రేగే ఇంకా ఇలా చెప్పాడు: “1911లో నేను యోగసా ధన గురించి ఆలోచించి, ఆ విషయంలో సహాయం చేయమని నా గురువైన సాయిబాబాను ప్రార్థించాను. వేరే ఏ గురువూ నాకు ఉండాలని నేను అనుకోలేదు. మట్టితో చేయబడిన ద్రోణాచార్యుని ప్రతిమను గురువుగా భావించి అస్త్రశస్త్ర విద్యలనభ్యసించిన ఏకలవ్యుని వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని నేను నా గురువైన సాయిబాబా చిత్రపటం ముందు కూర్చుని ఆసన, ప్రాణాయామాలను ప్రారంభించాను. బాబా అనుగ్రహం వలన నేను సంవత్సరకాలంలో నా శ్వాసను మరియు ఐదు నుండి ఆరు హృదయస్పందనలను నియంత్రించగలిగాను. 1912లో ఒకసారి నేను యోగసాధన గురించి, శరీర విధుల నియంత్రణ గురించి మాట్లాడుతున్నప్పుడు నా తల్లి 'ఆయీ' రాజయోగం ద్వారా తన ఋతుక్రమాన్ని అదుపు చేసుకోగలిగానని చెప్పింది.
ఆయీ అయిదు అడుగుల ఎత్తుతో సాధారణ స్త్రీలా ఉండేది. కానీ ఎంతో దృఢసంకల్పాన్ని, గొప్ప బలాన్ని కలిగి ఉండేది. ఆమె పెద్ద పెద్ద కుండలతో ఫర్లాంగు దూరాన ఉన్న బావి నుండి నీళ్ళు తీసుకుని వచ్చేది. మామూలుగా ఆ పని చేయడానికి బలశాలి అయిన వ్యక్తికి కూడా మరొకరి సహాయం అవసరమయ్యేది. కానీ ఆమె తన స్వహస్తాలతో ఎవరి సహాయం లేకుండా ఆ పని చేసేది. ఒకసారి ఆయీ నా ఛాతీపై ఒక దెబ్బ వేసి, "నువ్వు సంసారివి. నీ హృదయం బోళాగా ఉందా?" అని ప్రశ్నించి, "నేను నీకన్నా బలశాలిని" అని నొక్కి మరీ చెప్పింది. అందుకు, "నేను చిన్నపిల్లవాడిన"ని బదులిచ్చాను. ఆ విషయమై బలనిరూపణ చేసుకుందామని ఆమె అన్నది. నేను వద్దని చెప్పినప్పటికీ ఆమె పట్టుబట్టింది. మధ్యాహ్నవేళ రహతాకు వెళ్లే మార్గం ఎడారిలా ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లి ఒకరిని మరొకరు తమ వీపుపై ఎక్కించుకుని పరుగుతీయాలని ఆమె చెప్పింది. నేను ముందుగా ఆయీని నా వీపుపై ఎక్కించుకుని పరుగుతీశాను. రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళాక ఆమె, "నేను సంతృప్తి చెందాను. ఇక నువ్వు ఆగిపో" అని చెప్పింది. తరువాత ఆమె నన్ను తన వీపుపై ఎక్కించుకుని రెండు ఫర్లాంగుల కంటే ఎక్కువ దూరం పరుగుతీసి, "నేను నీకన్నా బలంగా ఉన్నాను కదూ?" అని అడిగింది. అందుకు నేను "నిస్సందేహంగా" అని బదులిచ్చాను. అప్పుడు ఆమె తన వీపు మీద నుండి నన్ను దిగమని చెప్పింది. కానీ నేను, "నా తల్లి వీపుపై నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఈ సంతోషాన్ని వదులుకోను" అని చెప్పాను. అప్పుడు ఆమె, "అయితే నిన్ను క్రిందపడేస్తాన"ని బెదిరించింది. అందుకు నేను, "ప్రేమమయి అయిన తల్లి అలా చేస్తే ప్రపంచం విడ్డూరంగా చూస్తుంద"ని బదులిచ్చాను. చివరికి ఆమె, "ఆధ్యాత్మిక మార్గంలో నిన్ను నా వెనుకే తీసుకెళ్తాను" అని నాకు వాగ్దానం చేసింది. ఇదంతా సాయిబాబా ముందుగానే నిర్ణయించినట్లు నాకు తోచింది. తరువాత మేము తిరిగి ఆయీ నివాసానికి చేరుకున్నాక, బాబా నన్ను పిలిపించి, "మీరు ఏమి చేస్తున్నార"ని అడిగారు. నేను మా పందెం గురించి, ఆయీ వాగ్దానం గురించి బాబాతో చెప్పాను. అప్పుడు బాబా, "ఆమె నిన్ను తన వెనుకే తీసుకెళ్తుంది. అలాగే నేను కూడా నిన్ను నా వెనుకే తీసుకెళ్తాను" అని చెప్పారు. తరువాత బాబా, "యోగాభ్యాసం మానేయమ"ని నన్ను ఆదేశించి, "భక్తితో ఉండు, ఇంకేమీ అవసరం లేదు" అని చెప్తూ, తమ శిరస్సును, హృదయాన్ని, చేతులను చూపుతూ, "బుద్ధిని, మనసును, చేతలను ఒకటి చేయి!" అని చెప్పారు.
1914, డిసెంబరులో శ్రీఅవస్తే నాతో శిరిడీ వచ్చాడు. అవస్తే తన చిన్నవయస్సులోనే ఒక మహాత్మురాలి వద్ద గురుమంత్రాన్ని స్వీకరించాడు. అయితే, ఆమె సజీవంగా ఉందో, లేదో అవస్తేకు తెలియదు. అందువల్ల తన స్నేహితుడైన దీక్షిత్ చెప్పినట్లు బాబా దర్శనానికి వెళ్లడాన్ని గురుద్రోహంగా భావించాడతను. అవస్తే ఇండోర్ జిల్లా న్యాయమూర్తిగా ఉండగా నేను అతని క్రింద సివిల్ న్యాయమూర్తిగా ఉన్నాను. నాకు బాబాతో ఉన్న అనుబంధం గురించి తెలిసి తన మనస్సులోని సందేహాన్ని అవస్తే నాతో చెప్పాడు. అప్పుడు నేను అతనితో, "బాబా మహత్తరమైన సద్గురువు. వారు సాక్షాత్తూ భగవత్ స్వరూపులే" అని చెప్పాను. దాంతో, నేను బాధ్యత తీసుకున్నట్లైతే నాతోపాటు శిరిడీ రావడానికి ఆమోదం తెలిపాడు అవస్తే. తరువాత మేము శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాము. బాబా అవస్తేను ఉద్దేశిస్తూ నాతో, "ఎవరీ పిచ్చివాడు(పిస్సట్)?" అని అడిగారు. అది విని అవస్తే ఉద్రిక్తుడయ్యాడు. అయితే బాబా ఆంతర్యమేమిటో ఆ తరువాత భక్తులకు అర్థమైంది. మరుసటిరోజు రాధాకృష్ణమాయి నాలుగు మల్లెపువ్వులు కట్టి, వాటిని నా చేతికిచ్చి, "వీటిని బాబా వద్దకు తీసుకొని వెళ్లి, విడదీయమని చెప్పు" అని చెప్పింది. నేను వాటిని బాబాకు ఇచ్చి ఆయీ చెప్పిన మాటను చెప్పాను. బాబా వాటి వాసన చూసి, తిరిగి నాకిస్తూ, "ఆ పని ఆమే చేయాలి" అని అన్నారు. తరువాత నేను, అవస్తే కలిసి ఆయీ ఇంటికి వెళ్ళాము. మధ్యాహ్న సమయంలో అవస్తేకి ఒక ఆలోచన వచ్చింది. అందుకు తగ్గట్టే అతను మాకెవరికీ తెలియకుండా బాబాకు సమర్పించబోయే నైవేద్యం పళ్ళెం నుండి ఒక అన్నం ముద్దను చేతిలోకి తీసుకొని, ‘దీన్ని గనుక పిండంగా బాబా స్వీకరిస్తే తన గురువు ఇక సజీవంగా లేరనీ, బాబాను గురువుగా ఆశ్రయించడం గురుద్రోహం కాదనీ’ అనుకుని, ఆ నైవేద్యం పళ్లేన్ని, దానిక్రిందుగా చేతిలో అన్నం ముద్దను పట్టుకొని మసీదుకు వెళ్ళాడు. ఆ సమయంలో నేను కూడా అతనితో ఉన్నాను. బాబా అవస్తేతో, "దాన్ని నాకివ్వు" అంటూ ఆ పిండాన్ని తీసుకొని, వాసన చూసి, "ఇది చేరాల్సిన చోటుకి చేరింది" అని అన్నారు. తరువాత మేమిద్దరం ఆయీ ఇంటికి వెళ్ళాము. అవస్తే ద్వారం వద్ద నుండే పరుగున వెళ్లి ఆయీ పాదాలపై పడి, అప్రయత్నంగా అరగంటసేపు పాడుతూ బాహ్యస్మృతి లేని స్థితిలో ఉండిపోయాడు. ఆయీ కూడా సమాధి స్థితిలో ఉంది. ఆ తరువాత అవస్తే నాతో, "రాధాకృష్ణమాయి స్థానంలో నేను నా మొదటి గురువును దర్శించాను" అని చెప్పాడు”.
మరో సాయిభక్తురాలు భికూబాయి ఇలా చెప్పింది: "నా పుట్టినిల్లు అహ్మద్‌నగర్‌లో ఉండేది. అక్కడే బాబాసాహెబ్ గణేష్ అనే ప్లీడరుండేవాడు. అతని మనుమరాలే నా స్నేహితురాలైన రాధాకృష్ణమాయి. ఆమె వద్ద సాయిబాబా ఫోటో ఉండేది. ఆమె ఎంతో భక్తిప్రపత్తులతో ఆ ఫొటోకు పూజ, ఆరతి చేస్తుండేది. తాను బాబా వద్దకు వెళ్లాలనుకుంటున్నట్లు ఒకసారి ఆమె నాతో చెప్పింది. నేను ఆమె ద్వారానే బాబా గురించి విన్నాను. నాకు చిన్నవయస్సులోనే సంగమనేరుకి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెళ్ళయిన కొంతకాలానికే నా భర్త మరణించాడు. ఒకసారి వంజర్‌గాఁవ్‌కు చెందిన గంగగిర్ మహరాజ్ శిరిడీలోని వాడాకు సమీపంలో ఉన్న చింతచెట్టు క్రింద పెద్ద ఎత్తున నామసప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజూ ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్తబృందమొకటి ఉంది. వాళ్ళు శిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు శిరిడీలో ఉంటూ బాబా సేవ చేసుకుంటున్న నా స్నేహితురాలు రాధాకృష్ణమాయి ఇచ్చిన బాబా ఫోటోను, బర్ఫీ ప్రసాదాన్ని నాకు ఇచ్చారు. ఆమె నన్ను శిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా వాళ్ళు నాతో చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నేను నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి నా పద్నాల్గవ ఏట 1908లో శిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నాను. బాబా నన్ను ఆయీతో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. అలా శిరిడీ చేరిన భికూబాయి తన స్నేహితురాలైన ఆయీ చెప్పినట్లు బాబా సేవ చేసుకుంటూ శిరిడీలోనే ఉంటూ బాబా అనుగ్రహాన్ని ఎంతగానో పొందింది.
సాయిభక్తుడు వామనరావు పటేల్ (స్వామి శరణానంద) తన స్మృతులలో ఇలా చెప్పాడు: “నాకు రాధాకృష్ణమాయితో ఏదో పూర్వజన్మ అనుబంధం ఉండి ఉండొచ్చు. నేను ఆమెను 1913వ సంవత్సరంలో మొదటిసారి కలిశాను. మొదటినుంచీ కూడా ఆయీ నన్నెంతో ప్రేమగా చూసుకుంటూ గారాబం చేసేది. మా పరిచయమై అప్పటికి కేవలం మూడు, నాలుగు రోజులే అయివుంటుంది. అవి చాతుర్మాస్యం రోజులు. ఆమె నాకు వెచ్చని స్వెట్టర్ తొడిగి, తలపాగా పెట్టి నావైపు చూస్తూ, “వామన్యా, ఇప్పుడు నువ్వు ‘వార్కరీ’ అయినట్లు కనిపిస్తున్నావు” అంది. మరోసారి ఆమె నాతో, “నీవు వెళ్ళిపోయిన తరువాత నాకు బాగా అనిపించలేదు, చాలాసార్లు ఏడుపొచ్చింది” అన్నది. ఆ తరువాత, “నిన్ను అంత చక్కగా పంపించాను కదా! మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? నీకు కుర్చీలో కూర్చోవటం బహుశా ఇష్టం లేదేమో! డబ్బు సంపాదించి నా ఈ సంసారానికి ఎప్పుడు సాయం చేస్తావు?” అని పదేపదే అన్నదామె. ఈ రకంగా ఆమె మాటలు రెండు అర్థాలు వచ్చేట్లుగా ఉండేవి. కొన్నిసార్లు వైరాగ్యం పెట్టుకోమని అర్థింపూ, మరికొన్నిసార్లు డబ్బు సంపాదించి ఆమె సంసారానికి సాయం చేయమనీనూ”. ఆ విధంగా సొంత బిడ్డపై చూపినట్లే ఆయీ శరణానందపై ప్రేమను చూపిస్తుండేది. శరణానంద కూడా ఆయీని తన తల్లిలాగానే గౌరవించి, పగలూ రాత్రీ తేడా లేక నిరంతరమూ బాబా సేవలో నిమగ్నమైవుండే ఆ మాతృమూర్తి శరీరం ఎంతగా అలసి ఉంటుందోనని ఆమె మేనువాల్చినప్పుడు ఆమె కాళ్ళు, చేతులు, ఒళ్ళు పట్టేవాడు. అతను ఆ పని చేస్తున్నప్పుడు రాధాకృష్ణమాయి తన శరీరాన్ని బిరుసుగా మార్చేది. దాంతో అతను మర్దన చేయలేక అలసిపోయేవాడు. అయినప్పటికీ ఆయీ అతనిని తన వీపుపైకి ఎక్కి పాదాలతో మర్దన చేయమని చెప్పి, తాను నిర్లక్ష్యంగా ఉండిపోయేది. అప్పుడతను తన హృదయంలో, "ఆయీ, నేను బాగా అలసిపోయాను. దయచేసి నాపై కాస్త దయచూపండి!" అని ప్రార్థించేవాడు. ఆశ్చర్యకరంగా, ఆయీ అతని అభ్యర్థన విన్నట్లుగా, తక్షణమే తన శరీరాన్ని వదులుగా చేసేది.
1916వ సంవత్సరం వర్షాకాలంలో నిరంతరం నీటిలో తడవటం వలన వామనరావు పాదాలు పగిలిపోయి బాగా నొప్పిపెట్టసాగాయి. అప్పుడు రాధాకృష్ణమాయి తన కాలివేలితో అతని పాదాలను తాకింది. అంతటితో అతని బాధ మాయమైంది.
ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు తళుక్కుమంటున్నాయి. అప్పుడే చావడిలో శేజారతి ముగిసింది. కాకాసాహెబ్ దీక్షిత్ 8 సంవత్సరాల కొడుకు, బాలాసాహెబ్ భాటే 10 సంవత్సరాల కొడుకు కలిసి ఈవిధంగా పాడారు:
సున్ సున్ బె హయ్యా, బె హయ్యా - ఛడీదార్ మై పాయా
సాయినాథ్ కీ ఛడీ - ఏ తీన్ లోక్ మే బడీ
త్రిగుణ్ శిఖర్ పే జానా - వహ్ సాయినామ్ జప్‌నా
అల్‌బలా సర్కార్ - ఆరామ్ కరో సర్కార్
చివరికి పెద్దలందరూ పిల్లలతో కలిసి 'శ్రీ సచ్చిదానంద సద్గురు మహరాజ్ మహరాజ్ కీ జై' అని జయకారాలు చేశారు. అందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, వారి వద్ద సెలవు తీసుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. శిరిడీ గ్రామమంతా నిశ్శబ్దం ఆవరించింది. దూరంనుండి కుక్కలు, నక్కల అరుపులు వినపడుతున్నాయి. పొద్దుపోయేకొద్దీ భగద్దర్శనం కోసం పరితాపంతో రాధాకృష్ణమాయి గుండె కొట్టుకోసాగింది. ఆమె ఒక చేత తొమ్మిది అంగుళాల రాధాకృష్ణుల విగ్రహాన్ని పట్టుకొని ఉంది, మరో చేతివేళ్ళు సితార్ వాయిద్యంపై కదులుతున్నాయి.
'ప్యారే దర్శన్ దీజో ఆయే, తుమ్ బిన్ రహయో న జాయ్!
జల్ బిన్ కమల్, చంద్ర బిన్ రజనీ, ఐసే తుమ్ దేఖ్యాఁ బిన్ సజ్‌నీ!
ఆకుల్ వ్యాకుల్ ఫిరూ రైన్ దిన్, విరహ్ కలేజా ఖాయ్!
దివస్ న భూక్, నీంద్ నహి రైనా, ముఖ్ కే కథన్ న ఆవై బైనా!
క్యోఁ తర్‌సావో అంతర్యామీ, ఆప్ మిలో కృపాకర్ స్వామీ,
మీరా దాసీ జనమ్ జనమ్ కీ, పూరీ తుమ్హారే పాయ్....'
అనే సువర్ణాక్షరాలు గొంతునుండి జాలువారుతుండగా హృదయంలో పొంగిపొరలుతున్న భక్తిపారవశ్యంతో ఆయీ ధ్యానస్థురాలైంది. భజన గీతం పూర్తయినా ఆయీ వేళ్లు ఆ వాయిద్యానికి అలాగే అతుక్కుపోయాయి. ఆమె కళ్ళనుండి ధారాపాతంగా ప్రవహిస్తున్న కన్నీళ్ళు చెంపల మీదుగా క్రిందికి జారి ఒంటిపై ఉన్న చీర తడిసిపోసాగింది. అంతటి ఆర్తితో పిలిచినప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వకుండా ఉండలేడు. ఒక్కసారిగా ఆమె కుటీరం ఊగిసలాడసాగింది. ఆమె చేతిలో ఉన్న రాధాకృష్ణుల విగ్రహంలో జీవం సంతరించుకుంది. కుటీరమంతా దివ్యప్రకాశంతో నిండిపోయింది. కుటీరం నుండి బయటికి వెదజల్లబడుతున్న ప్రకాశం ఆ అర్థరాత్రి అంధకారాన్ని తరిమేసి ప్రకాశవంతంగా మార్చింది. క్రమంగా ఆ విగ్రహం ఎరుపువర్ణంలోకి మారి, కొద్ది క్షణాల్లోనే నివురుగప్పిన నిప్పులా తయారయింది. విగ్రహం నుంచి మంటలు చెలరేగి కుటీరం వేడెక్కిపోసాగింది. ఆ వేడికి తాళలేక కుటీరంలో ఉన్న వామనరావు బయటికి పరిగెత్తాడు! అయితే, ఆశ్చర్యంగా కొన్ని క్షణాల్లో అంతా సాధారణ స్థితికి వచ్చింది. అప్పుడతను లోపలికి వెళ్లి చూసేసరికి రాధాకృష్ణమాయి నేలమీద స్పృహతప్పి పడివుంది.
తరువాత ఒకరోజు రాధాకృష్ణమాయి, "వామన్యా, నీ తలను చూడు! చాలా చుండ్రు పట్టింది. ఈరోజు స్నానానికి ఎక్కడికీ వెళ్ళకు. వేడినీళ్లలో కుంకుడుకాయలు నానబెట్టి రసం తీసి, నేనే నీకు తలంటి స్నానం చేయిస్తాను. నీ జుట్టుకు నూనె పట్టించి దువ్వుతాను, సరేనా?" అని చెప్పి, వెంటనే పొయ్యి మీద నీళ్ళు పెట్టి, కుంకుడుకాయలను వేడినీళ్లలో వేసి అతనిని సిద్ధంగా ఉండమని చెప్పింది. తరువాత ఆయీ అతని తలరుద్ది, ముఖాన్ని కడిగి కొన్ని లోటాల నీళ్ళు అతని శరీరంపై పోసి, "ఇక నువ్వు స్నానం చేయి. నేను త్వరగా నీ కఫ్నీ ఉతికిపెడతాను" అంది. వామనరావు కంగారుపడి, "వద్దు వద్దు మాయీ, దయచేసి నా కఫ్నీని ఉతకొద్దు. నాకు వేరే కఫ్నీ లేదు. పైగా ఇది మందమైన బట్టతో తయారుచేయబడింది. అందువల్ల, ఇప్పుడు ఉతికితే అది ఆరేసరికి సాయంత్రం అవుతుంది. కాబట్టి దయచేసి కఫ్నీని ఉతకొద్దు" అని అన్నాడు. కానీ ఆయీ అతని మాటను పట్టించుకోకుండా, “దాన్ని గురించి నువ్వేం బాధపడకు” అని కఫ్నీని తీసుకొని గబగబా వెళ్ళిపోయింది. వామనరావు స్నానం పూర్తయి ఒళ్ళు తుడుచుకుంటుండగా ఆయీ కఫ్నీని తీసుకొచ్చి, “వామన్! ఇదుగో నీ కఫ్నీ, వేసుకో” అన్నది. ‘కేవలం 10, 15 నిమిషాల్లో ఆమె కఫ్నీని ఉతికి, ఆరబెట్టి ఎలా తీసుకురాగలిగిందా?’ అని అతను ఆశ్చర్యపోయాడు. మందమైన ఆ కఫ్నీని పట్టుకొని ఉన్న ఆయీ చేతులను చూస్తూనే, అంతకుముందు ఆమె చేతుల్లో నివురుగప్పిన నిప్పులున్న సన్నివేశం గుర్తుకొచ్చి గౌరవభావంతో వంగి ఆమెకు నమస్కారం చేశాడు. ‘ఆ సన్నివేశంతో ఆయీ ఎంతటి సిద్ధురాలో నాకు అర్థమైంద’ని వామనరావు తన స్మృతులలో అంటాడు.
తరువాయి భాగం వచ్చేవారం ...
source: రేగే లెటర్స్,
శిరిడీఁచే సాయిబాబా బై గావంకర్,
బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి,
డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అఫ్ సాయిబాబా బై బి.వి నరసింహస్వామి.
Jai sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊😀🌹🌼
ReplyDeleteOm Sai Ram, entha baga rasaro kallaku kanpistundi ippudu jaruguthunnadi chustunna anubhoothi ki lonayyanu, thank you🙏🏻🙏🏻
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete