సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 862వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చావువరకు వెళ్లిన మనిషిని ప్రేమతో కాపాడిన బాబా
2. సాయినాథుని మించిన దైవం లేరు
3. పెద్ద ప్రమాదం నుండి అమ్మను కాపాడిన బాబా

చావువరకు వెళ్లిన మనిషిని ప్రేమతో కాపాడిన బాబా


ముందుగా, సాయిబంధువులందరికీ నా నమస్కారం. సాయే నాకు తల్లి, తండ్రి. నా తండ్రి సాయితో నాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే ఎక్కడనుండి మొదలుపెట్టాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నా మనసులో ఏముందో బాబానే నా చేత వ్రాయిస్తారని అనుకుంటున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నేను నమ్మిన మొట్టమొదటి దేవుడు సాయిబాబా. నేను బాబాని ఎంతగా నమ్మేదాన్నో మాటల్లో చెప్పలేను. ఆయన నన్ను ఎంతగానో కాపాడారు. నేను ఆయనకు పిచ్చి భక్తురాలినయ్యాను. నేను 6, 7 తరగతులు చదువుతున్నప్పటినుండి బాబా నాతోనే ఉన్నారు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మీతో ముందు ముందు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈమధ్యకాలంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇది మా మరిది, అంటే మావారి చిన్నమ్మ కొడుకుకి సంబంధించిన అనుభవం. అతను హైదరాబాదులో ఎస్.బి.ఐ.లో అసిస్టెంట్ మేనేజరుగా ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఎంత మంచి వ్యక్తి అంటే కలలో కూడా ఎవరి గురించీ చెడుగా ఆలోచించని బోళామనిషి. చాలా అమాయకుడు. ఎవరితోనూ ఎక్కువగా కలవడు, కనీసం మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినా రాడు. తను, తన ఉద్యోగం, అంతే. అంత సిన్సియర్‌గా ఉంటాడు. ఇలాంటి మంచిమనిషికి ఘోరంగా యాక్సిడెంట్ జరిగి చావువరకు వెళ్లి వచ్చాడు.


మా మరిదికి 2021, జూన్ 27న వివాహం జరగాల్సి ఉండగా జూన్ 25 ఉదయం క్యాబ్ మాట్లాడుకుని హైదరాబాద్ నుండి మా ఊరికి వస్తున్నాడు. అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద అతను వస్తున్న కారు ఒక లారీని ఢీకొట్టింది. మా మరిదికి తీవ్రంగా గాయాలయ్యాయి. కళ్ళకి, ముక్కుకి, నోటికి, తలకి పెద్ద దెబ్బలే తగిలాయి. బాగా రక్తస్రావం జరుగుతోంది. ఎవరో అతన్ని కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. రక్తస్రావం బాగా జరుగుతున్నందువల్ల ఆశలు తక్కువగా ఉన్నాయి, హైదరాబాద్ తీసుకెళ్లమని చెప్పారు అక్కడి డాక్టర్లు. ఆ సమయంలో పరీక్షల డ్యూటీ మీద హైదరాబాద్ వెళ్తున్న మావారికి ఈ విషయాలు తెలిశాయి. ఆయన వెంటనే అంబులెన్స్ డ్రైవరుతో మాట్లాడి, మా మరిదిని హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పారు. అంబులెన్సులో డ్రైవరు, మా మరిది ఇద్దరే బయలుదేరారు. నేను పెళ్ళికని బట్టలు సర్దుతుండగా మావారు ఫోన్ చేసి, యాక్సిడెంట్ గురించి చెప్పి, "బాగా రక్తస్రావమవుతోంది. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. తన వద్ద ఎవరూ లేర"ని చెప్పారు. ఆ విషయం విన్నప్పటినుండి నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. "ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టని మంచిమనిషికి రెండురోజుల్లో పెళ్లి ఉందనగా ఇలా జరిగిందేమిటి బాబా?" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇంకా, "బాబా! అంబులెన్సులో మా మరిది ఒక్కడే ఉన్నాడు. తనకు రక్తస్రావం ఎక్కువగా జరుగుతుందన్నారు తండ్రీ. నువ్వే తనకు తోడుగా వెళ్ళు. రక్తస్రావాన్ని ఆపు. తనకి నయమై ఇంటికి వస్తే, నేను ఈ అనుభవాన్ని వెంటనే మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని, నా నుదుటన బాబా ఊదీ పెట్టుకున్నాను. మూడేళ్ల మా బాబు చేత కూడా బాబాకు ప్రార్థన చేయించాను. ఇదిలా ఉండగా అంబులెన్సులో మా మరిదిని తీసుకెళుతున్న డ్రైవరు మధ్యదారిలో మావారితో, "మీ బ్రదర్‌కి చాలా రక్తస్రావం అవుతోంది. ఆశలు కనబడట్లేదు. మధ్యలో ఏ హాస్పిటల్ వచ్చినా ముందు అక్కడికే తీసుకెళదాం" అని చెప్పాడు. దాంతో మావారు వాళ్ళను మేడ్చల్ వద్ద కలుసుకుని కొంపల్లిలోని ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మా మరిదిని పరీక్షించిన డాక్టర్లు, "లాభం లేదు, తనను పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లండి" అని చెప్పేశారు. ఇంక బాబా మీద భారం వేసి మా మరిదిని కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బాబా మహిమను చూడండి! మనస్ఫూర్తిగా చేసిన మా ప్రార్థనలను బాబా విన్నారు. తీవ్రమైన గాయాలై, విపరీతమైన రక్తస్రావం జరిగి, ఆశలే లేవన్న మనిషిని ఆయన కాపాడారు. మా మరిదికి ప్లాస్టిక్ సర్జరీ చేసి జులై మొదటివారంలో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఇదంతా బాబా దయవల్లనే. అయితే మా మరిది ముఖానికి, ముక్కుకి సర్జరీ జరిగింది. దవడ భాగమంతా పగిలిపోయింది, పళ్ళు ఊడిపోయాయి. అందువలన నోటిని బోల్ట్ పెట్టి ఫిక్స్ చేశారు. 28 రోజుల వరకు తనను నోరు తెరవకూడదని చెప్పారు. ఉన్న పళ్ళసందుల గుండా ద్రవాహారం, మందులు ఇస్తున్నాము. కానీ తనకు నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల మందులు, జ్యూస్, పాలు వంటివి తీసుకోవడానికి మొండికేస్తున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. చావువరకు వెళ్లిన మనిషిని మీ ప్రేమ, కరుణ, దయలతో కాపాడారు తండ్రీ. ఇలాగే మమ్మల్ని సదా కాపాడండి బాబా. కానీ ఇప్పుడు మా మరిది అనుభవిస్తున్న పరిస్థితి మీకు తెలుసు బాబా. ప్రేమతో తనకు అండగా ఉంటూ నొప్పి తెలియనివ్వకుండా చేసి, మందులు, ద్రవాహారం తీసుకునేలా అనుగ్రహించి, తను తొందరగా కోలుకుని మామూలు మనిషి అయ్యేలా చేయండి బాబా. ప్లీజ్ బాబా".


సాయినాథుని మించిన దైవం లేరు


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.


ముందుగా, శ్రీసాయినాథునికి పాదాభివందనాలు. సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు మల్లీశ్వరి. మీతో పంచుకునేందుకు బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలోనుండి ఇంతకుముందు ఒక అనుభవాన్ని పంచుకున్న నేను ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. ఒకరోజు వర్షం వస్తోంది. చేనులో చాలామంది కూలీలు ఉన్నారు. అందరూ పిడుగులు పడుతున్నాయని భయపడుతుంటే నేను బాబాను తలచుకుని, "తండ్రీ, సాయినాథా! చేనులో చాలామందిమి ఉన్నాము నాయనా. మీ దయవలన వర్షం ఆగిపోతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. పది నిమిషాల్లో వర్షం ఆగిపోయింది. అంతా ఆ సాయినాథుని దయ. ఆ తండ్రిని మించిన దైవం లేరు. ఆ తండ్రి మన వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు.


ఇంకో అనుభవం: ఒకసారి మా అమ్మ క్రిందపడి చేతికి, కాలికి దెబ్బలు తగిలాయి. దాంతో అమ్మ చాలా ఇబ్బందిపడింది. కర్ణాటకలో ఉన్న మాకు మా అక్కావాళ్ళ కోడలు ఆ విషయం చెప్పి, అమ్మ చాలా ఇబ్బందిపడుతోందని చెప్పింది. నాకు కంగారుగా అనిపించి, దయామయుడైన సాయితండ్రిని, "తండ్రీ, సాయిప్రభూ! నేను అమ్మ దగ్గరకు వెళ్ళేటప్పటికి అమ్మకున్న సమస్యలన్నీ తీరినట్లైతే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల నేను 20 రోజుల తర్వాత వెళ్ళేటప్పటికి అమ్మకి ఉన్న కొన్ని ఇబ్బందులు తీరాయి. ఇప్పుడు అమ్మ బాగానే ఉంది. నా బిడ్డల పెళ్ళిళ్ళ విషయం బాబానే చూసుకోవాలి. అది నెరవేరితే మళ్లీ నేను నా అనుభవాన్ని పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. తప్పులేమైనా ఉంటే దయతో క్షమించండి బాబా".


ఓం సాయినాథాయ నమః.


పెద్ద ప్రమాదం నుండి అమ్మను కాపాడిన బాబా


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు దిలీప్. మాది జనగాం జిల్లా. 2021, జూలై 5న ఒక పెద్ద ప్రమాదం నుండి బాబా మా అమ్మను ఏ విధంగా కాపాడారో నేనిప్పుడు మీకు వివరిస్తాను. ఆరోజు నేను ఇంట్లో పూజ చేస్తుండగా దేనికోసమో అమ్మ ఇంట్లోనుండి బయటకు వెళ్ళింది. హఠాత్తుగా ఆమె ఉన్నట్టుండి క్రింద పడిపోయింది. అమ్మ ముక్కునుండి, నోటినుండి రక్తం వచ్చింది. ఇంటిముందున్న అక్క అమ్మను లేపుతూ నన్ను పిలిచేసరికి నేను కంగారుగా బయటకు వెళ్ళాను. అప్పటికే అమ్మ తలవాల్చేస్తూ 'బిడ్డా' అంది. నేను వెంటనే తనని మంచం మీద పడుకోబెట్టాను. అమ్మ నాతో, "నేను బ్రతకను బిడ్డా. నా పని అయిపోయింది" అని ఏడవసాగింది. నేను బాబా దగ్గర, "బాబా! అమ్మకి ఏమీ కాకూడదు తండ్రీ" అని చెప్పుకుని కొద్దిగా ఊదీని అమ్మ నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి అమ్మకి ఇచ్చాను. తరువాత అమ్మని తీసుకుని హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ అమ్మని టెస్ట్ చేసి, "ఏమీ కాదు, తనకు షుగర్ లెవల్స్ తగ్గాయి. మందులు వాడండి, సరిపోతుంది" అన్నారు. తరువాత అమ్మ ఎప్పటిలాగే నాతో మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉండసాగింది. నేను, అమ్మ, మా కుటుంబమంతా బాబాకు ఋణపడి ఉంటాము. "ధన్యవాదాలు బాబా".


11 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. 🏵🌺🙏OM SRI SAIRAM 🙏🌺🏵

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼😀

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  8. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  9. Om sai ram sai you always save your devotees with love. That is sai power. We love you baba

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo