సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 608వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న  బాబా
  2. పసరు మొత్తాన్ని పాము చేత తీయించి ఆరోగ్యవంతురాలిని చేసిన బాబా

నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న  బాబా

సాయిభక్తురాలు నిఖిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నా పేరు నిఖిత. నా జీవితంలో బాబా ఎన్నో విషయాలలో నాకు చాలా సహాయం చేశారు. వాటిలోనుండి నాలుగు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మొదటి అనుభవం: 

నేను ఎం.బి.ఎ. పరీక్షలు వ్రాసే సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి చాలాదూరం ప్రయాణించాల్సి వచ్చేది. అంతదూరం వెళ్ళాలంటే నాకు చాలా భయమేసేది. ప్రతిరోజూ నేను బాబా నామం స్మరించుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్ళేదాన్ని. బాబా నామస్మరణతో నాకు భయం పోయేది. బాబా అనుగ్రహంతో పరీక్షలు బాగా వ్రాశాను, క్లాస్ ఫస్ట్ కూడా వచ్చాను.

రెండవ అనుభవం: 

ఒకసారి మా అమ్మకి ఛాతీ దగ్గర బాగా నొప్పి వస్తోందని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాము. అమ్మను పరీక్షించిన డాక్టర్లు అమ్మకు ఛాతీలో గడ్డ వుందని చెప్పారు. తరువాత అమ్మకు ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించారు. ఆ తరువాత ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అవునో, కాదో నిర్ధారించుకోవడానికి దానిని బయాప్సీకి పంపించారు. అప్పుడు మా నాన్న బాబాను ప్రార్థించి, “ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా మామూలు గడ్డ అయ్యేలా అనుగ్రహించమని, అది క్యాన్సర్ గడ్డ కాకపోతే 5 గురువారాల పాటు సాయిబాబా మందిరానికి కూరగాయలు పంపిస్తాన”ని మ్రొక్కుకున్నారు. నేనేమో బాబాకు నమస్కరించుకుని, “ఇకపై నేనసలు టీ త్రాగను” అని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ గడ్డ మామూలు గడ్డ అని రిపోర్టులు వచ్చాయి. ఇదంతా బాబా మాపై చూపిన దయే. మేము ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

మూడవ అనుభవం: 

నేను కరోనా గురించి ఆలోచించి భయపడుతున్నప్పుడల్లా బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, “నువ్వు భయపడకు, మీ కుటుంబం నా బాధ్యత” అని చెప్పేవారు. బాబా ఇచ్చిన అభయంతో నిశ్చింతగా ఉండేదాన్ని.

ఒకసారి నాకు బాగా జలుబు చేసింది. దాంతో విపరీతంగా తుమ్ములు రాసాగాయి. దానివల్ల ఒకరోజు నాకు బాగా తలనొప్పి వచ్చింది. నేను వేడినీళ్ళలో బాబా ఊదీ వేసుకుని త్రాగాను. తలనొప్పి వల్ల ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. “బాబా! నాకు చాలా తలనొప్పిగా ఉంది, నిద్రపోలేకపోతున్నాను. వెంటనే నా తలనొప్పి తగ్గించు” అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో నా తలనొప్పి తగ్గిపోయింది. రెండు రోజుల్లో నా జలుబు కూడా తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు వస్తోంది, అంతే. ఇదంతా కేవలం బాబా దయ. 

ఒక్కమాటలో చెప్పాలంటే సాయిబాబా లేకపోతే నేను లేను. నన్ను, నా కుటుంబాన్ని బాబా ప్రతి నిమిషం వెంటవుండి కాపాడుతూ వస్తున్నారు.


పసరు మొత్తాన్ని పాము చేత తీయించి ఆరోగ్యవంతురాలిని చేసిన బాబా
 
సాయిభక్తురాలు శాంతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శాంతి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవంతో మీ ముందుకు వచ్చాను. 

నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ మరో నెలరోజుల్లో ఉంటాయనగా, దోమల వల్లనో లేదా వాతావరణంలోని మార్పుల వల్లనో తెలియదుగానీ హాస్టల్లో ఉన్న ఎక్కువ శాతం మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. వారిలో నేను కూడా ఉన్నాను. అనారోగ్యం పాలైన మా అందరినీ ఒక పదిరోజులు విశ్రాంతి తీసుకొని, మందులు వాడి, పూర్తిగా తగ్గిన తర్వాత రమ్మని హాస్టల్ యాజమాన్యం మమ్మల్ని ఇళ్లకు పంపించివేశారు. నేను ఇంటికి వెళ్ళిన తరువాత మా నాన్నగారు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకువెళ్లి చూపించారు. ఆయన నా కళ్ళు చూస్తూ నాకు జాండీస్ అని అనుమానంగా ఉందని నాన్నతో అన్నారు. అయినా ఒకరోజు వేచి చూద్దామని చెప్పి మందులిచ్చి ఇంటికి పంపించారు. ఇక నాకు దిగులు పట్టుకుంది, నెలరోజుల్లో పరీక్షలున్నాయి, 'నేను పరీక్షలు సరిగా రాయగలనో లేదో' అని. ఆ దిగులుతో ఆరోజు పడుకునేముందు మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఏంటి నాకు ఇలా జరుగుతోంది? నాకు జాండీస్ అయితే నేను ఇంటి దగ్గరే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. పత్యాలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లోవాళ్ళు కూడా నన్ను ఇప్పుడిప్పుడే హాస్టల్కి పంపించేటట్లు లేరు. మరి నేను ఎప్పుడు చదువుకోవాలి? ఇలాగే ఉంటే నేను ఎగ్జామ్స్ బాగా రాయగలనో, లేదో! నాకు మంచి మార్కులు వస్తాయో, రావో” అని బాబాకు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయాను. నిద్రపట్టిన కాసేపటికి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా మంచం చివరన కూర్చుని ఉన్నారు. నేను బాబాను చూసి ఎంతో సంతోషపడుతున్నాను. ఆ సమయంలో బాబా బాగా నల్లగా పొడవుగా ఉన్న ఒక త్రాచుపామును చూపించి ఆ పాముని నా కాళ్ల దగ్గర పెట్టబోతున్నారు. అది చూసి నేను, ‘నన్ను ఏమీ చెయ్యొద్దు, ఏమీ చేయొద్దు’ అంటూ కేకలు వేస్తున్నాను. అప్పుడు బాబా, “సరే, ఈ పాము నిన్ను ఏమీ చేయదు” అని నాకు అభయమిచ్చారు. నేను బాబా చేతుల వైపు చూశాను, బాబా చేతుల్లో పాము లేదు. అప్పుడు నేను ‘బాబా నాకు తోడు ఉన్నారు’ అని నిద్రకు ఉపక్రమించాను (కలలోనే). నేను నిద్రపోయిన తర్వాత బాబా మరలా పామును బయటకు తీసి నా కాళ్ల దగ్గర ఉంచారు. నేను అప్పుడు (కలలో) నిద్రలోనే ఉన్నాను. అప్పుడు ఆ పాము నా కాళ్ళనుండి ఏదో రసాన్ని పీల్చివేస్తున్నట్లు నాకు అనిపించింది. తరువాత నాకు మెలకువ వచ్చి చూస్తే బాబా నా దగ్గర లేరు. నేను మరలా నిద్రలోకి వెళ్లిపోయా. తెల్లవారి నిద్రలేచేసరికి నాలో ఏదో కొత్త ఉత్సాహం. గత కొన్ని రోజులుగా ఉన్న నీరసం, అనారోగ్య సమస్యలు ఏవీ లేనట్లు అనిపించింది. అదేరోజు ఫ్యామిలీ డాక్టర్ మా ఇంటికి వచ్చి నాకు జాండీస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో నాకు జాండీస్ లేదని తెలిసింది. నాకు వచ్చింది మామూలు జ్వరమేనని చెప్పి, మందులు ఇచ్చి, నాలుగు రోజులు వాడితే సరిపోతుందని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత హాస్టల్కి కూడా వెళ్ళవచ్చని నాతో చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడు నాకు అనిపించింది, రాత్రి బాబా నా కలలోకి వచ్చి నాలో ఉన్న పసరు మొత్తాన్ని పాము చేత తీయించి వేసి నన్ను ఆరోగ్యవంతురాలిగా చేశారు అని. మా నాన్నగారితో నాకు రాత్రి వచ్చిన కల గురించి, బాబా చేసిన సహాయం గురించి అంతా చెప్పాను. అప్పుడు మా నాన్నగారు, “నీకు బాబా ఎప్పుడూ తోడుగా ఉన్నారు, నిన్ను ఎప్పుడూ బాబానే రక్షిస్తున్నారు” అన్నారు. ఆ మాట వినగానే నా కళ్ళవెంట ఆనందభాష్పాలు జాలువారాయి. “బాబా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? నన్ను ఇంతగా రక్షిస్తున్నారా? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను బాబా?” అని అనుకున్నాను. ఆ తర్వాత డాక్టరిచ్చిన మందులు వేసుకోవటంతో నాలుగు రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. నేను హాస్టల్కి వెళ్లి, బాగా చదువుకొని, ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాను. ఇదంతా బాబా దయకాక మరేమిటి? “బాబా! ఇలాగే ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి నన్ను సరైన మార్గంలో నడిపించండి”.


4 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Baba amma ki infection tagginchu thandri problem cure ayyela chudu thandri nuvve dikku thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo