(విమలాశర్మగారి 'దేవుడున్నాడు లేడంటావేమి?' అనే పుస్తకంలో ప్రచురితమైన శరణానంద స్వీయ అనుభవాలలో రాధాకృష్ణమాయితో తనకున్న అనుబంధం గురించి అతను తెలియజేసాడు. ఇప్పుడు చదవబోయే ఆ వివరాలు రాధాకృష్ణమాయి అనుభవాలుగా కాక శరణానంద అనుభవాలుగా అనిపిస్తాయి. కానీ వాటి ద్వారా మనం ఆమె స్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వాటిని ఈ భాగంలో పొందుపరుస్తున్నాము.)
శరణానంద చెప్పిన మరికొన్ని అనుభవాలు:
ఒకసారి నేను డిసెంబరు నెలలో శిరిడీ వెళ్లి రాధాకృష్ణమాయి ఇంట్లో దిగాను. రెండు, మూడు రోజులు శిరిడీలోనే ఉన్నాను. ఆయీ ప్రతిరోజూ సరిగ్గా ఆరుగంటలకు, "వామన్యా! లే, టీ తయారైంది, ఆరుగంటలైంది” అంటూ నా చెల్లెలిలాగానే పిలుస్తూ నన్ను నిద్ర లేపేది. నా చెల్లెలు నన్ను తెల్లవారుఝామునే కేకలు వేసి ఎలా లేపేదో అచ్చం అలానే మాయీ నన్ను లేపడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. నేను చెప్పకుండానే ఆమె మా ఇంటి పద్ధతులనూ, నా అలవాట్లనూ తెలుసుకొన్నది. ముంబాయికి, శిరిడీకి ఎంత దూరం! కానీ మా ఇంటి వ్యవహారాలను ఏ మాత్రం తేడా లేకుండా తెలుసుకుని ఆ ప్రకారంగా నాకు ఆతిథ్యమివ్వటమనేది సామాన్యులు చేసే పని కాదు. మాయీతో ఇలాంటి అనుభవాలు నాకెన్నో కలిగాయి. అందువలన సహజంగానే నేను ఆమె చరణాలకు శిరసు వంచి నమస్కరించేవాణ్ణి.
ఒకసారి మాటల మధ్యలో రాధాకృష్ణమాయి నాతో, “నీవు బాబాకి ప్రతిరూపానివి” అన్నది. ఈ మాటతో నాకు సంతోషం కలుగలేదు. నా మనసులో ఇలా అనిపించింది, “ప్రతిరూపం అవటంలో ఏం పురుషార్థం ఉంది? నేను అసలైనవాడినే కావాలి” అని. అంతర్‌జ్ఞాని అయిన రాధాకృష్ణమాయి వెంటనే, “మనందరం ప్రతిరూపాలమే(నకళ్ళు)! అసలయినవారు ఆయనే(బాబా)!” అన్నది.
ఒకప్పుడు శ్రీమనూసుబేదారు విదేశం నుంచి తిరిగి వచ్చాడన్న సమాచారం తెలిసింది. ఈ విషయాన్ని రాధాకృష్ణమాయికి చెప్పి, అతనికి 400 రూపాయల వేతనంపై ప్రొఫెసర్‌గా ఉద్యోగం దొరికిందన్న విషయం చెప్పాను. అప్పుడామె, “మనం చాలా బీదవాళ్ళమని నీవనుకుంటున్నావు కాబోలు. ఇదుగో, నీకెంత డబ్బు కావాలి? యాభయ్యా? డెబ్భై అయిదా? వందా? నూట యాభయ్యా? చెప్పు ఎంతో?” అన్నది. దీనికన్నా పెద్ద మొత్తం చెప్పటం ఆమెకి చేతకాలేదు. కొద్దిరోజులు నా నెలజీతం 250, 275 రూపాయల వరకూ ఉంది. క్రాఫర్డ్ బేలీలో ఉన్నప్పుడు 11 నెలల వరకూ 350 రూపాయల వేతనం లభించింది. అలాగే 500 బోనస్ కూడా లభించింది. కొద్దిరోజుల వరకూ నేను నిరుద్యోగిగా ఉన్నాను. ఈ పూర్తి సమయం లెక్క చూస్తే నా సరాసరి నెలజీతం 150 రూపాయలు ఉంది. మాయీ పెట్టిన 150 రూపాయల పరిమితి నిజమైంది.
ఒకసారి రాధాకృష్ణమాయి, “వామన్! నాకు నూట ఇరవై అయిదు లేదా రెండు వందల రూపాయలివ్వు. ఆ డబ్బులతో బాబా ఎదురుగా ఉన్న దర్వాజా వద్ద మట్టిదీపాలు పెట్టటానికి దీపమాల కట్టిద్దాం” అన్నది. అయితే అప్పుడు ఆయీకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బు లేదు. అందువల్ల నా అసమర్థతను వ్యక్తం చేశాను. ఆయీ మరణించిన తరువాత నేను శిరిడీ వెళ్ళినప్పుడు బాబాను, “బాబా! ఎదురుగా దీపమాల కడదామా?” అని అడిగితే, అప్పుడు బాబా, “ఇప్పుడేమీ అవసరంలేద”ని అన్నారు. బాబా అలా అనటంతో, రాధాకృష్ణమాయి జీవించి ఉన్నప్పుడు ఆమె అడిగిన వెంటనే ఈ పని అయివుంటే బాగుండేదని నాకు పశ్చాత్తాపం కలిగింది. రాధాకృష్ణమాయి దీపమాల కట్టాలని బాబా ఆదేశంతోనే నాకు చెప్పివుంటుందని నాకనిపించింది. అప్పుడు ఆ ఆదేశాన్ని అమలుచేయటంలో నా అసమర్థతను వ్యక్తం చేశాను. ఆ తరువాత బాబా దీపమాల కట్టడానికి అనుమతించలేదు. దీంతో రాధాకృష్ణమాయి మాటలు బాబా మాటలే అనిపించింది. దానికి సరిగ్గా ఒక ఏడాది తరువాత బాబా దేహత్యాగం చేయబోతున్నారు. అందువల్లే ఆయన దానికి ఇప్పుడేమీ అవసరం లేదని అన్నారని నాకు అనిపించింది.
ఒకసారి నేను లోకమాన్య తిలక్ రచించిన 'గీతా రహస్యం' అనే గ్రంథం తెప్పించి చదవటం ప్రారంభించాను. దాన్ని పఠించే సమయంలో ఎన్నో నిగూఢమైన ప్రశ్నలు మనసులోకి రావటం మొదలైంది. అలాంటి ప్రశ్నలు ఏవైనా మనసులోకి వచ్చాక రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్ళి మామూలు మాటలు మాట్లాడుతుండగానే, పరిష్కారం కాని ఆ నా ప్రశ్నలకు సమాధానం దొరికేది. చాలాసార్లు ఆయీ వద్దకు వెళ్ళి నిలబడగానే ఆమె వద్ద సమాధానాలు దొరికేవి. ఆ ప్రశ్నలకు జవాబులు రాధాకృష్ణమాయి మాటల్లో వాటంతటవే వచ్చేవి. దానికి ముందు విద్యుత్తులా మెరిసే తేజస్సు గదిలోకి వచ్చేది. ఈ రకంగా దివ్యరూపంలో ప్రకటమై బాబా నా ప్రశ్నలకు సమాధానమిస్తుండేవారని నాకు అనిపిస్తుంది.
నేను పదకొండు నెలలు శిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో నేనొక అణాని దొంగిలించానని రాధాకృష్ణమాయి నాపై ఆరోపణ చేసింది. “శ్రమచేసి తాను ప్రాప్తింపచేసుకున్న జ్ఞానాన్ని నేను దొంగిలించాను” అని రాధాకృష్ణమాయి నాకు చెప్పాలనుకున్నదని నేను అర్థం చేసుకున్నాను. ఆమె ద్వారా బాబా నాకెన్నో నేర్పించారు. ఆ మాట నిస్సందేహం. అలా చూస్తే ఆ ఆరోపణ ఒకరకంగా నిజం కూడా. ఒక సాయంకాలం బాబా నన్ను ఉద్దేశించి మాధవరావుతో, “ఇతను నా కాలిని ఖండించి తీసుకెళ్ళాడు” అన్నారు. ఈ ప్రకారంగానే రాధాకృష్ణమాయి కూడా ఆరోపించింది. నేను రాధాకృష్ణమాయి ఆరోపణను అంగీకరించాను. అలాంటప్పుడు బాబా చెప్పిన మాట అసత్యమెలా అవుతుంది? వీరిద్దరి మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది.
ఒకసారి ఆయీ మాటల మధ్యలో ధ్యానం ఎలా చేసుకోవాలో చెబుతూ, "బయటి జగత్తుతో ప్రారంభించి, బాహ్య జగత్తంతటిలోనూ ఈశ్వరుడు వ్యాపకుడై ఉన్న భావాన్ని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేస్తూ, ఆ ఈశ్వరుడే తమ అంతఃకరణలోనూ వ్యాపించాడన్న భావాన్ని నిలుపుకోవాలి. అలాకాకుంటే, భగవద్గీత 18వ అధ్యాయంలోని “ఈశ్వరః సర్వభూతానాం హృద్యేశేర్జున తిష్ఠతి” అనే శ్లోకంలో వర్ణించబడినట్లు మనసులో ఈశ్వరుని గుర్తుచేసుకుంటూ చేసుకుంటూ సర్వత్రా ఆయన్ని వ్యాపింపచేయగల భావన పెట్టుకొని అందులో లీనమైపోవాలి. ఏ విధానంతో అయినాసరే ఈశ్వరునితో లీనమైపోయి జగత్తునూ, మనలనూ కూడా మరచిపోవాలి" అని వివరించింది. తరువాత ఒకరోజు బాబా నాకు పచ్చి జామకాయనిచ్చి, “తీసుకో, ఇది చాలా తియ్యగా ఉంది” అన్నారు. ఈ మాటతో - ఈ విధంగా ధ్యానం గురించి బాబా చెప్పిన పద్ధతి యొక్క వర్ణనను శ్రీపరమానందభారతి రచించిన 'లైట్ ఆన్ లైఫ్'లో చదవవచ్చు. దానితోటి మాయీ మాటలను కూడా కలుపుకుని నేను ధ్యానం చేయటానికి నిశ్చయించుకున్నాను. ఈమధ్యకాలంలో ఒకరోజు స్వప్నంలో బాబా నాతో, “టీ మానేసెయ్, కాఫీ కూడా త్రాగొద్దు” అన్నారు. అందువల్ల నేను టీ త్రాగటం మానేశాను.
1914లో గురుపూర్ణిమ తరువాత నేను సి.జె.ఎన్.ఎల్. హైస్కూల్లో సహాయక ఉపాధ్యాయుడుగా 65 రూపాయల నెలజీతంపై పనిచేయటం మొదలుపెట్టాను. రాధాకృష్ణమాయి ఆదేశంపై నేను అన్నం తినటం మానేశాను. కానీ అన్నం అలవాటు అయినందువల్ల మానటం చాలా కష్టమనిపించేది. అప్పుడొకసారి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, “రొట్టెతో పాటు ఉల్లిపచ్చడి తినాలి. ఎర్ర ఉల్లిపాయ దొరికితే మరీ మంచిది” అన్నారు. ఉల్లి తినటం వల్ల కొద్దిరోజులయ్యాక నా గొంతు పాడయినట్లు అనిపించింది. ఉల్లిపాయను జీర్ణించుకునే శక్తి నా సూక్ష్మశరీరానికి లేదని తెలిసిన తరువాత ఉల్లి తినటం మానేశాను. మా చెల్లెలు నౌసారీ వచ్చీరాగానే మళ్ళీ అన్నం తినటం మొదలుపెట్టాను. కానీ అన్నంతో అపథ్యమైంది. తరువాత రాధాకృష్ణమాయి అన్నం తినటం ప్రారంభించమని నాకు సలహా ఇచ్చింది.
ఒకరోజు మధ్యాహ్నం, ఇప్పుడు మాధ్యమిక పాఠశాల ఉన్నచోటులో, అంటే శ్యామసుందర్ అనే బాబా గుర్రం కట్టబడి ఉన్నచోటులో ఆ ఇంటిగోడని ఆనుకొని భక్తులతో పాటు నేను నిలుచుని ఉన్నాను. ఇంతలో రాధాకృష్ణమాయి గదిలోంచి ఏదో శ్వాస వచ్చినట్లనిపించింది. ప్రాణవాయువును బాబా మీదకు వదిలినట్లూ, అలాగే ఆ ప్రాణవాయువు విస్తరించి బాబా నిత్యరూపం ఉన్న స్థానంలో రుద్రాక్షధారి రూపంలో దర్శనమైంది. ఇదిలా రాస్తున్నప్పుడు, బహుశా ఈ దృశ్యం ద్వారా “నేను శుద్ధ బుద్ధ నిర్గుణ నిరంజన నిరాకారుడిన”ని బాబా నాకు చెప్పాలనుకుంటున్నారనిపిస్తోంది. అయితే మాయ యొక్క శ్వాసతో (స్పందనతో) ఈ శివరూపం ప్రాప్తించింది. నాకు శివరూపంలో దర్శనమైన రూపమే తలకు బట్ట కట్టుకుని గడ్డం, మీసాలతో ఉన్న కఫ్నీధారి రూపమని తెలుసుకోండి! పూర్ణబ్రహ్మత్వం మాయవల్లనే సాకారమవుతుంది.
ఒకరోజు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల సమయంలో నేను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాను. అప్పుడామె తన ముఖం ముందర ఒక పచ్చిమిరపకాయను పట్టుకుని కూర్చున్నది. నేను కూర్చోవటంతోనే ఆమె, “ఇది తీసుకొని తిను'' అన్నది. నేను ఆ మిరపకాయను తీసుకొని నోట్లో పెట్టుకుని నమిలి తినేశాను. ఆశ్చర్యంగా, అది నాకసలు కారమనిపించలేదు. తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒక యోగసిద్ధుడైన గురువుగారు తన శిష్యునికిచ్చిన మంత్రం గురించిన వ్యాఖ్య నా దృష్టిలో పడింది. అందులో, అభిమంత్రించిన మిరపకాయను తినటానికిచ్చే ప్రయోగం ఉంది. అప్పుడు మాయీ ఆ మిరపకాయ ద్వారా నాపై ఏదో మంత్రం ప్రయోగం చేసిందని అర్థమైంది. కానీ ఆ ప్రయోగం యొక్క పరిణామమేమిటో నేను తెలుసుకోలేకపోయాను. అయితే మిరపకాయ తిన్నప్పటినుంచి నేను అనేకమైన అగోచర వస్తువులు చూడగలిగేవాణ్ణి. అలాగే, ఎన్నోసార్లు ఎదురుగా ఉన్న వస్తువు కూడా నాకు కనపడేది కాదు. ఒకసారి దండెం మీదున్న టవల్ తీసుకురమ్మని మాయీ నన్ను ఆజ్ఞాపించింది. దండెం దగ్గరకు వెళ్ళాక ఆ టవల్ నాకు కనిపించలేదు. అప్పుడు రాధాకృష్ణమాయి వచ్చి, “ఇదుగో, చూడు టవల్” అని నాకు చూపించింది. గురువు అనుజ్ఞ లేకుండా గురుసేవ అసంభవమన్న దానికి ఇది ప్రత్యక్ష అనుభవం.
రాధాకృష్ణమాయి రెండుసార్లు (నేను భోజనం వండటం ప్రారంభించినప్పుడు ఒకసారీ, మా పెద్దక్క మోఘీ నా మేనల్లుడితో వచ్చినప్పుడు రెండోసారీ) నాతో, "వామన్, ఈరోజు బాబా నీ కిచిడీ తినవలసి ఉంది" అని చెప్పింది. మోఘీ అక్కయ్య ఇక్కడికొచ్చిన మొదటిరోజునే కిచిడీ చేసి, నైవేద్యం పెట్టటానికి బాబా వద్దకు పంపించి, తరువాత రాధాకృష్ణమాయి వద్దకు తీసుకెళ్ళింది. రాధాకృష్ణమాయి ఎంతో ప్రేమతో ఆ కిచిడీ తినింది. బాబా, రాధాకృష్ణమాయి నా కిచిడీ తినే సమయంలో నా వృత్తి సహజంగానే తథాకారం అయింది. అలాంటి అనుభవమే రెండోసారి కూడా నాకు కలిగింది. దీంతో మహాత్ములకు లేదా ఈశ్వరుడికి సమర్పించబడిన నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారని నాకు స్పష్టమైంది. స్వీకరించకపోతే ఆ సమర్పించబడని ఆహారం చెడుమార్గం వైపు తీసుకెళుతుంది. స్వీకరింపబడిన ఆహారం వృత్తిని తథాకారం చేస్తుంది. కనీసం సాత్విక వృత్తినీ, సాత్విక విచారాన్నీ ఉత్పన్నం చేస్తుంది.
ఆకారంలో పెద్దగా ఉండి, ఏమాత్రం బరువు లేకుండా తేలిగ్గా ఉన్న బిందెతో రాధాకృష్ణమాయి సాయంత్రం పూట నీళ్ళు తెచ్చుకునేది. ఈ పనికోసం ఒకటి రెండ్రోజులు ఆమె నన్ను తనతో తీసుకెళ్ళింది. ఆ గిలకబావిలోంచి నీళ్ళు తోడి ఆమె ఒక బిందె, ఒక బొక్కెన నింపుకునేది. నేను ఆ బిందె, బొక్కెన మోసేవాడిని. నా కుటుంబసభ్యులెవరైనా శిరిడీ వస్తే రాధాకృష్ణమాయి నాతో ఈ సేవ చేయించుకునేది కాదు. అయినా కూడా ఒకసారి ఆమె మాట వినకుండా నేను బిందె నింపి తెచ్చాను. ఆమె వెంటనే ఆ నీళ్ళు పారబోసింది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ రకమైన సేవచేయటం వల్ల బాబా కూడా కోపం వ్యక్తం చేసేవారు.
ఈశ్వర్‌లాల్ రాధాకృష్ణమాయి ఇంటికి కూడా వచ్చి పోతూ ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా అతనికి కలరా సోకింది. చివరి ఒకటి రెండ్రోజులు అతను నా గదిలోనే ఉన్నాడు. నేను, రాధాకృష్ణమాయి మాకు చేతనైన వైద్యం చేశాం. అయినా అతను బ్రతకలేదు. ఆరతి సమయంలో అతనికి దేహావసానం ప్రాప్తించింది. నా గదిలో రాధాకృష్ణమాయి సమక్షంలో అతను మరణించాడు. చివరిక్షణంలో అతనికి దడ వచ్చినప్పుడు రాధాకృష్ణమాయి అతన్ని, "కొంచెం పుణ్యదానమేమైనా చేశావా?” అని అడిగింది. అతను 'లేద'ని బదులిచ్చాడు. చివరి సమయంలో రాధాకృష్ణమాయి ఈ రకంగా ప్రశ్నించటం నాకు సమంజసం అనిపించలేదు. అయితే, పుణ్యం చేయకపోతే ప్రాయశ్చిత్తం చేయించగల శాస్త్రబద్ధమైన పద్ధతేదైనా ఉందేమోనని అనుకున్నాను. అతని మరణానికి కారణం బాబాపట్ల శ్రద్ధ తక్కువ అవటమని రాధాకృష్ణమాయి బహుశా అనుకున్నదేమో అని నేను అనుకున్నాను. కానీ, అలాంటిదేమీ లేదు. "అతను వేరే జగత్తులో నివసించటానికి వెళ్ళిపోయాడు” అని బాబా అన్నారు.
ఒకసారి రాధాకృష్ణమాయి శిరిడీలో ఉన్న నా గదిని తనకిమ్మని అడిగింది. ఆమె నాతో, “నీవు శిరిడీ వచ్చినప్పుడు ఉండటానికి నా ఇల్లు ఎలాగూ ఉంది కదా, వ్యర్థంగా నీవు అద్దె ఎందుకు కడుతున్నావు? బాబా కోసం తీసుకొచ్చే సామాను పెట్టడానికి ప్రస్తుతం స్థలం తక్కువైంది. నీ స్థలం మాకిస్తే మా స్థలం పెరుగుతుంది” అని అన్నది. నేను సరేనన్నాను. ఈ విషయం శ్రీతాత్యాపాటిల్‌తో చెబితే అతను కూడా సరేనన్నాడు. తరువాత ఆ ప్రదేశం రాధాకృష్ణమాయి వాడుకలోకి వచ్చేసింది. దానివల్ల ఆమెకు ఏకాంతంలో గుప్తమంత్రాన్ని సాధన చేసుకోవటానికి సరైన అవకాశం కలిగింది.
ఒకసారి ముంబాయిలో మా ఇంటినుండి మెంతి లడ్డూలు వచ్చాయి. వాటిని కొన్నిరోజులపాటు నియమంగా రోజుకి కొన్ని లడ్డూలే తిన్నాను. కానీ ఒకరోజు నోరు కట్టుకోలేక చాలా ఎక్కువ లడ్డూలు తినేశాను. అలవాటు ప్రకారం ఆ మధ్యాహ్నం బాబా వద్దకెళ్లి అక్కడున్న ఒక వేపచెట్టు వద్ద నిలబడ్డాను. లడ్డూలు మరీ ఎక్కువగా తిన్నందున బాబా నా చెంపమీద లెంపకాయలేస్తారేమోనని భయమేసి అక్కడినుండి ముందుకి కదలకుండా అలాగే నిలబడిపోయాను. అయితే వారేమీ అనకుండా వారి ఆసనం మీదే కూర్చున్నారు. అదేరోజు రాత్రి రాధాకృష్ణమాయి బాబాకు ఉపయోగించే వెండి గంగాళమూ, ఇటుకపొడీ ఇచ్చి, “దీన్ని తీసుకుని తూమువద్ద కూర్చొని బాగా మెరిసేలా తోము” అని చెప్పింది. ఎక్కువగా తినటం వల్ల సాయంత్రం పొట్ట బరువెక్కి బాధగా ఉంది. పైగా గిన్నెలు తోమే అలవాటు నాకు లేదు. అయినా మాయీ ఆదేశానుసారం రాత్రి 11, 12 గంటల వరకూ గంగాళం తోముతూనే ఉన్నాను. రాధాకృష్ణమాయి నిద్రనుండి మేల్కొనే వరకూ నేను పాత్రలు తోముతూనే వున్నాను. అది చూసి, “ఇప్పుడు గిన్నెలు పరిశుభ్రమయ్యాయి, వెళ్ళి పడుకో” అని ఆమె ఆదేశించింది. ఆ రాత్రే ఆమె, "వామన్ గోండ్కర్ చాలా అనారోగ్యంతో ఉన్నాడ"ని చెప్పింది. మరుసటిరోజు తెల్లవారి ఆయన పరమపదించారన్న వార్త అందింది.
1916లో నేను దీపపు వెలుగులో అర్థరాత్రి వరకు సొలిసిటర్ పరీక్షల కోసం చదువుతుండేవాడిని. పరీక్షల ఒత్తిడి వలన నాకు ఆందోళన ఎక్కువై ఆకలి నశించింది. అందువలన నేను బాగా నీరసించిపోసాగాను. అటువంటి సమయంలో ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ తన భార్యతో కలిసి శిరిడీ వెళుతున్నట్లు నాకు తెలిసింది. వారి ద్వారా బాబాకు పండ్లు, పూలమాల, దక్షిణ పంపించాలనుకున్నాను. మా బావగారితో పూలు, పళ్ళు తెప్పించాను. వాటిని కాకాసాహెబ్‌కు ఇవ్వటానికి నేను మా బావగారితో కలిసి బోరీబందరు వెళ్ళాను. మనసంతా ఆధ్యాత్మిక విషయాలతో నిండిపోవటం వల్ల స్టేషనులో ఉన్నప్పుడు నాకు, "కాకాసాహెబ్ ద్వారా వీటిని పంపే బదులు స్వయంగా శిరిడీకి వెళ్ళి బాబాకు అర్పిస్తే ఎంత బాగుంటుంది! బాబాకు అర్పించి వెంటనే తిరిగి రావచ్చు కదా!" అని మననులో అనిపించింది. కాకాసాహెబ్‌తోనూ, ఆయన భార్యతోనూ ఈ మాట చెబితే వాళ్ళు కూడా అందుకు సంతోషంగా సమ్మతించారు. బావగారితో అక్కయ్యకు కబురు పంపించి, నేను పళ్ళు, పూలు తీసుకుని కట్టుబట్టలతో శిరిడీ వెళ్ళాను. నోరంతా అరుచిగా ఉండటం వల్ల ఆ రాత్రి నేనేమీ తినలేదు. అలా వెళ్ళినవాణ్ణి శిరిడీలో ఇరవైఒక్క రోజులపాటు ఉండిపోవటమనేది నా దృష్టిలో అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే, ఈ సమయంలో నాకు అనేకరకాల ఆధ్యాత్మికానుభవాలు కలిగాయి. దాంట్లో మొదటి అనుభవం రాధాకృష్ణమాయితో అనుబంధం. దాన్ని గురించి మొదట చెప్పి, తరువాత బాబా ప్రసాదించిన అప్రతిమ, అమూల్య, అత్యంత గొప్ప అనుభవం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.
శిరిడీ చేరిన తరువాత తొట్లో నీటితో స్నానం చేసి, పూలదండ ఇత్యాది పూజాసామాగ్రి దొరక్కపోవటంవల్ల దక్షిణగా 65 రూపాయలు తీసుకుని మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకుని దక్షిణ అర్పించాను. మధ్యాహ్న ఆరతి తరువాత బాబా నైవేద్యం గురించిన ఏర్పాట్లు జరుగుతుండటాన్ని చూసి నేను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకుని, “ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలనే వచ్చాను. ఇక్కడ ఉండి సొలిసిటర్ పరీక్షకు సిద్ధమవుతాను” అన్నాను. అందుకామె, “చాలా మంచిది. నీలాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం మంచిదే. బాబా తమ స్థానంలో విరాజమానులై ఉన్నారు. భక్తులు కూడా కూర్చుని ఉన్నారు. నువ్విప్పుడు మసీదుకు వెళ్ళు. పుచ్చకాయ, కర్బూజ ప్రసాదంగా పంచుతున్నారు” అని చెప్పి, ఒక రుమాలును జోలెలాగా చేసి నాకిచ్చి, “వెళ్ళి ధుని ఎదురుగా నిలబడు. నా భాగానికి రావలసిన ప్రసాదాన్ని జోలెలో వేస్తారు” అన్నది. ఆ ప్రకారంగానే నేను వెళ్ళి మసీదులో నిలబడ్డప్పుడు బాబా ఆదేశంపై నా జోలెలో ప్రసాదం వేయబడింది. ఆ ప్రసాదాన్ని తీసుకుని నేను రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆమె నా పాత గది ముందున్న అరుగు మీద కూర్చుని భోజనం చేస్తున్నది. నన్ను చూసి ఆమె, “నువ్వు వచ్చావన్న సంగతి నాకు గుర్తులేదు. నీతో చెప్పిన మాటను నేను మరచిపోయాను. రా, కూర్చో” అంటూ తాను తినే పప్పన్నంలోంచి కొంచెం వేరుగా తీసి నాకు ఇచ్చి తినమని ఆదేశించింది. కానీ అది చాలా కారంగా ఉండటం వల్ల నేను తినలేకపోయాను. భోజనం తరువాత నేను కొంచెంసేపు కూర్చున్నాను. అప్పుడు రాధాకృష్ణమాయి, “ఇప్పుడు పడుకుంటావా, ఏం?” అన్నది. నేను 'అవును' అన్నమీదట ఆమె రామనామం వ్రాయబడిన తన దుప్పటిని నాపై కప్పింది. తను పడుకోకుండా గది బయటకు వెళ్ళి మసీదు వైపు దృష్టి పెట్టి, “వామన్ ఇప్పుడు కూడా పడుకోవాలనే అనుకుంటున్నాడు” అన్నది. నేను పడుకోవటం ఆమెకు నచ్చలేదని గ్రహించి రామనామం రాసిన ఆ దుప్పటిని అక్కడే పెట్టి గది బయటకొచ్చాను.
రాత్రి బసకు తిరిగి వచ్చి శ్రీమాన్ బూటీ, నార్వేకర్, రాధాకృష్ణమాయి మొదలైనవారితోపాటు భోజనం చేయటానికి కూర్చున్నాను. ఇదివరకే చెప్పినట్లు పరీక్ష గురించిన ఆలోచన వల్ల నాకు అన్నం రుచించక ఏదీ తినాలనిపించలేదు. కానీ రాధాకృష్ణమాయి ఒక్కొక్క ముద్దను నాకు పెడుతూ, వాటి తత్వసంఖ్యను చెబుతూ మొత్తం 42 ముద్దలు పెట్టింది. తద్వారా ఆమె అన్నం పట్ల నాకు ఏర్పడిన అరుచిని దూరం చేసింది. అంతేకాదు, దాంతోపాటు “తత్వాల శుష్కజ్ఞానంతో ఏం పని? ఏ వస్తువులో ఏ తత్వం ఉందో అది తెలుసుకొనే శక్తి మనకు ప్రాప్తించాలి. ఉదాహరణకి - ఉప్పు, అన్నం మొదలైనవాటిలో ఏ తత్వం ఉందో తెలుసుకోవటం అవసరం” అని చెప్పింది. ఆరోజు అర్థరాత్రి వరకూ నాకు నిద్ర రాకపోయేసరికి ఆమె తెల్లటి వస్త్రాన్ని ముట్టుకుంటే చల్లగా అనిపించి వెంటనే నిద్ర వచ్చింది. తరువాత ఒకరోజు మేమంతా భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు నా విస్తరి వద్ద ఒక అరటిపండు పెట్టి వుండటం కనిపించింది. దానిపై రెండు మూడుచోట్ల మచ్చలు పడినట్లు కనిపించాయి. మొదటి ముద్దలో ఎలుక పెంటిక కనిపించింది. అయితే మిగతాభాగం బాగున్నట్లే కనిపించింది. ఏది తినటానికి యోగ్యమైనదో, ఏది తినటానికి యోగ్యం కానిదో తెలుసుకొనే జ్ఞానాన్ని యోగులు తమ భక్తులకు ఈ ప్రకారంగా ఇస్తారని దీంతో బోధపడింది. మరుసటిరోజు బాబా వేరుశనగపప్పు, కొబ్బరి మరియు కొన్ని సుగంధద్రవ్యాలతో పచ్చడి తయారుచేసి కొద్దిగా రాధాకృష్ణమాయికి పంపారు. ఆమె దాన్ని నాకిస్తూ, "ఈ పచ్చడి కొద్దిగా తీసుకో. దీన్ని బాబా స్వయంగా తయారుచేశారు. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు" అని చెప్పింది. ఆమె బ్రతిమిలాడినందువల్ల కొద్దిగా తిన్నాను. కానీ పచ్చడి బాగా కారంగా ఉన్నందున అతిసారానికి గురయ్యాను. తరువాత నేను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, "ఏ వస్తువు మన వాటాలో లేదో దాన్ని తింటే ఇలాగే తెరలు తెరలుగా బయటకు వస్తుంది” అన్నారు. తద్వారా నేను ఇష్టంగా ఆహారం తినడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను.
నేను శిరిడీ విడిచి వెళ్ళడానికి ముందు ఒకరోజు మధ్యాహ్న ఆరతి, భోజనం అయ్యాక బాపూసాహెబ్ జోగ్ నాతో, “వామనరావ్! ఈ ఎడ్లబండి ఎక్కు. బాబా రహతాలో కుశాల్‌సేట్ ఇంటికి వెళ్ళారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పద!” అన్నాడు. సరేనని నేను అతనితో వెళ్ళాను. కుశాల్‌చంద్ ఇంట బాబా గద్దెమీద దిండ్లనానుకొని కూర్చున్నారు. నేను, కాకాసాహెబ్ మొదలైనవారందరం బాబా ఎదుట కూర్చున్నాం. నేను బాబాకి సరిగ్గా ఎదురుగా కూర్చున్నాను. బాబా ఆగమనానికి స్వాగతం చెప్తూ, పూజ, అర్చన చేసి పండ్లతో నిండిన పళ్ళేన్ని బాబా ఎదుట ఉంచాడు కుశాల్‌సేట్. నేను ఆ పళ్ళెం నుంచి ఒక అరటిపండుని తీసి, ఒలిచి బాబాకిచ్చాను. అందులో సగం అరటిపండుని తాము గ్రహించి మిగిలిన సగభాగాన్ని నాకు తిరిగిచ్చారు బాబా. నేను చేసిన ఈ పనిని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ముఖ్యంగా కాకాసాహెబ్. శిరిడీకి వెళ్ళాక దీక్షిత్ ఈ విషయాన్ని రాధాకృష్ణమాయితో చెప్పారు. అప్పుడు ఆయీ నన్ను చూస్తూ, “ప్రేమను కేవలం శిరిడీ బయటే చూపించాలా ఏం? వామన్! ఇంతటి ప్రేమను చూపించటం పట్ల ఇక్కడ ఎవరు అడ్డుచెబుతారు?” అన్నది. ఇకపోతే, బాబా కుశాల్‌సేట్ ఇంటినుంచి బయలుదేరి నదిని దాటి బండి ఆగివున్న చోటువరకూ నడిచి చేరుకున్నారు. నేను కూడా అక్కడకు చేరుకున్నప్పుడు నాకు ఒక అశరీరవాణి వినిపించింది: “వెనుకనుండి నన్ను పట్టుకుని నువ్వు గుర్రంలా నడువు!” అని. అందువల్ల నేను బాబాకి సరిగ్గా వెనకాల నిలుచున్నాను. బాబా నడుముని రెండు చేతులతో పట్టుకుని గుర్రంలా నడిచాననుకుంటా. అలాగే బాబా చరణాల వద్ద ఆకుపచ్చని బట్టలో చుట్టబడివున్న (శిరస్సు, ముఖం, ఛాతీలతో సహా) ఒక శవాన్ని చూశాను. అది చూసిన నాకు, 'బాబా ఇక్కడ ఎవరో ఒక రాక్షస ఫకీరును చంపారేమో' అనిపించింది. తరువాత నాకు శ్రీకృష్ణభగవానుడు రాక్షససంహారం చేయటం కోసం బృందావనానికి ఆవుల్ని మేపటానికి తీసుకొని వెళ్తుండేవారనీ, ఆ సంఘటన ద్వారా రాక్షససంహారాన్ని బాబా ప్రత్యక్షంగా చూపించారనీ అనిపించేది. నాతో పాటు బాబా వెంటవచ్చిన కాకాసాహెబ్ గానీ లేదా నార్వేకర్ గానీ ఆ దృశ్యాన్ని చూసి ఉంటారని నాకనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూపించి బాబా నాకు, ‘నీవు ఇక్కడనుంచి వెళ్ళు! ఈ ఫకీరు రాధాకృష్ణమాయిని చంపేశాడు. చూడు, నా చరణాల వద్ద ఆమె శవం!’ అని సూచిస్తున్నారేమో! అని కూడా అనిపించేది. అలాగే అయింది కూడా. వైకుంఠరావు వచ్చి నన్ను ముంబాయి తీసుకెళ్ళాడు. ముంబాయి నుంచి నేను మోతా వెళ్ళాను. నేను శిరిడీని వదిలిన 21 రోజుల తరువాత, రాధాకృష్ణమాయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతం చేసుకున్నదని నాకు తెలిసింది.
source: 'దేవుడున్నాడు లేడంటావేమి?' బై విమలాశర్మ.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJAI SAIRAM
ReplyDeleteJAI SAIRAM
JAI SAIRAM
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼
ReplyDeleteOm sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete