బాబా అనుగ్రహం - విఠోబా ప్రత్యక్షం
ప్రియమైన సాయిభక్తులారా! మా నాన్నగారు పొందిన అనుభవాలన్నీ తేదీల వారీగా నావద్ద లేనందున, నా మనసుకు ఏదైతే గుర్తుకొస్తుందో వాటినే మీకు వివరిస్తున్నాను. మా నాన్నగారు ఆధ్యాత్మిక అనుభూతులలోకి వెళ్ళినప్పుడల్లా ఆ అనుభవాలను మాకు వివరిస్తూ వుండేవారు. అందుచేత వాటిని వరుసక్రమంలో చెప్పడం నాకు సాధ్యం కాదు.
ఇంతకుముందు చెప్పినట్లుగా, తర్ఖడ్ కుటుంబమంతా ప్రతిరోజూ సాయిబాబాను పూజించడం ప్రారంభించారు. కుటుంబంలోని వారందరూ కలిసి ప్రతి గురువారం సాయంత్రం తమ గృహంలోని బాబాకు ఆరతి ఇస్తూ ఉండేవారు. మా నానమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారణ అవడంతో, ఆమె చాలా సంతోషంగా, పూర్తి మనశ్శాంతితో ఉన్నారు. ఆమె చిన్నగా ఆధ్యాత్మికతవైపుకు ఆకర్షితురాలై, ప్రతిరోజూ ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ ప్రారంభించారు. ఒకసారి ఆమె మా నాన్నగారితో, పవిత్రమైన పండరిపుర యాత్రకు వెళ్ళి పండరినాథుని(విఠోబా) దర్శనం చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. పవిత్రగ్రంథాలలో చెప్పినట్లుగా, ప్రతిఒక్కరూ తమ జీవితకాలంలో పండరిపురం కనీసం ఒక్కసారైనా తప్పక దర్శించాలని ఆమె చెప్పారు. మా నాన్నగారు ఆమెతో, సాయిబాబాను అడిగి ఆయన అనుమతి తీసుకోమని సలహా ఇచ్చారు. అలాగే, ఆమె తమ తరువాతి శిరిడీ దర్శనంలో, పండరిపురం వెళ్లి విఠలుని దర్శించుకొని రావటానికి బాబా అనుమతి కోరింది. బాబా ఆమెతో, “అమ్మా! మనం ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. శిరిడీయే మనకు సర్వస్వము” అన్నారు. బాబా సమాధానం విని ఆమె నిరాశచెందారు. దైవమైన విఠోబా పండరిపురంలో కొలువై వున్నారని, ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తులు గట్టిగా నమ్మి పండరిపురం వెళుతూ వుంటారని, జీవితంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్ళి విఠోబాను పూజించాలనే గాఢమైన తన కోరికను ఆమె బాబాకు విన్నవించింది. బాబా ఆమె కోరికను మన్నించి ఆమెతో, “అమ్మా! చింతించవద్దు, పండరిపురం వెళ్ళాలనే నీ కోరిక తప్పక నెరవేరుతుంది!” అన్నారు. ఇంటికి చేరుకోగానే మా తాతగారికి జరిగినదంతా చెప్పి, చక్కగా ప్లాను వేసుకొని మా నాన్నగారు, మా నానమ్మగారు పండరిపురానికి ప్రయాణమైనారు. ముస్లిములకు మక్కా, క్యాథలిక్కులకు బెథెలహాం ఎలాగో, మహారాష్ట్రీయులకు పండరిపురం అటువంటిదని పాఠకులు గ్రహించాలి.
అక్కడికి చేరుకున్నాక మా నాన్నగారు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు. స్నానం చేసి, ఫలహారం ముగించి, ఉదయం రద్దీ తగ్గిన తరువాత, పూజాసామాగ్రి తీసుకొని వారు విఠోబా మందిరానికి నడుచుకుంటూ వెళ్ళారు. పవిత్రమైన విఠలుని మందిరంలోకి ప్రవేశించిన తరువాత, విఠోబాను పూజించడానికి మందిర పూజారి అనుమతి తీసుకొని, మా నానమ్మగారు ఆమె అనుకున్న ప్రకారం పూజనంతా పూర్తిచేసారు. కానీ, విఠోబా విగ్రహానికి తన స్వహస్తాలతో పూలమాలవేసి అలంకరించాలని అనుకున్నారు. కానీ విఠోబా విగ్రహం వున్న పీఠం ఎక్కడానికి పూజారులకు తప్ప వేరెవరికీ అనుమతిలేదు. అందువలన పూజారి ఆమెను అనుమతించకపోయేసరికి సమస్య ఎదురయ్యింది. విఠోబా విగ్రహానికి తన చేతులతో స్వయంగా దండ వేయకపోతే తన పూజ పూర్తికాదని ఆమె మా నాన్నగారితో చెప్పారు. బాబాయే స్వయంగా ఆమెకు పండరిపురం వెళ్ళడానికి అనుమతిచ్చారు కాబట్టి బాబానే ప్రార్థించి, ఆయన సహాయం అర్థించమని మా నాన్నగారు ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె బాబాను తలచుకుని, కళ్ళుమూసుకొని పూలమాలను రెండు చేతులతో పైకెత్తి పట్టుకొని, దానిని స్వీకరించమని విఠోబాను కోరారు. అప్పుడు జరిగిన అద్భుతాన్ని విని తీరవలసిందే.
లార్డ్ విఠోబా విగ్రహం, తన స్థానం(పీఠం మీద) నుంచి క్రిందకు దిగివచ్చి మా నానమ్మగారి ముందు నిలుచుంది. అది గమనించిన మా నాన్నగారు వెంటనే కళ్ళుమూసుకొని వున్న మా నానమ్మగారిని కుదిపి, ఆమెను కళ్ళు తెరచి చూడమని, పండరినాథుడు ఆమె ప్రార్థనలకు స్పందించి ఆమె కనుల ముందు నిలుచున్నారని, ఆయనను వెంటనే పూలమాలతో అలంకరించమని చెప్పారు. ఆమె వెంటనే కళ్ళు తెరచి చూసి, సంభ్రమాశ్చర్యాలకు లోనై తన చేతిలోని పూలమాలను విఠోబా మెడలో వేసింది. ఆమె వేసిన పూలమాలను స్వీకరించిన వెంటనే పండరినాథుని విగ్రహం తిరిగి తన యథాస్థానానికి(పీఠం మీదకు) వెళ్ళింది. తల్లి, కొడుకులిద్దరూ పండరినాథునికి సాష్టాంగ నమస్కారం చేసారు.
ఇది చూసి పూజారి ఆశ్చర్యచకితుడై, పీఠం మీదనుంచి క్రిందకు దూకి, ఆ తల్లి, కొడుకుల కాళ్ళు పట్టుకొని, వారే విఠోబా, రఖుమాయి అని, వారిని అక్కడ నుంచి వెళ్ళనివ్వనని, తన అహంకారపు ప్రవర్తనను క్షమించమని వారిని వేడుకున్నాడు. మా నాన్నగారు ఆయనను ఓదార్చి, తమ గురించి అలా అనుకోవద్దని, తాము శిరిడీలో నివసించే శ్రీసాయిబాబా భక్తులమని, వారి ఆశీర్వాదంతోనే లార్డ్ విఠోబాను దర్శించడానికి పండరిపురం వచ్చామని చెప్పారు. ఇంకా మా నాన్నగారు ఆ పూజారితో, విఠోబా అంటే రాతి విగ్రహం కాదని, ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ సజీవంగా అక్కడ ఉన్నారని, అందువలన ఆయనను హృదయపూర్వకంగా పూజించి, ఆయనపై దృఢమైన నమ్మకం ఉంచి, ఆయన అనుగ్రహాన్ని పొందమని చెప్పారు. తరువాత వారు పూజారి ఇచ్చిన విఠోబా ప్రసాదం తీసుకుని మందిరం వెలుపలికి వచ్చారు. తరువాత వారు విఠోబా, రఖుమాయిల ఇత్తడి విగ్రహాలను కొని, వాటిని ప్రతిరోజూ పూజించుకోవడానికి తమ చందనపుమందిరంలో ఉంచారు.
పై అనుభవం వారిద్దరికీ ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. తాము ఎంతో వినయ, విధేయతలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ, లార్డ్ విఠోబా తమను అంతగా అనుగ్రహిస్తారని వారు కలలో కూడా ఊహించలేదు. పండరిపురం దర్శనం తరువాత వారు మళ్ళీ శిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు, బాబా మా నానమ్మగారిని, “అమ్మా! విఠోబాను కలుసుకున్నావా?” అని అడిగారు. మా నానమ్మ, “బాబా! ఇదంతా కేవలం మీ అనుగ్రహమే! ఇప్పుడు నా జీవితానికి సంపూర్ణ సార్థకత ఏర్పడింది. ఈ క్షణంలో ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళమన్నా వెళ్ళడానికి సిద్ధంగా వున్నాను” అని చెప్పి, బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మనం పూజించే ప్రతి విగ్రహంలోనూ భగవంతుడు ఉన్నారని మా నాన్నగారు ఎప్పుడూ మాతో చెబుతూ వుండేవారు. ఈ దివ్యానుభూతులన్నీ వారు తమ పూర్వజన్మలో చేసుకున్న మంచిపనుల వల్ల మాత్రమే గాక, నిస్సందేహంగా వారు సాయి అనుగ్రహమనే ఛత్ర ఛాయలో ఉండటం వల్ల ఇదంతా సాధ్యమయిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌸🌸🌸🙏🙏🙏🌸🌸🌸
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH
ReplyDeleteOm Sai Ram