బాబా విగ్రహము తయారి వెనుక దాగి ఉన్న లీల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాలు శ్రీ ఇమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన "శిరిడీలో సిరులు" అనే పుస్తకము నుండి గ్రహింపబడినవి.
పిలిచినంతనే పలికే దైవం, కోరిన వరాలు కురిపించే దేవుడు శిరిడీ సాయిబాబా. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అసలు సాయిబాబా ఎవరు..? దేవుడా..? యోగీశ్వరుడా..? అవతార పురుషుడా..? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భూవిపై వెలిసిన ప్రత్యక్షదైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ, సబూరి అనే సన్మార్గాలను బోధించిన సద్గురు అవతారం. 1838 నుండి 1918 మధ్య కాలంలో ఎంతోమంది భక్తులను కరుణించి, ఎన్నో మహిమలను చూపిన సాయిబాబా 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి చెందారు.
సాయిబాబా సమాధి చెందిన తరువాత నాటి భక్తులంతా కేవలం బాబా సమాధికి మాత్రమే నిత్యపూజలు చేస్తూ హారతులు ఇచ్చేవారు. ఆ తరువాత కొద్ది కాలానికి బాబా ఫొటోను వెండిపీఠంపై వుంచి నిత్యపూజలు చేయడం మొదలుపెట్టారు. భక్తులు సమాధితోపాటు, ఈ ఫొటోను కూడా దర్శించుకుని సాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన అనుభూతిని పొందేవారు. సాయి సమాధి చెందిన 36 ఏళ్ళకు అంటే 1954వ సంవత్సరంలో సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన వెనుక జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, సాయి మహిమ ఎంతటి మహత్తరమైనదో ఇట్టే అవగతమవుతుంది.
1954వ సంవత్సరంలో ముంబాయి ఓడరేవుకు ఇటలీ నుంచి ఓ నౌక వచ్చింది. ఆ నౌకలో నిలువెత్తు పాలరాతి ముడిపదార్థం వున్నట్టు సిబ్బంది గుర్తించారు. అది ఎవరి పేరు మీద వచ్చిందో, దాన్ని నౌకలోకి ఎవరు చేర్చారో వంటి వివరాలు ఎవ్వరికీ తెలియరాలేదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ రాకపోయేసరికి, రేవు అధికారులు దానిని వేలం వేశారు. వేలంలో ఒక పూణే వర్తకుడు దానిని సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరవాత అతనికి ఏ ప్రేరణ కలిగిందో తెలియదుగాని, ఆ పాలరాతిని శిరిడీ సంస్థానానికి సమర్పించాడు. ఆరాతి నాణ్యతను గుర్తించిన సంస్థాన్ కార్యవర్గ సభ్యుల మదిలో 'దీనితో బాబా ప్రతిమను చెక్కిస్తే ఎలా ఉంటుంది' అనే ఆలోచన మెదిలింది. అందరూ శిల్పం చెక్కించాలని నిర్ణయించి, బొంబాయికి చెందిన బాలాజీ వసంత్ తాలీమ్ అనే ప్రఖ్యాత శిల్పిని పిలిపించి, ఆ బాధ్యతను అతనికి అప్పగించారు.
అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫొటోలు కూడా చాలా కొద్ది మాత్రమే. అవి కూడా వేరు వేరు వయస్సులకు చెందినవి కావడం వలన విగ్రహాన్ని ఎలా మలచాలో బాబా ముఖకవలికలు, రూపు రేఖలు ఎలా తీర్చిదిద్దాలో తాలీమ్ కు ఓ పట్టాన అర్థం కాలేదు. అందువలన ఎంత శ్రమించినా నమూనా మూర్తి సంతృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయినే ప్రార్థించి వాటి గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, "నన్ను మళ్ళీ మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు. జాగ్రత్తగా చూడు" అని తన ముఖాన్ని వివిధ కోణాలలో చూపించారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ (కలలోనే) ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి పరికించాడు. ఆ స్వప్న సాక్షాత్కార బలంతో తెల్లవారగానే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చక్కని నమూనా మూర్తిని తయారుచేసి, దానినిబట్టి ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తైన పాలరాతి విగ్రహం అపురూపంగా మలిచాడు. అంటే సాయి తనంతట తానుగా తన ప్రతిరూపాన్ని తయారు చేయించుకున్నారు. 1954లో అక్టోబర్ 7 విజయదశమి రోజున శిరిడీ సాయినాథుడి విగ్రహ ప్రతిష్ట జరిగింది. నాటి నుండి శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడికి బాబా ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు. జీవకళతో తొణికిసలాడుతూ వుండే ఆ సజీవ ప్రతిమ భక్తులకు సాయి ప్రతిరూపం కాదు, సాక్షాత్తు శ్రీ సాయియే! ఈనాడు అంబరాన్ని చుంబించే భవంతులతో, లెక్కకు మించిన వాణిజ్య సముదాయాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న శిరిడీలో రాజ భవనం వంటి సమాధి మందిరం లో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ వుంటుంది. సాయిని సజీవంగా చూడలేకపోయిన భక్తులు, ఈ మూర్తిని చూసి, బాబాను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతున్నారు.
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి. |
Jayagurudatta
ReplyDeleteNa bangaru saidevudu
ReplyDeleteఓం సాయిరాం.బాబా ను మన సరా విశ్వసిస్తే అనేక రూపాలలో అగుపి స్తారు సత్యం.అనుభవం నాకు వుంది.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete