సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 584వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రతీసారి ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్న బాబా

  2. సాయి దయే అసలైన ఔషధం


ప్రతీసారి ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్న బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు సంహిత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి నా కృతజ్ఞతలు. నేనిప్పుడు బాబా కలలో నాకు దర్శనమిచ్చిన అనుభవం, ఆయన నాతోనే ఉన్నారనని తెలియజేసిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

నేను పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఉన్నాను. మాకు పాసింగ్ అవుట్ పెరేడ్ ప్రాక్టీస్ జరుగుతుంది. 2020, అక్టోబర్ ఒకటో తారీఖున ప్రాక్టీసులో భాగంగా మా అందరినీ గ్రౌండులో నిల్చోబెట్టారు. ఆ సమయంలో నా కాళ్ళు చాలా నొప్పిపెడుతున్నాయి. దాంతో నేను మనసులోనే బాబా నామస్మరణ చేసుకుంటున్నాను. అప్పుడు కొన్ని క్షణాలపాటు ఒకరకమైన సువాసన వచ్చింది. అది ప్రత్యేకించి శిరిడీ సమాధి మందిరంలో మాత్రమే వచ్చే సువాసన. బాబా నాతో ఉన్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని గంటలపాటు ఆ సంతోషం అలానే కొనసాగింది. నాకు కలిగిన ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈవిధంగా సువాసన రావడం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. మొదటి రెండుసార్లు నేను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడేమో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వచ్చింది. 

మరో అనుభవం:

రోజూ రాత్రి నిద్రపోయేముందు బాబా తాతని తలచుకుని నిద్రపోవడం నాకు అలవాటు. నాకు ఎన్నోసార్లు బాబా స్వప్న దర్శనమిచ్చారు. అలాగే 2020, అక్టోబర్ 2న కూడా బాబాని తలుచుకుని నిద్రపోయాను. మధ్యరాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను పాసింగ్ అవుట్ పెరేడ్ ప్రాక్టీసు అయ్యాక నా షూస్ తీసి బ్యాగులో పెట్టాను. కానీ ఆ తరువాత చూస్తే అవి కనిపించలేదు. ఎక్కడో పోగొట్టుకున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు తెలియలేదు. అప్పుడు నేను, "బాబా! ఇంకో రెండురోజులు ఈ షూస్ తో నాకు అవసరం ఉందనగా ఇప్పుడీ షూస్ పోయాయి. అవి ఎలాగైనా దొరికేలా చేయండి బాబా. తర్వాత పాసింగ్ అవుట్ పెరేడ్ కోసం ఎలాగూ కొత్త షూస్ వేసుకుంటాను" అని బాబాని అడుగుతూ షూస్ కోసం వెతుకుతున్నాను. అక్కడొక పెద్ద గది ఉంది. అందులో బాబా పెద్ద విగ్రహం ఉంది. నేను బాబా పాదాలపై పడి, "బాబా నాకు గ్రూపు 4లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. ఇష్టపడిన అబ్బాయితో నా వివాహం జరిపించండి. ఇంకా నా షూస్ ఎలాగైనా నాకిప్పుడు దొరికేలా చేయండి" అని బాబాని అడిగాను. తరువాత నేను బాబా పాదాల వద్ద నుండి లేస్తున్నప్పుడు బాబా తన రెండు పాదాలు నా తలపైన పెట్టారు. వెంటనే అప్పటివరకూ విగ్రహ రూపంలో ఉన్న బాబా మనవాకృతిలోకి మారారు. నేను బాబాకి నమస్కరించుకుని అక్కడినుండి వచ్చేసాను. ఇంతటితో కల ముగిసింది. ఉదయం లేచిన తరువాత కల గురించి ఆలోచించాను. కానీ నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు నాకు తెలిసిన ఒక సాయి అన్నయ్యకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, తలపై బాబా పాదాలు పెట్టడం వెనక ఉన్న అర్థం ఏమిటి అని అడిగాను. అతను, "బాబా గొప్ప సత్పురుషులు. వారు తమ పాదాలు మన తలపై పెట్టడం అంటే ఎంతో శుభ సూచకం, గొప్ప ఆశీర్వాదం" అని చెప్పారు. అది తెలిసి నాకెంతో సంతోషంగా అనిపించింది. వెంటనే ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను.

కానీ తరువాత వచ్చిన ఫలితాల్లో నేను గ్రూపు 4కి ఎంపిక కాలేదు. ఆ ప్రక్రియలో బాబా చాలా నిదర్శనాలు ఇచ్చినందువల్ల ఆ ఉద్యోగం నాకు వస్తుందని నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను. మరి బాబా ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా భయమేస్తుంది. ఎందుకంటే, నేను బాబాని ఏది అడిగినా మొదట్లో చాలా సానుకూలంగా చూపిస్తారు. నేను ఎంతో నమ్మకం పెట్టుకుంటాను కానీ, చివరికి ప్రతికూల ఫలితం ఎదురవుతుంది. అందుకే ఇంక బాబాని ఏదీ అడగకూడదని, ఆయన ఇష్టానికి వదిలేస్తున్నాను. ఎప్పుడూ నాతో ఉంటూ నన్ను నడిపించేది నా బాబా. ఆయన నాకు నచ్చింది చేసినా, చేయకపోయినా ఆయన మీద నాకున్న ఇష్టం పోదు. నేను బాబాపై కోపగించుకున్నా ఆయన నన్ను వదిలిపెట్టరు. బాబా అంటే నాకు చాలా నమ్మకం. కానీ ఆయన పెట్టే పరీక్షలు నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ అవుతుంది. ఏదేమైనా బాబా సమాధానం కోసం నేను నిరీక్షిస్తాను.

"చాలా చాలా థాంక్స్ బాబా. ప్రతీసారి మీరు మీ ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేనే మీ దర్శనం దొరుకుతుంది. అలాంటిది నేను అడిగిన ప్రతిసారి మీరు నాకోసం వస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు బాబా. కరోనా కారణంగా శిరిడీ దర్శించలేకపోతున్నాము. మీ దర్శన భాగ్యం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. వీలైనంత తొందరగా ఆ సదవకాశాన్ని భక్తులకు ప్రసాదించండి బాబా.

ఓంసాయిరాం.


సాయి దయే అసలైన ఔషధం

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సాటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇటీవల జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2020, సెప్టెంబరు 26వ తేదీ శనివారం రాత్రి మావారికి ఉన్నట్టుండి జలుబు మొదలైంది. అసలే బయట కోవిడ్ పరిస్థితుల వల్ల ఒంట్లో ఏ మాత్రం కాస్త నలతగా ఉన్నా అందరికీ భయమేస్తోంది. నాకు కూడా భయమేసి వెంటనే మన సద్గురు సాయిని ప్రార్థించి, మావారి చేత ఆవిరి పట్టించాను. తరువాత బాబా ఊదీ వేసిన వేడినీళ్ళు, కషాయం త్రాగమని మావారికి ఇచ్చాను. ఇన్ని చేసినా మర్నాడు కూడా తనకు జలుబు తగ్గలేదు. నేను బాబా ముందు ప్రణమిల్లి, “బాబా! మావారికి జలుబు తగ్గేలా చేయి తండ్రీ! మీ దయవల్ల మావారి జలుబు తగ్గిపోతే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను” అని మన సాయితండ్రిని వేడుకున్నాను. తనను నమ్మినవారిని సాయి ఎన్నటికీ విడిచిపెట్టరు. బాబా దయవల్లే మావారికి జలుబు తగ్గి ఆరోగ్యం కుదుటపడింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా మా కుటుంబానికి అడుగడుగునా సహాయంగా ఉంటూ అన్నివిధాలా మమ్మల్ని రక్షిస్తున్నారు. “బాబా! ఇలాగే నీ కృప అందరిమీదా ప్రసరించి ఈ కరోనా బారినుండి విముక్తి కలిగించు తండ్రీ!” 

ఓం సాయిరాం!



8 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo