సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 861వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కల నిజమైన వైనం
2. పారాయణతో నా భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. ఊదీతో చెల్లెలి భర్తకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
4. వాహన ప్రమాదం నుండి మా అబ్బాయిని కాపాడిన బాబా
5. బాబా దయతో దొరికిన బంగారు గొలుసులు

ఓం శ్రీ సాయినాథాయ నమః.


ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులందరికీ సాయిరామ్! " 'సాయిరామ్' అని చెప్పినందువల్ల విన్నవారికి, అన్నవారికి అంతా శుభం జరుగుతుంది" అని మా గురువుగారు చెప్పారు. నా పేరు శ్రీదేవి. మాది గుంటూరు దగ్గర్లోని ఒక గ్రామం. "నా భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు వాళ్ళను నా దగ్గరకు లాగుతాను" అని బాబా అన్నారు. అలా నన్ను, నా కుటుంబాన్ని కూడా బాబా తమ అనుగ్రహానికి పాత్రులను చేశారు. నా చిన్నతనంలోనే మా అమ్మ బాబాను పూజించేది. నేను కూడా బాబాకు నమస్కరించుకుని, బాబా ఏకాదశ సూత్రాలు చదువుకుని స్కూలుకి వెళ్ళేదాన్ని. 17 సంవత్సరాల వయస్సులో నాకు పెళ్లి నిశ్చయమైంది. మా పెళ్లి శుభలేఖ మీద మా అమ్మ కేవలం బాబా రూపాన్ని మాత్రమే ప్రింట్ చేయించింది. అప్పట్లో నేను ఆ సంగతి గుర్తించలేదుగానీ, వివాహమైన తర్వాత బాబా నన్ను తమ మార్గంలోకి తీసుకున్నాక, ‘నా వివాహం కూడా బాబా సంకల్పమే’ అని తెలుసుకున్నాను. 


కల నిజమైన వైనం: 


ఎక్కడైనా 'కలలో జరిగింది ఇలలో జరగద'ని అంటారు. కానీ నాకు మాత్రం కలలో కనిపించినది నిజంగా జరిగింది. ఆ అనుభవాన్ని ఇప్పుడు చెప్తాను. ఒకరోజు రాత్రి కలలో నాకు ఒక వ్యక్తి కనిపించి, "నీకు రేపు ఒకరు ఒక పుస్తకం తెచ్చిస్తారు. అది నీవు చదువుకుంటే నీకు మంచి జరుగుతుంది" అని చెప్పారు. నేను ఉదయం నిద్రలేవగానే ఆ కలను గుర్తుచేసుకుని, 'కలలో వచ్చింది ఎవరికైనా నిజంగా జరుగుతుందా? సరే చూద్దాం! నిజంగానే ఈరోజు ఎవరైనా నాకు పుస్తకం తెచ్చిస్తే నేను ఈ కలని నిజమని నమ్ముతాను' అనుకున్నాను. అప్పటినుండి 'ఎవరైనా వస్తారా?' అని ఎదురుచూడసాగాను. సాయంత్రం 6 గంటలు అయింది. అప్పుడు నా మనసులో, 'చీకటి పడిపోతోంది, ఇప్పుడు ఇంకెవరొస్తారు పుస్తకం తీసుకుని? అంటే, కలలోనివి నిజంగా జరగవు' అని అనుకున్నాను. అంతలో నాకు తెలిసిన ఒకామె వచ్చి, మా ఇంటి మెట్లమీద కూర్చుని, "శ్రీదేవీ, ఇలా రా!" అని పిలిచింది. నేను, "ఏంటమ్మా?" అంటూ బయటికి వెళ్లి చూస్తే, ఆమె తన చేతిలో ఉన్న పుస్తకాన్ని నాకు చూపించి, "ఇదిగో, ఇది తీసుకో. మా అక్క శిరిడీ వెళ్ళొచ్చింది. ఈ పుస్తకం, ప్రసాదం నాకు ఇచ్చి మా అమ్మాయికి ఇమ్మని చెప్పింది. కానీ నా కూతురు ఏ పూజలూ చేయదు, పుస్తకాలూ చదవదు, నువ్వైతే నిత్యం పూజ చేసుకుంటావు కదా! తీసుకో" అంటూ 'బాబా జీవిత చరిత్ర' పుస్తకం నా చేతిలో పెట్టింది. అంతే! కల నిజమైందని గ్రహించి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. ఆ పుస్తకాన్ని శ్రద్ధగా పారాయణ పూర్తిచేశాను. తరువాత మా అన్నయ్య శబరిమలై వెళ్ళినప్పుడు నాకొక బాబా విగ్రహం తెచ్చిచ్చాడు. అప్పటినుండి నేను బాబాను నిత్యమూ పూజించుకుంటున్నాను.


మా ఊరిలో 'సాయి కన్నయ్య' అనే మా గురువుగారు ఒక సాయిభక్తుల ఇంట్లో బాబా ప్రతిమను పెట్టి విధిగా పూజ, సత్సంగం నిర్వహిస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్లి సత్సంగం వింటూ బాబా సచ్చరిత్ర, సాయిలీలామృతం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ చరిత్ర పారాయణ చేసుకుంటున్నాను. ఒకసారి నేను సాయిలీలామృతం పారాయణ చేస్తున్నప్పుడు, నేను కోరకుండానే మేము ఇల్లు కట్టుకునేలా బాబా మమ్మల్ని అనుగ్రహించారు. అదెలా అంటే, నేను పారాయణ చేస్తుండగా ఉన్నట్టుండి మా మామయ్య "ఈరోజు మంచిరోజు. ఒక ఐదు పెంకులు తీసి, కొబ్బరికాయ కొడదాము" అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. మేమెప్పుడూ డాబా ఇల్లు కట్టుకుందామని అనుకోలేదు. అంతా పారాయణ మహిమ.


పారాయణతో నా భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా: 


ఇంటి నిర్మాణం ప్రారంభించినందువల్ల మా ఇంటికి దగ్గర్లోనే మేము ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటుండేవాళ్ళం. కొద్దిరోజులకు నెమ్మదిగా నా భర్తలో మార్పు వచ్చింది. ఆయన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, తిండి తినకుండా, నిద్రపోకుండా తెల్లవారేదాకా తిరుగుతూ ఉండేవారు. "ఎందుకు పడుకోవట్లేదు?" అని అడిగితే, "నాకు నిద్రపట్టట్లేదు" అనేవారు. మాకు భయమేసి గుంటూరులోనేకాక హైదరాబాదులోని ఒక పెద్ద హాస్పిటల్లో కూడా చూపించాం. అసలు విషయమేమిటంటే, మావారు మా బంధువుల పెస్టిసైడ్ షాపులో పనిచేస్తూ, ఆ షాపు బాధ్యతంతా తనే చూసుకునేవారు. ఆ మందుల ప్రభావం మావారి నరాలపై చూపటం వల్ల ఆయన ఒత్తిడికి గురై నిద్రపోలేకపోతున్నారని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు, ఇక ఆ షాపుకి వెళ్లొద్దనీ, ఒక సంవత్సరం దాకా మంచిగా మందులు వాడితేగానీ ఆరోగ్యం కుదుటపడదనీ చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి, ఆహారం విషయంలో చాలా నిబంధనలు చెప్పారు. ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటేనే మావారు నిద్రపోయేవారు, లేకుంటే లేదు. అయితే, డాక్టర్లు చెప్పినా వినకుండా మావారు మొండిగా ఆ షాపుకి వెళ్తానన్నారు. దాంతో సరైన ఆహారం లేకపోవడం వల్లా, స్లీపింగ్ పిల్స్ వల్లా మావారు చాలా నీరసించిపోయారు. ఇలా మూడు నెలలు గడిచిన తరువాత ఒకరోజు రాత్రి 8.30 సమయంలో నేను బాబా గుడినుండి ఊదీ, ప్రసాదం తీసుకొచ్చి మావారికిచ్చాను. మరుసటిరోజు ఉదయం మావారు నిద్రలేచాక నాతో, "రాత్రి ఇంటికెప్పుడు వచ్చావు? నేను నీకోసం చాలాసేపు ఎదురుచూసి తర్వాత పడుకున్నాను" అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసి, 'అదేమిటి? నేను గుడినుండి వచ్చి ప్రసాదం కూడా ఇచ్చాను కదా! ఏమీ తెలీనట్లు అడుగుతున్నారు? బహుశా టాబ్లెట్ ప్రభావం వల్ల నేను గుడినుండి వచ్చిన సంగతి గుర్తులేదేమో' అని అనుకున్నాను. 'ఇది సరేగానీ, రోజూ షాపుకి వెళ్తున్నారు కదా, ఎవరికైనా డబ్బులిచ్చి మర్చిపోతే ఏమిటి పరిస్థితి?' అని భయమేసింది. వెంటనే మావారితో, "ఇకనుండి మీరు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవద్దు. వేసుకుంటే నా మీద ఒట్టే. మీ ఆరోగ్యం సంగతి బాబానే చూసుకుంటారు" అని ఖచ్చితంగా చెప్పేశాను. తరువాత అన్ని మందులూ ప్రక్కన పడేశాను. అప్పటినుండి రోజూ మావారికి బాబా ఊదీ పెట్టి, ఆయన చేత గురుచరిత్ర, సాయిలీలామృతం పారాయణ చేయించేదాన్ని. రోజూ పడుకునేటప్పుడు నేను మావారి మంచం దగ్గర కూర్చుని సాయిలీలామృతం చదివి వినిపించేదాన్ని. బాబా లీలలు వింటూ వింటూ ఏ సమయానికో నిద్రపోయేవారు. ఒక్కోరోజు వేకువఝామున నాలుగుగంటల వరకు చదువుతుండేదాన్ని. అప్పుడు నిద్రపోయేవారు. చదివి చదివి నాకు ఎంత అలసటగా ఉన్నాసరే, మావారు నిద్రపోతే చాలు అనుకునేదాన్ని. అలా రోజూ బాబా లీలలు వినడం ద్వారా కొన్నిరోజులకి రాత్రి 11 గంటలకే నిద్రపోవడం మావారికి అలవాటైంది. అప్పటినుండి తనంతట తనే ఫోన్లో బాబా పాటలు వింటూ నిద్రపోయేవారు. ఇదంతా బాబా మహత్యం. నెలకు పదివేల రూపాయలు హాస్పిటల్ ఖర్చును తప్పించి, తమ పారాయణతోనే మావారి వ్యాధిని తగ్గించేశారు బాబా. ఇంతకంటే ఏం కావాలి? ఈరోజుకీ మావారు అనుక్షణం బాబా స్మరణలోనే గడుపుతున్నారు. నా మాంగల్యాన్ని కాపాడిన నా సాయితండ్రికి నేను జన్మజన్మలూ ఋణపడివుంటాను.


ఊదీతో చెల్లెలి భర్తకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా:


అటు పుట్టింటివైపు నుండి, ఇటు మెట్టినింటివైపు నుండి బంధువులందరి ప్రేమానురాగాలను అందించి నాకు ఏ లోటూ లేని జీవితాన్ని ప్రసాదించారు నా బాబా. నాకు ఒక చెల్లెలు, అన్నయ్య ఉన్నారు. మేము ముగ్గురం చిన్నప్పటినుండి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. పెళ్లిళ్లు అయ్యాక కూడా అందరమూ ఒకే ఊరిలో ఉంటున్నందువల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరితో ఒకరు పంచుకుని ఓదార్చుకుంటుంటాము. 2019లో మా చెల్లెలి భర్త తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు తన ఆరోగ్యం కోసం నేను, చెల్లి బాబా పారాయణ చేశాము. మా చెల్లి ప్రతిరోజూ మా మరిదికి బాబా ఊదీని పెట్టి, ఊదీతీర్థాన్ని ఇస్తుండేది. అలా మేము బాబానే నమ్ముకున్నాము. బాబా మా అన్నయ్య ద్వారా మా మరిదికి ఒక మంచి హాస్పిటల్లో చికిత్స చేయించారు. బాబా ఊదీతోపాటు మందులు వాడుతుండటం వల్ల మా మరిది అతి కొద్దిరోజుల్లోనే అనారోగ్యం నుండి బయటపడ్డాడు. ఆ సమయంలో మంచి వైద్యాన్ని అందించి బాబా మాపై చాలా అనుగ్రహాన్ని వర్షించారు. ఇప్పుడు మా చెల్లి ప్రతిరోజూ గురుచరిత్ర చదువుతూ, బాబా ఊదీని నీళ్ళలో కలిపి తీర్థంగా తన భర్తకి, కొడుకుకి ఇస్తూ బాబా నీడలో ఆనందంగా జీవితం గడుపుతోంది.


వాహన ప్రమాదం నుండి మా అబ్బాయిని కాపాడిన బాబా:


మాకు ఒక పాప, బాబు. బాబు బీ.టెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. పాప ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈమధ్య మా అబ్బాయి ఉద్యోగ నిమిత్తం ఒక కంపెనీకి వెళ్ళాడు. తను వ్రాతపరీక్షకి వెళ్లేముందు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! తనకు ఏది మంచిదైతే అది చేయండి. ‘ఈ కంపెనీలోనే ఉద్యోగం ఇవ్వండి’ అని నేను అడగను. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ మీకు మాత్రమే తెలుసు" అని చెప్పుకుని, ఊదీతీర్థాన్ని మా అబ్బాయికి ఇచ్చి పంపించాను. తను తిరిగొచ్చి, వ్రాతపరీక్ష పాసయ్యాననీ, ఇంటర్వ్యూ కూడా బాగా జరిగిందనీ, పదిరోజుల్లో రిజల్ట్ చెప్తారని చెప్పాడు. ఉద్యోగం వచ్చేదీ లేనిదీ ఇక అంతా బాబా నిర్ణయం.


ఇకపోతే, ఒక సంవత్సరం క్రిందట మా అబ్బాయి తన ఫ్రెండ్ కజిన్ పెళ్లికి బండిమీద ప్రక్కఊరికి వెళ్ళాడు. నాకు బాగా గుర్తు, ఆరోజు గురువారం. అప్పుడు రాత్రి తొమ్మిది గంటలవుతోంది. నేను గుడినుండి ఇంటికి వచ్చిన తర్వాత, "పెళ్ళికి వెళ్లిన బాబు ఇంకా రాలేదా?" అని మావారిని అడిగాను. మావారు, "ఇంకా రాలేదు. వస్తాడులే, బండి ఉంది కదా!" అని అన్నారు. అంతలో మావారికి ఫోన్ వస్తే, నాకు ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. కొంతసేపటికి మా అబ్బాయితోపాటు లోపలికి వచ్చారు. చూస్తే, మా అబ్బాయి మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. "ఏమైంది?" అని అడిగితే, "పెళ్లినుండి తిరిగి వస్తుంటే, నా ఫ్రెండ్ తనని ప్రక్కఊరిలో దింపమని అడిగాడు. అందువలన మన ఊర్లో ఆగాల్సిన నేను తనకోసం ప్రక్కఊరికి వెళ్తుంటే కుక్క అడ్డమొచ్చి ప్రమాదం జరిగింది. బండి మీదనుండి పడిపోయాను" అని చెప్పాడు. బాబా దయవలన మా అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలతో గండం తప్పింది. కానీ, బండి నడుపుతున్న తన ఫ్రెండ్ కాలికి మాత్రం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పాపం, తను కాలేజీకి వెళ్లలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అంత ప్రమాదం నుండి బాబానే మా అబ్బాయిని రక్షించారు. బాబా నామం, బాబా ఊదీ, బాబా చరిత్ర పారాయణ మా కుటుంబమంతటినీ సర్వదా కాపాడుతున్నాయి.


బాబా దయతో దొరికిన బంగారు గొలుసులు:


2021, జూలై 1, గురువారంనాడు ఒక సాయిబంధువు నా వద్దకు వచ్చి, "నేను ‘నవ గురువార వ్రతం’ చేసుకుంటున్నాను. ఈరోజు ఆఖరి గురువారం. మా ఇంటికొచ్చి ప్రసాదం, తాంబూలం తీసుకుని వెళ్ళండి" అని ఆహ్వానించింది. నేను 9 గంటలకల్లా వాళ్ళింటికి వెళ్లి, బాబా పూజామండపం అలంకరణలో నా వంతు సహాయం చేశాను. తరువాత పూజ బాగా జరిగింది. బాబా పాటలు పాడుకుని, వ్రత కథ చదువుకుని, బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకోవడంతో ఒక చక్కటి సత్సంగం జరిగింది. అందరమూ బాబా ఊదీ, ప్రసాదం, తాంబూలం తీసుకుని సంతోషంగా ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్లిపోయాం. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి, "నువ్వేమన్నా పూజకి వెళ్ళావా? ఆ రంగమ్మ అత్తయ్య గొలుసు పోయిందట. ఎంత వెతికినా దొరకలేదట. పూజ జరిగినరోజు రాత్రి పోయిందట" అని చెప్పింది. 'పూజ చేసుకోవడం ఏంటి? ఆరోజే గొలుసు పోవడమేంటి?' అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కూడా కలిగింది. వెంటనే వాళ్ళింటికి వెళ్లాను. రంగమ్మ అత్తయ్య నన్ను చూస్తూనే ఏడుస్తూ, "పూజ జరిగినరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్నానం చేసేముందు తాడు, నల్లపూసలు తీసి ఒకచోట పెట్టి వెళ్ళాను. తర్వాత వచ్చి చూస్తే అవి అక్కడ లేవు. బీరువా మొదలుకుని ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇంట్లోకి ఎవరూ రాలేదు" అని చెప్పింది. ఆమె గురువారం మధ్యాహ్నం తీసుకున్న ప్రసాదం తప్ప, శనివారం మధ్యాహ్నం దాకా ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉందని ఆమె తోడికోడలు చెప్పింది. అప్పుడు నేను, "అత్తా! 'ఖాళీ కడుపుతో ఉంటే ఏ పనీ సవ్యంగా జరగదు' అని బాబా అంటారు కదా! నువ్వు ముందు కడుపునిండా తిని, ప్రశాంతంగా నిద్రపో. తరువాత నెమ్మదిగా ఎక్కడ పెట్టావో ఆలోచించు. ఇంట్లోకి ఎవరూ రాలేదంటున్నావు కాబట్టి గొలుసులు ఇంట్లోనే ఎక్కడో ఉంటాయి. తప్పకుండా దొరుకుతాయి. నేను కూడా, 'గొలుసులు దొరికేటట్లు చేయండి బాబా. నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను' అని బాబాతో చెప్పుకుంటాను" అని ఆమెతో చెప్పాను. మరుసటిరోజు ఆదివారం ఉదయం మళ్లీ వెతకగా గొలుసులు ఇంట్లోనే కనిపించాయి. అంతకుముందు కూడా ఆ చోటులో వాళ్ళ బంధువులు చాలా వెతికారు. కానీ అప్పుడు అవి కనిపించలేదు. వెంటనే ఆమె నా వద్దకొచ్చి బాబా అనుగ్రహాన్ని నాతో సంతోషంగా పంచుకుంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀🌼😊

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba santosh ki putra santanam kalagali thandri

    ReplyDelete
  7. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo