సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ప్రక్కనే కూర్చొని మాట్లాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు భావన. నేను మహాపారాయణ - 56 గ్రూపులో సభ్యురాలిని. అది కూడా బాబా బాబా. అది నన్ను బాబాకు ఇంకొక అడుగు దగ్గరకు చేసింది. "బాబా! మహాపారాయణలో నాకు కూడా స్థానం కల్పించినందుకు మీకు కృతఙ్ఞతలు."ఇక నా అనుభవానికి వస్తే, హాస్టల్లో ఉన్నప్పటినుండి నాకు ప్రతి గురువారం సంధ్య ఆరతికి వెళ్లడం అలవాటు. 2017, నవంబర్ నెలలో ఒక గురువారంనాడు నేను నాతోపాటు బాబా మందిరానికి రమ్మని మా అమ్మను అడిగాను. ఆమె, "నేను వచ్చేవారం వస్తాను, ఈరోజుకి మీ నాన్నతో వెళ్ళు!" అని చెప్పింది. కానీ, ప్రతి గురువారం ఏదో ఒక కారణంతో ఆమె వాయిదా వేస్తూ ఉండేది. చివరికి 2018, ఫిబ్రవరి 15న ఆమె నాతో రావడానికి అంగీకరించింది. మా ఇంటి నుండి మందిరం చాలా దూరంలో ఉండటంతో ఇద్దరం ఆటోలో బయలుదేరాము. అక్కడికి చేరుకున్నాక ఆటోడ్రైవర్‌కి డబ్బులు ఇచ్చే సమయంలో అతని చేతిలో పవిత్రమైన 'సాయి సచ్చరిత్ర' గ్రంథం ఉండటం చూసి నాకు సంతోషంగా అనిపించింది.

అప్పటికి ఆరతి సమయం కావడంతో మేము వెళ్లి లైన్లో నిలుచున్నాము. ఒక మహిళ ఏదో వెతుకుతున్నట్లు నేను గమనించాను. నేను ఆమెతో, "మీరు ఆరతి పుస్తకం కోసం వెతుకుతున్నారా?" అని అడిగితే, ఆమె అవుననని జవాబిచ్చింది. వెంటనే నేను శిరిడీలో కొనుగోలు చేసి తెచ్చుకున్న ఆరతి పుస్తకం ఆమెకిచ్చాను. ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసారు. నేను, మా అమ్మ నా మొబైల్‌లో ఆరతి పిడిఎఫ్ చూస్తూ పాడటం మొదలుపెట్టాము. ఆరతి అయిన తర్వాత ఆవిడ నా పుస్తకాన్ని ఆనందంతో నాకు తిరిగి ఇచ్చింది. తరువాత మేము దర్శనానికి లైన్లో నిలుచున్నాము. నేను నా మనస్సులో ఆలోచిస్తూ, "ఎవరికైనా ఏదైనా సహాయం చేయదలిస్తే మనసులో సందేహాలకు తావివ్వకుండా మనస్పూర్తిగా చేయమని, చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించవద్దని మీరు చెప్పారు కదా బాబా! కానీ ఆరతి సమయంలో నేను ఆరతి పుస్తకాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలని అనుకున్నాను బాబా! ఆ ఆలోచన సరైనది కాదు బాబా! దయచేసి నాలో ఉన్న ఈ చెడు తలపులను తొలగించి, ఇకపై ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు నిస్వార్ధంగా చేసేలా అనుగ్రహించండి బాబా!" అని అనుకుంటూ బాబాకి 10 రూపాయలు దక్షిణగా ఇవ్వాలని అనుకున్నాను. తర్వాత బాబా దర్శనం చేసుకొని, ఆయన పాదాలు తాకడం కోసం లైన్లో వేచి ఉన్నాము. బాబాకి దగ్గరగా వచ్చే సమయానికి ఒకతను, "ఈ దేవునికి 'సాయిబాబా' అనే పేరు పెట్టారు" అని అన్నాడు. నేను, "ఇతనెందుకు అలా చెప్తున్నాడు? మందిరానికి వచ్చే అందరికీ ఆయన బాబా అని తెలుసు కదా! మరి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి?" అని అనుకున్నాను. ఇంతలో ఒక వృద్ధురాలు, "నాకు అందరూ ఒక్కటే. ఈయన 'బాబా' అని మీరు చెప్తున్నారు. నల్ల బట్టలు ధరించినప్పుడు ఈయన 'అయ్యప్ప' అంటారు మీరు. అందరూ ఒకటే నాకు, ఏ తేడా లేదు. నేను దేవుళ్లందరినీ ఒక్కటిగానే పూజిస్తాను. నాకు పేరుతో పనేమీ లేదు" అన్నారు. అంతలో నా వంతు రావడంతో బాబాను తాకి నమస్కరించుకొని ప్రసాదం తీసుకోవడానికి నిలబడి ఉండగా, పూజారిగారు "సచ్చరిత్ర పారాయణ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి తన దగ్గరనుండి పుస్తకాలు తీసుకోవచ్చ"ని ప్రకటించారు. అతనే చదువవలసిన అధ్యాయాలను కేటాయిస్తున్నారు. నేను ప్రసాదం తీసుకొని కూర్చొని సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. నేను రోజూ సచ్చరిత్ర చదవాలని నా కోరిక. నేను మొదటి అధ్యాయం పూర్తి చేశాను. ఇంతలో ఆ వృద్ధురాలు వచ్చి నా పక్కన కూర్చొని, "ఏమిటిది? బాబా కదా?" అని అన్నారు.

నేను : అవునండి.

ఆమె : నువ్వు రోజూ చదువుతావా?

నేను : అవును, నేను రోజూ చదవడం మొదలుపెట్టాను.

ఆమె : ఆమె మీ అమ్మగారా?

నేను : అవునండి.

ఆమె : నాది చాలా పెద్ద కుటుంబం, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు నా షష్టిపూర్తి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు ఈ ఏర్పాట్లన్నీ అవసరం లేదు. కానీ వారి ఆనందం కోసం నేను అక్కడికి వెళ్తున్నాను. నా పిల్లలు ఆనందంగా ఉంటే చూడటం నాకు సంతోషం. నువ్వు కూడా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా? దీని తరువాత నేను శిరిడీకి వెళతాను.

[వేరే ఏ ఆలోచనా లేకుండా నేను 10 రూపాయలు ఇచ్చాను.]

ఆమె(బాబా) : మీ అమ్మ విషయంలో జాగ్రత్త తీసుకోబడుతుంది, త్వరలోనే నీ వివాహం అవుతుంది.

ఈ సంభాషణ తరువాత మేము బయటికి వచ్చాము. అప్పుడుగాని ఆమె రూపంలో వచ్చింది బాబా అని అర్థం కాలేదు. ఆ సమయంలో బాబా సూచనలు ఇస్తున్నా కానీ నేను ఆయనను గుర్తించలేకపోయాను. నేను ఎంత బుద్ధిహీనంగా ఉన్నాను! ఆయన "సబ్ కా మాలిక్ ఏక్ హై(దేవతలందరూ ఒకటే)" అని ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రతిచోటా జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలనే ఆయన షష్టిపూర్తిగా ప్రస్తావించారు. ఆయన నేను ఇస్తానన్న డబ్బులను నా వద్దనుండి తీసుకొని నన్ను ఆశీర్వదించారు. నేను ప్రార్థించిన కొన్ని నిమిషాలలోనే మనస్సులో ఏ ఆలోచనా లేకుండా డబ్బులు ఇచ్చేలా కూడా చేసారు. ఆయన నా ప్రతి ఆలోచనను, ఆయనకు చెప్పుకొనే ప్రతి మాటను వింటున్నారు. పైగా నేను ఆరోజు మహాపారాయణ కోసం చదవాల్సిన అధ్యాయం కూడా మిస్టర్ దేవ్‌కు సంబంధించినదే. ఆ అధ్యాయంలో దేవ్ తల్లి చేసే ఉద్యాపన కార్యక్రమానికి బాబా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వస్తారు. కానీ దేవ్ బాబాను గుర్తించలేకపోతాడు. దేవ్ గారిలా నేను కూడా బాబా నా పక్కనే కూర్చొని నాతో మాట్లాడినా గుర్తించలేకపోయాను. బాబా లీలలు అనంతము. మీ పవిత్ర పాదాలను ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండేలా ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి బాబా! మా ఆలోచనలన్నీ మీ మీదే ఉండేలా అనుగ్రహించండి బాబా!"

భావన తిరుమలశెట్టి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo