1. అన్నీ విధాలా బాబా చూపుతున్న అనుగ్రహం
2. బాబా సర్వాంతర్యామి
3. దయార్ద్రహృదయుడైన బాబా కరుణ
అన్నీ విధాలా బాబా చూపుతున్న అనుగ్రహం
అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. బాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ. ఆయన లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల బాబా మాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇటీవల నాకు కరోనా వచ్చినప్పటికీ బాబా దయవలన ఎలాంటి ప్రమాదం లేకుండా తొందరగానే తగ్గిపోయింది. అయితే కరోనా తగ్గి రెండు నెలలు అయినప్పటికీ ఈమధ్య బాగా నీరసంగా అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుందో తెలియలేదుగానీ, దానివల్ల ఇంటిపనులు, ఆఫీసుపనులు చూసుకోలేకపోయేదాన్ని. అట్టి స్థితిలో నాకు బాబానే దిక్కు, ఆయనే నన్ను కాపాడగలరని బాబాను శరణువేడి, "ఎలాగైనా ఈ నీరసం తగ్గేలా చేయండి బాబా" అని కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నాను. అంతేకాదు, ‘సంకల్ప పారాయణ’ గ్రూపులో పారాయణ కూడా చేయించాను. బాబా దయవలన ఆ పారాయణ అయినరోజు నుండి నాకు నీరసం తగ్గుతూ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఈ విషయం బ్లాగులో పంచుకుంటానని మీకు మాటిచ్చాను, కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి బాబా. నువ్వే మాకు దిక్కు. ఈ దీనురాలిని, నా కుటుంబాన్ని, ఇంకా అందరినీ కాపాడు బాబా".
మరో అనుభవం:
నాకు కరోనా తగ్గిన తరువాత సత్యనారాయణస్వామివ్రతం చేసుకుందామనుకున్నాను. అయితే, ఆ వ్రతాన్ని గురుపూర్ణిమరోజున నకిరేకల్ బాబా మందిరంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకున్నాను. మేము ఉండేది నల్గొండలో. ‘గురుపూర్ణిమకి ఎలాగైనా నకిరేకల్‌లోని బాబా మందిరానికి వెళ్ళి, బాబా దర్శనం చేసుకుని, సత్యనారాయణవ్రతం చేసుకునేలా అనుగ్రహించమ’ని బాబాను వేడుకున్నాను. దయగల సాయితండ్రి నేను కోరుకున్నట్లుగానే నన్ను అనుగ్రహించారు. గురుపూర్ణిమరోజున నేను, నా భర్త, పిల్లలు అందరం కలిసి నకిరేకల్ బాబా మందిరానికి వెళ్ళాము. ఆరోజు మందిరానికి చాలామంది భక్తులు వచ్చారు. చాలా కన్నులపండుగగా ఉంది. బాబా అద్భుతమైన దర్శనాన్ని ప్రసాదించారు. బాబాను చూడటానికి రెండు కళ్ళూ సరిపోలేదు. బాబా దర్శనం చేసుకుని, బాబా సన్నిధిలో సత్యనారాయణస్వామివ్రతం చేసుకున్నాను. ‘ఏ సమస్యా లేకుండా అందరం క్షేమంగా ఇంటికి చేరేలా అనుగ్రహించమ’ని బాబాను కోరుకుని, ‘అందరం క్షేమంగా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల అందరం క్షేమంగా ఉన్నాము.
మరొక అనుభవం:
ఒకరోజు మావారికి ఒంట్లో అనీజీగా అనిపించింది. నేను బాబాకు నమస్కరించుకుని, ‘తెల్లవారేసరికి మావారు యాక్టివ్‌గా ఉండేలా అనుగ్రహించమ’ని కోరుకున్నాను. ఆ రాత్రి మావారికి బాబా ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి తను యాక్టివ్‌గా ఉన్నారు.
మరో అనుభవం:
నాకు కొన్ని రోజుల క్రితం బ్రష్ చేస్తున్నప్పుడు నోట్లోనుండి రక్తం వచ్చింది. భయం వేసి వెంటనే బాబాకు నమస్కరించుకుని, ఈ సమస్యను తీర్చమని వేడుకున్నాను. తరువాత నీళ్ళలో బాబా ఊదీ వేసుకుని త్రాగి, ‘ఈ సమస్య తీరితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి సమస్య తీరిపోయింది.
మరో అనుభవం:
నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. ఇటీవల నేను బాబాకు నమస్కరించుకుని, “ఎలాగైనా నాకు డేట్ తెప్పించండి బాబా” అని కోరుకున్నాను. బాబా దయవల్ల నాకు పీరియడ్స్ వచ్చాయి. హ్యాపీగా మన బ్లాగులో పంచుకుంటున్నాను. నాకు అజీర్తి సమస్య కూడా ఉంది. బాబా దయవల్ల అది పూర్తిగా తగ్గిపోగానే ఆ అనుభవాన్ని కూడా మన బ్లాగులో పంచుకుంటాను.
మా పిల్లలు కూడా బాబా దయవల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. “వాళ్ళు చక్కగా చదువుకునేలా, వాళ్ళను మంచి పిల్లలలాగా తీర్చిదిద్దే బాధ్యత నీదే తండ్రీ. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. కరోనా నుండి ఈ మానవాళిని రక్షించు తండ్రీ. నా ఫ్యామిలీ అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలా చూడు స్వామీ!”
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా సర్వాంతర్యామి
నా పేరు సోను. 2021, జూలై 24, గురుపౌర్ణమిరోజున బాబా అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2021, మార్చి నెలలో అమెరికా వచ్చాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజూ ఉదయం ఆరతికి బాబా మందిరానికి వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత బాబాకు పూజ చేయాలంటే కనీసం పువ్వులు కూడా దొరికేవి కావు. పువ్వులు కావాలంటే కాస్త దూరం వెళ్ళి బొకేలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక నా అనుభవానికి వస్తే... గురుపౌర్ణమిరోజున బాబాకు పువ్వులతో పూజ చేయాలనుకుని, ‘బయటికి వెళ్ళి పూలబొకే తీసుకురమ్మ’ని మావారితో చెప్పాను. కానీ మావారు వెళ్ళలేదు. నాకు చాలా ఏడుపొచ్చింది. ‘ఇండియాలో ఉంటే మంచి మంచి పువ్వులు తెచ్చి నీకు అలంకరించి పూజ చేసేదాన్ని కదా బాబా’ అని అనుకున్నాను. అప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది, ‘భక్తిగా ఒక పుష్పంగానీ, నీరుగానీ, ఏది సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు కదా’ అని. మేము క్రొత్తగా వచ్చిన ఆ అపార్ట్‌మెంట్ బయట కొన్ని చెట్లు ఉన్నాయి. వాటికి కొన్ని పువ్వులున్నాయి. కానీ ఆ పువ్వుల పేర్లు ఏమిటో నాకు తెలియదు. ఆ పువ్వులను చూస్తూ, “ఏ పువ్వులైనా సరే బాబాకు మనస్ఫూర్తిగా పెడితే చాలు, పువ్వుల పేర్లు తెలియాల్సిన అవసరం లేదు” అనుకున్నాను. అయితే, నాకెందుకో ఆ పువ్వులు పెట్టడానికి మనస్కరించటం లేదు. నాకు బాబాను పువ్వులతో అలంకరించడం అంటే ఇష్టం. నేను ప్రతి సంవత్సరం గురుపౌర్ణమిరోజున బాబాను రకరకాల పువ్వులతో అలంకరించి చక్కగా పూజ చేసేదాన్ని. కానీ, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. సన్నజాజులు, విరజాజులు వంటి పువ్వులు లేకపోయినా ఇక్కడ దొరికిన ఆ పూలతోనే బాబాను అలంకరించాను. మావారు పువ్వుల కోసం వెళ్లనందుకు, తనకు బాబాపై అంతగా భక్తి లేనందుకు చాలా బాధేసింది. అయితే, బాబా దయవల్ల మావారు నన్ను బాబా మందిరానికి తీసుకువెళ్లారు. ఎంతో బాధతో, ఏదో తెలియని లోటుతో మావారితో కలిసి బాబా మందిరంలోకి అడుగుపెట్టిన నేను, ఇంట్లో ఏ పువ్వులైతే బాబాకు పెట్టానో అవే పువ్వులు ఇక్కడ బాబా పాదాల దగ్గర ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. ‘ఇంటి దగ్గర ఎదురుగా పువ్వులు ఉన్నాయి, వాటిని భక్తితో బాబాకు పెడితే చాలనుకుని పెట్టేశాన’ని నాకు చాలా ఏడుపు వచ్చింది. అంతలోనే బాబా ముఖంలో చిరునవ్వు చూసి ఎంతో ఆనందము, చక్కని అనుభూతి కలిగాయి. “ఐ లవ్ యు బాబా!” అని గట్టిగా అరవాలనిపించింది. అప్పుడు అర్థమైంది నాకు, ‘బాబా సర్వాంతర్యామి అనీ, ఆయన ఎల్లప్పుడూ మనలోనే ఉన్నారనీ, ప్రతిక్షణం మనతో ఉండి మనల్ని నడిపిస్తారనీ’. నిజంగా ఆ సద్గురు ప్రేమకు మనం ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము, కేవలం ఒక ప్రేమ తప్ప!
దయార్ద్రహృదయుడైన బాబా కరుణ
సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు లత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. ఇటీవల మా అమ్మకి కరోనా వచ్చింది. ఆ కారణంగా మా నాన్నగారు అమ్మను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. దాంతో మా అమ్మ దగ్గరే ఉండే మా తొమ్మిది సంవత్సరాల బాబు ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వచ్చి, చిన్నపిల్లవాడైనందున తన నాయనమ్మ దగ్గరకి వెళ్లాడు. అయితే అక్కడకు వెళ్లిన రెండురోజులకి బాబుకి బాగా జ్వరం వచ్చింది. టెస్ట్ చేయిస్తే, తనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే తన నాయనమ్మ బాబుని మా దగ్గరికి తీసుకుని వచ్చింది. బాబుకి వేరుగా ఉండటం తెలీదు. పైగా వాడికి ఒక వారంరోజులపాటు జ్వరం చాలా తీవ్రంగా ఉంది. అందువల్ల రోజూ బాబుకి ఒళ్లు తుడవడం, అన్నం తినిపించడం, ట్యాబ్లెట్స్ వేయించడం చేయాల్సి వచ్చేది. ఇదంతా చేస్తూ దూరం పాటించడం చాలా కష్టం. అయితే తనతో సన్నిహితంగా ఉన్నప్పటికీ బాబా దయార్ద్రహృదయం వల్ల మాకెవరికీ కోవిడ్ ఎఫెక్ట్ కాలేదు. మన బాబా మమ్మల్ని కరుణించి బాబుకు తొందరగా నయం చేశారు. అయితే, ఒకరోజు బాబు వాళ్ల నాయనమ్మ, ‘నాకు కొంచెం జ్వరంగా ఉంది, ఒళ్లంతా చలిగా ఉంది’ అంది. ఆవిడలో కోవిడ్ లక్షణాలేమన్నా బయటపడుతున్నాయేమోనని నాకు చాలా భయమేసి, "బాబా! నీవే మాకు దిక్కు" అని బాబా ఫోటో ముందు దణ్ణం పెట్టుకున్నాను. చల్లని తండ్రి బాబా ఉండగా మనకు భయమేల? మూడు గంటల్లోనే ఆవిడకి జ్వరం తగ్గిపోయింది. ఆవిడ మామూలుగానే ఉంది, కోవిడ్ ఎఫెక్ట్ కాలేదు. ఇకపోతే, చల్లని తండ్రి బాబా దయవల్ల అమ్మ కూడా పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు అమ్మ మామూలుగానే ఉంది. నాన్న కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా దయార్ద్రహృదయుడైన బాబా కరుణ. "బాబా! నేను మీకు ఎంతో ఋణపడివున్నాను. మీ నామస్మరణ చేయడం తప్ప ఇంకేమి చేయగలను సాయీ? సదా మీ నామస్మరణలోనే ఉండేలా అనుగ్రహించండి సాయీ". చివరిగా తోటి సాయిభక్తులకు నాదొక విన్నపం... ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. బాబా దయవల్ల అందరూ చల్లగా ఉంటారు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteBaba helped.me a lot But
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼😊🌹😀❤
ReplyDelete836 days
ReplyDeletesairam
Om sai ram baba amma arogyam bagundela chudu thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDelete