1. చల్లగా చూస్తున్న బాబా
2. సరైన సమయంలో బాబా అనుగ్రహం తప్పక లభిస్తుంది
3. బాబా కృపతో 18 ఏళ్ళ తరువాత పూర్తయిన డిగ్రీ
చల్లగా చూస్తున్న బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాపేరు కృష్ణవేణి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య మా మామయ్యకు గుండెలో సమస్య వస్తే హాస్పిటల్లో చేర్పించాము. అక్కడ ఆయన మూడు రోజులపాటు ఐ.సి.యులో ఉన్నారు. డాక్టర్లు టెస్టు రిపోర్టులు వస్తేగాని ఏమీ చెప్పలేమన్నారు. నాకు చాలా భయమేసి వెంటనే, "బాబా! రిపోర్టులలో సమస్య ఏమీ లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. ఇంకా మామయ్యకు నయం కావాలని అనుకుంటూ ప్రతిరోజూ ఊదీ నా నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీ నోటిలో వేసుకుంటూండేదాన్ని. బాబా దయతో ఆయనకు గండం తప్పింది. డాక్టరులు మందులిచ్చి ఇంటికి పంపారు. ఆ కష్టసమయాన్ని తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. కానీ బాబా మా కుటుంబాన్ని చల్లగా చూసారు.
పది సంవ్సరాలుగా మా ఇంటిలో ఒక ఆంటీ పని చేస్తుంది. ఆవిడ కూతురు పెళ్ళైన తరువాత భర్తతో విడాకులు తీసుకుంది. తరువాత తనకి మళ్లీ పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తే, ఒక సంబంధం కుదిరింది. అప్పుడు నేను, 'రెండో పెళ్లితో ఆ అమ్మాయి సంతోషంగా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆ అమ్మాయి ఇప్పుడు సంతోషంగా ఉంది.
ఈ మధ్య మావారు శబరిమల వెళ్ళారు. అప్పుడు నేను, 'ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మావారు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల మావారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని చూపు మా కుటుంబంపై సదా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను, వాడిని చల్లగా అనుగ్రహించండి బాబా. నా కడుపులో ఉన్నప్పటినుంచి వాడు ఆరోగ్యపరంగా చాలా బాధలు పడుతున్నాడు. వాడి మీద దయ చూపి వాడికి అన్నీ మీరై చూసుకోండి తండ్రి. వాడి ఆరోగ్యం మంచిగా అయి సన్మార్గంలో నడిచేటట్లు అనుగ్రహించండి బాబా. చివరిగా నేను ఏమైనా తప్పులు చేసుంటే క్షమించండి సాయీ".
అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ!!
పాహిమాం, రక్షమాం... సాయీశ్వరా!!!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సరైన సమయంలో బాబా అనుగ్రహం తప్పక లభిస్తుంది
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. పిలిస్తే పలికే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సాయిబాబానే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన దైవం బాబానే. నా జీవితంలో ఎదురైన ప్రతి కష్ట, నష్టాల్లో బాబా తోడున్నారు. అలానే బాబా నన్ను చివరికంటా గమ్యం చేరుస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఇకపోతే బాబా దయవలన ఆయన నాకు ప్రసాదించిన చాలా అనుభవాలను నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా చదువు పూర్తిచేసిన తర్వాత కరోనా కారణంగా చాలా రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నా ఉద్యోగం కోసం బాబాను చాలాసార్లు అడిగాను. "నిర్దేశించబడిన సమయంలో కోరుకున్నది వస్తుంది" అనే విధంగా బాబా నాకు కొన్ని సూచనలిస్తుండేవారు. నేను బాబాపై విశ్వాసంతో ఆయన అనుగ్రహం కోసం ఎంతగానో ఎదురు చూసాను. ఆరోజు రానే వచ్చింది. అనుకోకుండా నేను అదివరకు దరఖాస్తు చేసుకున్న ఒక కంపెనీ నుంచి నాకు జాబ్ ఆఫర్ చేస్తూ ఫోన్ కాల్ వచ్చింది. నేను అసలు నమ్మలేకపోయాను. నిజానికి నా చదువు పూర్తయిన తరువాత నాకు ఒక ఉద్యోగం వచ్చింది. అయితే నేను ఆ ఆఫీసులో ఒకరోజు పనిచేసి అక్కడి వాతావరణం నచ్చక మానేశాను. కానీ వచ్చిన అవకాశాన్ని అనవసరంగా వదులుకున్నానా అని బాధపడ్డాను. అయితే సరిగ్గా ఆ సమయంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అందుకే నా క్షేమం దృష్ట్యా బాబానే నేను ఆ ఉద్యోగాన్ని వదులుకునేలా చేశారు అనుకున్నాను. ఇప్పుడు సరైన సమయంలో బాబా నాకు ఉద్యోగం ఇచ్చారు. ముఖ్య విషయం ఏమిటంటే, నేనిప్పుడు ఉద్యోగం చేసే చోట అందరూ బాబా భక్తులే. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకరోజు నేను ప్రయాణిస్తుండగా హఠాత్తుగా నాకు విపరీతమైన దగ్గు మొదలైంది. నా వలన తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నందుకు నేను చాలా బాధపడి, "బాబా! మీ దయవలన దగ్గు ఆగిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను మనసులోనే ప్రార్థించాను. ఆయన దయవల్ల కొద్ది నిమిషాల్లో దగ్గు ఆగిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
బాబా కృపతో 18 ఏళ్ళ తరువాత పూర్తయిన డిగ్రీ
సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నాపేరు శ్రీవాణి. బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. 18 ఏళ్ళ క్రిందట నేను డిగ్రీ పూర్తి చేయకముందే నాకు వివాహం అయింది. దాంతో నేను నా డిగ్రీ పూర్తి చేయలేకపోయాను (మూడు సబ్జెక్టులు ఉండిపోయాయి). గత సంవత్సరం నాకు డిగ్రీ పూర్తి చేయాలనిపించి డిగ్రీ కళాశాలకు వెళ్లి అడిగితే, "ఐదు సంవత్సరాలలో డిగ్రీ పూర్తి చేయకపోతే అదివరకు పూర్తి చేసిన డిగ్రీ చదువు రద్దు అయిపోతుంది. మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే" అని చెప్పారు. అది విని నేను చాలా బాధపడ్డాను. ఇంక చేసేదిలేక ఆ సాయినాథుని తలుచుకుని డిగ్రీ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాను. ఇలా ఉండగా ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన సింగల్ సిట్టింగ్ పేరుతో 20 సంవత్సరాలుగా డిగ్రీ పూర్తిచేయని వారికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వచ్చింది. అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది. వెంటనే ఆ సాయినాథుని తలుచుకుని డిగ్రీ పరీక్షకు ఫీజు కట్టాను. అయితే పరీక్షకు ప్రిపేర్ కావడానికి 18 సంవత్సరాల క్రితం నాటి సిలబస్ బుక్స్ దొరకలేదు. అయినా నేను బాబా మీద నమ్మకంతో పరీక్షలు వ్రాసి, "బాబా! నేను వ్రాసిన మూడు సబ్జెక్టులలో నేను ఉత్తీర్ణురాలినయ్యేలా అనుగ్రహించండి. 18 సంవత్సరాల తరువాత వ్రాసిన ఈ పరీక్షలలో నేను పాస్ అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా మీద దయతో నన్ను ఆ పరీక్షలలో ఉత్తీర్ణురాలిని చేసారు. అలా 18 సంవత్సరాల క్రితం పూర్తిచేయలేని డిగ్రీ ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన పూర్తి చేయగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అన్నివిధాలా బాబా మా కుటుంబానికి రక్షణగా ఉంటూ మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మీ కరుణ, కటాక్షాలు మా మీద ఉండాలి. ఇంకా మా కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో ఉండేలా అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. కరుణించు సాయి. ప్రణామాలు బాబా".
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
