సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 365వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయితో నా స్మృతులు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబాతో తన స్మృతులను ఇలా పంచుకుంటున్నారు:

శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై! 

శ్రీసాయినాథునికి నా నమస్సులు. బాబాని భక్తితో, ఆర్తితో పిలిస్తే ఆయన మనల్ని ఆదుకుంటారు. ఎందుకంటే ఆయనే మన తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ గురుచంద్రుని కరుణకి ఎల్లలు లేవు. ఆయన మనలను సర్వదా కంటికి రెప్పలా కాపాడతారు. ఒక్కొక్కసారి అది త్వరగా మనకు అర్థం కాకపోయినా తరువాత మనకి విషయం అర్థం అవుతుంది. అన్నింటికీ కారణాలు బాబాకు తెలుసు. మన మీద ఆయనకి ఎంతో వాత్సల్యం. మనకి పరిస్థితులు ముందుగా తెలియక అనవసరంగా గాబరాపడతాం, అంతే. శ్రీసాయిదత్తుని పాదపద్మములను అనన్యంగా శరణు పొందిన భక్తుల ఆనందం చెప్పనలవి కాదు. సాయిబాబా త్రిమూర్తి దేవతల స్వరూపం, సర్వదేవతలూ. ఆయన మన తప్పులను మన్నించి ఎల్లవేళలా మనల్ని కాపాడాలి. "ఆదిపరాశక్తి రూపమైన బాబా! నా అహాన్ని తీసివేసి నన్ను అక్కున చేర్చుకో తండ్రీ. నీ పాదపద్మములనే నేను అనన్యంగా శరణు వేడుకుంటున్నాను. ఎన్నడూ నాపై కోపించవద్దు. సాయిమాయీ! నీకు నా సహస్ర కోటి పాదాభివందనాలు. నా తప్పులనింటినీ మన్నించి నన్ను క్షమించు. నన్ను కాపాడు స్వామీ, నా తండ్రీ. నన్ను, ఇంకా అందరినీ కూడా కాపాడే నీకు సదా జయము. బాబా, నీ అనుమతితో ఈ క్రింది విషయాలు చెప్పాలనుకుంటున్నాను".

1. ఒకసారి మా అమ్మ "ఇల్లు కొనాలా? వద్దా?" అని చీటీలు వేసి బాబాను అడిగారు. బాబా సందేశం ‘వద్దు’ అని వచ్చింది. కానీ ఆత్రపడి మా అమ్మ ఇంటిని కొనేశారు. గృహప్రవేశం జరిగే రోజున బాబా ఫోటోపై ఉండే గ్లాస్ విరిగిపోయింది. కానీ కార్యక్రమం హాయిగా ఏ ఇబ్బందీ లేకుండా జరిగిపోయింది. ఈ సంఘటన ద్వారా ఏదో కీడును తమ మీదకు తీసుకొని మాకు మంచి జరిగేలా చూశారు బాబా. తరువాత ఇంటికి సంబంధించిన లోన్ మొదలైన విషయాలు కూడా బాబా అనుగ్రహంతో నెమ్మదిగా చక్కగా క్లియర్ అయ్యాయి. లేకుంటే చాలా సమస్య అయ్యేది. ఆయన ప్రేమమూర్తి. ఆయన చెప్పినదానికి మేము వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ ఎంతో వాత్సల్యంతో మాకంతా మంచే చేశారు బాబా.

2. ఒకసారి శిరిడీ వెళ్లాలని నాకు చాలా బలంగా అనిపించింది. బాబాకు తన భక్తుల మనసులో ఏముందో తెలుసు. భక్తులు అడగకపోయినా ఆయన వాటిని నెరవేర్చి వాళ్ళని సంతోషపరుస్తారు. అయితే ఆయనపై మనం నమ్మకం ఉంచాలి, అంతే. నా విషయంలో అదే జరిగింది. శిరిడీ యాత్రకు వెళ్లే భజన బృందంలో అనుకోకుండా ఒకరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ టికెట్ మీద నా శిరిడీ యాత్ర కోరికను ఎంతో చక్కగా నెరవేర్చారు బాబా. వాళ్లతో శిరిడీ వెళ్లి బాబాను తృప్తిగా దర్శించుకొని ఆనందంగా తిరిగి వచ్చాను. 

3. కష్ట సమయాలలోనూ, సమస్యలోనూ, వేదనలోనూ ఉన్నపుడు చాలాసార్లు శిరిడీ నుండి ప్రసాదం పంపించి నన్ను ఆశీర్వదించేవారు బాబా. తమ అభయాన్ని, సహాయాన్ని, అనుగ్రహాన్ని నాకు అందించారు. ఎంతటి బాధలైనా, ఎటువంటి సమస్యలనైనా బాబాను నమ్మితే చాలు, ఆయన మనలను ఆదుకుంటారు. లీలల ద్వారా అన్నీ ఆయనే చక్కబెడతారు. ఆయన తన భక్తుల యోగక్షేమాలు చూసుకుంటారు.

4. బ్రతకడానికి ఒక స్థితిని, ఆర్థిక తోడ్పాటుని అందించి నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టింది బాబానే. నా చదువులో, పరీక్షల్లో వచ్చిన అడ్డంకులు దాటించారు బాబా.

5. బాబాను మనసారా నమ్మి ధ్యానిస్తే, అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యాన్ని, మంచి స్థిరమైన బుద్ధిని ప్రసాదిస్తారు. ఒకసారి నేను ఆరోగ్యం బాగాలేక ఐ.సి.యు. లో ఉన్నప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న బాబా గుడికి సంబంధించినవాళ్ళు నా తల్లితండ్రులకి కాకతాళీయంగా కనిపించారు. మా తల్లితండ్రులు రెండురోజుల అన్నదానానికని సరిపడా డబ్బు వాళ్ళకిచ్చి నా ఆరోగ్యం గురించి బాబాని ప్రార్థించమని వాళ్ళని అభ్యర్థించారు. అంతటితో మా వాళ్ళకి 'బాబా ఉన్నారు. నా విషయంలో ఆయన అంతా జాగ్రత్తగా చూసుకుంటార'ని ధైర్యం వచ్చింది. కాదు, బాబానే ఆ రీతిన మా వాళ్ళకి ధైర్యాన్నిచ్చారు. తరువాత నా ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో నన్ను డిశ్చార్జ్ చేసారు. అయితే ఇంటికి వచ్చాక నాకు బాగా విరోచనాలు అవుతుండడంతో మరలా రెండవసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఇంటికి వచ్చాక మా వాళ్ళు బాబా గుడిలో అన్నదానానికి డబ్బులు కట్టిన విషయం తెలిసింది. అప్పుడు అనిపించింది, నేను రెండుసార్లు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందనే బాబా రెండు రోజులకి డబ్బులు కట్టేలా ముందస్తు ఏర్పాటు చేశారేమో అని. నేను మీతో పూర్తిగా చెప్పలేనుగానీ, ఎంతో ప్రాణాపాయస్థితి నుండి బాబా కృపతో నన్ను బయటపడేశారు. నా చెడు కర్మని రూపుమాపి, నేను కోలుకొని హాయిగా ఉండేలా చేశారు

6. తరువాత నేను కోలుకుంటున్న దశలో బాబా ప్రసాదం కావాలని ఆశపడ్డాను. సరిగ్గా అదే సమయంలో మా కుటుంబ స్నేహితుల ద్వారా శిరిడీ ప్రసాదాన్ని పంపించారు బాబా. నా కోరిక తీర్చి నన్ను ఆనందింపజేసిన కరుణాసముద్రునికి నా వందనాలు.

7. ఏ పూజ చేస్తున్నా సాయినే తలచుకుంటూ ఉంటే మన కార్యక్రమాలను మనచేత ఆయన చక్కగా జరిపించి అనుగ్రహిస్తారు. ఇది చాలామందికి అనుభవమే కదా! నేను ఒకరోజు శివాలయంలో పూజ చేస్తుండగా ఎవరో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఆనందంగా నావైపు చూశారు. ఆ రూపంలో నా సాయే నన్ను ఆశీర్వదిస్తున్నారని నాకు చాలా సంతోషం కలిగింది.  

8. ఒకసారి నా తల్లిదండ్రులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోవెలలో పూజ చేస్తున్నపుడు నేనొక బాబా ఫోటో చూసి చాలా ఆనందించాను. అయినా దేవతలందరూ బాబాలోనే కొలువై ఉన్నారు. ఆ కార్తికేయస్వామి, బాబా ఒక్కరే. ఒకసారి మా కులదేవత అయిన అమ్మవారిని ఆరాధించే అవకాశాన్ని బాబా కలిపించారు. అయినా అమ్మవారు, బాబా వేరు కాదు కదా. ఆయన త్రిమూర్తిస్వరూపుడు, దత్తస్వామి.

9. ఒకసారి మేము అనుకోకుండా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఆకస్మిక ప్రయాణం, ఎక్కడ ఉండాలి? ఏమిటి మా పరిస్థితి? అని ఆందోళన చెందుతున్న సమయంలో బాబా మా కుటుంబ స్నేహితుని(బాబా భక్తుడు అని అనుకుంటున్నాను) రూపంలో మాకు ఉండటానికి చక్కని వసతి కల్పించారు. మనం బాబాను తలవకపోయినా మన బాధ్యత ఆయనకు గుర్తే కదా! బాబాను మనసారా స్మరిస్తే, కష్టాలు, బాధలు మనల్ని ఇబ్బందిపెట్టవు. అవి మనకి అణుమాత్రమైనా ఇబ్బంది కలిగించకపోగా ఆనందాన్నిస్తాయి సుమా! అంతా మనకి మంచే జరుగుతుందని తెలుసుకోగలిగితే చాలు.

ఇంకా బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. కొన్ని సందర్భాలలో మనము వాటిని గుర్తించలేము. కానీ సమయం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా అర్థమవుతాయి. "బాబా! నాకున్న బాధలన్నింటి నుండి నన్ను దూరం చేసి, నా మనసుని నీ వైపుకి తిప్పుకొని, నా అహాన్ని తీసివేయి. నాపై కోపించక దయగల తల్లిలా నా తప్పులను మన్నించండి బాబా. సర్వదా నన్ను కాపాడు తండ్రీ. ఇప్పుడున్నట్లే ఎప్పుడూ మీ అభయం నాకుండాలి దేవా! నీ బిడ్డలపై నీ చల్లని చూపులు ప్రసరింపజేసి వారికీ రక్షణనివ్వండి బాబా".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
సర్వం శ్రీసాయీశ్వర దేవతా పాదారవిందార్పణమస్తు!


4 comments:

  1. very nice experience.sai bless all.

    ReplyDelete
  2. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  3. Baba only gives leelas he only make us write leelas.Baba please forgive me and help me for any of my mistakes.bless me and love you baba.all we talk is also because of baba preran only...
    Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo