సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాధాకృష్ణమాయి - ఏడవ భాగం



మాయీ నిప్పుమీద నడవగలిగేది, భక్తుల మనస్సులను చదవగలిగేది. అంతేకాదు, అందరూ చూస్తుండగా అకస్మాత్తుగా అదృశ్యమయ్యేది. ఈ సిద్ధులన్నీ ఆమెకు ఆభరణాలు. ఆమె రోజూ బాబాకు అల్పాహారం తయారుచేసేదని చెప్పుకున్నాము కదా! ఒకరోజు ఆమె వామనరావుతో, "వామన్యా, నా ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి, ఈరోజు నువ్వు అల్పాహారం తయారుచేసి బాబా కోసం తీసుకొని వెళ్ళు" అని చెప్పి బయటకి వెళ్లిపోయింది. అతను ఆయీ మాటకు కట్టుబడి అల్పాహారం తయారుచేసి ద్వారకామాయిలో బాబాకు నివేదించాడు. తరువాత అయీ రాకకోసం నిరీక్షించసాగాడు. అయితే మధ్యాహ్నమైనా ఆయీ తిరిగి రాలేదు. దాంతో వామనరావు సహనాన్ని కోల్పోయి ఆయీ కోసం గ్రామంలో వెతికాడు, కానీ ఆమె జాడ తెలియలేదు. ఆమె కుటీరానికి తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి అయింది. దాంతో అతను, 'ఇక ఆయీని ఎక్కడికీ వెళ్లనివ్వకూడద'ని నిర్ణయించుకున్నాడు. కానీ, మరుసటిరోజు కూడా అల్పాహారం తయారుచేసే బాధ్యతను వామనరావుకు అప్పగించి ఆయీ బయటకి వెళ్ళింది. అతనెంతో కలతచెంది ఆమెననుసరిస్తూ ఆమెను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆమె అతని మాట వినిపించుకోక ముందుకు సాగింది. అయినా అతను ఆగక ఆమెను వెంబడించాడు. ఇద్దరూ బాలాభావు హోటల్‌ వద్దకు చేరుకోగానే హఠాత్తుగా ఆయీ అదృశ్యమైంది. ఈ సంఘటన ద్వారా ఆమెకి యోగశక్తులున్నాయని వామన‌రావు నిర్ధారించుకున్నాడు.

1914వ సంవత్సరంలో శ్రీరామనవమి గురువారంనాడు వచ్చింది. బాబా ఆరాధనకు అదెంతో విశిష్టమైనరోజని తలచిన వామన‌రావు బాబాకు ఏదైనా విలువైన వస్తువును బహుమతిగా సమర్పించాలని అనుకున్నాడు. కానీ తననుకున్నట్లు విలువైన వస్తువు కొనడానికి అతని వద్ద డబ్బు లేదు. అతను తన మనసులోని కోరికను రాధాకృష్ణమాయి వద్ద వెలిబుచ్చాడు. అప్పుడు ఆమె, "నువ్వు బాబాకు వెండిదీపాన్ని బహుమతిగా అర్పించి, వారి పాదకమలాల వద్ద పెట్టు. బాబా దీపాలను ఇష్టపడతారు. నువ్వు అలా చేస్తే బాబా ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆ దీపంలా వెలిగిస్తారు. నువ్వు డబ్బు గురించి చింతించకు. భగవంతుడు అంతా జాగ్రత్తగా చూసుకుంటాడు" అని చెప్పింది. తరువాత ఆయీ అతని కోరికను ముంబాయికి చెందిన వామనరావు నార్వేకర్‌ అనే వర్తకుని వద్ద ప్రస్తావించి, "వామన‌రావు బాబాకు విలువైన వెండిదీపాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ అతనికి ప్రస్తుతం డబ్బు కొరత ఉంది. కాబట్టి నేను అతని కోరికను నెరవేర్చాలనుకుంటున్నాను. మీరు ప్రస్తుతం కొంత డబ్బును సర్దుబాటు చేస్తే, అతను నెలకు 25 రూపాయలు చొప్పున ఒక సంవత్సరం లోపలే ఆ డబ్బును తిరిగి చెల్లించగలడు" అని చెప్పింది. అలాగే, ‘నెలకి 25 రూపాయల చొప్పున వాయిదా పద్ధతిలో నార్వేకర్‌కి డబ్బులు చెల్లించమ’ని వామనరావుతో చెప్పింది. అందుకు నార్వేకర్ సమ్మతించి వామనరావు కోసం 125 రూపాయల విలువగల వెండి దీపపుసెమ్మెను తీసుకున్నాడు. మార్చి 25న శ్రీరామనవమి పండుగకోసం లక్షలాదిమంది భక్తులు శిరిడీలో గుమిగూడారు. అందరూ ఆరతి సమయంలో పూజాసామగ్రి తీసుకుని మసీదుకు వెళుతున్నారు. మధ్యాహ్న ఆరతికి ముందు భక్తులు తమ తమ బహుమతులను బాబాకు అర్పించడం గమనించిన వామనరావు ఉద్వేగానికి లోనై, ‘తనతోపాటు మసీదుకు వచ్చి వెండిదీపాన్ని బాబాకు సమర్పించమ’ని రాధాకృష్ణమాయిని కోరాడు. అప్పుడు ఆయీ ఆ వెండి దీపపుసెమ్మెలో నెయ్యి, వత్తులు వేసి దానిని పళ్ళెంలో పెట్టి, “ధోవతిని నడుముకి సరిగ్గా కట్టుకో!” అని వామనరావుని ఆదేశించి, ఆ పళ్ళేన్ని అతని చేతిలో పెట్టి, "నువ్వు ఈ దీపపుసెమ్మెను తీసుకొని వెళ్ళు, నేను నీ వెనుకగా వచ్చి మసీదు మెట్లెక్కి నీతో పైకి వస్తాను” అన్నది. నిజానికి బాబా ఆదేశానుసారం ఆయీ మసీదుకి వెళ్లడం లేదు. వామనరావు దీపపుసెమ్మె ఉన్న పళ్లెం తీసుకొని మసీదుకి వెళ్లి మెట్లు ఎక్కుతుండగా ఒక హస్తస్పర్శ అతని భుజాన్ని మృదువుగా తాకింది. అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రాధాకృష్ణమాయి కనిపించి, "వామన్యా! వెళ్ళు, ముందుకు వెళ్లి ఈ అందమైన దీపాన్ని వెలిగించి బాబాకు సమర్పించు" అని చెప్పింది. ఆ విషయమై శరణానంద ఇలా చెప్పాడు: "ఇతరులెవరూ ఆమె సూక్ష్మస్వరూపాన్ని చూడలేదనుకుంటా! ఎందుకంటే, ఎవరూ ఆమె మసీదుకి వచ్చిందన్న మాటే చెప్పుకోలేదు. అదీగాక, ఆమె బాబా సమక్షానికి వెళ్ళటం నిషేధించబడింది. అంతేకాదు, బాబా ఎదురుగా వెళ్ళకపోవటమనేది ఆయీ వ్రతం కూడా అయివుండొచ్చు. అయితే ఆమె నాకు మాత్రం స్థూలరూపంలో దర్శనమిచ్చి, నా వీపుపై తట్టి నాతో, 'వెళ్ళు, పైకి వెళ్ళి దీపాన్ని వెలిగించు' అన్నది".

రాధాకృష్ణమాయికి పుస్తక పఠనమంటే ఎంతో ఆసక్తి. శరణానంద తదితర భక్తుల వద్ద నుండి ఆమె పుస్తకాలు అరువుగా తీసుకొని సమగ్రంగా అధ్యయనం చేస్తుండేది. నిర్ణయసాగర్ ప్రెస్ ద్వారా ప్రచురితమైన 'తుకారాం గాథ' అనే పుస్తకం ఆమెకి ఎంతో ప్రియమైన పుస్తకం. అందులోని అభంగాలను ఆమె శ్రావ్యమైన స్వరంలో ఎంతో మృదుమధురంగా ఆలపిస్తుండేది. ఒకసారి ఆయీ, “ఇక్కడికొచ్చిన తొలిరోజుల్లో నేను తరచూ తుకారాం అభంగాలను బాబా ఎదుట పాడుతుండేదాన్ని. బాబా వాటిని ఎంతో ఇష్టపడేవారు" అని శరణానందతో చెప్పింది. సాధుసత్పురుషుల మరియు కరుణ, శాంతి వంటి స్థితుల గురించిన అనేక అభంగాలు ఆమెకు తెలుసు. వాటిలో చాలావాటిని భక్తులకు ‘తుకారాం గాథ’ చదివి వివరించేటప్పుడు ఆయీ పాడుతుండేది. సంత్ తుకారాం గాథ కాక శ్రీజయదేవ్ విరచిత గోపీ గీతాలు రాధాకృష్ణమాయికి చాలా ఇష్టంగా ఉండేవి. ఆమె మళ్ళీ మళ్ళీ వాటిని గానం చేస్తూ, “గోపీ గీతాల విశిష్టత ఏమిటంటే, వీటిని ప్రతిరాగంలోనూ పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు" అని చెబుతుండేది. సాయంకాల సమయంలో ఆమె ఆ గీతాలను పాడుతుంటే, సాయిభక్తుడైన డాక్టర్. పిళ్ళే సితార్ వాయిస్తూ ఆమె గానానికి జతకలిపేవాడు. అతను రాత్రింబవళ్ళూ మాయీ వద్ద కూర్చొని ఆమె చెప్పిన విధంగా సితార్ మీద రాగాలాపనలు చేస్తుండేవాడు. ఆయీ డాక్టర్ పిళ్ళేతో కలిసి కొంచెంసేపు సమర్థ రామదాసు రచించిన ‘దాసబోధ’ను పెద్దగా చదివి, విపులంగా వివరిస్తుండేది.

ఒకరోజు సాయంత్రం వామనరావు నార్వేకర్ తనతోపాటు ఏకనాథ భాగవతం తీసుకొచ్చాడు. అందులోని "కాయేన వాచా మనసేంద్రియైర్వా" (భావం: నా శరీరం, వాక్కు, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి మరియు సహజ ప్రకృతిని నారాయణునికి సమర్పించాను) అనే శ్లోకంపై ఆయీ సుదీర్ఘంగా ఉపన్యసించి, "గీతాసారాంశం ఈ శ్లోకంలో ఉంది. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి" అని చెప్పింది. వార్కరీ సాంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి గోస్వామి తులసీదాసు రాసిన రామాయణాన్ని మరాఠీలోకి అనువదించారు. దాన్ని శరణానంద ముంబాయిలో తీసుకొనగా, ఆయీ అది చదివి దాన్ని ఎంతగానో ప్రశంసించింది. ఒకసారి ఆయీకి మరాఠీలో రచింపబడిన శ్రీగౌరాంగ ప్రభువు జీవితచరిత్ర లభించింది. అది పఠించిన తరువాత ఆయీ ఒకటి రెండు రోజులు అదే ధ్యాసలో ఉండిపోయింది.

ఒకసారి ఆయీ శరణానంద వద్దనుంచి 'నవనీత్' అనే మరాఠీ కావ్యసంగ్రహాన్ని తీసుకొని కొద్దిరోజులు తన దగ్గర పెట్టుకుంది. అందులో గొల్లవేషంలోని హరిదర్శన ప్రతిబింబాన్ని ఆయీ తన హృదయంలో ముద్రించుకుని నిరంతరం స్మరిస్తూ ఉండేది. అందులో గోపబాలుడి వేషంలో ఉన్న శ్రీకృష్ణుని మనోహర ముద్రల గురించి సుందరంగా వర్ణించబడివుంది. ఆ పది, పన్నెండు పంక్తులనూ ఆమె ఎప్పుడూ పాడుతుండేది. పుస్తకం తిరిగి ఇచ్చే సమయంలో భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో వర్ణించబడి ఉన్న బ్రాహ్మణ ధర్మంపై టిప్పణీ చేయబడి ఉన్నచోట ఆమె గుర్తుపెట్టింది. ‘బ్రాహ్మణ సద్గుణాలను అనుసరించమ’ని ఆమె ద్వారా తనకది సూచన అనిపించిందనీ, సద్గురువును ఎలా చేరుకోవాలో తెలియజేసే ఖజానా యొక్క తాళంచెవిని ఆయీ ఆ శ్లోకాల ద్వారా అందిస్తుందనీ వామనరావు అంటాడు.

"శమో దమః తపః శౌచం శాంతిరార్జవమేవచ,

జ్ఞానం విజ్ఞాన మస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం” 

- (భగవద్గీత 18వ అధ్యాయం, 42వ శ్లోకం)

అర్థం:- అంతఃకరణ నిగ్రహం, ఇంద్రియ దమనం, బాహ్య-అంతరంగిక శుద్ధి, ధర్మం కోసం కష్టాన్ని సహించటం, క్షమాభావంతో ఉండే మనసు-శరీరం, ఇంద్రియాల సరళత్వం, ఆస్తిక్య బుద్ధి, శాస్త్ర విషయ జ్ఞానము, పరమాత్మ తత్వాన్ని గురించిన జ్ఞానము - ఇవి బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలు.

ఆయీ ఇంటిని ఆనుకొని ఉన్న ఒక గదిలో వామనరావు ఉండేవాడు. అతను వివిధ సత్పురుషుల గురించి పెద్దగా చదివి రాధాకృష్ణమాయికి వినిపిస్తుండేవాడు. ఒకసారి అతనలా చదువుతున్నప్పుడు అందులో భాగంగా వచ్చిన ఒక సత్పురుషుని జీవితగాధ రాధాకృష్ణమాయిపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో ఆమె కట్టలు తెంచుకొస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక నియంత్రణ కోల్పోయి దుఃఖించసాగింది. అకస్మాత్తుగా చీకటిగా ఉన్న ఆ గదిలో ఆమె ముందు ఒక మెరుపు మెరిసింది. అప్పుడు ఆమె శాంతించి నిద్రపోయింది.

‘రామకృష్ణ బోధామృతం’ కూడా ఆయీ కోసం శరణానంద పెద్దగా చదివేవాడు. ఆయీ అతనితో, "మాయా వలయాన్ని ఛేదించడానికి ఈ పుస్తకమొక అద్భుతమైన ఉపకరణం. మనం ఏ స్థితిలో ఉన్నా జీవితంలో సంతృప్తిగా ఉండటం గురించి ఇది మనకు బోధిస్తుంది" అని చెప్పింది. తరువాత ఒకరోజు బాబా తమ చేతిలో తుకారాం గాథ పుస్తకం పట్టుకొని శరణానందకు స్వప్నదర్శనమిచ్చారు. బాబా ఆ పుస్తకాన్ని తెరచి, '104వ పేజీ' అని చెప్పి, ఆ పేజీని చూపించారు. మరుసటిరోజు ఉదయం శరణానంద నిద్రలేస్తూనే ఆ పుస్తకం తెరిచి 104వ పేజీని చూశాడు. అక్కడ దర్వేష్ అనే సూఫీ మహాత్ముడు రచించిన ఒక పద్యం వుంది. ‘అల్లాహ్’ అనే పదంతో మొదలయ్యే ఆ పద్యంలోని నీతి ఏమిటంటే, 'జీవితంలో ప్రాప్తించినదానితో సంతృప్తి చెందాలి, దానిని సంతోషంగా అంగీకరించాలి. స్వర్గానికిగానీ లేదా నరకానికిగానీ మార్గాన్ని ఎన్నుకోవడం కాదు, దయతో కూడిన ధర్మబద్ధమైన ధార్మిక మార్గాన్ని ఎన్నుకోవడం' అని.

కొద్దిరోజుల తరువాత వామనరావు వద్దకు వచ్చిన బాపూసాహెబ్ జోగ్, "మాయీ ముందు ఈ గొప్ప గొప్ప గ్రంథాలను చదవడం వల్ల నీకు ఎటువంటి జ్ఞానమూ రాదు. నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం" అని చెప్పాడు. అంతటితో వామనరావు పెద్దగా చదవడం మానేశాడు. అదీగాక, ఆయీకి ఇతరులు తనముందు మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైనా ఎవరైనా మతపరమైన అంశాలపై తమ స్వంత జ్ఞానాన్ని ప్రదర్శించినట్లైతే, ఆయీ వాళ్లతో వాదించి, వాళ్ళ అభిప్రాయాన్ని చిత్తుచేసి నోరుమూయించేది. అందువల్ల శరణానంద ఎన్నడూ తన మననులో మాటను ఆమె ముందు చెప్పేవాడు కాదు. అది బాబాకి నచ్చేది కాదు. ఒకసారి బాబా అతనితో, “అరే! నేన్నిన్ను అక్కడకు పంపించాను. అక్కడ నువ్వు మాట్లాడటం లేదు. ఇలా అయితే నేనేం చేయాలి?” అని అన్నారు. అయినప్పటికీ అతను మౌనంగా ఉండేవాడు.

రాధాకృష్ణమాయి వద్ద చిన్న కృష్ణుని ఇత్తడి విగ్రహం ఒకటి ఉండేది. ఆయీ ఎక్కడికి వెళ్ళినా ఆ విగ్రహాన్ని తనతో పాటు తీసుకువెళ్ళేది. భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దనూ ముందు ఆ విగ్రహానికి అర్పించి, తరువాత ప్రసాదంగా తినేది. అది చూసిన శరణానంద తన వద్ద కూడా అలా ఒక విగ్రహాన్ని ఉంచుకోవాలని అనుకున్నాడు. ఎప్పుడూ తదేకంగా దాని గురించే ఆలోచిస్తుండేవాడు. కానీ తన మనసులోని ఆలోచనలను ఆయీ ముందు బహిర్గతం చేసేవాడు కాదు. అయినా ఎదుటి వ్యక్తిలోని ఆలోచనలను చదవగల సామర్థ్యమున్న ఆయీ ఒకరోజు, “నీకిలాంటి ప్రతిమ ఆవశ్యకతేమీ లేదు. నీకు బాబా తన ఫోటో ఇచ్చారు కదా” అని అతనితో అన్నది. 

స్వామిశరణానంద సిద్ధాసనంలో కూర్చుని నిర్ణీత సమయం వరకు ధ్యానం చేస్తుండేవాడు. ఒకసారి రాధాకృష్ణమాయి అది చూసి, 'స్వస్తిక్' ఆసనంలోగానీ లేదా 'సహజ' ఆసనంలోగానీ కూర్చోమని అతనికి సలహా ఇచ్చింది. అంతేకాదు, ఆయా ఆసనాలు వేయడానికి ఏ భంగిమలో కూర్చోవాలో కూడా ఆయీ అతనికి చూపించింది. అదేరోజు రాత్రి అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, బాబా తాము మామూలుగా కూర్చొనే పద్ధతిలో కాక స్వస్తిక్ ఆసనంలో కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. బాబా ఆ ఆసనంలో కూర్చోవడం ద్వారా తనను కూడా ఆవిధంగా కూర్చోమని సూచిస్తున్నట్లుగా నిర్ధారించుకొని అప్పటినుంచి అతను స్వస్తిక్ ఆసనంలో కూర్చోవడం ప్రారంభించాడు.

తరువాయి భాగం వచ్చేవారం ...

source: 'దేవుడున్నాడు లేదంటావేమి?' బై విమలాశర్మ.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


5 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba bless us

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀😊🌼❤🥰

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo