సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1882వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యప్రదాత సాయి
2. బాబా దయ
3. బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు

ఆరోగ్యప్రదాత సాయి

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను సాధారణ సాయి భక్తురాలిని. 2023, నవంబర్ లేదా డిసెంబర్‌లో నాకు తీవ్రమైన చలి జ్వరం వచ్చింది. చలికి ఒకరోజు రాత్రి అస్సలు తట్టుకోలేకపోయాను. మర్నాడు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు టెస్టులన్నీ చేసి 'డబల్ టైఫాయిడ్' అని చెప్పి నాలుగు రోజులు సెలైన్లు పెట్టారు. నేను, "బాబా! నాకు జ్వరం తగ్గేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయవలన జ్వరం పూర్తిగా తగ్గింది. 'బాబా! నువ్వు ఉన్నావు తండ్రీ' అని మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకసారి ఛాతి మీద రుద్దుతున్నప్పుడు గాయంలా అయింది. అది చూసి నేను ఎంతో భయపడిపోయి, "బాబాతండ్రీ! మీరే ఈ గాయాన్ని మాన్పించాలి. ఏమీ కాకుండా ఉండేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ గాయం మానిపోయింది. మరోసారి నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చి వారం రోజులు వరకు తగ్గలేదు. నాకు భయమేసి, "బాబాతండ్రీ! ఏమిటీ తలనొప్పి? ఒక్క రోజుతో తగ్గిపోయేది వారం రోజులైనా తగ్గటం లేదు. ఈ నొప్పిని తగ్గించు తండ్రీ" అని బాబాని వేడుకున్నాను. తర్వాత బాబా దయవలన తలనొప్పి తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ఎన్నో అనుభవాలు ప్రసాదించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబా దయ

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే బాబా మీద భక్తి, గౌరవాలు మరింత పెరుగుతున్నాయి. బాబా చల్లని చూపుతో మాకు 2023, జూలై 20న పాప పుట్టింది. తను పుట్టినప్పటినుంచి ఏ చిన్న సమస్య వచ్చినా బాబాని ప్రార్థించి, ఊదీ వాడుతుంటే అంతా సమసిపోతుంది. తనకి 11వ నెల వచ్చాక తలనీలాలు(వెంట్రుకలు) తీసే కార్యక్రమం పెట్టుకున్నాం. నేను అప్పుడు తను సరిగ్గా చేయించుకుంటుందో, లేదోనని చాలా కంగారుపడ్డాను. నేను తనకి తలనీలాలు తీసే సమయంలో బాబాని తలుచుకుంటూ, "బాబా! తను సరిగ్గా తీయించుకొనేలా చూడండి" అని వేడుకున్నాను. అంతే, పాప కొంచెం కూడా తల కదపకుండా చాలా బాగా తీయించుకుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబా దయతోనే తను సరిగ్గా కూర్చుంది అని నాకు తెలుసు. ఇలా ప్రతి చిన్న విషయంలో బాబా మాకు తోడుగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".

బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు

సాయి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సంధ్య. నేనిప్పుడు  మా అబ్బాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతునప్పటి అనుభవం ఒకటి చెప్తాను. తను చదువులో సాధారణంగా ఉంటాడు. మందకొడి మాత్రం కాదు. కానీ అతి విశ్వాసం(ఓవర్ కాన్ఫిడెన్స్)తో చదువుని చాలా తేలికగా తీసుకుంటాడు, అందువల్ల మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. కాలేజీవాళ్లతో పాటు మేమంతా నమ్మలేకపోయాం. 'ఏంటి ఇలా జరిగింది?' అని ఒక నిమిషం షాక్ తిన్నాము. తప్పితే తప్పాడుగానీ ఆ కారణం చేత తనెక్కడ మనస్తాపం చెందుతాడోనని భయపడ్డాము. "అయ్యో బాబా! ఏంటి ఇలా చేశారు? మీరే కాపాడండి" అని బాబాని ప్రార్థించి చాలా రకాలుగా బాబుని ఉత్సాహపరిచి ఇంట్లోనే పరీక్షకి మళ్ళీ ప్రిపేర్ చేయించాం. ఆ క్రమంలో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. కానీ నేను నా మనసులో, 'బాబా నా బిడ్డకు పెద్ద గుణపాఠం నేర్పారు. వైఫల్యాన్ని తట్టుకొని నిలబడడం నేర్పించారు' అని అనుకుంటూ బాబు చేత ప్రాక్టీసు చేయించాను. బాబా దయవల్ల బాబు సప్లిమెంటరీలో 90 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. బాబా ఏది చేసినా మన మంచికే అన్నది నిజం. ఆయన  ఎన్నో అసాధ్యమైన పనులు సుసాధ్యం చేశారు. ఒకటి మాత్రం నిజం, బాబాని నమ్ముకుంటే దేనికి ఢోకా ఉండదు. "థాంక్యూ బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo