సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1063వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో ప్రతి సమస్యా పరిష్కారమవుతుంది
2. కోరిక తీర్చిన బాబా
3. బాబాకి దక్షిణ సమర్పణ

బాబా అనుగ్రహంతో ప్రతి సమస్యా పరిష్కారమవుతుంది


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నమస్కారాలు. బ్లాగులోని భక్తులందరి అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది, బాబాకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా లీలలను మననం చేసుకుంటే, ఆ సమస్య నుండి బయటపడేందుకు పరిష్కారం లభిస్తుంది. నాపేరు చైతన్య. నేను చాలాసార్లు నా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మావారు, మా అత్తయ్య, మామయ్య ఊరు వెళ్లారు. వాళ్ళు అక్కడి నుండి తిరిగి బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు. కానీ మరో గంటలో విజయవాడలో మా ఇంటికి చేరుకుంటారనగా మావారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చాలాసార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ, లిఫ్ట్ చెయ్యట్లేదు. మా అత్తయ్య, మామయ్యల ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. ఇక నాకు చాలా భయమేసి, "బాబా! వాళ్లకి ఏమీ కాకూడదు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీరే చూడండి బాబా. వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అరగంట తర్వాత మావారు ఫోన్ చేసి, "ఫోన్ సైలెంట్‍లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు. మేము సిటీలోకి వచ్చేసాము" అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మనకి ఏ సమస్య వచ్చినా సరే బాబా మీద భారం వేసి, శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఆయన మనల్ని, మన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.


ఒకరోజు మా కారుని శుభ్రపరుస్తుంటే బ్యాటరీలోకి నీళ్లు చేరి బ్యాటరీ డౌన్ అయింది. అందుచేత కారు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నేను, "బాబా! కారు స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. మాకు అర్జెంటుగా కారు అవసరం ఉంది" అని బాబాకి చెప్పుకున్నాను. కొద్దిసేపటికి దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ వచ్చి బ్యాటరీ బాగుచేయడంతో ఒక గంటలో కారు బాగైంది. అదేరోజు మా ఇంటిలో ఉన్న గీజర్ పనిచేస్తూ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు కూడా నేను బాబాని తలచుకుని, "బాబా! గీజర్ పని చేసేలా చూడండి" అని వేడుకున్నాను. తరువాత మెకానిక్ చూసి, "గీజర్ ప్రాబ్లం ఏమీ లేదు. పవర్ కనెక్షన్ లూజవ్వటం వల్ల పని చేయడం లేద"ని చెప్పి సరిచేసాడు. దాంతో గీజర్ మంచిగా పని చేసింది. అంతా బాబా దయ.


2022, సంక్రాంతికి మా కుటుంబమంతా కలిసి మా ఊరు వెళదామని అనుకున్నాము. కానీ మా పెద్దబాబుకి పరీక్షలు ఉండటం వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చింది. అక్కడ చూస్తే మా అత్తయ్యవాళ్ళు మేము వస్తామని నెలరోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ స్థితిలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి నేను మా వారితో, చిన్నబాబుతో, "మీరు వెళ్ళండి. మేమిద్దరం ఇక్కడ  ఉంటాము" అని చెప్పాను. కానీ నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లని మా చిన్నబాబు, "నువ్వు రావాలి. నువ్వు వస్తేనే నేను వెళ్తానమ్మ. లేదంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను" అని అన్నాడు.


సాయిభక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దేహత్యాగం చేసిన తరువాత వారి అనుమతి తీసుకోవడానికి చీటీలు వేసి నిర్ణయం తీసుకునే వారని మనం శ్రీసాయి సచ్చరిత్రలో చదువుకున్నాము కదా! మేము కూడా ఏదైనా పని చేయాలా, వద్దా అనుకున్నప్పుడుగానీ, ఎక్కడికైనా వెళ్లాలా, వద్దా అన్నప్పుడుగానీ నిర్ణయం తీసుకునే ముందు చీటీలు వేసి బాబా నిర్ణయం తెలుసుకుని దాదాపు తదనుగుణంగా నడుచుకుంటాము. మా పిల్లలకి కూడా నేను అదే అలవాటు చేశాను. అలా చేయడం వల్ల ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా జరుగుతాయి. సరే, మా బాబు ఊరు వెళ్లాలా, వద్దా అనే విషయంలో కూడా నేను బాబా నిర్ణయం కోసం చీటీలు వేసాను. అప్పుడు బాబా సమాధానం 'వెళ్ళమ'ని వచ్చింది. కానీ బాబు ఏమంటాడో ఏమిటోనని నేను, "బాబా! చిన్నబాబు ఊరికి వెళితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా అద్భుతం చేసారు. ముందురోజు వెళ్లనంటే వెళ్లానని అల్లరి చేసిన చినబాబు మరుసటిరోజు ఉదయం లేచాక, "నేను వెళతాను. బాబా చెప్పారు కదా" అని చెప్పి సంతోషంగా వెళ్ళాడు. "ధన్యవాదాలు బాబా. అందరినీ కరోనా మహమ్మారి నుండి రక్షించండి బాబా".


కోరిక తీర్చిన బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వాళ్ళకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. మేము హైదరాబాద్‍లోని ఎల్.బి.నగర్‍లో నివాసముంటున్నాము. ఏడు నెలల క్రితం మా అమ్మాయి తన ఆఫీసుకు దగ్గర అని కూకట్‍పల్లిలో ఉంటుండేది. తనకి ఆఫీసులోని తన బాస్ వలన టార్చర్ ఎక్కువగా ఉండడం వల్ల తను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిసుండేది. అయితే తనకి హైదరాబాదులోనే ఉద్యోగం చేయాలని చాలా ఆశ. అందువలన తను హైదరాబాదులో చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసింది. కాని  ఎంత ప్రయత్నించినా తనకి హైదరాబాదులో కాకుండా బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేక, మరోపక్క మా అందరినీ వదలివెళ్లలేక నరకం చూసింది. కానీ తప్పనిసరై తను బెంగుళూరు వెళ్ళడానికి సిద్ధమైంది. తను కూకట్‍పల్లి నుండి బయలుదేరడానికి ముందురోజు, "నీ దగ్గరికి వస్తామ"ని మేము ఎంత చెప్పినా తను, "వద్దు" అని ఖండితంగా చెప్పింది. ఎందుకంటే, మమ్మల్నందరినీ వదిలి వెళ్ళటం తనకి అస్సలు ఇష్టం లేదు. అలాంటిది మేము తన దగ్గరికి వెళితే, తనకున్న బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే మమ్మల్ని రావద్దని అంత ఖండితంగా చెప్పింది. అందుకని మేమెవరమూ తన దగ్గరికి వెళ్ళలేదు. మా అమ్మాయి బెంగుళూరు వెళ్ళిపోయింది. ఆ ముందురోజు రాత్రంతా తను విపరీతంగా ఏడ్చిందని తన స్నేహితుల ద్వారా మాకు తరువాత తెలిసింది. తను అంతలా బాధపడటానికి కారణం లేకపోలేదు. మా అమ్మాయి చదువు రిత్యా మాకు దూరంగా కొంతకాలం లక్నోలో ఉంది. చదువు అయిపోయిన తర్వాత తనకి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడినుండి తను బదిలీ మీద పూణే వెళ్ళింది. తరువాత హైదరాబాదు వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని ఇక్కడే వేరే ఉద్యోగం చూసుకుంది. 'చదువు, ఉద్యోగం అంటూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఇప్పుడైనా హైదరాబాదులో కుటుంబంతో  ఉండాలన్నది' తన కోరిక.


మా అమ్మాయి అంతలా బాధపడిందని తెలిసాక మా అమ్మాయిని తలుచుకుని నేను చాలా బాధపడేదాన్ని. ఒకరోజు బాబాకి పూజచేస్తూ బాగా ఏడ్చాను. తరువాత బాబాకి దణ్ణం పెట్టుకుంటూ, "బాబా! మా అమ్మాయికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు కానీ, బెంగుళూరుకి పంపేసావు. 5, 6 సంవత్సరాల నుండి అమ్మాయికోసం పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ సంబంధాలు కుదరటం లేదు. తనకి పెళ్ళి అవ్వడం లేదని, ఇష్టం లేకున్నా దూరంగా ఉంటుందని మేము చాలా బాధపడుతున్నాము. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. తొందరగా అమ్మాయి హైదరాబాదుకి తిరిగి వచ్చేలా చేయండి. బెంగుళూరు నుంచి హైదరాబాదుకి ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేయండి, లేదా వేరే ఏ ఉద్యోగమైనా హైదరాబాదులో ఇప్పించండి" అని బాబాకి మొరపెట్టుకుని చాలా ఏడ్చాను. తరువాత saileelas.com వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు "బాబా! నా సమస్యకి సమాధానం సాయి వచనంలో రావాలి"  అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అప్పుడు సైటులో "నీ కోరిక త్వరలో తీరుతుంది" అని వచ్చింది. సరిగ్గా మా అమ్మాయి బెంగుళూరు వెళ్ళిన 7 నెలలకి 2022, జనవరి 20న తనకి 'స్టార్ మా'లో మంచి ప్యాకేజీతో హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని తెలిసి నేను పట్టలేని ఆనందంతో ఏడ్చేసాను. "ధన్యవాదాలు బాబా. మా ఇద్దరమ్మాయిలకి పెళ్లి చేయాలని 5, 6 సంవత్సరాల నుండి సంబంధాలు చూస్తున్నాము. ఈ విషయంలో మీరు తప్ప ఎవ్వరూ సహాయం చేయలేరు బాబా. మీ సహాయం కోసం కంటతడితో ఎదురు చూస్తున్నాను తండ్రి. పెళ్ళి పరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా పిల్లలిద్దరినీ హైదరాబాదులోనే స్థిరపరచండి. పిల్లల బాధ నేను చూడులేను సాయి". ఆనంద భాష్పాలతో మరోసారి నా తండ్రి సాయికి కృతజ్ఞలు చెప్పుకుంటూ... సెలవు తీసుకుంటున్నాను.


బాబాకి దక్షిణ సమర్పణ


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు తిరుమల కృష్ణ. నేను చిన్నప్పటి నుండి బాబానే నమ్ముకున్నాను. నేను, నా కుటుంబం సంతోషంగా ఉన్నామన్నా, నాలుగు ముద్దలు మా నోట్లోకి వెళ్తున్నాయన్నా అదంతా సాయిబాబా దయే. ఆ బాబా దయ అందరి మీదా ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి గురువారం గుడికి వెళ్లి బాబాకి 11/- దక్షిణ సమర్పించుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా గుడికి వెళ్ళడానికి కుదరక బయట ఉన్నప్పుడు నన్ను ఎవరైనా భిక్ష అడిగితే, నా చేతికి ఎంత వేస్తే అంత వాళ్ళకి ఇచ్చి బాబాకే ఇచ్చినట్లు భావిస్తాను. ఎందుకంటే, ఆయా వ్యక్తుల రూపంలో బాబానే ఉన్నారన్నది నా ప్రగాఢ విశ్వాసం. 2021, డిసెంబర్ 30 గురువారంనాడు నేను టెంపుల్‌కి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా నా బైక్ సర్వీసింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది. నేను సర్వీసింగ్ షాప్ దగ్గర ఉండగా ఒకరు బిక్షకోసం వస్తే, నేను 5 రూపాయలిచ్చి, 'బాబాకి 5 రూపాయలు ఇచ్చేశాను. ఇంకా 6 రూపాయలు ఇవ్వాలి' అని అనుకున్నాను. కొంతసేపటి తరువాత నా పక్కనే నా స్నేహితుడు, షాప్ యజమాని ఉన్నప్పటికీ ఒక ఆమె నేరుగా నా దగ్గరకే వచ్చి డబ్బులు కావాలన్నట్లు చేయి చాచింది. నేను మారు మాట్లాడకుండా ఎంత చేతికి వస్తే, అంత ఇచ్చేద్దామని జేబులో చేయిపెడితే 5 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులిస్తే ఆమె మాటైనా మాటాడకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు, 'సాయే ఆమె రూపంలో వచ్చి దక్షిణ స్వీకరించార'ని నాకు సంతోషంగా అనిపించి, "బాబా! నేను ఈరోజు మీకు ఇవ్వాల్సిన దక్షిణను సమర్పించుకున్నాను" అని అనుకున్నాను.



5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ������ o

    ReplyDelete
  5. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Baba please help me my husband health cure.. Bless me Baba always me and my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo