు. చూడగానే 'ఫోటో చాలా బాగుంది, బాబా చాలా బాగున్నారు' అని ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ రోజున మా పెద్దమ్మ ఏ కళనుందో(ఏ మూడ్ లో ఉందో) లాటరీ తీయడానికి ఒప్పుకుంది. బహుశా బాబా వారి సంకల్పమే అయుండవచ్చు. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. అందరం వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాము. మా పెద్దమ్మ వాళ్ళింట్లో అందరి పేర్లమీద చీటీలు తీసింది. నన్ను కూడా తీయమని చెప్పింది. లాటరీ తీస్తూ నా మనసులో, "బాబా మా దైవం అయితే, నేను ఆయనను నమ్మినది నిజమైతే ఈ ఫోటో రూపంలో బాబా మా ఇంటికి రావాలి" అని అనుకున్నాను. అయితే ఆ వ్యక్తి మా కుటుంబం వద్ద మాత్రమే కాకుండా మరికొందరి వద్ద కూడా లాటరీ తీయించాడు. అతను ప్రతిసారీ అలాగే చేస్తాడు. ఉదాహరణకు, ఒక నాలుగు లేదా ఐదు కుటుంబాల వారితో లాటరీ తీయిస్తాడు. (డబ్బులకే సుమా, ఉచితంగా మాత్రం కాదు. పాపం తను బ్రతకాలిగా.) అలాగే ఆరోజు కూడా మాతో పాటు నలుగురైదుగురితో చీటీలు తీయించాడు. అవన్నీ కలిపి మధ్యాహ్నం లాటరీ తీస్తారు. తరువాత నేను ఆఫీసుకి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాక ఏదో పనిమీద మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా దృష్టి దేవుడి ఫోటోలు తగిలించి ఉండే గోడ మీద పడింది. ఉదయం మేము చీటీలు తీసిన బాబా ఫోటో అక్కడ తగిలించి వుండటం చూసి ఆశ్చర్యపోయాను. మా పెద్దమ్మని అడిగాను 'ఈ ఫోటో మనింటికి ఎలా వచ్చింద'ని. ఆమె చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. "మధ్యాహ్నం లాటరీ తీస్తే మీ వదిన పేరు మీద వచ్చింది. అతను బాబా ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. డబ్బులేమైనా ఇవ్వాలా అని అడిగాను. 'అవసరం లేదం'టూ వెళ్ళిపోబోతుంటే అతన్ని పిలిచి భోజనం పెట్టి పంపించాను" అని చెప్పింది. అది విన్న నేను ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. బాబా చూపిన కృపకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా నా జీవితంలో ఎన్నో అనుభవాలను, అనుభూతులను పంచుతూ, అనుక్షణం నా వెంట ఉండి కాచి రక్షిస్తున్న బాబాకి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి? బాబాకు మనస్ఫూర్తిగా వేనవేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని మాత్రమే కాక తనదైన విశాల వసుదైక కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడాలని ఆ సాయినాథుని మనసారా ప్రార్థిస్తున్నాను.

రానున్న పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడారు

బెంగళూరు నుండి సాయిభక్తురాలు మలార్ అరుణ్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఒకరోజు ఉదయం నా భర్త ఆఫీసుకి వెళ్లి రెండు గంటలలోపు తిరిగి వచ్చారు. ఆయనను చూస్తూ నేను అవాక్కైపోయాను. ఆయన తను ప్రమాదానికి గురయ్యానని చెప్పారు. ఆయన శరీరంలోని ఎడమవైపున, అంటే తలనుండి కాలివరకు గాయాలయ్యాయి. కొన్ని సెకన్లలో ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. 45 నిమిషాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు. నాకు భయంతో కాళ్లుచేతులు ఆడలేదు. వెంటనే బాబా ఊదీ ఆయన నుదుటిపై పెట్టాను. తరువాత ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశాను. డాక్టర్లు ఎక్స్-రే తీసి, స్కానింగు చేశారు. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చాయి. మరుసటిరోజు ఉదయం నుండి ఆయనకు వాంతులు మొదలయ్యాయి. డాక్టర్ చాలా మందులు ఇచ్చినప్పటికీ వాంతులు తగ్గలేదు. ఆ సమయమంతా నేను ఏడుస్తూ, "ఈ బాధాకరమైన పరిస్థితి నుండి బయటపడేయమ"ని సాయిబాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. బాబా కృపవలన చివరికి రాత్రి 10 గంటలకు నా భర్త ఆరోగ్యం సాధారణస్థితికి వచ్చింది. అయితే మరుసటిరోజు వైద్యులు మాకొక షాక్ ఇచ్చారు. మావారికి చేసిన ఒక స్కాన్ రిపోర్టును బట్టి మావారి గాల్‌బ్లాడర్‌లో చిన్న చిన్న పాలిప్స్(తిత్తిలు వంటివి) చాలా ఉన్నాయని, చికిత్స చేయకుండా వదిలేస్తే అవి ఖచ్చితంగా క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని, క్యాన్సర్‌గా మారేవరకు ఎటువంటి సూచనలు బయటకు కనిపించవని చెప్పారు. అంతేకాదు, వెంటనే గాల్‌బ్లాడర్ తొలగించాలని చెప్పారు. మావారికి ప్రమాదం జరిగితే జరిగింది కానీ, దాని ద్వారా రానున్న పెద్ద ప్రమాదాన్ని బాబా మాకు తెలిసేలా చేశారు. నేను, "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. నా భర్త పూర్తి ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. రెండువారాల తరువాత రెండో అభిప్రాయం కోసం మరో డాక్టర్ని సంప్రదించాము. ఆ డాక్టర్ రిపోర్టులన్నీ చూసి వెంటనే గాల్‌బ్లాడర్ తొలగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు నా భర్త మందులు వాడుతున్నారు. త్వరలోనే బాబా నా భర్తకు పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తారని నేను నమ్ముతున్నాను.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2561.html


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo