సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 18వ భాగం


శ్రీసాయితో వీరేంద్ర స్వానుభవాలు 

అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను చదివిన తరువాత, శ్రీసాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు వుంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు. నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో, మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొందివుండకపోవచ్చుననీ, కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల ఆయన వారసత్వంగా, అణుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయిభక్తులందరికీ వివరించదగిన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా పొందే ఉంటానని అన్నది. ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అన్నది. ఆ భక్తురాలు ఇచ్చిన ఆ సలహా నన్ను కదిలించడంతో, ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను. 

నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్  మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉన్నది. మా ముత్తాతగారు తన కొడుకులకందరికీ తమ పేరు చివర 'ద్ర' అనే అక్షరం వచ్చేటట్లుగా పెట్టారు. అలా నామకరణం చెయ్యటానికి మూలకారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీరవీంద్రనాథ్ ఠాగూర్.

శ్రీఠాగూర్ యునైటెడ్ కింగ్ డం (U.K.) వెళ్ళేముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాతగారి బంగళాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా ముత్తాతగారి కుటుంబానికి ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి, వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన అక్కడకు వచ్చారు. ఠాగూర్ గారికి జ్యోతిష్యం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసారు.

ఆయన మా ముత్తాతగారి జాతకచక్రం వేసి, తర్ఖడ్  కుటుంబం వారంతా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారనీ, అందుచేత వారంతా ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలనీ చెప్పారు. ఆ విధంగా తన కొడుకులకు అలా (పేరు చివర ద్ర' అనే అక్షరం వచ్చేలా) పేర్లు పెట్టడానికి ఆయన మా ముత్తాతగారిని ప్రభావితం చేసారు. మా ముత్తాతగారు దానికి ఒప్పుకొని ఉండవచ్చు. ఆయన తన కొడుకులకు రామచంద్ర (మా తాతగారు), జ్ఞానేంద్ర  అని నామకరణం చేసారు. మా తాతగారు తన కుమారులిద్దరికీ సత్యేంద్ర, జ్యోతీంద్ర (మా నాన్నగారు) అని నామకరణం చేశారు. ఆ తరువాత జ్యోతీంద్ర తన కొడుకులకు రవీంద్ర (మా అన్నగారు), వీరేంద్ర (నేను) అనీ, రవీంద్ర తన కొడుకుకు దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లను పెట్టడం జరిగింది.

నా చిన్నతనం నుండి నేను, ప్రతి గురువారం సాయంత్రం మా ఇంట్లో జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను మొట్టమొదటిసారిగా నాకు 18 సంవత్సరాల వయస్సున్నప్పుడు, నా స్నేహితులు అమర్ భగతాని, శశిభాటియాలతో కలసి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా భార్య కూడా సాయిభక్తురాలు కావటం నా అదృష్టం. ఆమె తన 5వ యేట నుండి శిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుంటోంది. ఆమె తన 5 సంవత్సరాల వయస్సులో తండ్రిని పోగొట్టుకుంది. మా వివాహం అయిన తరువాత మేము మా అత్తగారి ఫ్లాట్ లోనే నివసించడం మొదలుపెట్టాము. మా అత్తగారు, నా భార్య ఇద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా 'సాయి సంస్కారం' ఇంకా వృద్ధిచెందింది. 

శిరిడీలో గురుపూర్ణిమ

శిరిడీలో జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు మా అత్తగారితో కూడా కలసి వెళ్ళడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా 18 గురుపూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యాను. శిరిడీలో గురుపూర్ణిమ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసేవుంటుంది. ఆ ఉత్సవాలలో 'అఖండ పారాయణ' అంటే, మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా 'శ్రీసాయి సచ్చరిత్ర' పవిత్రగ్రంథాన్ని చదవడం ఒక అంశం. ఆ కార్యక్రమంలో పాల్గొనదలచిన సాయి భక్తులందరూ తమ తమ పేర్లు ఇస్తే, ఆ పేర్లలోనుంచి డ్రా ద్వారా 54 పేర్లు తీసి 'శ్రీసాయి సచ్చరిత్ర' అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. 

అలా ఒక గురుపూర్ణిమనాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు, నాకు 9వ నెంబరు కేటాయించబడింది. దీనర్ధం  నేను శ్రీసాయి సచ్చరిత్ర'లోని 9వ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయంలోనే సాయిబాబాపై తర్ఖడ్ కుటుంబానికి గల భక్తి, ప్రేమల గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందం కలిగించింది. మసీదులో నా భాగం పారాయణ పూర్తిచేసాక, నాకు ఒక కొబ్బరికాయ, శ్రీసాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి. ఈ ఫోటోని లామినేషన్ చేయించి, ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజూ పూజించుకోవడానికి మా ఇంట్లో ఉంచాము. ప్రతిరోజూ ఉదయాన్నే నేను నిద్రనుండి లేవగానే, ఈ బాబా ఫోటో ముందు నిలబడి, నమస్కారం చేసుకొని, శ్రీసాయిని, “ఓ సాయి! నేను నిన్నెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు!” (“హేఁచి దాన్ దేగా దేవా, తుఝా విసర్ నవావా) అని ప్రార్థిస్తూ వుంటాను.

అపురూపమైన వెండి భరిణె

తరతరాలుగా తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబా తమ ఆశీస్సులను అందజేస్తూనే ఉన్నారు. శ్రీసాయిబాబా మా కుటుంబదైవం. ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము అనుక్షణమూ ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము. భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది. నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను.

అది 1973వ సంవత్సరం నవంబరు నెల, దీపావళి రోజులు. నేను పనిచేసే కంపెనీవారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండు పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేనక్కడ లండను నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చి వరకు ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ సర్దుకోవడం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండను చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊదీ పెట్టుకొని వెళ్ళడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు. సోమవారం ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా, నా దగ్గర బాబా ఊదీ లేదని గ్రహించి, ఎంతో నిరాశపడ్డాను. అంతలోనే, నా భార్యకు ట్రావెలింగ్ సూటుకేసు సర్దేటప్పుడు మొట్టమొదట బాబా ఊదీ ప్యాకెట్ పెట్టి, ఆ తరువాతనే మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నేను వెళ్ళి సూటుకేసు మొత్తం ఖాళీచేసి చూడగా, ఊదీ ప్యాకెట్ కనిపించింది. అది 5 నెలలవరకూ నాకు సరిపోతుంది. లండనులో ఈ చిన్న ఊదీ ప్యాకెట్టే నాకు పెద్ద అండ. ఉద్యోగరీత్యా ముంబయిలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని. అందుచేత ముంబయి తిరిగి వెళ్ళగానే ఊదీ దాచుకునేందుకు ఒక వెండి భరిణె కొనాలని నిర్ణయించుకున్నాను. లండనులో ట్రైనింగ్ పని పూర్తిచేసుకుని మార్చి నెలలో ముంబయి తిరిగి వచ్చాను. 

నా భార్య, అత్తగారితో కలసి వెండి భరిణె కొనడానికి ముంబయిలోని గిర్గాఁవ్ లో ఒక షాపుకు వెళ్ళాను. ఆ షాపులోని అబ్బాయి 7, 8 వెండిభరిణెలు చూపించాడు. కానీ అన్ని భరిణెలకూ మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి. నాకు అలా మూత విడిగా రాకుండా భరిణెతోనే ఉండేలాగా కావాలని చెప్పాను. షాపు యజమాని, "భరిణె ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను” అని చెప్పాడు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకని ఆలోచించి, మరో షాపులో చూద్దామని ప్రక్కషాపులోకి వెళ్ళాము. ప్రక్కషాపతనికి నాకు ఎటువంటి వెండిభరిణె కావాలో వివరించాను. షాపు యజమాని, "పాత భరిణె అయినా ఫరవాలేదా?" అని అడిగాడు. పాత భరిణె అంటే ఏమిటని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు, వాటిలో మీకు కావలసిన వెండిభరిణె ఉండవచ్చని అన్నాడు. ఇది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండిభరిణె కొనడమా? అదేమన్నా మంచి పనేనా? నా భార్య, అత్తగారు కూడా అలాగే ఆలోచించడంతో మరోషాపులో క్రొత్త భరిణె ఉంటుందేమో చూద్దామనుకున్నాము. ముందే వద్దని చెప్పి షాపు యజమానిని బాధపెట్టడం ఎందుకని, పాత భరిణె తీసుకొచ్చాక చూసి, ఆ తరువాత వద్దని చెప్పొచ్చులే అని అనుకొని, “సరే తీసుకురండి! చూస్తాము” అని చెప్పాము. ఆ షాపు యజమాని మాకు ఎలాంటి భరిణె కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చి ఇచ్చాడు. ఆ వెండిభరిణెను చూడగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా ముఖంలో భావాన్ని చూసి, షాపు యజమాని, "అయ్యా! ఒకవేళ మీరు కోరుకునే భరిణె ఇలాంటిదే అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికే మెరుగు పెట్టించి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్నాడనిపించింది. తరువాత ఆ వెండిభరిణె మూత తెరచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. దానివంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా భార్య, అత్తగారు నన్ను చూసి, “ఏమయింది? ఎందుకు అలా ఉండిపోయావు? ఏమి జరిగింది?” అని ఆత్రుతగా అడిగారు. వారికి ఆ భరిణెను చూపించగానే వాళ్లకు కూడా నోటమాట రాలేదు. ఆ వెండిభరిణె మూతకు లోపలివైపు బాబా ఫోటో అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. అంత చిన్న భరిణెలో బాబా ఫోటో ఎవరు అతికిస్తారు? అది 1974వ సంవత్సరం. అప్పట్లో ఇప్పుడు ఉన్నంతమంది బాబా భక్తులు లేరు. పైగా బాబాపై భక్తిశ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం. భక్తులు గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు మొదలయిన దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటుండేవారు. అందుచేత ఎవరయినా బాబా భక్తుడు అంత శ్రమ తీసుకుని ఆ భరిణెలో బాబా బొమ్మ అతికించాడంటే నమ్మశక్యం కాలేదు. షాపు యజమాని ఆ వెండిభరిణెకు మెరుగు పెట్టించి ఇచ్చాడు. ఈరోజువరకూ కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే వుంది. మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు, బొమ్మలూ ఉన్నాయి. అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి, కానీ ఈ వెండిభరిణె మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే వుంది. ఆ భరిణె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బాబా ఊదీ ఎప్పుడు పెట్టుకుందామని దానిని తెరిచినా, నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది.

ఒక్కసారి జరిగినదంతా గుర్తుచేసుకుంటే, బాబా నా కోసమే ఆ భరిణెను తయారుచేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. నేనే కనుక క్రొత్త వెండిభరిణెను ఆర్డర్ చేసి ఉంటే, అందులో బాబా ఫోటో ఉండేది కాదు. అలా తర్ఖడ్ కుటుంబంలో మూడవతరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇంకా బలపడింది.

విజ్యోత్ ఆవిర్భావం

మనలో ప్రతి ఒక్కరికీ కూడా మనసులో ఒక బలీయమైన కోరిక ఉంటుందని నా అభిప్రాయం. మా నాన్నగారు తను ఒక ధనవంతుడిననీ, తనకు ఒక బంగళా, కారు ఉండేవని, ఒక స్టోర్ రూమ్ నిండా పింగాణీ పాత్రలలో సమృద్ధిగా ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉండేవని చెబుతూ ఉండేవారు. కానీ తరువాతి కాలంలో అవన్నీ మృగ్యమైపోయాయి. నేను ఆయన ఆఖరి సంతానాన్ని. అందుచేత స్వశక్తితో బాగా కష్టపడి, మా కుటుంబం పోగొట్టుకున్న సంపదనంతా భగవంతుని దయతో తిరిగి సంపాదించాలనే బలీయమైన కోరిక ఉండేది. ముంబయిలో స్వంత బంగళా కలిగి ఉండటమంటే అసాధ్యం. నా భార్య కూడా ఖార్‌లో బంగళాలోనే పుట్టి పెరిగింది. అందుచేత మా కుటుంబానికి కూడా స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, వృద్ధాప్యంలో సుఖంగా జీవిద్దామని మా ఇద్దరి కోరిక. తరువాత, 1991లో మేము వనగాం (ముంబయి నుండి సుమారు 100 కి.మీ. దూరంలో వెస్ట్రన్ రైల్వే లైనులో ఉన్న స్టేషన్) గ్రామంలో 6 గుంటల (726 చదరపు గజాల) స్థలం కొన్నాము. నా కంపెనీలో ఋణం తీసుకుని, మేము 1993 కల్లా ఆ స్థలంలో ఒక బంగళా కట్టుకోగలిగాము. 1960లో ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు, నా స్కూల్ స్నేహితుడు నాకు 'లకాకి' (LAKAKI) అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లక్ష్మణరావ్(ల) కాకాసాహెబ్(కా) కిర్లోస్కర్(కి) గారిది. ఆయన పేరులోని మొదటి అక్షరాలు (ల కా కి) తీసుకొనడమే ఆ పేరు వెనుకవున్న రహస్యం. 1959లో ఆర్థిక ఇబ్బందులవల్ల ఖార్‌లో వున్న మా బంగళాను అమ్మవలసివచ్చింది. నాకు 16 సంవత్సరాల వయస్సులో, 'లకాకి' బంగళాను చూశాక, నా జీవితంలో ఎప్పుడైనా బంగళా కట్టుకుంటే దానికి 'విజ్యోత్'(VIJYOT- VIrendra JYOtindra Tarkhad) అనే పేరు పెట్టాలనే ఆలోచన కలిగింది. అందుకే మేము కట్టుకున్న బంగళాకు 'విజ్యోత్' (VIJYOT) అని పేరు పెట్టుకున్నాము. 

అబా పన్షీకర్ నుంచి సాయి ప్రసాదం 

మా బంగళా బ్లూ ప్రింటు తయారుచేసినప్పుడు, ఆ బంగళాలో పూజ మరియు ధ్యానం చేసుకోవడానికి ఒక చిన్న పాలరాతిమందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది. ఆ మందిరంలో నిలువెత్తు బాబా రంగుల ఫోటో ఉంచాలనే కోరిక మాకు బలంగా ఉండటంతో మేము చాలా గట్టి ప్రయత్నం చేశాము. కానీ మాకు అలాంటి బాబా ఫోటో ఒక్కటి కూడా లభించలేదు.

అది ఏప్రిల్, 1993. మార్చి నెలలో ముంబయి మహానగరం విషాదకరమైన బాంబుపేలుళ్ళకు సాక్షీభూతంగా నిలిచింది. దానివల్ల ప్రజలు, అపరిచితులతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. అలాంటి పరిస్థితులలో, ఒకరోజు సాయంత్రం బాగా ప్రొద్దుపోయాక ఒక వ్యక్తి మా ఇంటి డోర్ బెల్ మ్రోగించాడు. నా భార్య తలుపుతీయగానే, ఒక అపరిచితవ్యక్తి నా గురించి అడిగి, నన్ను కలవాలని పట్టుబట్టాడు. కానీ, అతడు నా పేరు కూడా సరిగా చెప్పలేకపోవడంతో నా భార్య అతడిని అనుమానించింది. నేను అక్కడికి వెళ్ళగానే, అతడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఒకసారి అతడు శిరిడీలోని లెండీబాగులో నన్ను కలుసుకున్నానని, ఆ సమయంలో నేను బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని కూడా అతడితో పంచుకున్నట్లు గుర్తుచేశాడు. అతడు పూనా సాయిమందిరంలో సేవ చేస్తుండే వ్యక్తి అని నాకు స్పష్టంగా గుర్తుకొచ్చి, అతడిని మా ఇంట్లోకి రావడానికి అనుమతించాను. రాత్రి భోజనం చేసే సమయం అయినందువల్ల అతడిని భోజనానికి ఆహ్వానించగా, అతడు అంగీకరించాడు. 

మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మా పాలరాతి మందిరానికి ఒక సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే మా కోరికను అతడితో వెల్లడించాను. మేము కనుక నిలువెత్తు రంగుల చిత్తరువు కోసం చూస్తూ ఉన్నట్లయితే, ఒక చిత్రకారుడి చేత నిలువెత్తు రంగుల చిత్రపటం గీయించుకోవచ్చనీ, అలాకాకుండా రంగుల ఫోటో కోసమే చూస్తున్నట్లయితే అబా పన్షీకర్ మాత్రమే మాకు సహాయం చేయగలరని అతడు చెప్పాడు. తన దగ్గర అబా పన్షీకర్ తమ్ముడు, ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడయిన ప్రభాకర్ పన్షీకర్ ఫోన్ నంబరు ఉందని కూడా చెప్పాడు. నేను ప్రభాకర్ పన్షీకరుకు ఫోన్ చేసి, లండనులో ఉన్న అబా పన్షీకర్ టెలిఫోన్ నెంబరు తీసుకుని, ఆయనకు ఫోన్ చేశాను. 

బాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను విని ఆయన, తాను మే నెలలో ముంబయి వస్తున్నాననీ, తన తమ్ముడు నివాసముండే ప్రభాదేవి ప్రాంతంలో తనను కలుసుకోవచ్చుననీ చెప్పాడు. మే నెల దాకా నిరీక్షించి, ఆయన ముంబయి వచ్చిన తరువాత, ఒక శనివారం సాయంత్రం ఆయనను కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మా కుటుంబసభ్యులు, అనగా నేను, నా భార్య కుందా, మా అమ్మాయి సుజల్ మరియు మా అబ్బాయి మహేంద్ర, అందరం కలిసి 1993 మే 22న వాళ్ళింటికి వెళ్ళాము. నాకు ఆయన గురించి ఏమీ తెలీదు. ఇంతలో కాషాయవస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్షమాలతో ఒకాయన మా ముందుకు వచ్చి, తనను తాను అబా పన్షీకరుగా పరిచయం చేసుకున్నారు. నేనాయనకు నమస్కారం చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండలు కానీ, మిఠాయిలు కానీ ఏమీ లేకుండా వట్టిచేతులతో ఎలా వచ్చారని ఆయన నన్ను మందలించారు. కానీ ఆయన మాకోసం బాబా చిత్రపటం తెస్తున్నట్లు నాతో ఎప్పుడూ చెప్పని కారణంగా, ఆయన అలా మందలించడంతో నేను ఆశ్చర్యపోయాను.

ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని కోరి, వెంటనే సిద్ధివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి ఒక పూలదండ, కొన్ని పేడాలు తీసుకెళ్ళాను. ఆయన తన ఇంటి లోపలికి వెళ్ళి, చిత్రపటాలను వుంచే పెద్ద పెట్టెను తీసుకునివచ్చారు. దాని మూత తీసి, అందులోనుంచి ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టను బయటకు తీశారు. ఆ చుట్టను విప్పగానే అందులో, సింహాసనం మీద కూర్చుని, తమ నిత్యమైన చిరునవ్వును మాపై వర్షిస్తూ ఉన్న శ్రీసాయిబాబా సాక్షాత్కరించారు. 1మి.మీ. దళసరి కొడాక్ పేపరు మీద ముద్రించిన బాబా రంగుల చిత్రపటం అది. అబా పన్షీకర్ సలహా ప్రకారం బాబా చిత్రపటానికి పూలమాల వేసి, అందరికీ పేడాలు పంచాను. అబాగారు ఆ చిత్రపటం క్రిందభాగంలో, “వీరేంద్ర, కుందా, సుజల్ మరియు మహేంద్రలకు.. అబా పన్షీకర్ నుంచి సాయిప్రసాదం” అనే సందేశాన్ని వ్రాసి సంతకం చేసిన తరువాత ఆ ఫోటోను మాకిస్తూ, "దయచేసి మీ నిధిని స్వీకరించండి" అని అన్నారు. 

అది నా జీవితంలోనే బంగారుక్షణం. నాకు నోట మాట రాలేదు. నిస్సందేహంగా నాకది విలువకట్టలేని సంపద. నేను నా పర్సులోనుంచి 1,001 రూపాయలు తీసి ఆయనకు ఇవ్వబోయాను. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పి ఆయన ఆ డబ్బును స్వీకరించలేదు. కనీసం లండనులోని సాయిమందిరానికి విరాళంగానైనా ఆ డబ్బును తీసుకోమని నేను చెప్పాను. ఆయన అయిష్టంగానే అందుకు ఒప్పుకుని, తన చేతితో తీసుకోకుండా ఆ డబ్బును బల్లమీద పెట్టమన్నారు. తరువాత ఆయన మా నేపథ్యం గురించి అడిగారు.

అప్పుడు శ్రీసాయిబాబాతో మా నాన్నగారికి వున్న అనుబంధం గురించి నేను ఆయనకు చెప్పాను. నేను చెప్పినది వినగానే ఆయన నన్ను కౌగిలించుకుని, ఆరోజు తన జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పొందిన రోజని చెప్పారు. ఆయన ఎంతో ఉద్విగ్నతతో లోపలకు వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని స్వీకరించి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, “నేనిప్పుడు నిజమైన బాబా ప్రసాదాన్ని పొందాను” అన్నాను. ఆయన నా మాటలకు అర్థమేమిటని అడిగారు. నేను ఆయనతో, “ఈ రెండు నాణాలు శ్రీసాయిబాబా విశ్వవ్యాప్త సందేశాలైన శ్రద్ధ మరియు సబూరీ” అని చెప్పాను. నా వివరణతో అబా పన్షీకర్ సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతుండగా, తాను ఈరోజు ఒక నిజమైన సాయిభక్తుడిని కలుసుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. 

అప్పుడు అబా పన్షీకర్ మాకు తన నేపథ్యం గురించి చెప్పారు. ఆయన తండ్రి గిర్గాఁవ్ లో వున్న గణపతి మందిరం ప్రధాన పూజారి. అబాకు 8 సంవత్సరాల వయస్సులో వారి ఇంటికి ఒక ముస్లిం ఫకీరు వచ్చి, అతడికి ఒక సాయిబాబా ఫోటోను ఇచ్చారు. ఆయన ఆ ఫకీరుతో, తాను బ్రాహ్మణుల ఇంట్లో జన్మించానని, తన ఇంట్లో ముస్లిమైన బాబా ఫోటోను పెట్టనివ్వరని అన్నాడు. అప్పుడా ఫకీరు, “బాబూ! నువ్వు ఇప్పుడు ఈ ఫోటోని తీసుకోకపోయినా నువ్వు జీవితాంతమూ బాబా సేవ చేస్తూవుంటావని నీ భవిష్యత్తులో వ్రాసివున్నది. నువ్వు బాబా ఫోటోలను ప్రజలకు పంచుతావు. (బేటే, అబ్ తూ ఇసే మత్ లే! తేరీ కిస్మత్ మే లిఖా హై కి తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా! ఔర్ ఇస్కే ఫోటో లోగోంకో బాటా కరేగా!)” అని అన్నారు. ఆయన సూచించిన భవిష్యత్తు నూటికి నూరుపాళ్ళు యదార్థం. ఎందుకంటే, అబా పన్షీకర్ తమ చరమదశ వరకు శ్రీసాయిబాబా సేవలో ఉన్నారు. 

తరువాత ఆ అమూల్యమైన బాబా ఫోటోకు లామినేషన్ చేయించి, దానికి చక్కని చెక్కఫ్రేము తయారు చేయించి, 1993వ సంవత్సరం గురుపూర్ణిమనాడు, వనగాఁవ్ లోని మా 'విజ్యోత్' బంగళాలోని చిన్న సాయిబాబా మందిరంలో దానిని ప్రతిష్ఠించాము. అప్పటినుండి మేము క్రమం తప్పకుండా గురుపూర్ణిమను ఆ ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకుంటున్నాము. ఇది నా చిన్న స్వీయ అనుభవం.

నేను వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా శిరిడీకి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం నేను పదవీవిరమణ చేసి, బాబా అనుగ్రహంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాను. మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవితభాగస్వాములుగా రావాలని, తర్ఖడ్ కుటుంబంలోని మాకందరికీ శ్రీసాయిబాబాపై భక్తి, ప్రేమలు ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ మేము బాబాను ప్రార్థిస్తున్నాము. చివరగా, నేను సాయిభక్తులందరినీ కోరుకునేదేమిటంటే, సాయిబాబా మనకందించిన శ్రద్ధ, సబూరీ అనే మహామంత్రాలను ఎన్నటికీ మరవవద్దు. ఎవరైతే ఈ రెండు మంత్రాలకు నిజంగా కట్టుబడివుంటారో వారి కోరికలను శ్రీసాయిబాబా తప్పక నెరవేరుస్తారు. మనము నిత్యం ప్రేమించే శ్రీసాయిబాబాకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాను.

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! 

శ్రీసాయిబాబాతో తర్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు సమాప్తం.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

4 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏🙏 while reaching i was felt in sai s trance... Really exllecent stories of tharkad jiii..I'm lucky That I have gone through such meracules sai leelas.. om sai ram

    ReplyDelete
  3. Om sai ram me challani daya ma meeda unchandi tandri, amma nannalami kshamam ga chudandi tandri valla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi na manasu meeku telusu, ofce lo anta bagunde la chesi illu konali anna na korika neravere la chudandi tandri pls

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo