సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 153వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • సచ్చరిత్ర పారాయణ - లభించిన సాయి అనుగ్రహం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తురాలిని. ఆయన చూపిన అనేక లీలలను నేను నా జీవితంలో అనుభవించాను. వాటిలో రెండింటిని మాత్రమే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఎందుకంటే వాటన్నిటి గురించి వ్రాయడం మొదలుపెడితే, అవి 100 పేజీల వరకు వెళ్తుంది. నేను కేంద్ర ప్రభుత్వ అధికారిగా ఢిల్లీలో పనిచేస్తున్నాను. నిజానికి నేను దుర్గమ్మ భక్తురాలిని. 2001కి ముందు సాయిబాబా గురించి నాకు పెద్దగా తెలియదు. 2001లో నా భర్తకు మధ్యప్రదేశ్ నుండి న్యూఢిల్లీకి బదిలీ అయ్యింది. అతని సహచరులు తనకి వీడ్కోలు చెపుతూ బహుమతిగా సాయిబాబా విగ్రహాన్ని ఇచ్చారు. నేను తన సూట్‌కేస్‌ ఖాళీ చేస్తున్నప్పుడు కార్డ్‌బోర్డ్ పెట్టెలో ఉన్న బాబా విగ్రహాన్ని చూసి, "మేము ఈయన్ని ఆరాధించము, కనుక వాళ్ళు వేరే ఏ ఇతర ఉపయోగకరమైన బహుమతయినా  ఇచ్చుంటే బాగుండేది" అని అనుకున్నాను. నాకు ఆ సమయంలో తెలియదు, అది నా జీవితంలో అమూల్యమైన బహుమతి అవుతుందని. 

ఆ సమయంలో నా పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో సగటు మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ మార్కులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తనకి ప్రవేశం దొరకదన్న విషయం నాకు తెలుసు. తన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే తనని ఏ కాలేజీలో జాయిన్ చేయాలో తెలియలేదు. ఆమె చదువు గురించి, ఉద్యోగం గురించి, ఒకటేమిటి, తన భవిష్యత్తు ఏమవుతుందోనని భయం పట్టుకుంది. పగలు, రాత్రి నాకు అదే చింత. అటువంటి స్థితిలో నేను ఆ విగ్రహాన్ని ఏదో ఒక మూల పెట్టేశాను. ఇప్పుడు అద్భుతం మొదలైంది.

మా ఇంటికి బాబా వచ్చిన వారం లేదా రెండువారాల తరువాత నా బాస్ రిటైర్ అయ్యి కొత్త బాస్ డ్యూటీలో జాయినయ్యారు. అతను సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతికొద్దిరోజుల్లో అతని భార్యతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆమె కూడా సాయిబాబాకు గొప్ప భక్తురాలు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, నా కుమార్తె భవిష్యత్తు గురించి నా ఆందోళనను ఆమెతో పంచుకున్నాను. ఆమె, "మీకు ఇష్టమైతే, 'సాయి సచ్చరిత్ర' అనే పుస్తకాన్ని మీకు పంపుతాను, మీ కోరికను బాబాకు చెప్పుకుని గురువారం నుండి గురువారం వరకు పారాయణ చేయండి. తరువాత ఏమి జరుగుతుందో మీరే చూస్తారు" అని చెప్పింది. నేను సరేనని పుస్తకం చదవడం ప్రారంభించాను. ఇంకా పారాయణ పూర్తి కాలేదు. అంతలోనే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నా సోదరి నాకు ఫోన్ చేసి, యూనివర్సిటీ GGSIPU అను ఒక కొత్త ప్రొఫెషనల్ కోర్సు ప్రారంభించిందని, అందులో భాగంగా చాలా కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయని, అందుకు అవసరమైన పోటీ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిందని చెప్పింది. నేను నా కుమార్తె చేత కొన్ని కోర్సులకు ఫారాలను నింపించి, దరఖాస్తు చేయించాను. ఆమె ఆ పరీక్షలు వ్రాసి 'మాస్ కమ్యూనికేషన్ కోర్సు'లో చాలా మంచి ర్యాంకును సాధించింది. బాబా ఆశీస్సులతో తన ప్రతిభ కారణంగా తనకి “ఉచిత సీటు” లభించింది. తరువాత ఆమె గ్రాడ్యుయేషన్‌లో కూడా మంచి మార్కులు సాధించి చాలా సంతోషంగా ఉంది. ఆ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆమెకు చాలా మంచి ఉద్యోగం లభించింది. తన కెరీర్‌లో ఎంతో ఎత్తుకు దూసుకుపోతోంది

నా కూతురికోసం మొదటిసారి 'సాయిసచ్చరిత్ర' చదివాక నేను బాబాపై నిజమైన ప్రేమను పెంచుకున్నాను. ఎక్కడో మూలన దాచిపెట్టిన బాబా విగ్రహాన్ని బయటకు తీసి పూజించడం మొదలుపెట్టాను. గత 18 సంవత్సరాలుగా ఆయన్ను అనన్యంగా ప్రార్థిస్తూ, సచ్చరిత్ర అనేకసార్లు చదివాను. ఎప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నా సచ్చరిత్ర చదవడం, సమస్య పరిష్కరింపబడటం నా స్వానుభవం. ఆరోజు బాబా మా ఇంటికి రాకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించలేను.

రెండవ అనుభవం:

ఇది నా చిన్న కుమార్తెకు సంబంధించినది. 2008లో తను 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యింది. తను పరీక్షలు అంత బాగా ఏమీ వ్రాయలేదు. తన చదువు అంతంత మాత్రమేనని నాకు తెలుసు. అందువలన తను పరీక్షలో ఫెయిల్ అవుతుందని నాకు చాలా ఆందోళనగా ఉండేది. కానీ తనకోసం సచ్చరిత్ర పారాయణ చేద్దామంటే ఏదో ఒక కారణంచేత నాకు వీలు కాలేదు. ఇలా ఉండగా తన బోర్డు పరీక్షా ఫలితాలు గురువారం ప్రకటిస్తారని తెలిసింది. తీరా మరుసటి రోజు ఫలితాలు ప్రకటిస్తారనగా ముందురోజు హఠాత్తుగా ఫలితాల విడుదల శుక్రవారానికి మార్చారు. నేను గురువారం తెల్లవారుఝామున 4 గంటలకు లేచి, స్నానం చేసి, త్వరత్వరగా పనులన్నీ పూర్తిచేసుకుని ఉదయం 5.30 గంటలకు సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. మధ్యాహ్నం వంటకోసం చిన్న విరామం తీసుకుని మళ్ళీ చదవడం కొనసాగించాను. నేను సాయంత్రం 8.00 గంటలకి పుస్తకమంతా చదవడం పూర్తిచేశాను. వారంరోజుల్లో చదవాల్సిందంతా ఒక్క రోజులో పూర్తి చేశాను. మరుసటిరోజు ఫలితాలు వెలువడ్డాయి. ఆశ్చర్యం! నా కూతురికి 70% మార్కులు వచ్చాయి. నన్ను నేను నమ్మలేకపోయాను. నా చింతలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. పట్టలేని ఆనందంతో నా సాయిబాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

సాయిని ప్రార్థిస్తూ ఉండండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo