1. బాబా కరుణాకటాక్షాలతో అన్నీ చక్కబడతాయి
2. బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
3. బాబా దయ
బాబా కరుణాకటాక్షాలతో అన్నీ చక్కబడతాయి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా సాయి మహరాజుకి నా శతకోటి పాదాభివందనాలు. బాబా ప్రసాదించిన అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పించినందుకు ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు లక్ష్మి. మేము హైదరాబాదులో ఉంటాము. నేను ఏ పని చేస్తున్నా నా నోటినుండి వచ్చేది సాయినామమే. నన్ను, నా కుటుంబాన్ని కరుణించి కాపాడే తండ్రి బాబానే. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
2021, ఏప్రిల్ 3న మా బాబు కాస్త దగ్గుతూ ఉన్నాడు. తను ఈమధ్య తరచూ బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాడు. అందువల్ల, ‘బయట ఏమి తిన్నావ’ని తనను అడిగితే, “ఫ్రెండ్ వాళ్ళింట్లో చల్లని మంచినీళ్ళు త్రాగాను” అని చెప్పాడు. రెండు రోజుల తర్వాత ఏప్రిల్ 5 అర్థరాత్రి 1.30 సమయంలో తను నిద్రలో సన్నగా మూలగటం వినిపించడంతో నేను నిద్రనుండి లేచి వెళ్ళి చూశాను. బాబు ఊపిరి కాస్త ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. ఒళ్ళు వేడిగా అనిపించటంతో థర్మామీటరుతో టెంపరేచర్ చెక్ చేస్తే 101 డిగ్రీలు ఉంది. నాకు చాలా భయం వేసింది. వెంటనే బాబా వద్దకు వెళ్ళి, “నా బిడ్డకి జ్వరం తగ్గిపోయేలా చేయి తండ్రీ” అని వేడుకుని, కొద్దిగా ఊదీ తీసుకుని బాబు నుదుటన పెట్టి, మరికాస్త ఊదీని నీళ్ళలో కలిపి బాబుకి త్రాగించాను. తరువాత డోలో టాబ్లెట్ వేసి, తన తలక్రింద బాబా పాదుకల ఫోటో పెట్టి, మనస్సులో బాబా నామం జపిస్తూ రాత్రంతా తనవద్దే భయంతో ఉండిపోయాను. నాకు పొరపాటున కునుకుపట్టినా మనస్సులో నామజపం మాత్రం ఆగలేదు. ఉలిక్కిపడి లేచేదాన్ని. “బాబా, మీరే నా బిడ్డని కాపాడాలి” అని బాబాను వేడుకోని క్షణం లేదు. తెల్లవారాక డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెబితే, కొన్ని మందులు సూచించి, “ఇవి వేయండి, తగ్గిపోతుంది” అని ధైర్యం చెప్పారు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబుకి వచ్చిన ఈ జ్వరాన్ని మామూలు జ్వరంగా తగ్గించండి. తనకు అసలే అలర్జీ, ఆయాసం కూడా వస్తుంటుంది. మీ అనుగ్రహంతో బాబుకి జ్వరం తగ్గిన వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి'లో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. డాక్టర్ సూచించిన మందులు వేస్తూ, బాబా ఊదీని నీళ్ళలో కలిపి బాబుకి త్రాగించేదాన్ని. ఆ తరువాత నుండి బాబుకి మళ్ళీ జ్వరం రాలేదు. అద్భుతమైన బాబా ఆశీస్సుల వల్ల అది మామూలు జ్వరంగానే తగ్గిపోయింది. కేవలం బాబా కరుణాకటాక్షాల వల్లనే ఇంతటి కష్టపరిస్థితులలో నుండి సులభంగా బయటపడి సురక్షితంగా ఉన్నాము. “బాబా, మా అందరినీ కోవిడ్ బారినుండి రక్షించి, కరుణించి కాపాడండి. బాబుకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ మీ చల్లని ప్రేమను మాపై చూపండి. మేము తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించండి. మీపై మా భక్తివిశ్వాసాలు పెరిగేలా అనుగ్రహించండి. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి సాయీ! థాంక్యూ సో మచ్ బాబా! లవ్ యు సాయితాతా!”
మరొక అనుభవం:
2021, ఏప్రిల్ 27న మేము తిరుపతి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అక్కడ మాకు ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి ప్రక్కనున్న స్థలం వారితో సమస్య వచ్చింది. మా స్థలం చుట్టూ ఉన్న అన్ని స్థలాలనూ వేరేవాళ్ళు విడతలవారీగా కొనుక్కున్నారు. వాటన్నిటి మధ్యలో మా స్థలం ఉంటుంది. ఆ స్థలం విషయం మాట్లాడి, సర్వే చేయించడానికి తప్పనిసరిగా తిరుపతి వెళ్ళాలి. ఆ సమయంలో తిరుపతిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తిరుపతిని కంటెయిన్మెంట్ జోన్‌గా చేసి, మధ్యాహ్నం 2 గంటల నుండి కర్ఫ్యూ విధించారు. హైదరాబాద్ నుండి నేను, మా బాబు విజయవాడ వెళ్ళి అక్కడనుండి మా నాన్నగారితో కలిసి తిరుపతికి వెళ్ళాలి. కానీ ‘ఈ సమయంలో ప్రయాణం చేయడమా, మానడమా’ అని సందిగ్ధంలో ఉండగా, తమ్ముడి ప్రోత్సాహం, బాబా అనుమతి లభించడంతో బయలుదేరడానికి నిశ్చయించుకున్నాము. బాబాకు నమస్కరించుకుని, “తండ్రీ, స్థలం సమస్యను పరిష్కరించి, మమ్మల్ని ఆ మహమ్మారి నుండి కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చండి” అని వేడుకున్నాను. ప్రతి క్షణం బాబా నామాన్ని జపించుకుంటూ ఇంటినుండి బయలుదేరి తిరుపతికి చేరి, వెంకన్న పాదాల చెంత, అంటే కొండకి ఆనుకునివున్న హోటల్లో బసచేశాము. తిరుపతిలో ఉన్న బంధువుల సహాయంతో స్థలం సర్వే చేయించాము. మా స్థలానికి చుట్టూ ఉన్న స్థలాలను కొనుక్కున్న అతను మా స్థలానికి వెళ్ళే దారిని కూడా తన స్థలంలో కలుపుకుని, “మీ స్థలానికి చేరుకునేందుకు దారిలేదు, మీ స్థలానికి వెళ్ళాలంటే గాలిలో ఎగురుకుంటూ వెళ్ళాలి” అని ఎంతకీ బేరం కుదరనివ్వడం లేదు. పైగా, అతనే అతి తక్కువ ధరకి, అంటే మార్కెట్ ధరలో 30 శాతం ధర మాత్రమే వస్తుందని చెప్పి, ‘ఈ రేటుకి అంగీకరిస్తే ఆ స్థలాన్ని తాను కొనుక్కుంటాన’ని కబురుపంపాడు. మేము, “ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నారు? మీకైతే 70 శాతం రేటుకి ఇస్తాము” అని చెప్పి వచ్చేశాము. ‘ఇక ఈ సమస్యను బాబానే పరిష్కరిస్తారు. అతను చేసిన తప్పును అతను తెలుసుకునేలా చేసి, మా స్థలానికి దారి ఇచ్చేలా చేస్తార’ని నమ్మకంతో ఉన్నాను. బాబా మమ్మల్ని వెంకన్న పాదాల చెంత సురక్షితంగా ఉంచి, అక్కడనుండి క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చారు. “మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంటికి తీసుకువచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ”. బాబా దయవుంటే మనం వారి పాదాల చెంత క్షేమంగా ఉంటాము.
విజయవాడ వచ్చాక అమ్మకి వ్యాక్సిన్ వేయించాలనుకున్నాము. కానీ అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో భయం వేసింది. వ్యాక్సిన్ చాలా తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వ్యాక్సినేషన్ సెంటర్లో విపరీతమైన రద్దీ ఉండేది. ఆ రద్దీలో వెళ్ళి 3, 4 గంటలు ఉండి వచ్చిన వాళ్ళలో చాలామందికి కోవిడ్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. పరిస్థితి చూస్తే అస్సలు బయటికి వెళ్ళకూడదు. కానీ అమ్మకి వ్యాక్సిన్ వేయించాలి. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అమ్మకి, నాన్నకి ఎటువంటి సమస్యా రాకుండా క్షేమంగా వ్యాక్సిన్ వేయించుకుని ఇంటికి చేరుకునేలా మీరే వెంట ఉండి కాపాడండి తండ్రీ, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధిలో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. అమ్మానాన్నలు వ్యాక్సినేషన్ సెంటరుకి వెళ్ళేసరికి అక్కడ దాదాపు 500 మంది వరకు ఉన్నారట. తరువాత ‘కేవలం 45 ఏళ్ళు పైబడినవాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నాం’ అని చెప్పేటప్పటికి సగంమంది వెళ్ళిపోయారట. తరువాత, ‘కేవలం రెండవ డోస్ వేయించుకునేవారికి మాత్రమే’ అని చెప్పేటప్పటికి మిగిలినవారిలో సగంమంది వెళ్ళిపోయారట. చివరికి 100 మంది మిగిలారట. తరువాత బాబా దయవల్ల అక్కడ తెలిసినవాళ్ళ ద్వారా త్వరగా వ్యాక్సిన్ వేయించుకుని ఇంటికి వచ్చారు.
“బాబా! అలనాడు షామాను పాము కరచినప్పుడు, “దిగిపో, పైకి ఎక్కావో చూడు” అంటూ కేవలం మీ దివ్యవాక్కుతో పామువిషాన్ని దింపి షామాను కాపాడారు. అలాగే, ఈనాడు ఈ కరోనా మహమ్మారి నుండి ఈ ప్రపంచాన్ని కాపాడండి సాయీ. మీరు మాత్రమే ఈ పని చేయగలరు తండ్రీ. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించండి సాయీ. పిలిచినంతనే పలికే దైవం మీరు. ఈ సూక్ష్మక్రిమిని నిర్మూలించి మీ బిడ్డలను కాపాడండి సాయితాతా! బాబా, మీకు చాలా ధన్యవాదాలు. మీ కరుణ మాపై, విశ్వంలోని ప్రతి ఒక్కరిపై ఇలాగే ఉంచండి సాయీ!”
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
నేను యు.ఎస్.ఏ.లో నివాసముంటున్న ఒక సాయిభక్తురాలిని. “oms‘AIR’am”(Om Sai Ram) అనే అద్భుతమైన ఈ మూడు పదాలు నా ప్రపంచంలో చాలా ఆనందాన్ని తీసుకుని వచ్చాయి. ఆ పదాలే (AIR) నా శ్వాస. సమాధి అనంతరం బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడానికి, చదువుకోవడానికి అనువుగా చక్కటి ఈ 'ఆధునిక సాయిసచ్చరిత్ర'ను (బ్లాగు) నిర్వహిస్తున్న బృందానికి ధన్యవాదాలు. ఇక నా అనుభవానికి వస్తే... నేను ఒకసారి నా సర్టిఫికేషన్ పరీక్ష కోసం నమోదు చేసుకుని పరీక్షకి సన్నద్ధమయ్యాను. కానీ పరీక్ష జరిగేరోజున నేను మరో ముఖ్యమైన డాక్యుమెంట్ సిద్ధం చేయాల్సి ఉందనీ, దానికి సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరి అనీ నాకు తెలిసింది. అయితే పరీక్షకి ఇక రెండు గంటల సమయం మాత్రమే ఉంది. దాంతో నేను పరీక్షను రీషెడ్యూల్ చేసుకుందామా, లేదంటే నేను ఫెయిల్ అవుతానని ఆలోచిస్తున్నాను. అంతలో మా అబ్బాయి, "ఈ రెండు గంటలలో చదవడానికి ప్రయత్నించమ్మా. నువ్వు ప్రిపేర్ అవగలిగితే గనక పరీక్షకి హాజరవ్వు, లేదంటే రీషెడ్యూల్ చేసుకో" అని చెప్పాడు. దాంతో నేను ప్రిపేరై పరీక్షకి హాజరయ్యాను. కానీ పరీక్ష జరుగుతున్నప్పుడు అప్పుడే చదివిన డాక్యుమెంట్‌కి సంబంధించి అన్ని సమాధానాలను పూర్తిగా గుర్తు తెచ్చుకోలేకపోయాను. ఇలా అయితే ఇతర డాక్యుమెంట్ల సంగతి ఏమిటని, వాటికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులిచ్చాను. తరువాత, "బాబా! నేను నా వంతు వీలైనంత కృషిచేశాను, ఇక మీకే వదిలేస్తున్నాను" అని బాబాతో చెప్పుకుని సబ్మిట్ చేశాను. ఆశ్చర్యంగా, నేను 79% మార్కులతో ఆ పరీక్షలో పాసయ్యాను. నాతోపాటు పరీక్ష వ్రాసిన మిగతా అందరూ 73% మాత్రమే తెచ్చుకున్నారు. ఇదంతా సాయి అనుగ్రహం, సాయి కృప. నా సాయి ఎప్పుడూ అద్భుతాలు చేస్తారు. కానీ మనం శ్రద్ధ, సబూరీలను కలిగి ఉండాలి. అన్ని విషయాలలో వీలైనంత ఉత్తమంగా చేసి, మిగతాది బాబా పాదపద్మాల చెంత విడిచిపెట్టాలి. ఆయనకు తెలుసు, మనకేది మంచిదో, ఏది కాదో. "ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా దయ
అందరికీ నమస్కారం. నా పేరు చందన. ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మా అత్త కోవిడ్ బారినపడ్డారు. ఆవిడ బయటికి ఎక్కడికీ వెళ్ళరు. అందులోనూ ఏమీ తినని కారణంగా చాలా బలహీనంగా ఉంటారు. అలాంటి ఆవిడకి కోవిడ్ అనేసరికి, 'అసలు ఆవిడ తట్టుకోగలరా?' అని మేము చాలా భయపడ్డాము. వెంటనే నేను బాబాకు నమస్కరించి, "బాబా! మీ దయతో అత్తకి కోవిడ్ తగ్గిపోయి, ఆవిడ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. బాబా దయవల్ల ఆవిడ ఏడురోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆవిడ బాగానే ఉన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete🌺🌟🌷🌼🙏🙏🙏🙏🙏🌼🌷🌟🌺 🌺🌺 Om Sri SaiRam 🌺🌺
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼😀
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
821 days
ReplyDeletesairam
Om sai ram baba amma ki sampurna arogyani prasadinchu thandri pleaseeee
ReplyDeleteBaba santosh ki heart problem vundakudadu adhi just gas pain matrame ayyi vundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDelete