సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 875వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి అనుగ్రహ దీప్తులు
2. నిజంగా సాయి అనుగ్రహమే!

సాయి అనుగ్రహ దీప్తులు


సాయిబంధువులకు, ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు దీప్తిరెడ్డి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నింటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. 


మొదటి అనుభవం: ఒకసారి, శిరిడీలో ఉండే సాధకులు ఒకరు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము వెళ్ళి వారిని కలిశాము. వారు నాతో ‘శ్రీసాయిలీలామృతం పారాయణ చేయమ’ని చెప్పారు. కానీ, నేను ‘పారాయణ చేయాలా, వద్దా’ అనే సందిగ్ధంలో ఉండి పారాయణ ప్రారంభించలేదు. ఆ తర్వాత ఒకరోజున, ‘ఈ గురువారం పారాయణ ప్రారంభిద్దామ’ని అనుకున్నాను. అదేరోజు ఉదయం ఒక సాయిబంధువు శ్రీసాయిలీలామృతం పారాయణతో తనకు కలిగిన అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నారు. అది చూసి, పారాయణ చేయడానికి బాబా ఆజ్ఞ లభించిందని భావించి శ్రీసాయిలీలామృతం పారాయణ చేశాను.


రెండవ అనుభవం: మే నెలలో నా స్నేహితురాలి నాన్నగారు మరణించారు. ఆ తర్వాత నేను తనను కలవడానికి వెళ్ళి వచ్చాను. రెండు రోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసి, “మా అందరికీ కరోనా వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి” అని చెప్పింది. దాంతో నాకు చాలా భయంవేసి, బాబా ఊదీని పెట్టుకుని, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, ‘నాకు కరోనా సోకకుండా కాపాడమ’ని బాబాను ప్రార్థించాను. ఆ తండ్రి దయవలన నాకు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.


మూడవ అనుభవం: ఒకసారి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం రిజిస్టర్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఎంతకీ యాప్‌లో రిజిస్టర్ కావటం లేదు. ఇప్పుడెలాగా అని బాధపడుతుంటే మా ఫ్రెండ్ తనకు తెలిసినవారి ద్వారా నాకు కోవాక్సిన్ టీకా మొదటి డోస్ వేయించారు. బాబా దయవల్ల ఎటువంటి నొప్పీ లేకుండా పనులు చేసుకోగలిగాను. ఒక నెలరోజుల తర్వాత రెండవ డోస్ వేయించుకుందామంటే ఎక్కడా కోవాక్సిన్ ఇవ్వడం లేదు. ‘కేవలం మొదటి డోస్ మాత్రమే ఇస్తున్నార’ని చెప్పారు. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మొదటి డోస్ మీరే ఇప్పించారు. రెండవ డోస్ కూడా మీరే ఎలాగైనా ఇప్పించండి” అని వేడుకున్నాను. మొదటి డోస్ తీసుకున్న 35 రోజులకి మళ్ళీ అంతకుముందు సహాయం చేసినవారి ద్వారానే రెండవ డోస్ కూడా ఇప్పించారు బాబా. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


నాలుగవ అనుభవం: ఒకసారి నేను ‘శ్రీపాదశ్రీవల్లభ చరితామృతము’ ఒక సప్తాహం పారాయణ చేశాను. పారాయణ ప్రారంభించిన మొదటిరోజున, ‘పుస్తకం మొత్తం చదవలేనేమో’నని భయపడి బాబాతో, “ఎలాగైనా మీరే నాచేత ఈ గ్రంథపారాయణ పూర్తిచేయించాలి” అని వేడుకున్నాను. బాబా ఎంతో దయతో మరుసటి బుధవారానికల్లా నాచేత పారాయణ పూర్తిచేయించారు. ఆ తర్వాత ఒక గ్రూపులో ‘శ్రీపాదశ్రీవల్లభ చరిత్ర పారాయణ ప్రతిరోజూ ఒక అధ్యాయం చదవాల’ని మెసేజ్ వచ్చింది. అది చూసి, ‘స్వామి తన చరిత్రను మళ్ళీ పారాయణ చేయమని చెప్తున్నార’ని భావించి ఆ గ్రూపులో చేరి, ఏప్రిల్ 29 నుండి జూన్ 20 వరకు నిష్ఠగా పారాయణ చేశాను. ఇందులో పెట్టిన క్విజ్ పోటీలో బహుమతిగా నాకు చక్కని శ్రీపాదులవారి ఫోటో వచ్చింది. దాదాపు 50 మంది పారాయణ చేస్తే కేవలం ఆరుగురికి బహుమతులు వచ్చాయి. అందులో నేను ఒకదానిని. అంతేకాదు, ఈ సమయంలోనే బాబా ఆశీస్సులతో నాకు శిరిడీ నుండి పాదుకలు, ఊదీ ప్రసాదంగా వచ్చాయి.


అయిదవ అనుభవం: ఒకసారి మా అత్తమ్మ పాన్ కార్డును మా మామయ్య ఎక్కడో పెట్టి మర్చిపోయారు. దాదాపు సంవత్సరం నుండి ఆ కార్డు కోసం వెతుకుతున్నారు, కానీ కనిపించటం లేదు. క్రొత్త కార్డ్ కావాలంటే కనీసం పాన్ కార్డ్ నెంబర్ అయినా కావాలని చెప్తున్నారు. అప్పుడు, బాబాను ప్రార్థించి, ‘ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః’ అని జపిస్తే తాము పోగొట్టుకున్న వస్తువులు దొరికాయి’ అని ఈ బ్లాగులో కొందరు సాయిబంధువులు పంచుకున్న అనుభవాలు గుర్తుకువచ్చి, నేను, పిల్లలు, మా అత్తమ్మ అందరం బాబాను పార్థించి, ‘ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః’ అని జపం చేశాము. అంతేకాకుండా, ‘కార్డు దొరికితే బాబాకు మూడు కొబ్బరికాయలు సమర్పిస్తామ’ని కూడా మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఒక వారం రోజుల లోపు ఆ కార్డు బట్టల క్రింద దొరికింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని నా మ్రొక్కు తీర్చుకున్నాను.


ఆరవ అనుభవం: 2021, జులై 10వ తేదీ శనివారంనాడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పూర్తయ్యాక ఫోనులో వాట్సాప్ మెసేజెస్ చూసుకుని, తర్వాత పవర్ బటన్ నొక్కి ఫోన్ ఆఫ్ చేశాను. కాసేపయ్యాక మళ్ళీ ఏదో కాలిక్యులేషన్ కోసం ఫోన్ ఆన్ చేసేసరికి ఫోన్ స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయి, కేవలం Samsung అని వస్తోంది. అది చూసి, “ఫోన్ పాడయింది, ఇక నాకెవరు ఇంకో ఫోన్ ఇప్పిస్తారు?” అని బాబా ముందు బాగా ఏడ్చాను. తర్వాత దగ్గరలో ఉన్న రిపేర్ షాపులో చూపిస్తే ‘రిపేర్ చేయడానికి ఒకరోజు పడుతుంద’న్నారు. సరేనని సోమవారం అక్కడికి వెళ్ళి ఫోన్ ఇచ్చి వచ్చాను. మరుసటిరోజు వాళ్ళకు కాల్ చేస్తే, “ఫోన్ బాగవటం లేదు, వచ్చి తీసుకెళ్ళండి” అన్నారు. నేను వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటుంటే, ‘ఒకసారి శాంసంగ్ సర్వీస్ సెంటర్లో ట్రై చేయండి’ అని చెప్పారు వాళ్ళు. దాంతో శాంసంగ్ సర్వీస్ సెంటరుకి వెళితే వాళ్ళు, ‘సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ అయితే రిపేర్ చేయడానికి ఖర్చు తక్కువే అవుతుంది. అదే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ అయితే రిపేరుకు 7,000 రూపాయల వరకు ఖర్చువుతుంది’ అని అన్నారు. సరేనని ఫోన్ రిపేరుకు ఇచ్చాను. తరువాత నా స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా మందిరానికి వెళ్ళి తన పేరున అర్చన చేయించాము. అప్పటినుండి శుక్రవారం ఉదయం శాంసంగ్ వారి మెసేజ్ చూసి వెళ్ళి ఫోన్ తెచ్చుకునేవరకు టెన్షన్ పడుతూ సాయినామజపం చేసుకున్నాను. ఆ చల్లని తండ్రి దయవల్ల సర్వీస్ సెంటర్ వాళ్ళు, ‘అది కేవలం సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్’ అని చెప్పి తక్కువ ధరలో ఫోనుని బాగుచేసి ఇచ్చారు. నా మొర ఆలకించి, తక్కువ ధరలో ఫోను రిపేరయ్యేలా చేసినందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


నిజంగా సాయి అనుగ్రహమే!


ముందుగా సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చిన సాయిబాబాకి నా ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు. మాది విజయవాడ. నేను పదవీవిరమణ చేసిన ప్రైవేట్ ఉద్యోగినైనందున నాకు పెన్షన్ ఏమీ రాదు. నాకు వచ్చే అద్దె డబ్బులతోనే నేను నా జీవితం సాగిస్తున్నాను. అయితే, ఈమధ్య వచ్చిన కరోనా వల్ల మేము అద్దెకిచ్చిన ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. దాంతో అద్దె డబ్బులు లేనందున మా జీవనం కష్టమైంది. అప్పుడు నేను భగవాన్ సాయిని, "ఎలాగైనా సరే, తొందరగా మా ఇళ్ళల్లోకి ఎవరో ఒకరు అద్దెకు వచ్చేలా అనుగ్రహించి మా కష్టాలు తీర్చమ"ని ప్రార్థించాను. సాయి మా మొర ఆలకించారు. ఒక్క వారం రోజుల్లోనే మా అన్ని ఇళ్ళల్లోకీ అద్దెకు వచ్చే విధంగా అనుగ్రహించారు. ఇది నిజంగా సాయి అనుగ్రహమే! ఎందుకంటే, మా కాలనీలో చాలా ఇళ్ళు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. నిజానికి ఎవరూ అద్దెకు రావడం లేదు. కానీ నా సాయి నా ప్రార్థన విని మాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశారు. అందుకు బాబాకు మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.


9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼❤

    ReplyDelete
  3. Om Sairam
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba santosh health, Carrier bagundali thandri

    ReplyDelete
  7. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo