1. బాబా కృపవలన పదిరోజుల తరువాత దొరికిన గోల్డ్ చైన్
2. బాబా కృపతో దొరికిన చెవి కమ్మ
3. బాబా అనుగ్రహంతో వివాహం
బాబా కృపవలన పదిరోజుల తరువాత దొరికిన గోల్డ్ చైన్
నేను ఒక సాయిభక్తురాలిని. 2021, ఆగస్టు నెలలో మావారు పనిమీద తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక హోటల్లో రూమ్ తీసుకుని, పని పూర్తి చేసుకుని రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మావారు తిరిగి వచ్చేటప్పుడు తన డ్రెస్సు ఒకటి హోటల్లో మర్చిపోయి వచ్చేసారు. సరే, 'బట్టలే కదా!' అని మేము పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల హైదరాబాదులో మా బంధువులు ఉన్నప్పటికీ ఆ డ్రెస్సు తెప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పదిరోజుల తర్వాత మావారు తన గోల్డ్ చైన్ ఇవ్వమని నన్ను అడిగారు. నేను ఆ చైన్ కోసం సాధారణంగా ఎప్పుడూ పెట్టే చోట చూసాను. కానీ అది అక్కడ లేదు. దాంతో నేను, మావారు ఇద్దరం కలిసి ఇంట్లో అన్ని చోట్లా వెతకసాగాము. అంతలో నేను చివరిసారి మావారు ఆ చైన్ ఎప్పుడు వేసుకున్నారో గుర్తుచేసుకుని ఆయనతో, "మీరు హైదరాబాదు వెళ్ళినప్పుడు చైన్ వేసుకుని వెళ్ళారు. అక్కడినుండి తిరిగి వచ్చిన తర్వాత మీరు నాకు ఆ చైన్ తిరిగి ఇవ్వలేదు. కాబట్టి మీరు చైన్ ఎక్కడ పెట్టారో గుర్తుతెచ్చుకోండి" అని అన్నాను. అయితే ఆయనకేమీ గుర్తు రాలేదు. ఇల్లంతా వెతికినా కానీ ఆ చైన్ దొరకలేదు. ఇప్పుడు ఉన్న బంగారం ధరను బట్టి ఆ చైన్ విలువ లక్షరూపాయలకు పైనే ఉంటుంది. తరువాత మావారు బయటకు వెళ్ళారు. నేను మాత్రం ఆ చైన్ గురించే ఆలోచిస్తూ, "చైన్ దొరికేలా చేయమ"ని బాబాను నిరంతరాయంగా ప్రార్థించసాగాను. కొంతసేపటి తర్వాత బాబా ప్రేరణవల్ల నాకు 'పదిరోజుల క్రితం మావారు హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో తన డ్రెస్సు మరిచిపోయి వచ్చారు కదా, ఒకవేళ ఆ డ్రెస్సులో చైన్ ఉందేమో!" అని అనుమానం వచ్చింది. మావారు వచ్చిన తరువాత నాకొచ్చిన అనుమానం ఆయనతో చెప్పాను. దాంతో మావారు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. నేను బాబా ముందు కూర్చుని, "బాబా! మీరే ఇప్పుడు మాకు సహాయం చేయాలి. మీ కృపాదృష్టి మాపై వర్షించి ఆ చైన్ దొరికేలా చేయండి. సచ్చరిత్ర పారాయణ చేస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. కాని నా మనస్సులో 'అసలు అలా జరుగుతుందా? పదిరోజుల ముందు వదిలి వచ్చిన బట్టలు ఇంకా అక్కడ ఉంటాయా? ఒకవేళ ఆ బట్టలు అక్కడే ఉన్నా, ఆ హోటల్లోని వర్కర్లు ఆ బట్టలను రిసెప్షన్లో ఇచ్చినా వాటిలో ఉన్న చైన్ ఎవరూ తీయకుండా ఉంటారా? ఈ కాలంలో దొరికిన వాటిని, అందులోనూ బంగారాన్ని తిరిగి ఇచ్చేవారు ఉంటారా?' అని పరిపరివిధాల ఆలోచనలు రావడంతో, "బాబా! మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా! మీ కృపాదృష్టి మాపై ఉంటే మా చైన్ మాకు దొరుకుతుంది. దయచేసి మాకు సహాయం చేయండి సాయితండ్రి" అని బాబాకు చెప్పుకున్నాను. తర్వాత ఏం జరిగిందో ఎవరైనా ఊహించగలరా? నా బాబా అద్భుతం చేసారు.
మావారు తన ఫ్రెండ్‍తో జరిగిన విషయం చెప్పి, "ఒకసారి ఆ హోటల్‍కి వెళ్ళి డ్రెస్సు గురించి అడిగిరా" అని అన్నారు. అతను ఆ హోటల్‍కి వెళ్ళి, మావారి పేరు చెప్పి, "పదిరోజుల క్రితం ఇతను తన స్నేహితులతో మీ హోటల్లో రెండురోజులు ఉన్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు రూమ్ కప్ బోర్డులో ఒక డ్రస్ మర్చిపోయి వెళ్లిపోయారు. అవి ఉన్నాయా?" అని మేనేజరుని అడిగారు. వెంటనే అతను, "హా హా సార్. వాళ్ళ బట్టలు ఉన్నాయి" అని చెప్పి వాటిని తెచ్చి మావారి ఫ్రెండ్‍కిచ్చారు. వెంటనే మావారి ఫ్రెండ్ ఆ డ్రెస్సు జేబులో చూస్తే, మా చైన్ అందులో ఉంది. అతను వెంటనే మా వారికి ఫోన్ చేసి చైన్ ఉందని చెప్పారు. మావారు వెంటనే నాకు ఫోన్ చేసి, "మిస్ అయిన చైన్ హోటల్లో మర్చిపోయిన డ్రెస్సులో ఉంద"ని చెప్పారు. అవధులు లేని నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇదంతా కలా, నిజమా అనిపించగా బాబా ముందు కూర్చుని, "బాబా! ఈరోజు మీరు మా మీద ఇంతటి దయ చూపించినందుకు ధన్యవాదాలు తండ్రి. మీరు ఎల్లప్పుడూ ఇలాగే మాపై, మీ బిడ్డలందరిపై మీ దయాదృష్టిని వర్షిస్తూ ఎల్లవేళలా అందరికీ తోడుగా ఉండమని మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. మీరు నాకు ప్రసాదించిన ఈ చక్కటి అనుభవాన్ని వ్రాసేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీ బిడ్డను క్షమించండి తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా కృపతో దొరికిన చెవి కమ్మ
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుజాత. ఒకసారి నా బంగారపు చెవి కమ్మ కనపడకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఇక నేను కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! నా చెవి కమ్మ ఎలాగైనా దొరికేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాకి మ్రొక్కిన రెండు నెలల తరువాత ఒక గురువారంనాడు నా చెవి కమ్మ మెట్ల దగ్గర దొరికింది. దాన్ని చూడగానే నా కళ్ళలో ఆనందభాష్పాలు నిండిపోగా బాబాకి కృజ్ఞతలు చెప్పుకుని ఆ చెవి కమ్మను తీసుకున్నాను, మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినా, ఇంకేవిధమైన ఆరోగ్య సమస్య వచ్చినా మేము బాబాకి చెప్పుకుని, ఆయన ఊదీ పెట్టుకుంటాము. 5 నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది. కరోనా కాలంలో బాబా మమ్మల్ని ఎంతగానో రక్షించారు. "సాయినాథా! నువ్వే నా తండ్రివి. జన్మజన్మలకు నేను మీకే భక్తురాలిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దేవా. నాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. మీ కృపతో అతి త్వరలోనే అవి తొలగిపోవాలని మీ పాదాలకు కన్నీటితో విన్నవించుకుంటున్నాను బాబా".
బాబా అనుగ్రహంతో వివాహం
ఈ బ్లాగు చదువుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నేను ఇప్పుడు నా పెళ్ళికి సంబందించిన అనుభవాన్ని పంచుకుంటాను. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏవీ కుదిరేవి కాదు. నేను బాబానే నమ్ముకున్నాను. బాబా ఆన్లైన్‍లో మెసేజ్ల ద్వారా నాకు తగిన సలహాలు/సూచనలు ఇస్తుండేవారు. బాబా చెప్పినట్టే జరుగుతుండేవి. చివరికి బాబా ఆశీస్సులతో నాకు మంచి సంబంధం కుదిరింది. నేను అందరితో కలిసి, అందరి మధ్య సంతోషంగా నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ కరోనా వల్ల పెళ్లికి సంబంధించి అన్నీ ఎలా జరుగుతాయో అని చాలా భయపడ్డాను. అప్పుడు కూడా బాబాని ప్రార్థిస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచాను. బాబా దయవల్ల నిశ్చితార్థం, పెళ్లి సమయానికి కరోనా ఉధృతి లేకపోవడం వల్ల అన్నీ బాగా జరిగాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే సదా మీ అనుగ్రహం మాపై కురిపించు తండ్రి".
