1. సచ్చరిత్ర పారాయణ - బాబా కృప
2. సాయి చూపిన దయ
3. అడగకున్నా మనకు కావాల్సింది బాబా ఇస్తారు
సచ్చరిత్ర పారాయణ - బాబా కృప
ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా నమస్సుమాంజలి. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు సాహిత్య. మావారికి ప్రతిభ ఉన్నప్పటికీ చాలాకాలంగా తక్కువ జీతం వస్తోంది. అందువల్ల నేను మావారికి ఉద్యోగంలో ప్రమోషన్ గానీ లేదా వేరే కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం గానీ రావాలన్న కోరికతో సాయిబాబా సచ్చరిత్ర సప్తాహపారాయణ చేయాలని సంకల్పించాను. అనుకున్నట్లే, 2021, జూలై 7, బుధవారంనాడు నేను పారాయణ మొదలుపెట్టి జూలై 12, సోమవారంనాడు పూర్తిచేశాను. అంటే, ఆరురోజుల్లోనే నా పారాయణ పూర్తయింది. అందుచేత ఏడోరోజు విష్ణుసహస్రనామాలు చదువుకున్నాను. కాకపోతే, నేను గర్భవతినైనందున నేలమీద పడుకోవడం, ఉపవాసం ఉండటం వంటివి ఏమీ చేయకుండా పారాయణ చేశాను. బుధవారంనాడు మావారు తనకి ఆ ముందురోజు, అంటే మంగళవారంనాడు 'సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ త్వరలో ఉంటుంది' అని అంతకుముందు తను మొదటి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తిచేసిన ఒక కంపెనీ నుండి మెసేజ్ వచ్చిందని చెప్పారు. విచిత్రం ఏమిటంటే, మావారు ఫస్ట్ రౌండ్ అటెండ్ అయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అప్పటినుండి ఇప్పటివరకూ ఆ కంపెనీ నుండి ఎలాంటి స్పందనా లేదు. అలాంటిది పారాయణ పూర్తిచేసిన వెంటనే మెసేజ్ రావడం నిజంగా పెద్ద మిరాకిల్. బాబా కృపకు నేను చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. మరో విషయం ఏమిటంటే, 7 రోజులు పారాయణ చేయాలన్న సంకల్పంతో 7వ తేదీన పారాయణ ప్రారంభించిన నేను 7+7=14 అంటే 14వ తేదీకి పారాయణ పూర్తిచేయాలని అనుకున్నాను. కానీ నా లెక్క తప్పు. 13వ తేదీకే నా పారాయణ పూర్తిచేయాలి. అయితే ఆ విషయం నేను గ్రహించకపోయినా బాబా ఎంతో దయతో ఏడురోజుల్లో నా పారాయణ పూర్తిచేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". నేను అనుకున్న జీతం మావారికి తప్పకుండా వస్తుందని బాబా యందు ఉంచిన నమ్మకం నిజమైంది. ఆగస్టు 9న మావారికి తను పనిచేస్తున్న ఆఫీసువాళ్ళు ఫోన్ చేసి, ‘10% జీతం పెంచుతున్నామ’ని చెప్పారు. వాళ్ల ఆఫీసు చరిత్రలోనే అంత హైక్ ఇవ్వడం ఇదే మొదటిసారట. ఇదంతా బాబా దయ. పారాయణ పూర్తయిన నెలలోనే బాబా మాకు ఇంత అద్భుతమైన వార్త అందించారు. మేము చెప్పలేని ఆనందంతో బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ ఆనందాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలనిపించింది. "మరోసారి థాంక్యూ సో మచ్ బాబా. ఇంకా నా అనుభవాలు ఒక్కొక్కటీ ఈ బ్లాగులో పంచుకుంటాను బాబా. ఆలస్యమై ఉంటే క్షమించండి. మా అమ్మానాన్నల ఋణబాధలు తీర్చండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః.
సాయి చూపిన దయ
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు పి.సి.శేఖర్. నేను 7 సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. నేను ప్రతిరోజూ ‘గురుగీత’ వింటుంటాను. అయితే, 2021, జూన్ 19, సాయంత్రం యూట్యూబ్‌లో గురుగీత గురించి ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు నేను సాయిని ప్రార్థించాను. ఆ రాత్రి మళ్లీ వెతికితే, సాయిబాబా దయవల్ల 'who is guru?(మన ఊహలకి అందనివాడు గురువు)' అన్న టైటిల్‌తో వచ్చింది. నేను చాలా సంతోషించాను. మరోసారి గురుగీత 29వ టాపిక్ కోసం చాలా వెతికాను, కానీ అది కనిపించలేదు. అప్పుడు కూడా నేను సాయిని ప్రార్థించాను. అయినా నాకు కావలసిన ఆ టాపిక్ రాలేదు. కొంతసపటి తరువాత నేను స్నానం చేసి వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేస్తే, నేను సెర్చ్ చేయకుండానే దానంతటదే నాకు కావాల్సిన టాపిక్ వచ్చింది. నేను ఆనందాశ్చర్యాలకు లోనై బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మా అమ్మ వణుకు సమస్యతో బాధపడుతుంటే 2021, జులై 17, రాత్రి డాక్టర్ మా అమ్మకు హై డోస్ (ఎక్కువ మోతాదు) మందిచ్చారు. మరుసటిరోజు అమ్మకి వాంతులయ్యాయి. నాకు చాలా భయం వేసింది. వీడియో కాల్ చేసి అమ్మ పరిస్థితిని డాక్టరుకి చూపిద్దామంటే, ఆరోజు ఆదివారం. అయినప్పటికీ ఫోన్ చేస్తే డాక్టరు మరుసటిరోజు చేయమన్నారు. సోమవారం వీడియో కాల్ చేస్తే, అమ్మ పరిస్థితి చూసిన డాక్టరు మందుల డోస్ తగ్గించారు. ఆ మందులతోపాటు బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలిపి అమ్మకి ఇవ్వసాగాను. బాబా దయవల్ల అమ్మ పరిస్థితి కొంతవరకు మెరుగైంది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మాపై దయచూపండి బాబా. మీ కృపతో అమ్మకి వణుకు సమస్య పూర్తిగా నయం కావాలి తండ్రీ". చివరిగా, ఈ అవకాశమిచ్చిన బాబాకి, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు.
అడగకున్నా మనకు కావాల్సింది బాబా ఇస్తారు
శ్రీ సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగును ఏర్పాటు చేయించి, తోటి భక్తుల అనుభవాలు చదివే అవకాశం కల్పించిన బాబాకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సురేష్. నేను విశాఖపట్నం నివాసిని. నేను, నా భార్య ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నాము. మా ఇద్దరికీ వచ్చే నెల జీతం తప్ప మా కుటుంబానికి వేరే స్థిరాస్తులంటూ ఏమీ లేవు. గత ఏడు సంవత్సరాలుగా మేము ఒక అపార్ట్‌మెంటులో అద్దెకు ఉంటున్నాము. ఆ ఇంటి యజమాని ఈ సంవత్సరం(2021) జనవరి నెలలో మా ఇంటికి వచ్చినప్పుడు, "మీరు అద్దెకు ఉంటున్న ఈ ఇంటిని మీరే కొనుక్కోవచ్చు కదా!" అని మమ్మల్ని ప్రోత్సహించి, ధర కూడా మాకు సౌకర్యవంతంగానే చెప్పారు. అందుకు మేము, "మాకు బ్యాంకు లోన్ ఇస్తే కొనుక్కుంటాం" అని చెప్పాము. అదే నెలలో మేము బ్యాంక్ లోన్‌కి దరఖాస్తు చేసుకున్నాము. బ్యాంకువాళ్ళు మా అర్హతలు చూసి, మేము లోన్ తీసుకోవడానికి అర్హులమని నిర్ధారించి ఏప్రిల్ నెలలో లోన్ మంజూరు చేశారు. మే, జూన్ నెలల్లో లాక్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొద్దిగా ఆలస్యమై, చివరికి జూలై 14న రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకు స్తోమత లేదని భావిస్తూ, "మాకు ఒక సొంత ఇల్లు కావాల"ని బాబాను మేమెప్పుడూ అడగలేదు. మేము అడగకున్నా ఊహించని రీతిలో మాకొక సొంత ఇంటిని అమర్చారు బాబా. "వేల వేల ధన్యవాదాలు బాబా". బాబాను నమ్ముకుంటే, మనం దేనికి అర్హులమో దాన్ని మనం అడగకుండానే ఆయన మనకు ప్రసాదిస్తారు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
- ఐ. సురేష్.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌹😊🌼❤
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
835 days
ReplyDeletesairam
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDelete