సాయి వచనం:-

- శ్రీబాబూజీ.
Showing posts with label తర్ఖడ్ అనుభవాలు. Show all posts
Showing posts with label తర్ఖడ్ అనుభవాలు. Show all posts

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 18వ భాగం


శ్రీసాయితో వీరేంద్ర స్వానుభవాలు 

అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను చదివిన తరువాత, శ్రీసాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు వుంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు. నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో, మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొందివుండకపోవచ్చుననీ, కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల ఆయన వారసత్వంగా, అణుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయిభక్తులందరికీ వివరించదగిన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా పొందే ఉంటానని అన్నది. ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అన్నది. ఆ భక్తురాలు ఇచ్చిన ఆ సలహా నన్ను కదిలించడంతో, ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను. 

నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్  మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉన్నది. మా ముత్తాతగారు తన కొడుకులకందరికీ తమ పేరు చివర 'ద్ర' అనే అక్షరం వచ్చేటట్లుగా పెట్టారు. అలా నామకరణం చెయ్యటానికి మూలకారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీరవీంద్రనాథ్ ఠాగూర్.

శ్రీఠాగూర్ యునైటెడ్ కింగ్‌డం(U.K.) వెళ్ళేముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాతగారి బంగళాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా ముత్తాతగారి కుటుంబానికి ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి, వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన అక్కడకు వచ్చారు. ఠాగూర్ గారికి జ్యోతిష్యం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసారు.

ఆయన మా ముత్తాతగారి జాతకచక్రం వేసి, తర్ఖడ్  కుటుంబం వారంతా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారనీ, అందుచేత వారంతా ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలనీ చెప్పారు. ఆ విధంగా తన కొడుకులకు అలా (పేరు చివర ద్ర' అనే అక్షరం వచ్చేలా) పేర్లు పెట్టడానికి ఆయన మా ముత్తాతగారిని ప్రభావితం చేసారు. మా ముత్తాతగారు దానికి ఒప్పుకొని ఉండవచ్చు. ఆయన తన కొడుకులకు రామచంద్ర (మా తాతగారు), జ్ఞానేంద్ర  అని నామకరణం చేసారు. మా తాతగారు తన కుమారులిద్దరికీ సత్యేంద్ర, జ్యోతీంద్ర (మా నాన్నగారు) అని నామకరణం చేశారు. ఆ తరువాత జ్యోతీంద్ర తన కొడుకులకు రవీంద్ర (మా అన్నగారు), వీరేంద్ర (నేను) అనీ, రవీంద్ర తన కొడుకుకు దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లను పెట్టడం జరిగింది.

నా చిన్నతనం నుండి నేను, ప్రతి గురువారం సాయంత్రం మా ఇంట్లో జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను మొట్టమొదటిసారిగా నాకు 18 సంవత్సరాల వయస్సున్నప్పుడు, నా స్నేహితులు అమర్ భగతాని, శశిభాటియాలతో కలసి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా భార్య కూడా సాయిభక్తురాలు కావటం నా అదృష్టం. ఆమె తన 5వ యేట నుండి శిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుంటోంది. ఆమె తన 5 సంవత్సరాల వయస్సులో తండ్రిని పోగొట్టుకుంది. మా వివాహం అయిన తరువాత మేము మా అత్తగారి ఫ్లాట్‌లోనే నివసించడం మొదలుపెట్టాము. మా అత్తగారు, నా భార్య ఇద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా 'సాయి సంస్కారం' ఇంకా వృద్ధిచెందింది. 

శిరిడీలో గురుపూర్ణిమ

శిరిడీలో జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు మా అత్తగారితో కూడా కలసి వెళ్ళడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా 18 గురుపూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యాను. శిరిడీలో గురుపూర్ణిమ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసేవుంటుంది. ఆ ఉత్సవాలలో 'అఖండ పారాయణ' అంటే, మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా 'శ్రీసాయి సచ్చరిత్ర' పవిత్రగ్రంథాన్ని చదవడం ఒక అంశం. ఆ కార్యక్రమంలో పాల్గొనదలచిన సాయి భక్తులందరూ తమ తమ పేర్లు ఇస్తే, ఆ పేర్లలోనుంచి డ్రా ద్వారా 54 పేర్లు తీసి 'శ్రీసాయి సచ్చరిత్ర' అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. 

అలా ఒక గురుపూర్ణిమనాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు, నాకు 9వ నెంబరు కేటాయించబడింది. దీనర్ధం  నేను శ్రీసాయి సచ్చరిత్ర'లోని 9వ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయంలోనే సాయిబాబాపై తర్ఖడ్ కుటుంబానికి గల భక్తి, ప్రేమల గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందం కలిగించింది. మసీదులో నా భాగం పారాయణ పూర్తిచేసాక, నాకు ఒక కొబ్బరికాయ, శ్రీసాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి. ఈ ఫోటోని లామినేషన్ చేయించి, ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజూ పూజించుకోవడానికి మా ఇంట్లో ఉంచాము. ప్రతిరోజూ ఉదయాన్నే నేను నిద్రనుండి లేవగానే, ఈ బాబా ఫోటో ముందు నిలబడి, నమస్కారం చేసుకొని, శ్రీసాయిని, “ఓ సాయి! నేను నిన్నెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు!” (“హేఁచి దాన్ దేగా దేవా, తుఝా విసర్ నవావా) అని ప్రార్థిస్తూ వుంటాను.

అపురూపమైన వెండి భరిణె

తరతరాలుగా తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబా తమ ఆశీస్సులను అందజేస్తూనే ఉన్నారు. శ్రీసాయిబాబా మా కుటుంబదైవం. ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము అనుక్షణమూ ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము. భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది. నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను.

అది 1973వ సంవత్సరం నవంబరు నెల, దీపావళి రోజులు. నేను పనిచేసే కంపెనీవారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండు పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేనక్కడ లండను నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చి వరకు ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ సర్దుకోవడం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండను చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊదీ పెట్టుకొని వెళ్ళడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు. సోమవారం ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా, నా దగ్గర బాబా ఊదీ లేదని గ్రహించి, ఎంతో నిరాశపడ్డాను. అంతలోనే, నా భార్యకు ట్రావెలింగ్ సూటుకేసు సర్దేటప్పుడు మొట్టమొదట బాబా ఊదీ ప్యాకెట్ పెట్టి, ఆ తరువాతనే మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నేను వెళ్ళి సూటుకేసు మొత్తం ఖాళీచేసి చూడగా, ఊదీ ప్యాకెట్ కనిపించింది. అది 5 నెలలవరకూ నాకు సరిపోతుంది. లండనులో ఈ చిన్న ఊదీ ప్యాకెట్టే నాకు పెద్ద అండ. ఉద్యోగరీత్యా ముంబయిలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని. అందుచేత ముంబయి తిరిగి వెళ్ళగానే ఊదీ దాచుకునేందుకు ఒక వెండి భరిణె కొనాలని నిర్ణయించుకున్నాను. లండనులో ట్రైనింగ్ పని పూర్తిచేసుకుని మార్చి నెలలో ముంబయి తిరిగి వచ్చాను. 

నా భార్య, అత్తగారితో కలసి వెండి భరిణె కొనడానికి ముంబయిలోని గిర్గాఁవ్ లో ఒక షాపుకు వెళ్ళాను. ఆ షాపులోని అబ్బాయి 7, 8 వెండిభరిణెలు చూపించాడు. కానీ అన్ని భరిణెలకూ మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి. నాకు అలా మూత విడిగా రాకుండా భరిణెతోనే ఉండేలాగా కావాలని చెప్పాను. షాపు యజమాని, "భరిణె ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను” అని చెప్పాడు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకని ఆలోచించి, మరో షాపులో చూద్దామని ప్రక్కషాపులోకి వెళ్ళాము. ప్రక్కషాపతనికి నాకు ఎటువంటి వెండిభరిణె కావాలో వివరించాను. షాపు యజమాని, "పాత భరిణె అయినా ఫరవాలేదా?" అని అడిగాడు. పాత భరిణె అంటే ఏమిటని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు, వాటిలో మీకు కావలసిన వెండిభరిణె ఉండవచ్చని అన్నాడు. ఇది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండిభరిణె కొనడమా? అదేమన్నా మంచి పనేనా? నా భార్య, అత్తగారు కూడా అలాగే ఆలోచించడంతో మరోషాపులో క్రొత్త భరిణె ఉంటుందేమో చూద్దామనుకున్నాము. ముందే వద్దని చెప్పి షాపు యజమానిని బాధపెట్టడం ఎందుకని, పాత భరిణె తీసుకొచ్చాక చూసి, ఆ తరువాత వద్దని చెప్పొచ్చులే అని అనుకొని, “సరే తీసుకురండి! చూస్తాము” అని చెప్పాము. ఆ షాపు యజమాని మాకు ఎలాంటి భరిణె కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చి ఇచ్చాడు. ఆ వెండిభరిణెను చూడగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా ముఖంలో భావాన్ని చూసి, షాపు యజమాని, "అయ్యా! ఒకవేళ మీరు కోరుకునే భరిణె ఇలాంటిదే అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికే మెరుగు పెట్టించి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్నాడనిపించింది. తరువాత ఆ వెండిభరిణె మూత తెరచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. దానివంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా భార్య, అత్తగారు నన్ను చూసి, “ఏమయింది? ఎందుకు అలా ఉండిపోయావు? ఏమి జరిగింది?” అని ఆత్రుతగా అడిగారు. వారికి ఆ భరిణెను చూపించగానే వాళ్లకు కూడా నోటమాట రాలేదు. ఆ వెండిభరిణె మూతకు లోపలివైపు బాబా ఫోటో అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. అంత చిన్న భరిణెలో బాబా ఫోటో ఎవరు అతికిస్తారు? అది 1974వ సంవత్సరం. అప్పట్లో ఇప్పుడు ఉన్నంతమంది బాబా భక్తులు లేరు. పైగా బాబాపై భక్తిశ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం. భక్తులు గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు మొదలయిన దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటుండేవారు. అందుచేత ఎవరయినా బాబా భక్తుడు అంత శ్రమ తీసుకుని ఆ భరిణెలో బాబా బొమ్మ అతికించాడంటే నమ్మశక్యం కాలేదు. షాపు యజమాని ఆ వెండిభరిణెకు మెరుగు పెట్టించి ఇచ్చాడు. ఈరోజువరకూ కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే వుంది. మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు, బొమ్మలూ ఉన్నాయి. అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి, కానీ ఈ వెండిభరిణె మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే వుంది. ఆ భరిణె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బాబా ఊదీ ఎప్పుడు పెట్టుకుందామని దానిని తెరిచినా, నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది.

ఒక్కసారి జరిగినదంతా గుర్తుచేసుకుంటే, బాబా నా కోసమే ఆ భరిణెను తయారుచేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. నేనే కనుక క్రొత్త వెండిభరిణెను ఆర్డర్ చేసి ఉంటే, అందులో బాబా ఫోటో ఉండేది కాదు. అలా తర్ఖడ్ కుటుంబంలో మూడవతరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇంకా బలపడింది.

విజ్యోత్ ఆవిర్భావం

మనలో ప్రతి ఒక్కరికీ కూడా మనసులో ఒక బలీయమైన కోరిక ఉంటుందని నా అభిప్రాయం. మా నాన్నగారు తను ఒక ధనవంతుడిననీ, తనకు ఒక బంగళా, కారు ఉండేవని, ఒక స్టోర్ రూమ్ నిండా పింగాణీ పాత్రలలో సమృద్ధిగా ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉండేవని చెబుతూ ఉండేవారు. కానీ తరువాతి కాలంలో అవన్నీ మృగ్యమైపోయాయి. నేను ఆయన ఆఖరి సంతానాన్ని. అందుచేత స్వశక్తితో బాగా కష్టపడి, మా కుటుంబం పోగొట్టుకున్న సంపదనంతా భగవంతుని దయతో తిరిగి సంపాదించాలనే బలీయమైన కోరిక ఉండేది. ముంబయిలో స్వంత బంగళా కలిగి ఉండటమంటే అసాధ్యం. నా భార్య కూడా ఖార్‌లో బంగళాలోనే పుట్టి పెరిగింది. అందుచేత మా కుటుంబానికి కూడా స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, వృద్ధాప్యంలో సుఖంగా జీవిద్దామని మా ఇద్దరి కోరిక. తరువాత, 1991లో మేము వనగాం (ముంబయి నుండి సుమారు 100 కి.మీ. దూరంలో వెస్ట్రన్ రైల్వే లైనులో ఉన్న స్టేషన్) గ్రామంలో 6 గుంటల (726 చదరపు గజాల) స్థలం కొన్నాము. నా కంపెనీలో ఋణం తీసుకుని, మేము 1993 కల్లా ఆ స్థలంలో ఒక బంగళా కట్టుకోగలిగాము. 1960లో ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు, నా స్కూల్ స్నేహితుడు నాకు 'లకాకి' (LAKAKI) అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లక్ష్మణరావ్(ల) కాకాసాహెబ్(కా) కిర్లోస్కర్(కి) గారిది. ఆయన పేరులోని మొదటి అక్షరాలు (ల కా కి) తీసుకొనడమే ఆ పేరు వెనుకవున్న రహస్యం. 1959లో ఆర్థిక ఇబ్బందులవల్ల ఖార్‌లో వున్న మా బంగళాను అమ్మవలసివచ్చింది. నాకు 16 సంవత్సరాల వయస్సులో, 'లకాకి' బంగళాను చూశాక, నా జీవితంలో ఎప్పుడైనా బంగళా కట్టుకుంటే దానికి 'విజ్యోత్'(VIJYOT- VIrendra JYOtindra Tarkhad) అనే పేరు పెట్టాలనే ఆలోచన కలిగింది. అందుకే మేము కట్టుకున్న బంగళాకు 'విజ్యోత్' (VIJYOT) అని పేరు పెట్టుకున్నాము. 

అబా పన్షీకర్ నుంచి సాయి ప్రసాదం 

మా బంగళా బ్లూ ప్రింటు తయారుచేసినప్పుడు, ఆ బంగళాలో పూజ మరియు ధ్యానం చేసుకోవడానికి ఒక చిన్న పాలరాతిమందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది. ఆ మందిరంలో నిలువెత్తు బాబా రంగుల ఫోటో ఉంచాలనే కోరిక మాకు బలంగా ఉండటంతో మేము చాలా గట్టి ప్రయత్నం చేశాము. కానీ మాకు అలాంటి బాబా ఫోటో ఒక్కటి కూడా లభించలేదు.

అది ఏప్రిల్, 1993. మార్చి నెలలో ముంబయి మహానగరం విషాదకరమైన బాంబుపేలుళ్ళకు సాక్షీభూతంగా నిలిచింది. దానివల్ల ప్రజలు, అపరిచితులతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. అలాంటి పరిస్థితులలో, ఒకరోజు సాయంత్రం బాగా ప్రొద్దుపోయాక ఒక వ్యక్తి మా ఇంటి డోర్ బెల్ మ్రోగించాడు. నా భార్య తలుపుతీయగానే, ఒక అపరిచితవ్యక్తి నా గురించి అడిగి, నన్ను కలవాలని పట్టుబట్టాడు. కానీ, అతడు నా పేరు కూడా సరిగా చెప్పలేకపోవడంతో నా భార్య అతడిని అనుమానించింది. నేను అక్కడికి వెళ్ళగానే, అతడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఒకసారి అతడు శిరిడీలోని లెండీబాగులో నన్ను కలుసుకున్నానని, ఆ సమయంలో నేను బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని కూడా అతడితో పంచుకున్నట్లు గుర్తుచేశాడు. అతడు పూనా సాయిమందిరంలో సేవ చేస్తుండే వ్యక్తి అని నాకు స్పష్టంగా గుర్తుకొచ్చి, అతడిని మా ఇంట్లోకి రావడానికి అనుమతించాను. రాత్రి భోజనం చేసే సమయం అయినందువల్ల అతడిని భోజనానికి ఆహ్వానించగా, అతడు అంగీకరించాడు. 

మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మా పాలరాతి మందిరానికి ఒక సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే మా కోరికను అతడితో వెల్లడించాను. మేము కనుక నిలువెత్తు రంగుల చిత్తరువు కోసం చూస్తూ ఉన్నట్లయితే, ఒక చిత్రకారుడి చేత నిలువెత్తు రంగుల చిత్రపటం గీయించుకోవచ్చనీ, అలాకాకుండా రంగుల ఫోటో కోసమే చూస్తున్నట్లయితే అబా పన్షీకర్ మాత్రమే మాకు సహాయం చేయగలరని అతడు చెప్పాడు. తన దగ్గర అబా పన్షీకర్ తమ్ముడు, ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడయిన ప్రభాకర్ పన్షీకర్ ఫోన్ నంబరు ఉందని కూడా చెప్పాడు. నేను ప్రభాకర్ పన్షీకరుకు ఫోన్ చేసి, లండనులో ఉన్న అబా పన్షీకర్ టెలిఫోన్ నెంబరు తీసుకుని, ఆయనకు ఫోన్ చేశాను. 

బాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను విని ఆయన, తాను మే నెలలో ముంబయి వస్తున్నాననీ, తన తమ్ముడు నివాసముండే ప్రభాదేవి ప్రాంతంలో తనను కలుసుకోవచ్చుననీ చెప్పాడు. మే నెల దాకా నిరీక్షించి, ఆయన ముంబయి వచ్చిన తరువాత, ఒక శనివారం సాయంత్రం ఆయనను కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మా కుటుంబసభ్యులు, అనగా నేను, నా భార్య కుందా, మా అమ్మాయి సుజల్ మరియు మా అబ్బాయి మహేంద్ర, అందరం కలిసి 1993 మే 22న వాళ్ళింటికి వెళ్ళాము. నాకు ఆయన గురించి ఏమీ తెలీదు. ఇంతలో కాషాయవస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్షమాలతో ఒకాయన మా ముందుకు వచ్చి, తనను తాను అబా పన్షీకరుగా పరిచయం చేసుకున్నారు. నేనాయనకు నమస్కారం చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండలు కానీ, మిఠాయిలు కానీ ఏమీ లేకుండా వట్టిచేతులతో ఎలా వచ్చారని ఆయన నన్ను మందలించారు. కానీ ఆయన మాకోసం బాబా చిత్రపటం తెస్తున్నట్లు నాతో ఎప్పుడూ చెప్పని కారణంగా, ఆయన అలా మందలించడంతో నేను ఆశ్చర్యపోయాను.

ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని కోరి, వెంటనే సిద్ధివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి ఒక పూలదండ, కొన్ని పేడాలు తీసుకెళ్ళాను. ఆయన తన ఇంటి లోపలికి వెళ్ళి, చిత్రపటాలను వుంచే పెద్ద పెట్టెను తీసుకునివచ్చారు. దాని మూత తీసి, అందులోనుంచి ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టను బయటకు తీశారు. ఆ చుట్టను విప్పగానే అందులో, సింహాసనం మీద కూర్చుని, తమ నిత్యమైన చిరునవ్వును మాపై వర్షిస్తూ ఉన్న శ్రీసాయిబాబా సాక్షాత్కరించారు. 1మి.మీ. దళసరి కొడాక్ పేపరు మీద ముద్రించిన బాబా రంగుల చిత్రపటం అది. అబా పన్షీకర్ సలహా ప్రకారం బాబా చిత్రపటానికి పూలమాల వేసి, అందరికీ పేడాలు పంచాను. అబాగారు ఆ చిత్రపటం క్రిందభాగంలో, “వీరేంద్ర, కుందా, సుజల్ మరియు మహేంద్రలకు.. అబా పన్షీకర్ నుంచి సాయిప్రసాదం” అనే సందేశాన్ని వ్రాసి సంతకం చేసిన తరువాత ఆ ఫోటోను మాకిస్తూ, "దయచేసి మీ నిధిని స్వీకరించండి" అని అన్నారు. 

అది నా జీవితంలోనే బంగారుక్షణం. నాకు నోట మాట రాలేదు. నిస్సందేహంగా నాకది విలువకట్టలేని సంపద. నేను నా పర్సులోనుంచి 1,001 రూపాయలు తీసి ఆయనకు ఇవ్వబోయాను. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పి ఆయన ఆ డబ్బును స్వీకరించలేదు. కనీసం లండనులోని సాయిమందిరానికి విరాళంగానైనా ఆ డబ్బును తీసుకోమని నేను చెప్పాను. ఆయన అయిష్టంగానే అందుకు ఒప్పుకుని, తన చేతితో తీసుకోకుండా ఆ డబ్బును బల్లమీద పెట్టమన్నారు. తరువాత ఆయన మా నేపథ్యం గురించి అడిగారు.

అప్పుడు శ్రీసాయిబాబాతో మా నాన్నగారికి వున్న అనుబంధం గురించి నేను ఆయనకు చెప్పాను. నేను చెప్పినది వినగానే ఆయన నన్ను కౌగిలించుకుని, ఆరోజు తన జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పొందిన రోజని చెప్పారు. ఆయన ఎంతో ఉద్విగ్నతతో లోపలకు వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని స్వీకరించి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, “నేనిప్పుడు నిజమైన బాబా ప్రసాదాన్ని పొందాను” అన్నాను. ఆయన నా మాటలకు అర్థమేమిటని అడిగారు. నేను ఆయనతో, “ఈ రెండు నాణాలు శ్రీసాయిబాబా విశ్వవ్యాప్త సందేశాలైన శ్రద్ధ మరియు సబూరీ” అని చెప్పాను. నా వివరణతో అబా పన్షీకర్ సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతుండగా, తాను ఈరోజు ఒక నిజమైన సాయిభక్తుడిని కలుసుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. 

అప్పుడు అబా పన్షీకర్ మాకు తన నేపథ్యం గురించి చెప్పారు. ఆయన తండ్రి గిర్గాఁవ్‌లో వున్న గణపతి మందిరం ప్రధాన పూజారి. అబాకు 8 సంవత్సరాల వయస్సులో వారి ఇంటికి ఒక ముస్లిం ఫకీరు వచ్చి, అతడికి ఒక సాయిబాబా ఫోటోను ఇచ్చారు. ఆయన ఆ ఫకీరుతో, తాను బ్రాహ్మణుల ఇంట్లో జన్మించానని, తన ఇంట్లో ముస్లిమైన బాబా ఫోటోను పెట్టనివ్వరని అన్నాడు. అప్పుడా ఫకీరు, “బాబూ! నువ్వు ఇప్పుడు ఈ ఫోటోని తీసుకోకపోయినా నువ్వు జీవితాంతమూ బాబా సేవ చేస్తూవుంటావని నీ భవిష్యత్తులో వ్రాసివున్నది. నువ్వు బాబా ఫోటోలను ప్రజలకు పంచుతావు. (బేటే, అబ్ తూ ఇసే మత్ లే! తేరీ కిస్మత్ మే లిఖా హై కి తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా! ఔర్ ఇస్కే ఫోటో లోగోంకో బాటా కరేగా!)” అని అన్నారు. ఆయన సూచించిన భవిష్యత్తు నూటికి నూరుపాళ్ళు యదార్థం. ఎందుకంటే, అబా పన్షీకర్ తమ చరమదశ వరకు శ్రీసాయిబాబా సేవలో ఉన్నారు. 

తరువాత ఆ అమూల్యమైన బాబా ఫోటోకు లామినేషన్ చేయించి, దానికి చక్కని చెక్కఫ్రేము తయారు చేయించి, 1993వ సంవత్సరం గురుపూర్ణిమనాడు, వనగాఁవ్‌లోని మా 'విజ్యోత్' బంగళాలోని చిన్న సాయిబాబా మందిరంలో దానిని ప్రతిష్ఠించాము. అప్పటినుండి మేము క్రమం తప్పకుండా గురుపూర్ణిమను ఆ ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకుంటున్నాము. ఇది నా చిన్న స్వీయ అనుభవం.

నేను వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా శిరిడీకి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం నేను పదవీవిరమణ చేసి, బాబా అనుగ్రహంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాను. మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవితభాగస్వాములుగా రావాలని, తర్ఖడ్ కుటుంబంలోని మాకందరికీ శ్రీసాయిబాబాపై భక్తి, ప్రేమలు ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ మేము బాబాను ప్రార్థిస్తున్నాము. చివరగా, నేను సాయిభక్తులందరినీ కోరుకునేదేమిటంటే, సాయిబాబా మనకందించిన శ్రద్ధ, సబూరీ అనే మహామంత్రాలను ఎన్నటికీ మరవవద్దు. ఎవరైతే ఈ రెండు మంత్రాలకు నిజంగా కట్టుబడివుంటారో వారి కోరికలను శ్రీసాయిబాబా తప్పక నెరవేరుస్తారు. మనము నిత్యం ప్రేమించే శ్రీసాయిబాబాకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాను.

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! 

శ్రీసాయిబాబాతో తర్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు సమాప్తం.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 17వ భాగం


సంత్ గాడ్గేమహరాజ్‌తో అనుభవం

ఇంతకుముందు చెప్పినట్లుగా, మహారాష్ట్రలో గొప్ప సాధువయిన  గాడ్గేమహరాజ్ గురించి ఇప్పుడు తెలియచేస్తాను. ఆయన ఖార్‌లో వున్న మా బంగళాకు తరచూ సాయంత్రం సమయంలో ముందుగా చెప్పకుండానే విచ్చేసి, రాత్రంతా వుండి, వేకువఝాముననే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను ఆయనను స్వయంగా చూశాను. ఆయన వివిధ రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన కఫ్నీ ధరించి, తలకు ఒక గుడ్డముక్క కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనను 'గోధాడీ మహరాజ్' లేదా 'గోధాడీ  బాబా' అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలుచెప్పులు వేసుకుని, చేతిలో ఎప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెళుతుండేవారు. వెదురుకఱ్ఱ అరిగిపోకుండా అడుగున ఇనుపతొడుగు బిగించబడివుండేది.

ఆయన విఠలుని(విష్ణువు) పరమభక్తుడు. ఎల్లప్పుడూ, 'పాండురంగా! పాండురంగా!' అని జపిస్తుండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయిమహిమను చాటిన దాసగణు మహరాజ్ ఆయనను మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గేమహరాజ్ దృష్టి ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల ప్రజలకు అన్నివిధాలుగా సహాయం చేయడంపైనే కేంద్రీకృతమై వుండేది. ఆయన వారికి పరిశుభ్రత యొక్క ప్రాధాన్యాన్ని తెలియచేస్తూ, మహారాష్ట్ర అంతా వీధులు ఊడ్చి, తానే స్వయంగా ఆచరించి చూపేవారు. 'పరిశుభ్రతే దైవం' అనేది ఆయన నినాదం. గ్రామాలను అంటువ్యాధుల బారినుండి, జబ్బుల నుండి 'పరిశుభ్రతే' సురక్షితంగా ఉంచుతుందన్నది గ్రామస్థులందరికీ ఆయన ఇచ్చే సందేశం. ఈ కార్యక్రమానికి ఆయన ధనవంతుల నుంచి ఆర్థికసహాయం కూడా స్వీకరించేవారు. అలా స్వీకరించిన ధనాన్ని గ్రామాల్లో అవసరమైనవారికి ఆయన పంచుతూ ఉండేవారు.

శ్రీసాయిబాబా మహాసమాధియైన తరువాత మా తాతగారు గాడ్గేమహరాజుకు బట్టలతానులు విరాళంగా ఇస్తూవుండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా గోధాడీ కుట్టి, గాడ్గేమహరాజ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయనకు సమర్పిస్తుండేవారు. ఆయన దానిని స్వీకరించి, మా అమ్మగారిని ఆశీర్వదించేవారు. ఆ కాలంలోని వారు కురిపించిన ప్రేమ, వాత్సల్యాలు ఈ రోజుల్లో చూడటం చాలా కష్టం.

ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారిచేత బంగళా కొనిపించడానికి ముఖ్యకారకులు సంత్  గాడ్గేమహరాజ్. ఆయన అన్నిచోట్లకు ఎక్కువగా కాలినడకనే తిరుగుతూ ఉండేవారు. ఆయన ఖార్ అనే ప్రాంతంలో ఒక బంగళాను చూశారు. దానినే మా నాన్నగారు 1923వ సంవత్సరంలో రూ.15,007 లకు కొన్నారు. అప్పట్లో ఓల్డ్ ఖార్ ప్రాంతంలో అదొక్కటే ఏకైక కట్టడం. మా బంగళా మిద్దెపై నుంచి మేము రైల్వేస్టేషన్, మౌంట్ మేరీ చర్చి మొదలైనవన్నీ ఎటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. ఎప్పుడైనా గాడ్గేబాబా మా బంగళాకు వచ్చినప్పుడు, జొన్నలతో రోటీ(భాకరీ), ఝుణకా(సంప్రదాయ మహారాష్ట్ర వంటకం) తయారుచేయమని మా అమ్మగారిని ఆదేశించేవారు. మేమంతా ఆ రాత్రికి 'ఝణకా భాకర్' తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క అద్భుతమైన రుచి ఇప్పటికీ నా జ్ఞాపకాలలో అలాగే పదిలంగా ఉంది. రాత్రి భోజనం చేసిన తరువాత, గాడ్గేబాబా తాను వివిధ గ్రామాలలో చేసిన పాదయాత్రలలో తమ అనుభవాలను మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గేబాబా సాధారణమైన వ్యక్తి కాదు, నిశ్చయంగా భగవంతుని దూతే. మా నాన్నగారు ఆయనతో కలసి పండరిపురం వెళ్ళినప్పుడు మా నాన్నగారికి కలిగిన దివ్యానుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.

ఒకసారి మా నాన్నగారు ఆయనను, ఎప్పుడైనా పాండురంగ విఠలుని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారిని తనతో పాటు పుణ్యక్షేత్రమైన పండరిపురానికి రమ్మన్నారు. సౌఖ్యవంతమైన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా, అక్కడ ఒక సాధారణ యాత్రికునిలా ఉండాలని ఆయన మా నాన్నగారితో చెప్పారు. అప్పుడు గాడ్గేబాబాతో కలిసి మా నాన్నగారు రెండవసారి పండరిపురానికి ప్రయాణమయ్యారు.

చంద్రభాగా నదీతీరంలో ఒక గుడారంలో వారికి బస ఏర్పాటు చేయబడింది. ఆయన రోజంతా గాడ్గేబాబాతో కలిసి తిరుగుతూ, ఆయన పరిశుభ్రతా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో, ఆయన చుట్టూ గుమిగూడే పీడిత ప్రజానీకానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, ప్రజలు ఆయన జ్ఞానోపదేశాలను ఎంత ఓపికగా వింటున్నారో అవన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్ గాడ్గేమహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగివచ్చారు. గుడారం లోపల ప్రతి పడక మీద నలుపురంగు కంబళి అమర్చబడివున్న మూడు పడకలు, గుడారం మధ్యలో వేలాడుతూవున్న ఒక కిరోసిన్ లాంతరు ఉండటం మా నాన్నగారు గమనించారు. గాడ్గేబాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి తినడానికి 'ఝుణకా భాకర్' తెస్తానని చెప్పారు. ఖాళీగా వున్న మూడవ పడక ఎవరికోసమని మా నాన్నగారు ఆయనను అడిగినప్పుడు, గాడ్గేబాబా తాను చెప్పడం మరిచాననీ, ఆ రాత్రికి తన అతిథి ఒకరు వస్తారనీ, ఆ రాత్రికి అక్కడే వుండి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతారనీ చెప్పారు. ఆ అతిథి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించరని గాడ్గేబాబా చెప్పారు. తానెప్పుడు పండరిపురం వచ్చినా ఈ అతిథి ఆ రాత్రి తనకు తోడుగా ఉంటారని చెప్పి గాడ్గేబాబా గుడారం నుంచి బయటికి వెళ్ళారు. కొద్దిసేపటిలోనే గుడారంలో చీకటిపరచుకుంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోయింది. మా నాన్నగారు కొంతసేపు కునికిపాట్లుపడి వెంటనే నిద్రపోయారు. కొంతసేపటికి తనకోసం ఝణకా భాకర్ తెచ్చిన గాడ్గేబాబా పిలుపుతో మా నాన్నగారు మేల్కొన్నారు. తన అతిథితో కలిసి తాను అప్పటికే భోజనం చేసినందుకు ఏమీ అనుకోవద్దని చెప్పి, మా నాన్నగారిని భోజనం పూర్తిచేయమనీ, ఈలోపల తాను అలా నది ఒడ్డున వాహ్యాళికి వెళ్ళి వస్తానని గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు ఆ అతిథివైపు చూశారు. అతడు ధోవతి కట్టుకుని, నడుము పైభాగంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాడు. అతడి శరీరం కారునలుపుతో ఉండి, చూడటానికి భిల్లజాతివాడిలా ఉన్నాడు. అతడి కళ్ళు ఎఱ్ఱగా మండుతున్న నిప్పుకణికల్లా ఉన్నాయి. అతడి భుజం మీద కంబళి ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గుడారం మొత్తం మా నాన్నగారు ఇంతకుముందెన్నడూ ఆఘ్రాణించని గాఢమైన కస్తూరి పరిమళంతో నిండిపోయింది. ఇంతలో వారిద్దరూ గుడారం నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు గాడ్గేబాబా తెచ్చిన భోజనాన్ని తినడం పూర్తిచేశారు. అటువంటి మధురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచిచూసి వుండలేదు. భోజనం పూర్తిచేయగానే, గుడారంలోని కస్తూరి పరిమళం తన మత్తుప్రభావాన్ని చూపడంతో మా నాన్నగారు వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే కాకి అరుస్తున్న శబ్దానికి ఆయన నిద్ర లేచారు. గాడ్గేబాబా అప్పటికే నిద్ర లేచివున్నారు. ఆయన మా నాన్నగారిని ముఖం కడుక్కొని, ఆయనకోసం మట్టికుండలో ఉంచిన వేడి వేడి టీ త్రాగమన్నారు. మా నాన్నగారు రాత్రి వచ్చిన అతిథి గురించి ఆరా తీయగా, ఆ అతిథి తన కర్తవ్య నిర్వహణకోసం విఠోబా గుడి తెరవడానికి ముందే అక్కడ ఉండాలనీ, అందువలన అతడు అప్పటికే టీ త్రాగి వెళ్ళిపోయాడనీ గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు దానిని కొంచెం అమర్యాదగా భావించి, ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గేబాబాను అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారితో, అతడిని మీరు గుర్తించి ఉంటారని అనుకున్నాననీ, అతడిని పండరిపురంలో పరిచయం చేయాల్సిన అవసరం లేదనీ అన్నారు. మా నాన్నగారు ఆయనతో, రాత్రి చీకటిలో ఆ అతిథిని తాను సరిగా చూడలేదనీ, ఉదయాన్నే నిద్రలేచిన తరువాత అతడిని పరిచయం చేస్తారని అనుకున్నానని చెప్పారు. అప్పుడు గాడ్గేబాబా ఆ అతిథి మరెవరో కాదని, పండరిపురంలో వెలసిన శ్రీపాండురంగ విఠలుడేనని చెప్పారు. తరువాత గాడ్గేబాబా మా నాన్నగారితో, బంగళాలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందా అని అడిగారు. రాత్రి మా నాన్నగారిని మంత్రముగ్ధుడిని చేసిన కస్తూరి పరిమళం అప్పుడు మళ్ళీ ఆయనను ఆవరించింది. తరువాత చాలాకాలంపాటు ఆ కస్తూరి పరిమళం తనని అనుసరించేదని, దాంతో లార్డ్ విఠోబా తనతోనే ఉన్నారనే భావన కలుగుతుండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్ గాడ్గేబాబా ఇంకొక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా ఇచ్చారు.

కాలం గడిచేకొద్దీ గాడ్గేబాబా వృద్ధులయ్యారు. మా బంగళాకు ఆయన ఆఖరిరాక కూడా మరపురానిది. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా తనతోపాటు కంబళి, వెదురుకఱ్ఱను తీసుకొని వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తనతోపాటు తీసుకుని వెళుతూ వుండేవారు. ఆయన చివరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనతోపాటు వెదురుకఱ్ఱను తీసుకుని వెళ్ళడం మరచిపోయారు. నిజానికి ఆయన కఱ్ఱను తనతో తీసుకువెళ్ళడం మరచిపోలేదు. దానిని ఆయన జ్ఞాపకంగా ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడ వదిలేశారు. నేనిది ఎందుకు చెబుతున్నానంటే ఆయన నడకతీరు, కఱ్ఱ సహాయం లేకుండా నడవలేరన్నట్లుగా వుండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకుని, ఆయన ఆచూకీ తెలుసుకుని ఆయన కఱ్ఱని ఆయనకు తిరిగి ఇచ్చేద్దామనుకున్నారు. కానీ, ఆయన ఎల్లప్పుడూ మహారాష్ట్రలో సంచారం చేస్తూ వుండటం వలన ఆయనను వెదకి పట్టుకోవడం సాధ్యం కాలేదు. నా తల్లిదండ్రులు ఆ కఱ్ఱను ఎంతో పవిత్రమైనదిగా భావించి, దానిని చందనపు మందిరం దగ్గర వుంచారు. నా తల్లిదండ్రులు గాడ్గేబాబా చిత్రపటాన్ని ఒకటి కొని, దానిని కూడా చందనపు మందిరంలో ఉంచి, ప్రతిరోజూ పూజిస్తుండేవారు. గాడ్గేబాబాను కూడా వారు ఒక దైవంలా పూజించడాన్ని మీరు కూడా అభినందిస్తారు. ప్రియమైన పాఠకులారా! ఈ రోజుల్లో మన మధ్యన అటువంటి సాధువులుగాని, దేవదూతలుగాని ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. అటువంటి సాధువులకు నిస్వార్థసేవ చేసే అంకితభక్తుల ఉనికి కూడా కరువయింది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 16వ భాగం


  • చిరస్మరణీయమైన చివరి దర్శనం
  • శిరిడీలో బాబా మహాసమాధి - ముంబయిలో నిదర్శనం
  • శ్రావణ సోమవారం - శ్రీసాయిలో ఐక్యం

చిరస్మరణీయమైన చివరి దర్శనం

శ్రీసాయిబాబాతో తర్ఖడ్ కుటుంబం వారి ప్రత్యక్ష అనుభవాలను వివరించడం పూర్తిచేశాను. తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబాతో సాహచర్యం కలగడానికి కారణం వారి పూర్వజన్మ సుకృతమేనని ఇప్పుడు ప్రతివారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వారు బాబానుంచి ఎప్పుడూ ఏదీ కోరుకోలేదని మీరు గమనించే వుంటారు. వారు మొదట శిరిడీ వెళ్ళింది కూడా శారీరక బాధ నుండి ఉపశమనం కోసమే అయినప్పటికీ వారి శిరిడీ రాకకు గల కారణాన్ని బాబాకు తెలియపరచవలసిన అవసరం కూడా రాలేదు. వారి ఆలోచనను బాబా ఉన్నది ఉన్నట్లుగా చదివి, వారిపై తమ అనుగ్రహాన్ని కురిపించి, వారిని తమ అక్కున చేర్చుకున్నారు. కాలానుగుణంగా బాబాతో వారి అనుబంధం మరింత బలపడింది. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తున్నాను. 

అది 1918వ సంవత్సరం నవరాత్రి రోజులు అనుకుంటాను(జబ్బుతో బాధపడుతున్న పులికి మోక్షాన్ని ప్రసాదించిన ఏడు రోజులకు బాబా విజయదశమినాడు మహాసమాధి చెందారు). వృద్దాప్యంవల్ల బాబా ఇద్దరు భక్తుల సహాయంతో నడిచేవారు. ఒకరోజు సాయంత్రం మా నాన్నగారు పెట్రోమాక్స్ దీపాలను వాటి వాటి స్థానాలలో ఉంచిన తరువాత, బాబా చాలా అలసటగా ఉండటం గమనించారు. బాబాకు కాస్త ఉపశమనంగానూ, సౌఖ్యంగానూ ఉంటుందని, ఆయన బాబాతో, “బాబా! కాళ్ళు ఒత్తమంటారా?” అని అడిగారు. “నీ తృప్తి కోసం నువ్వు కోరుకున్నట్లుగానే కానీ!” అన్నారు బాబా. మా నాన్నగారు బాబా పాదాలవద్ద కూర్చుని, బాబా పాదాలు ఒత్తసాగారు. కొంతసేపయిన తరువాత బాబా ఆయనవైపు తిరిగి, “భావూ! ఇదే మన ఆఖరి కలయిక. ఇక మీదట మనం కలుసుకోము. రకరకాల ప్రజలు ధనము, పిల్లలు, ఆరోగ్యం వంటి రకరకాలయిన కోరికలు తీర్చుకోవడానికి శిరిడీకి వస్తారని నీకు తెలుసు. నేను ఎవ్వరినీ నిరాశపరచక, వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు. నా దగ్గరకు వచ్చి ఏమీ అడగని వాళ్ళలో నువ్వు ఒకడివి. నీకు వివాహం అవకపోవడం వల్ల, సంసారం లేకపోవడం వల్ల నీకు ఏదీ అవసరమనిపించకపోవచ్చు. కానీ భావూ! మనం ఇక ఎప్పటికీ కలుసుకోలేము. కాబట్టి, నీకు కావలసింది ఏదయినా అడుగు. లేకపోతే నువ్వింతవరకు నాకు చేసిన సేవలన్నిటికీ నేను నీకు ఎప్పటికీ ఋణపడిపోతాను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! మీ అనుగ్రహం వల్ల జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి. నాకు ప్రాపంచికమైన అవసరాలు ఏమీ లేవు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నా మీద ఉండేలా మాత్రం అనుగ్రహించండి. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులలోనూ మీరు నా స్మృతిపథం నుంచి మాత్రం తొలగిపోకుండా ఉండేలా వరమివ్వండి (హేచి దాన్ దేగా దేవా తుఝా విసార్ న వవ)” అని అన్నారు. అప్పుడు బాబా, “భావూ! నా భక్తుల విధి నిర్వహణకు నేను బద్దుడను. ప్రత్యేకంగా నీ కోసం ఏదయినా కోరుకోమని నేను అడుగుతున్నాను. కారణం ప్రతి మానవుడికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమ జీవితం విజయవంతంగా సాగడానికి బయటనుంచి సహాయం అవసరమవుతుంది. అందువల్ల, మొహమాటపడకుండా అడుగు!” అన్నారు. మా నాన్నగారు అది తనకు కఠిన పరీక్ష అనుకొని, “బాబా! మీరు అంతగా అడుగుతున్నారు కనుక నా కోరికను తప్పకుండా తీరుస్తానని ముందుగా నాకు మాటివ్వండి” అన్నారు. అప్పుడు బాబా, “భావూ! నేను భక్తులందరి కోరికలను తీరుస్తాను. నువ్వు నాపట్ల లేశమాత్రమయినా అనుమానం పెట్టుకోవద్దు! నువ్వు అడుగు! నేను తీరుస్తాను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను. మీరు నాకు ఎలాంటి జన్మను ప్రసాదించినా, నేను మీ పాదాలవద్దే వుండేలా అనుగ్రహించండి” అన్నారు. బాబా అప్పుడు కొంచెంసేపు మౌనంగా ఉండి, తరువాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, “భావూ! నీ ఈ కోరికను నేను తీర్చలేను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! నా అంతట నేనుగా మిమ్మల్ని కోరలేదు. ఈ విషయంలో మీరే బలవంతపెట్టారు. ఇది తప్ప మీ నుండి నాకింకేమీ అవసరం లేదు” అన్నారు. 

అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి, “భావూ! ఎంతోమంది శిరిడీకి వస్తారు. కానీ నీలాగా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమందే. నీ కోరికతో నువ్వు నన్ను శాశ్వతంగా బద్దుణ్ణి చేద్దామనుకుంటున్నావు. ఈ విధంగా ఎవరితోనూ బంధం ఏర్పరచుకోవడానికి నాకు నా దేవుడి నుండి అనుమతి లేదు. అయినప్పటికీ నువ్వు నిరాశపడనవసరంలేదు. మన తరువాతి జన్మలో మనకు పది సంవత్సరాల వయసప్పుడు మనిద్దరం కలసి కూర్చుని ఒకే కంచంలో తింటామని మాట ఇస్తున్నాను” అన్నారు. నాన్నగారు, “మీ ఇష్టం బాబా” అన్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే, మరుసటి జన్మలో మరలా కలుస్తానని మా నాన్నగారికి బాబా ప్రమాణం చేశారు. మా నాన్నగారు సంతృప్తి చెంది వెంటనే బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా ఆయనను లేవనెత్తి తన ప్రక్కనే ఉన్న ఊదీ కుండలో చేయిపెట్టి, చేతినిండా ఊదీ తీసి మా నాన్నగారికిచ్చి, “భావూ! దీనిని ప్రాణప్రదంగా భద్రపరచుకో! బాగా అవసరమయినప్పుడు మాత్రమే ఉపయోగించు! జీవులలో పోయిన ప్రాణాన్ని తిరిగి ప్రవేశపెట్టేంత అనంతమైన శక్తి ఈ ఊదీలో వుంది” అని అన్నారు. 

అప్పుడు సంధ్య ఆరతి సమయం అయింది. ఆ క్షణంలో మా నాన్నగారికి ఎంతో సంతృప్తి కలిగిన అనుభూతి కలిగింది. అదే సమయంలో బాబా అదే తమ ఆఖరి కలయిక అని చెప్పడం వల్ల కాస్తంత విచారము కలిగింది. మరునాడు బాబా ఆయనను ముంబయి వెళ్ళిపొమ్మని చెప్పారు. ఇంటికి చేరుకోగానే ఆయన శిరిడీలో జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఒక చిన్న వెండిబాక్సు కొని, దానిని బాబా ప్రసాదించిన ఊదీతో నింపారు. ఆ ఊదీని భగవంతుడే స్వయంగా ప్రసాదించిన అమృతంలా వారు భావించారు. మాలో ఎవరికైనా తీవ్రంగా సుస్తీ చేస్తే, నయమవడానికి మా నాన్నగారు నీళ్ళలో ఆ ఊదీ కొంచెం వేసి, మాకు త్రాగడానికివ్వడం నాకు ఇంకా గుర్తుంది. ఆయన జీవించివుండగా, ఆయన ఏడుగురు సంతానంలో ఎవరూ మరణించలేదు.

మా నాన్నగారు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆయనకు స్వంత బంగళా, కారు ఇలా ప్రతీదీ - ఎవరైనా తమ జీవితంలో ఏమేం కావాలనుకుంటారో అవన్నీ - ఉన్నాయి. కానీ, తరువాత కాలంలో ఆయనకు ఈ ప్రాపంచికజీవితం మీద కోరిక పోయింది. ఆయన తన 70వ యేట జబ్బుపడి మరణించేంత వరకు ఆయన ఒక్కసారి కూడా జబ్బున పడటం నేనెన్నడూ చూడలేదు.

శిరిడీలో బాబా మహాసమాధి - ముంబయిలో నిదర్శనం 

బాబా ఊదీ ఔషధంలా పనిచేసి, మోరేశ్వర్ ప్రధాన్ గారికి తిరగబెట్టిన ఆస్త్మా ఎలా తగ్గిందో ఇంతకుముందు మీకు వివరించాను. ఆ సమయంలో ప్రధాన్ గారికి, బాబా స్వయంగా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని నీళ్ళలో వేసి మా తాతగారు త్రాగించగానే, ఆయన ఆస్త్మా నయమవడంతో మా నాన్నగారు, తాతగారు చాలా సంతోషించారు. గొప్ప అభయంతో బాబా తమకు ప్రసాదించిన ఊదీని ఇంత త్వరగా ఉపయోగించవలసి వస్తుందని వారు అసలు ఊహించలేదు. అదే సమయంలో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మోరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటినుంచి మా నాన్నగారు, తాతగారు బాంద్రాలోని తమ ఇంటికి తిరిగివచ్చి, తమ ఇంట్లోని చందనపు మందిరంలోని బాబా ముందు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నిలబడినప్పుడు, బాబా చిత్రపటం పట్టుతప్పి ప్రక్కకు వ్రేలాడుతూ కనబడింది. వారు మా నానమ్మగారిని, “మేము ఇంట్లో లేనప్పుడు పనిపిల్లవాడు పూజాగదిని ఏమైనా శుభ్రం చేశాడా?” అని అడిగారు. ఆరోజు విజయదశమి పర్వదినం కావడం వల్ల పూజాగదిని ప్రొద్దున్నే శుభ్రంచేసి పూజ పూర్తిచేయడం జరిగిందని, కనుక అలాంటిదేమీ జరగలేదని ఆమె చెప్పింది. అప్పుడు వారు, ఆ రెండు సంఘటనలు కాకతాళీయంగా జరిగాయా లేక వేరే ఏమైనా కారణమున్నదా అని ఆలోచించసాగారు.

వారు బాంద్రాలోనే తమ ఇంటికి దగ్గరలో ఉన్న టెండూల్కర్ ఇంటికి గానీ, దభోళ్కర్ ఇంటికి గానీ వెళదామనుకున్నారు. కానీ ఆ అవసరం లేకపోయింది, ఎందుకంటే ఆ సాయంత్రం విలేపార్లే నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ సేవకుడు వీరి ఇంటికి వచ్చి, ఆరోజు మధ్యాహ్నమే శిరిడీలో శ్రీసాయిబాబా మహాసమాధి చెందారని, దీక్షిత్ కుటుంబం శిరిడీకి బయలుదేరి వెళుతున్నారనీ, మా తాతగారిని కూడా తమతో రమ్మన్నారనీ చెప్పాడు. ఆ విషయం విన్నాక, ఈ రెండు సంఘటనల ద్వారా, బాబా మహాసమాధి చెందబోతున్నట్లు తమకు ముందుగా వైర్‌లెస్ సందేశం పంపారని వారికి అర్థమయింది. 

అందుచేతనే మోరేశ్వర్ గారికి తాత్కాలికంగా ఆస్త్మా తిరగబెట్టింది. వారింట్లోని చందనపు మందిరంలో వున్న బాబా చిత్రపటం ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. శిరిడీకి, ముంబయికి మధ్య ఎంతో దూరమున్నా, బాబా తాము మహాసమాధి చెందబోతున్నామని తమ ప్రియభక్తులకు తమదైన విలక్షణరీతిలో తెలియచేశారు. అందుచేతనే శ్రీసాయిబాబా 'అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్'గా పిలవబడుతున్నారు.

ఆయన తెలియచేసే ఇటువంటి విలక్షణమైన సందేశాలు ఆయన ప్రియభక్తులలో ఎటువంటి గగుర్పాటును కలిగిస్తాయో వారి భక్తులకు మాత్రమే అనుభవం. సాయిబాబా మహాసమాధి చెందినప్పటికీ అది భౌతికంగా మాత్రమే. ఎందుకంటే ఆయన తమ అవతారకార్యంలో, పిలిచిన వెంటనే తాను తన భక్తుల చెంత ఎల్లప్పుడూ ఉంటానని నిరూపించి తమ భక్తుల మనస్సులను ప్రభావితం చేశారు. “నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి. నాయందు నమ్మకముంచండి. నిత్యసత్యమేమిటంటే నేను ఎల్లప్పుడూ సజీవంగానే వుంటాను (నిత్య మీ జీవంత జాణా హేచి సత్య). మీ అందరికీ ఇది నా హామీ. దీనిని మీరు మరువవద్దు” అని బాబా ముందే ప్రకటించేవున్నారు.

ప్రియపాఠకులారా! శ్రీసాయితో అంతటి ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన తరువాత కూడా మా నాన్నగారు సామాన్యమానవుని వలె తన మిగిలిన జీవితాన్ని ఎలా గడపగలిగారా అని ఆశ్చర్యపోతూవుంటాను. సామాన్యంగా ఎవరైనా ప్రాపంచిక విషయాలను వదిలించుకోవడం కోసం, పరమార్థం కోసం భక్తిమార్గాన్ని అనుసరిస్తారు. కానీ, ప్రత్యేకంగా మా నాన్నగారి జీవితం ఈ సూత్రానికి మినహాయింపేనని ఎవరైనా ఒప్పుకోవలసిందే.

శ్రావణ సోమవారం - శ్రీసాయిలో ఐక్యం 

1918 నుంచి 1965 వరకు అంటే 47 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాలవ్యవధి. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణాన్ని మా నాన్నగారు ఎలా చేశారో మీకు వివరించడం నా ఉద్దేశ్యం కాదు. సాయిబాబాతో ఆయనకు గల అనుభవాలను మీతో పంచుకోవడం, తద్వారా శ్రీసాయిపై భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడమే ముఖ్యకారణం.

1918 తరువాత మా నాన్నగారి వివాహం మా అమ్మగారితో జరిగింది. ఆమె పేరు లక్ష్మీదేవి కేళ్వేకర్. ఆమెది ముంబయిలోని కేళ్వేమాహిం. ఇదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలోని గొప్ప సాధువులలో ఒకరైన  శ్రీ గాడ్గే మహరాజుతో పరిచయమయింది. ఆయన మా నాన్నగారిని ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు. ఆయన నిర్దేశించినట్లుగా, మా నాన్నగారు ఖార్‌లో(51 E, ఖార్ పాలీ రోడ్) ఒక బంగళా కొనుక్కొని, టాటాబ్లాక్సులో వున్న ఇంటికి 1923లో వీడ్కోలు చెప్పారు. 
శ్రీ జ్యోతీంద్ర, శ్రీమతి లక్ష్మీదేవి తర్కడ్
మా నాన్నగారు తమ వివాహం అయిన తరువాత మా అమ్మగారిని ఒకే ఒక్కసారి మాత్రమే శిరిడీకి తీసుకువెళ్ళారు. తన గతజీవితం గురించి, శ్రీసాయితో తన సాన్నిహిత్యం గురించి ఆమెకు వివరంగా చెప్పారు. మా అమ్మగారు కూడా ఆధ్యాత్మికభావాలు కలవారు. ఈ 21వ శతాబ్దంలో కూడా, భగవంతుని పట్ల భక్తి, ప్రేమలు ఉన్నటువంటి తల్లిదండ్రులున్నందుకు, వారినుండి అరుదైన మంచి సంస్కారాలను అలవరచుకొన్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని భావిస్తున్నాను. 

మా నాన్నగారు మంచి ఆరోగ్యంతో ఉండేవారు. ఆయన జబ్బుపడటం గాని, కనీసం సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుతో బాధపడటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఆయనకు అయిదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆయన తన అయిదుగురు కుమార్తెలకు వివాహాలు చేసి తన బాధ్యతను నిర్వర్తించారు, కానీ తన ఇద్దరు కొడుకుల వివాహాలను మాత్రం చూడలేకపోయారు. 

అది 1965 సంవత్సరం, జులై నెల మా నాన్నగారు తీవ్రమైన ఆస్త్మాకు గురయ్యారు. దానికి తోడు నడుమునొప్పితో ఆయన మంచానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మేమంతా కూడా అవి వార్ధక్య లక్షణాలని అనుకున్నాము. నేను వి.జె.టి.ఐ. ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా పెద్దన్నయ్య రవీంద్ర, మా నాన్నగారు పదవీవిరమణ చేసిన టెక్స్‌టైల్ మిల్లులోనే పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు రక్తపోటు (బి.పి.), చక్కెరవ్యాధి (డయాబెటిస్), ఆస్త్మా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉండేవారు. ఆమెకు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఉండేదంటే, మేము ఆమెకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. ఆమె కోసం మా ఇంట్లో ఎప్పుడూ ఒక ఆక్సిజన్ సిలిండర్ సిద్ధంగా ఉంచుకునేవాళ్ళం. 

మా నాన్నగారిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ప్రాథమికంగా లుంబాగో(వెన్నుపూస క్రింద భాగంలో వచ్చే నొప్పి) అని నిర్ధారించారు. నేను వింటోజెనో బామ్ గాని, మహానారాయణతైలం గాని ఆయన నడుముకు రాస్తూ ఉండటం వల్ల ఆయనకు కొంచెం ఉపశమనంగా వుండేది. మాచేత సేవ చేయించుకోవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయన అంతకుముందెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు ఒత్తమని కూడా అడగలేదు. అందుచేత ఆయన జబ్బుతో అలా మంచానికే పరిమితం అవడంవల్ల చాలా భాధపడేవారు. తాను ఆ వ్యాధి నుండి ఎప్పటికైనా బయటపడగలనా అని ఒకసారి ఆయన నన్ను అడిగారు. బాబాను ఆర్తిగా ప్రార్ధించమని, వారే ఆయనను రక్షించగలరని నేను ఆయనతో చెప్పినట్లు గుర్తు. కానీ ఆయన పరిస్థితి క్షీణించింది. డాక్టరు జోషీ సలహా మేరకు ఆయనను శాంతాక్రజ్‌లోని నానావతీ ఆసుపత్రిలో చేర్పించాము. మా అమ్మగారు స్వయంగా తానే ఒక రోగినన్న విషయాన్ని మరచిపోయి, ఆయనకు సపర్యలు చేయడంలో పూర్తిగా మునిగిపోయారు. 

ఆమె ఉదయాన్నే ఆయనకు టీ, అల్పాహారం తీసుకుని వెళుతుండేవారు. మరలా సాయంత్రం భోజనం తీసుకొని వెళ్ళేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మా అమ్మగారిని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదనీ, అయితే ఆయన తన ఇంద్రియజ్ఞానం కోల్పోలేదనీ ఆమె చెప్పేవారు. ఆ విధంగా ఆయన ఒక వారంరోజులు ఆసుపత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ప్రతిరోజూ ఉదయాన్నే తేనీటితో పాటు బాబా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని కూడా ఆయనకు ఇస్తూవుండేవారు. ఆగష్టు 16వ తేదీన మరాఠీ క్యాలెండర్ ప్రకారం శ్రావణ సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారంనాడు మేము సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించేవాళ్ళం. అందువలన, మా అమ్మగారు మా అన్నయ్యతోనూ, నాతోనూ ఆరోజు త్వరగా ఇంటికి తిరిగిరమ్మని చెప్పారు. నేను మధ్యాహ్నమే కాలేజీనుంచి ఇంటికి తిరిగి వచ్చాను. 

మా అమ్మగారు ఆసుపత్రికి వెళుతూ, ఈ రోజు చాలా క్లిష్టమైన రోజు అని, మా దాదాకు (తండ్రికి) ఈరోజు గండం గడిస్తే ఆయన కనీసం మరొక సంవత్సరంపాటు తప్పక బ్రతుకుతారని చెప్పారు. ఎందుకలా అంటున్నారని నేను ఆమెను అడిగినప్పుడు, తర్ఖడ్ కుటుంబంలోని మగవాళ్ళందరికీ శ్రావణసోమవారం దురదృష్టకరమైన రోజు అనీ, చాలామంది మగవారు ఆరోజునే మరణించినట్లు తన అత్తగారు చెప్పారనీ ఆమె సమాధానమిచ్చారు. ఆ తరువాత ఆమె ఆసుపత్రికి వెళ్ళారు. సుమారు 3.30 గంటలకు ఆమె తనతో తీసుకువెళ్ళిన థర్మాస్ ప్లాస్కులోంచి ఒక కప్పు టీ మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారికి టీ ఎక్కువసార్లు త్రాగే అలవాటు. టీ త్రాగిన తరువాత ఆయనకు కొంచెం ఉపశమనంగా అనిపించి, సుమారు 4 గంటలకు మరొకసారి టీ ఇమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో, అరగంట క్రితమే టీ ఇచ్చాననీ, మళ్ళీ 5 గంటలకు మాత్రమే టీ ఇస్తానని అన్నారు. ఇంకా, ఆ రోజు శ్రావణసోమవారం కాబట్టి త్వరగా ఇంటికి వెళతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తనకు టీ వెంటనే ఇవ్వవలసిందేనని పట్టుపట్టారు. 

ఆయన తానేదో దృశ్యాన్ని చూస్తున్నాననీ, కానీ అది స్పష్టంగా కనపడటం లేదనీ అన్నారు. మా అమ్మగారు, ఆయనను ఆందోళన పడవద్దని చెప్పి, ఆయన చేతిలో ఒక తులసిమాలను ఉంచి, బాబాను ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు. ఆమె మా నాన్నగారి నుదుటిమీద పవిత్రమైన బాబా ఊదీని రాశారు. కాసేపటి తరువాత ఆమె మా నాన్నగారికి టీ ఇచ్చారు. ఆయన ఒక గుక్క టీ త్రాగిన వెంటనే మా అమ్మగారితో, తనను ఎవరో పిలుస్తున్నారనీ, కానీ ఆ ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నానని, దానివల్ల ఆ వ్యక్తి ఎవరో సరిగా నిర్ధారించుకోలేకపోతున్నాననీ అన్నారు. 

మా అమ్మగారు ఆయనతో, గదిలో మనమిద్దరమే ఉన్నామని, మౌనంగా బాబా జపం చేసుకోమని చెప్పారు. ఆయన బాబా నామాన్ని మెల్లగా జపించసాగారు. కొంతసేపటికి ఆయన ముఖం ఎంతో ప్రకాశవంతంగా మారింది. ఆయన ముఖంలో నడుమునొప్పి వల్ల కలిగే బాధ మాయమైపోగా, “బాబా! నేను వస్తున్నాను!”  అని పెద్దగా అరిచారు. ఆ ఆఖరి మాటలు పలికి ఆయన తన శరీరాన్ని విడిచారు. ఇది ఆయన  చరమాంకం.

ఆ సమయంలో ఆయనకు బాబా సాక్షాత్కరించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంత గొప్ప మరణం ఆయనది! ప్రతి ప్రాణి శరీరం నుండి ప్రాణం (ఆత్మ) వదలి వెళ్ళేముందు చాలా బాధపడుతుందని అందరూ చెప్తుంటారు. కానీ మా నాన్నగారు, “బాబా, నేను వస్తున్నాను!” అంటూ తమ ప్రాణాలు విడిచారు. ఈ విధంగా శ్రీసాయిబాబా తన భావూని తనతోపాటు తీసుకువెళ్ళారు. ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన మా అమ్మగారి ధైర్యానికి మెచ్చుకున్నాను. ఆమె నాతో, మా దాదా (తండ్రి) మరణించారని, ఈ విషయాన్ని అందరికీ తెలియపరచి, ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు. 

నేను స్కూలులో చదువుకునేటప్పుడు, “మరణాత్ ఖరోఖరా జగ జగతే” (One Lives The Real Life In One's Death) అనే శీర్షికతో మాకొక పాఠం ఉందని నాకు గుర్తు. దాదా (మా నాన్నగారు) దాన్ని నూటికి నూరుపాళ్ళు ఋజువుచేశారు. నిజానికి మా అమ్మగారికి భావోద్వేగం చాలా ఎక్కువ. కానీ, ఆమె ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేదు. అటువంటి అపూర్వమైన మరణదృశ్యాన్ని చూసి ఆనందంలో మునిగిపోయి వుండవచ్చు, లేదా ఆరోజున కన్నీరు కార్చకూడదని శ్రీసాయిబాబా ఖచ్చితమైన ఆదేశమయినా అయివుండవచ్చు. అలా మా అమ్మగారి సిద్ధాంతం, 1965వ సంవత్సరం ఆగష్టు 16వ తేదీ, శ్రావణ సోమవారం రోజున నిజమైంది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo