1. అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం
2. 'ఊదీ'యే దివ్య ఔషధం
3. బాబాకు మ్రొక్కుకున్నంతనే దొరికిన ఉంగరం
అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం
ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహరాజు'కు నా శతకోటి వందనాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇదివరకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. నేను నా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్లి సాయినాథుని దర్శించుకోవాలని గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను. కాని కరోనా కారణంగా మా ఆశ నెరవేరలేదు. ఆఖరికి 2021లో మా పిల్లల సంక్రాంతి సెలవుల్లో ఎలాగైనా శిరిడీ వెళ్ళాలని అనుకున్నాము. అయితే మహారాష్ట్రలో కరోనా ప్రభావముందని తెలిసి కాస్త భయమేసినప్పటికీ 'బాబా ఉన్నారు. ఆయన మనకి తోడుగా ఉంటారు' అనుకున్నాము. ఇకపోతే మేము ఆరతి సమయంలో బాబా సమక్షంలో ఉండాలని ఆశపడ్డాము. అయితే దర్శనం మరియు ఆరతి టికెట్లు ఆన్లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉండటంతో నేను శిరిడీ సంస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరతికి టికెట్లు బుక్ చేద్దామని ప్రయత్నించాను. కానీ టికెట్ స్లాట్లు అయిపోయాయని వచ్చింది. మూడు రోజులు ప్రయత్నించినా అలాగే జరిగింది. దాంతో నాకు చాలా బాధేసినప్పటికీ, 'పోనిలే, బాబా మనకు దర్శనం ఇస్తారు' అని దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకుని శిరిడీకి బయలుదేరాము. అక్కడికి చేరుకున్నాక సాయి మాకు తమ మహత్యం చూపారు. మేము ముందుగా అనుకున్నట్లు డొనేషన్ కౌంటరుకి వెళ్లి అన్నదానానికి డొనేషన్ కట్టాము. ఆ కౌంటరులో ఉన్న అతని రూపంలో సాయి మాకు ఎంత చల్లని వార్త చెప్పారంటే, అది విని మేము ఎంతో సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాము. అసలు విషయమేమిటంటే, 'డొనేషన్ కట్టే వాళ్ళకి రెండు ఆరతులకు మరియు దర్శనానికి అనుమతిస్తారట'. మాకు ఎంతమాత్రం తెలియని విషయం ఇది. ఆన్లైన్‌లో ఎంత ప్రయత్నించినా దొరకని ఆరతి టికెట్లు బాబా సన్నిధిలోకి రాగానే ఒక ఆరతి కాదు రెండు ఆరతులకు, దర్శనానికి అవకాశం ఇవ్వడం బాబా మాపై కురిపించిన గొప్ప అనుగ్రహమని, మాకు ఎంతటి భాగ్యం దక్కిందని మేము ఎంతో సంతోషించాము. బాబా లీలలు అత్యంత అద్భుతంగా ఉంటాయనడానికి ప్రత్యక్ష నిదర్శనమిది. మనకు ఏది అవసరమో ముందే తెలిసిన బాబా సరైన సమయంలో మనల్ని అనుగ్రహిస్తారు. "నేను ఆశపడిన దానిని మాకిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రి".
తరువాత మధ్యాహ్న ఆరతికి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము ఆరతి సమయానికి లైన్‍లో వెళ్ళి బాబా ముందు నిల్చున్నాము. ఇంకా ఆరతి మొదలు కాలేదు. మేమంతా తదేకంగా బాబాను చూస్తుండగా కొన్ని క్షణాల్లో ఆరతి మొదలైంది. అందరూ తన్మయత్వంతో ఆరతి పాడుతున్నారు. నేను కూడా బాబాను చూస్తూ ఆరతి పాడుతున్నాను. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. బాబా మూర్తి యొక్క స్థానంలో బాబా ఒరిజినల్ రూపంతో నాకు దర్శనం ఇచ్చారు. ఒక్కసారిగా బాబా ముఖం పెద్దదై, నా వైపే చూస్తూ తమ స్థానంలో నుంచి లేస్తూ కనిపించారు. నేను అయోమయంగా ఒకసారి కనులు మూసి, తెరిచి మళ్ళీ బాబాను చూశాను. బాబా ఎప్పటిలానే మామూలుగా ఉన్నారు. కానీ బాబా దర్శనం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. "దన్యవాదాలు బాబా. మీరు మీ సమాధి నుండి సమాధానం ఇస్తానని అన్నారు. అది అక్షరాలా నిజం".
మేము శిరిడీ నుండి ఇంటికి వచ్చాక నాకు అలసటగా అనిపించి పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి జ్వరం కూడా ఉంటే, 'ఇది మామూలు జ్వరమే' అని ఒక టాబ్లెట్ వేసుకున్నాను. కానీ జ్వరం తగ్గలేదు. పైగా హెచ్చుతగ్గులు అవుతుంది. దానికి తోడు వాసన కూడా తెలియలేదు. అసలే కరోనా సమయం కదా! నాకు భయమేసి, "బాబా! నాకు వాసన తెలియటం లేదు. నాకు ఏమి కాకూడదు. అన్నిటికి మీరే మాకు దిక్కు" అని బాబాను ప్రార్థించి నా కారు వాష్ చేయించడానికి తీసుకుని వెళ్లి అక్కడ ఒక ప్రక్క కూర్చున్నాను. అప్పటివరకు ఏ వాసన తెలియని నాకు ఉన్నటుండి రెండు సెకన్ల పాటు ఏదో అగరుబత్తి వాసన వచ్చింది. "నీకు నేను ఉన్నాను. నీకు ఏమీ కాదు" అని సాయి నాకు సూచన ఇస్తున్నారనిపించింది. నేను ఇంటికి తిరిగి వచ్చాక బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని మూడు పూటలా త్రాగాను. రెండు రోజుల్లో జ్వరం తగ్గి వాసన కూడా తెలిసింది. ఆ సాయినాథుడు మనకు తోడు ఉండగా మనకేమీ కాదని నాకు అర్ధమైంది. నాకు జ్వరం తగ్గితే బ్లాగులో పంచుకుంటానని సాయికి మాటిచ్చినట్లు ఇప్పుడిలా మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
'ఊదీ'యే దివ్య ఔషధం
ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే దైవం మన సాయితండ్రి. ఆయన ప్రతిక్షణమూ తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. అణువణువునా అంతటా వ్యాపించివున్న ఆ బ్రహ్మాండనాయకుడికి నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి బందువులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు కూడా నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. నాకు ఏ సమస్య వచ్చినా బాబాకు విన్నవించుకోవడం, ఆయన నన్ను అనుగ్రహించడం, ఆపై నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పటి నుండి 'బాబా' నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. మా నాన్నగారికి నాలుగు సంవత్సరాల నుండి భుజం దగ్గర ఒక గడ్డ ఉంది. అయితే నొప్పి లేకపోవటం వల్ల నాన్న ఆ గడ్డ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఆ గడ్డ లోపలి భాగంలో ఇన్ఫెక్షన్‍లా అయి నాన్న నొప్పిని భరించలేకపోయారు. అప్పుడు నేను, "బాబా! నాన్నకి వచ్చిన గడ్డ తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. నాన్న ఆ గడ్డపై బాబా ఊదీ రాస్తూ డాక్టరు ఇచ్చిన మందులు వేసుకోసాగారు. బాబా దయవల్ల కొన్నిరోజులకి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది.
మా అమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. తనకి పరీక్షల సమయంలో బాగా 'స్కిన్ అలర్జీ' వచ్చింది. తనని ఇంటికి పంపమని అడిగితే కాలేజీవాళ్ళు, "పరీక్షలు జరుగుతున్నందున ఇప్పుడు పంపమ"ని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు నేను, "బాబా! మా అమ్మాయి చాలా కష్టపడి చదువుతుంది. తనకి పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి, చక్కగా పరీక్షలు వ్రాసేలా అనుగ్రహించండి. తనకి త్వరగా అలర్జీ తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" బాబాను వేడుకున్నాను. బాబా దయవలన వారి ఊదీతో త్వరగానే అమ్మాయికొచ్చిన అలర్జి తగ్గిపోయింది. నా తండ్రి దయ ఉంటే సాధ్యం కానిదేముంది. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మీ భక్తులమైన మా అందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
బాబాకు మ్రొక్కుకున్నంతనే దొరికిన ఉంగరం
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వాహకులకు అభినందనలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు పంచుకున్న అనుభవంలో మా ఇంటిలోకి మంచి అద్దెదారులు రావాలని బాబాను కోరుకున్నాను. ఆయన దయవల్ల మంచి అద్దెదారులు వచ్చారు. ఇకపోతే నేను సాధారణంగా ఇంటి పనులు పూర్తయ్యాక నా వేలికి ఉంగరం పెట్టుకుంటాను. 2022, జనవరిలో ముక్కోటి ఏకాదశి రోజున కూడా అలానే పెట్టుకున్నాను. తరువాత పారాయణ పుస్తకాల కోసం అట్టపెట్టెలో వెతికి పారాయణ మొదలుపెట్టాను. కాసేపటికి పారాయణ చేస్తూ నా చేతికి ఉంగరం లేదని గమనించాను. వెంటనే అట్టపెట్టెలో వెతికాను కానీ, ఉంగరం కనిపించలేదు. దాంతో ఇంట్లో గిన్నెలు తోముకునే చోట పడిపోయిందేమోనని అక్కడంతా వెతికాను. అయినా ఉంగరం కనిపించలేదు. వెంటనే ఈ బ్లాగులో చాలామంది భక్తులు పంచుకున్న అనుభవాలు గుర్తొచ్చి సాయిబాబాకు నమస్కరించుకుని, "ఉంగరం దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనుకుంటూ మళ్లీ అట్టపెట్టెలో వెతికాను. అద్భుతం! ముందు వెతికినప్పుడు కనబడని ఉంగరం ఈసారి కనపించింది. అంతే అప్పటివరకు నేను పడిన బాధంతా పోయింది. బ్లాగులో పంచుకుంటామని మనసులో అనుకుంటే వెంటనే కోరికలు నెరవేరుతాయి. అలా నాకు ఇప్పటికి ఐదు, ఆరు అనుభవాలు జరిగాయి. అవన్నీ గతంలో నేను మీ అందరితోనూ ఈ బ్లాగు ద్వారా పంచుకున్నాను. ప్రస్తుతం మేము మా ఊళ్ళో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాము. కానీ ఆ స్థలం తాలూకు వాస్తు గురించి సరిగా చెప్పేవారు దొరకడం లేదు. బాబా దయతో త్వరలోనే వాస్తు, ఇంటి ప్లాన్ సరిగ్గా చెప్పేవారు దొరుకుతారని నమ్ముతున్నాను. ఇంటి నిర్మాణ విషయంలో బాబా అనుగ్రహం లభించిన వెంటనే నేను బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను.
చివరిగా ఒక మాట: 'ఏది చేస్తే మంచి జరుగుతుందో బాబా అది చేస్తారని, సరైన మార్గం చూపిస్తారని మనం నమ్మకంగా అనుకుంటే చాలు. అంతా శుభం జరిగేలా ఆ సాయినాథుడు అనుగ్రహిస్తారు'.
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDelete