సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 600వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. తోడుగా ఉన్నట్టు నిదర్శనమిచ్చిన బాబా
  2. బాబా కృపతో ఆఫీసులో సమస్య పరిష్కారం 

తోడుగా ఉన్నట్టు నిదర్శనమిచ్చిన బాబా

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. నా పేరు ఇందిర. నేను ఇంతకుముందు మా నాన్నగారి విషయంలో బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకున్నాను. మా నాన్నగారు గుండెవ్యాధిగ్రస్థులు. ఆయన విషయంలో మాకెప్పుడూ ఆందోళనే. క్రిందటి అనుభవంలో మా నాన్నకి అత్యవసర పరిస్థితి ఏర్పడి హాస్పిటల్లో చేర్చిన విషయం చెప్పాను. ఆ సమయంలో ఆయనకి గుండెల్లో బాగా మంట వచ్చింది. ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి చూస్తే కానీ సమస్య ఏమిటో చెప్పలేమని అన్నారు. దాంతో నాన్నగారిని యాంజియో టెస్ట్ చేయించటానికి తీసుకెళ్ళారు. నాకు ఆ సమయంలో చెప్పలేనంత భయము, ఆందోళన కలిగాయి. ఎందుకంటే, ఆయనకి యాంజియో చేయటం అది రెండవసారి. ఆయన శరీరం అందుకు సహకరించడం లేదు. నేను బాబాపై భారం వేసి బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. వైద్యులలోనే ధన్వంతరి అయిన మన సాయితండ్రి ఆ యాంజియో టెస్ట్ సజావుగా పూర్తి చేయించటమేకాక నాన్నగారి గుండె పరిస్థితి కూడా బాగుండేలా అనుగ్రహించారు. యాంజియోగ్రామ్ రిపోర్టు చూసిన డాక్టర్లు, “ఇదివరకు యాంజియోగ్రామ్‌లో ఏ విధంగా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏ సమస్యా లేదు” అని చెప్పారు. కానీ మా నాన్నగారికి గుండెల్లో మంట మాత్రం తగ్గలేదు. దాంతో ప్రేవుల్లో అల్సరో, క్యాన్సరో ఉండివుంటుందేమోననే అనుమానంతో నాన్నగారికి ఎండోస్కోపీ చెయ్యాలన్నారు డాక్టర్లు. మళ్ళీ మాకు భయం మొదలైంది. మాకు దిక్కు బాబానే, ఆయన మీదే భారం వేశాము. ఈసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామనుకుని వేరే హాస్పిటల్లో చూపించాము. అక్కడి డాక్టర్లు కూడా ఎండోస్కోపీ పరీక్ష చేయిస్తే తప్ప మంట ఎందుకు వస్తోందో చెప్పలేమన్నారు. ఈసారి నాన్నని నేను హాస్పిటల్‌కి తీసుకువెళ్లాను. మా అమ్మ ఎంతో ధైర్యం గల మనిషి. కానీ, నాన్నగారి పరిస్థితి చూసి ఆవిడ రాలేక నన్ను పంపింది. ఎండోస్కోపీ పరీక్ష మత్తు ఇచ్చి చెయ్యాలని, అందువల్ల నాన్నగారికి ఆహారం ఏమీ పెట్టొద్దని చెప్పారు డాక్టర్లు. ఉదయం 10 గంటలకు ఎండోస్కోపీ చేస్తానని చెప్పి, మత్తు ఇచ్చే డాక్టర్ ఇంకా రాలేదని మమ్మల్ని వేచివుండమన్నారు. చివరికి మధ్యాహ్నం 12 గంటలకు మత్తు లేకుండానే ఎండోస్కోపీ టెస్ట్ పూర్తి చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. మన బ్లాగులో ప్రచురించే అనుభవాలలో సాయిభక్తులు తమకేదైనా కష్టం వచ్చినప్పుడు, “బాబా! మాకు మీరు తోడుగా వున్నారని ఏదో ఒక రూపంలో నిదర్శనం చూపండి” అని అడిగినప్పుడు, వాళ్లందరికీ బాబా నిదర్శనం చూపినట్లు చదివాను. ఆ అనుభవాలను చదివిన నేను, “ఇదంతా నిజమేనా? లేక వాళ్ళు భ్రమపడ్డారా?” అని అనుకున్నాను. ఇప్పుడు నా విషయంలో ఏమైందంటే, నాన్నగారిని ఎండోస్కోపీ టెస్టుకి తీసుకువెళ్లాక నేను మా అమ్మకి ఫోన్ చేసి, ‘ఇప్పుడే నాన్నని లోపలికి తీసుకెళ్లారు’ అని చెప్పాను. అప్పటికి టైం 12:30 అయ్యింది. ఉదయం నుండి ఆయన ఏమీ తినలేదు. చాలా బలహీనంగా వున్నారు. మా అమ్మ ఒక్కటే మాట అంది, “నేను ఆయన మీద ఆశ వదిలేసుకున్నాను. డాక్టర్లు ఏం చేస్తారో, ఆయనని ఎలా ఇంటికి పంపిస్తారో వాళ్ళిష్టం. ఎందుకంటే, హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు చేయించుకున్నా, హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్‌మెట్ తీసుకుని వచ్చినా ఆయన రోజుల తరబడి కోలుకోలేకపోతున్నారు” అని. ఆ మాట విన్నాక ఇంకా నాకు భయం పెరిగిపోయింది. కళ్ళనుండి నీళ్లు నాకు తెలియకుండానే ధారగా కారిపోతున్నాయి. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, “మీ భక్తులు కష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తమకు అండగా మీరున్నారనే నిదర్శనం చూపించమని ప్రార్థిస్తే ఏదో ఒక రూపంలో మీరున్నారని వాళ్ళకు ఋజువు చేశారు. అలాగే నాకు కూడా మీరు తోడుగా ఉన్నట్టు ఏదైనా నిదర్శనం చూపించు తండ్రీ!” అని వేడుకున్నాను. నాకు అది అసాధ్యమని అనిపించినప్పటికీ బాబాను అడిగాను. హాస్పిటల్ క్లోజ్డ్‌గా వుంది, అక్కడ పేషెంట్లు, నర్సులు తప్ప మరెవరూ లేరు. ఇంతలో కొంతమంది వ్యక్తులు ఒక పేషెంటుని చెకప్ కోసం అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళని నర్సు అడ్రస్ అడిగినప్పుడు తమ ఇల్లు ‘Near SaiBaba temple’ (సాయిబాబా మందిరం దగ్గర) అని రెండు మూడు సార్లు చెప్పారు. కన్నీళ్ళతో బాబాను ప్రార్థిస్తున్న నేను వాళ్ళ ప్రక్కనే ఉన్నాను. ఆ మాట వినగానే బాబా నాతో ఉన్నారని నాకు కొండంత ధైర్యం వచ్చింది. నిజంగా ఇది అద్భుతంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఒక అరగంటకి డాక్టర్ మమ్మల్ని పిలిచి, ‘ఎండోస్కోపీలో ఏ సమస్యా లేదని, అంతా నార్మల్‌గానే ఉందని’ చెప్పారు. ఎంతో సంతోషంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆ తర్వాత గుండెకి సంబంధించిన కొన్ని మందులు మార్చారు. బాబా అనుగ్రహంతో ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది.

నేను బాబాను మర్చిపోయినా ఆయన నా వెన్నంటే వున్నారనటానికి నిదర్శనం - నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చడమే. తెల్లవారి లేచిన దగ్గరనుండి ఎన్నో సమస్యల వల్ల ఒక్కోసారి దేవుడిని ప్రార్థించటానికి కూడా అవకాశం దొరకదు. కానీ, పారాయణలో సభ్యులమయితే రెండు రోజుల ముందు నుంచే బాబా మన మదిలో ఉండి మనతో పారాయణ పూర్తి చేయిస్తారు. గ్రూపులోని వ్యక్తులు ఎంతో నిబద్ధతతో ఉండాలి. ఒకవేళ పారాయణ చేయలేకపోతే ముందే గ్రూపు అడ్మిన్‌కు తెలియజేయాలి. అంటే, బాబానే మనలో ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన భక్తిని నేర్పుతున్నారని నేను భావిస్తాను. “ధన్యవాదాలు బాబా!”


బాబా కృపతో ఆఫీసులో సమస్య పరిష్కారం 

నా పేరు అంజలి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటీవల మా ఆఫీసులో జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు మా సబ్‌స్టేషన్‌లో బ్యాటరీ రీడింగ్స్ తక్కువ వచ్చాయి. అవి క్రొత్త సెల్స్. “అవి వేసి కేవలం ఒక సంవత్సరం అవుతోంది, ఏంటి రీడింగ్స్ తక్కువ వస్తున్నాయి?” అని బాధపడ్డాను. ఇంక బాబాను స్మరించుకుని సర్వీస్ ఇంజనీరుతో మాట్లాడితే, తెల్లవారిన తరువాత కూడా మరోసారి బ్యాటరీ రీడింగ్స్ తీయమన్నారు. ఇంక అప్పుడు చూస్తే, ఒక సెల్‌లో లోపం ఉంది. దానిని తీసేయమని ఆయన చెప్పారు. అయినా తెల్లవారాక రీడింగ్స్ తీస్తే ఎప్పటిలానే నార్మల్‌గా వచ్చాయి. అంతా బాబా దయ. సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ సమస్య పరిష్కారమైతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “కాస్త ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా!” బాబా ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అంతా ఆయన దయ. ఏ కష్టం వచ్చినా బాబా తన బిడ్డలను తప్పకుండా కాపాడుతున్నారు.

ఈ నెలలో డబ్బుకు సంబంధించిన చిన్న సమస్య వచ్చింది. అది కూడా బాబా దయవల్ల వెంటనే పరిష్కారమైంది. “ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి బాబా. అవేమిటో మీకు తెలుసు. వాటిని మీరే చూసుకుంటారన్న ధైర్యం నాకు ఉంది. ఇంక నాకెందుకు బాధ?” ఇంకా మరిన్ని అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



7 comments:

  1. అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. Baba please amma ki problem cure cheyandi baba pleaseee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo