సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 856వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆదుకున్న సాయినాథుడు
2. దయతో తమ్ముడిని కాపాడిన బాబా
3. బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేసిన మోటార్

ఆదుకున్న సాయినాథుడు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీరామ. నా జీవితంలో సాయిలీలలు అపారం. నా జీవితంలో వచ్చిన కష్టకాలంలో అనేకసార్లు సాయిబాబా ఎంతో దయతో నా చెంతనే ఉండి నన్ను రక్షించారు. 2021, ఏప్రిల్ 26వ తేదీన తమతో సరదాగా గడపటానికని మా బావ నన్ను వాళ్ల ఊరికి తీసుకెళ్లారు. అయితే మేము చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మరుసటిరోజు నాకు విపరీతంగా జ్వరం వచ్చింది. అది కరోనా అయితే వాళ్ళకు ఇబ్బందవుతుందని మా బావవాళ్లు కంగారుపడ్డారు. ఆ మరుసటిరోజు నేను కోవిడ్ టెస్టు చేయించుకుంటే, విధివ్రాత, నా కర్మ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నా వల్ల వాళ్ళందరికీ కరోనా వస్తుందేమోనని నాకు చాలా భయం వేసింది. భయపడినట్లే, వారం తరువాత మా బావకి కరోనా వచ్చింది. మా ఇల్లు చాలా చిన్నది. ఒకటే బాత్‌రూమ్. నేను ఒక గదిలో ఐసొలేషన్‌లో ఉంటే, అమ్మ, నాన్న, అన్నయ్య హాల్లోనే ఉండేవారు. నాకు కరోనా వచ్చినప్పటినుండి మా అమ్మ చాలా నీరసించిపోయింది. తనకు అంత బాగాలేకపోయినా అమ్మ మాకోసం వంట మొదలుకొని అన్ని పనులూ చేస్తుండేది. నా వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని నేను రోజూ ఏడ్చేవాడిని. బావకి కరోనా తగ్గలేదు, అమ్మానాన్నలకు కూడా వస్తుందేమోనని భయంతో సాయిని పదేపదే ప్రార్థిస్తూ ఉండేవాడిని. రోజూ బాబా ఊదీ పెట్టుకోమని అమ్మతో చెప్పి, సాయిపూజ 5 వారాలు చేస్తానని సాయీశ్వరునికి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల ఏడవరోజున అమ్మకి కాస్త నీరసం తగ్గడంతో కొంచెం అన్నం తినింది. 10వ రోజుకి అమ్మకి నీరసం పూర్తిగా తగ్గింది. 15వ రోజు గురువారంనాటికి నాకు కరోనా పూర్తిగా తగ్గింది. ఆ దేవాధిదేవుడైన శ్రీసాయి దయవల్ల అమ్మానాన్నలు ఆరోగ్యంగా ఉండటంతో ఐదు గురువారాల పూజ మొదలుపెట్టాను. అయితే మా బావ పరిస్థితి ఇబ్బందిగా ఉండటం వలన నేను మానసికంగా చాలా కృంగిపోయాను. కానీ బాబా అనుగ్రహంతో కొద్దిరోజుల్లోనే మా బావ కూడా పూర్తిగా కోలుకున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఆలస్యం చేయకుండా రక్షణనిచ్చారు సాయినాథుడు. భక్తసులభుడైన శ్రీసాయి కాపాడకుంటే మా జీవితాలు చాలా దారుణంగా ఉండేవి. దేవుని లీలలు ఎవరికీ అర్థం కావు. ఇంట్లో ఉన్న నన్ను తీసుకుని వెళ్లి, నా వల్ల మా బావ, తనవాళ్లు ఇబ్బందిపడ్డారు. ఏదేమైనా ఈ సంఘటన నాకు పెద్ద గుణపాఠం నేర్పింది. 


ఇకపోతే, వయసు దాటినా నాకింకా వివాహం కాలేదు. ఎన్నోసార్లు బాబాను నా పెళ్లి గురించి అడిగాను. కానీ నాకు ఆయన నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. ఒక అమ్మాయి నా వద్ద 40,000 రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు సరికదా, నన్ను పెళ్లి చేసుకుంటానని తీవ్రంగా మోసం చేసింది. మళ్ళీ నాకు కనిపించకుండా చాలా జాగ్రత్తపడి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలా జరిగేసరికి, "నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెకు మీ ఆదేశంగా భావించి సహాయం చేశాను. మంచితనానికి విలువ లేదా?" అని నేను సాయిని నిలదీసేవాడిని, నిందించేవాడిని. ఇప్పటికీ వివాహం, డబ్బు విషయంలో ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నా సాయి వద్దనుండి నాకు సరైన సమాధానం రాలేదు, పరిష్కారమూ దొరకలేదు. బాధతో చాలాసార్లు బాబాతో పరుషంగా మాట్లాడాను. "అన్నిటికీ నన్ను మన్నించండి సాయీ. బాధితులకు మీరే దిక్కు. నా సమస్యను పరిష్కరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను”.


దయతో తమ్ముడిని కాపాడిన బాబా


ముందుగా శ్రీసాయినాథుని మార్గములో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిభక్తజనులకు నా నమస్కారాలు. నా పేరు చండీశివప్రియ. నేను ఉదయాన్నే స్నానం ముగించుకున్న తరువాత ఈ బ్లాగులోని అనుభవాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదువుతాను. తద్వారా నాకు బాబా యందు నమ్మకం ధృఢమవుతుంది. అసలు నేను ఒకప్పుడు ఇలాంటి బ్లాగు ఒకటి ఉంటే బాగుంటుందని ఇంటర్నెట్లో పరిశోధించాను. కృపతో బాబా నాకు ఈ బ్లాగును పరిచయం చేశారు. అలాగే వారి ఆశీస్సులతో మహాపారాయణ గ్రూపులో కూడా చేరాను. నేను ఇదివరకే నా అనుభవాలు రెండు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. వాటి లింక్స్ ఈ క్రింద జతపరుస్తున్నాను, ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.


https://saimaharajsannidhi.blogspot.com/2021/03/700.html?m=1


https://saimaharajsannidhi.blogspot.com/2020/12/610.html?m=1


'సాయినాథా' అనే పదం నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గుర్తుకువస్తుంది. మా తమ్ముడి అనారోగ్యాన్ని నా సాయినాథుడు ఏ విధంగా నయంచేశారో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మా తమ్ముడికి ఇదివరకు కరోనా వచ్చి తగ్గింది. అప్పుడు అమ్మకి కూడా కరోనా వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ నా సాయినాథుని దయవల్ల మరియు అమ్మవారి దయవల్ల వాళ్ళకు ఏమీ కాలేదు. ఇప్పుడు తమ్ముడు మళ్లీ అవే లక్షణాలతో ఇబ్బందిపడ్డాడు. అప్పుడు నేను, "తమ్ముడికి ఏమీ కాకుండా చూడమ"ని బాబాని, అమ్మవారిని వేడుకున్నాను. వారి దయవల్ల ఒక్కరాత్రిలోనే తమ్ముడికి నయం అయింది. అసలు బాబా ప్రేమను ఏమని చెప్పను? "తండ్రీ! నేను అడిగిన ఉద్యోగం ఎప్పుడు ఇస్తావోనని ఎదురుచూస్తున్నాను. నమ్మకంతో నేను కోరుకునే ఉద్యోగాన్ని ఇచ్చి, నా జీవితాన్ని నిలబెడతావని ఆశిస్తున్నాను బాబా".


అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ.


బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేసిన మోటార్


నా పేరు ధనలక్ష్మి. బాబా లీలలు అద్భుతం. మా జీవితంలో ఏర్పడిన ఎన్నో ఇబ్బందుల్ని బాబా తొలగించారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంటి అవసరాలకు నీటికోసం మేము బోర్ మీద ఆధారపడుతూ ఉంటాము. ఆ బోరుకున్న మోటార్ ఈమధ్య పాడవటంతో నీటికోసం చాలా ఇబ్బందిపడ్డాము. మోటార్ రిపేర్ చేయించినప్పటికీ మళ్లీ రెండురోజులకే పనిచేయటం మానేసింది. ఈ సమస్యతో మేము చాలా బాధపడ్డాం. మెకానిక్‌కి ఫోన్ చేస్తే, "పూర్తి కేబుల్ (వైరు) మార్చాలి. సుమారు 15,000 రూపాయలు అవుతుంది" అన్నారు. ఆరోజు గురువారం. మావారు ప్రతి గురువారం పూజ పూర్తయిన తరువాత శ్రీసాయిసచ్చరిత్ర రెండు అధ్యాయాలు పారాయణ చేస్తారు. కానీ ఆరోజు బోర్ టెన్షన్లో పడి సచ్చరిత్ర చదవలేదు. నేను మనస్ఫూర్తిగా బాబాను, "బాబా! మా యందు దయవుంచి మోటార్ ఆన్ అయ్యి నీళ్లు వచ్చేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. తరువాత నేను మావారితో, "ముందు మీరు వెళ్లి పారాయణ చేయండి. బాబా మనకు అండగా ఉన్నారు" అని  చెప్పాను. సరేనని, ఆయన వెళ్లి పారాయణ పూర్తిచేసి వచ్చారు. తరువాత బోర్ స్టార్టర్‌కి ఊదీ రాసి, బాబాను ప్రార్థించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. బాబా దయతో మోటార్ ఆన్ అయింది. మెకానిక్ రాకముందే బాబా కృపవలన మోటార్ చక్కగా పనిచేసింది. మాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాము. "బాబా! మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడు తండ్రీ".



11 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🌼🕉🙏😊

    ReplyDelete
  4. 🌺🌼🌺 Om Sri SaiRam🌼🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh health bagundali thandri

    ReplyDelete
  8. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo