సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించిన బాబా



నా పేరు ప్రియ. నేను సాయిభక్తుల అనుభవాల్ని నిత్యం బ్లాగులో చదువుతూ బాబా ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటాను. ఒక్కోసారి బాబా మనపై కృప చూపడం ఆలస్యం అవుతున్నట్లు ఉంటుంది. అటువంటి సందర్భాలలో మన విశ్వాసం సడలుతూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం! సరైన సమయం వచ్చినప్పుడు ఆ సాయినాథుడు స్వయంగా వచ్చైనా మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. నా జీవితంలో కూడా అటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నా భర్తని 2018, ఫిబ్రవరి నెలలో ఉద్యోగం నుండి తొలగించారు. దానితో మేము ఉండే ఇల్లు ఖాళీ చేసి కొన్నిరోజులు మా స్నేహితుల ఇంట్లో ఉన్నాము. ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నప్పటికీ ఉద్యోగం మాత్రం వీసా నియమాల వల్ల అందని ద్రాక్షలా ఉండేది. ఆ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నేను  ఒక సప్తాహం సచ్చరిత్ర పారాయణ కూడా చేసి, సాయితో నా బాధలు చెప్పుకొని ఏడ్చాను. "బాబా! నా భర్త ఉద్యోగం పోవడం వలన మేము చాలా కష్టాలలో కూరుకుపోయి ఉన్నాం, మీ హృదయంలో మాకు కాస్తైనా చోటు ఉంటే, మాపై అనుగ్రహం కురిపించండి" అని తరచు బాబాని అడుగుతూ ఉండేదాన్ని. అలా మా స్నేహితుల ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తరవాత మేము మా అక్క ఇంటికి వెళ్లి అక్కడ రెండు నెలలు ఉన్నాము.

మొదట్లో నా భర్త దేవునికి ప్రతి రోజు పూజ చేసేవారు. ఇలా రోజులు గడిచేకొద్దీ భగవంతునిపై ఉన్న నమ్మకం సన్నగిల్లిపోయింది. "మనం ఉద్యోగం లేకుండా ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన తరువాత నేను ఏ గుడిలోనూ అడుగుపెట్టను. నువ్వు కూడా నన్ను గుడికి రమ్మని పిలవద్దు. పాపని కూడా దేవుడిని ప్రార్థించమని బలవంతం చేయకు" అని నాతో గట్టిగా చెప్పారు. అది విని నాకు నోట మాట రాలేదు. నేను ఎప్పుడూ దేవునితో ఇదే విషయంపై గొడవ పడేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ మా అక్క నాకు ధైర్యం చెప్తూ, నన్ను సానుకూలంగా ఆలోచించమని చెప్తూ ఉండేది. ప్రతి గురువారం నేను తనతోపాటు సాయి మందిరానికి వెళ్తుండేదాన్ని. అలాగే జులైలో గురుపౌర్ణమి నాడు కూడా మేము ఇద్దరం సాయి  మందిరానికి వెళ్ళాం. ఎందుకో ఆరోజు బాబాని చూడగానే తట్టుకోలేక ఏడుస్తూ, "నా భర్తకి తప్పక ఉద్యోగం వస్తుందని ఎవరో ఒకరి ద్వారా చిన్న సంకేతం అయినా ఇవ్వమ"ని వేడుకొని భారమైన మనసుతో అక్కడ నుండి బయటకు వచ్చేసాను.

అదేరోజు మా అక్క ఒక కేటరింగ్ ఆవిడకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఉండటం వలన మేము టెంపుల్ నుండి ఆవిడ ఇంటికి వెళ్ళాము. ఆవిడ మమ్మల్ని కొంతసేపు వేచి ఉండమని చెప్పింది. మేము లోపలికి అడుగుపెట్టగానే అక్కడ పెద్ద బాబా ఫోటో నా కంట పడింది. పూజగదిలో కూడా పూజచేసి అందంగా అలంకరించిన బాబా విగ్రహం ఉంది. ఆమె ఫుడ్ ప్యాక్ చేసి మాతో మాట్లాడుతూ, తనకి బాబా ఇచ్చిన అనుభవాల్ని గురించి చెప్పింది. "నా జీవితమంలో బాబా చాలాసార్లు నాకు సహాయాన్ని అందించారు" అని చెప్పింది. తరువాత నా గురించి మా అక్కని అడిగింది. అప్పుడు నేను ఆమెతో, "నా భర్త ఉద్యోగం పోయినందువల్ల మా అక్క ఇంట్లో ఉంటున్నాన"ని చెప్పాను. నేను ఆ మాట చెప్పగానే ఆవిడ నా భుజంపై చేయి వేసి "దిగులుపడకు! ఈ వారంలో నీ భర్తకి తప్పక ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ధైర్యంగా ఉండు, అంతా సర్దుకుంటుంది" అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే నాకు కన్నీరు ఆగలేదు. నేను బాబాని నా భర్తకి ఉద్యోగం వస్తుందని ఏదో ఒక రూపంలో సంకేతం ఇవ్వమని వేడుకున్నాను కదా! అందుకు బాబా ఆ మాటలు ఈమె ద్వారా చెప్పించారు. సాయివాక్కులు ఎప్పుడూ అసత్యం కావు, నా భర్తకి ఆ వారంలోనే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది.

అదేవారంలో గురువారంనాడు ఇండియాలో ఉన్న మా అమ్మ వాళ్ళింట్లో ఒక అధ్బుతం జరిగింది. మా అమ్మగారు సాయివ్రతం చేస్తున్నారు. ఆరోజు పూజ ప్రారంభించే ముందు "ఈరోజు ఎవరికైనా అన్నదానం కూడా చేస్తే బాగుంటుంది" అని మనసులో అనుకున్నారు. పూజ పూర్తైన మరుక్షణం వంటగది కిటికీ దగ్గర భిక్షకోసం వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. మా నాన్నగారు అతనిని గుమ్మం దగ్గరకి రమ్మని పిలిచి అన్నం మరియు దక్షిణ ఇచ్చారు. ఆ వ్యక్తి మెడలో ఒక సాయిబాబా డాలర్ ఉంది. అతను మా అమ్మానాన్నల్ని చూస్తూ వాళ్ళకున్న ఆరోగ్యసమస్యల గురించి చెప్పాడు. అతను చెప్పినవన్నీ సత్యాలే. అతను వెంటనే "నీకు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం నీవు నీ రెండవ కుమార్తె భవిష్యత్తు గురించి చింతిస్తున్నావు కదా?  అని, నీ కుమార్తెకి దిగులుపడవద్దని చెప్పు, వచ్చే రెండు గురువారాలలో సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పారు. మా అమ్మానాన్న ఫోన్ చేసి జరిగినదంతా మాతో చెప్పారు. నిజానికి మేము ఎంతో అదృష్టవంతులం. బాబా మాపై ఇంత కరుణ చూపారు. బాబా కృపతో నా భర్తకి 6 నెలల వ్యవధి గల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. బాబా దయతో అన్నీ సర్దుకుంటాయని నేను చాలా ధీమాగా ఫీల్ అయ్యాను. నా భర్తకి కూడా బాబా యందు భక్తి, విశ్వాసాలు పునరుద్ధరింపబడ్డాయి.

మా కష్ట సమయంలో అండగా నిలిచిన అందరినీ ఆశీర్వదించమని నేను బాబాను ప్రార్ధిస్తున్నాను. మా అక్కకి, బావగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు మాకు ఆ సమయంలో బాధ కలగకుండా చూసుకుంటూ, దేవుడుపై నమ్మకం ఉంచండి, అంతా సర్దుకుంటుందని ఎంతో ప్రోత్సహించారు.

మన సమస్యలు బాబాకి అప్పగిస్తే, అయన మనల్ని తప్పక రక్షిస్తారు.

3 comments:

  1. Mee experience chaduntunte I felt that pain. Husband ki job lekunte really hell. I believe theesukunedhi baba ye icchedhi baba ye. Hope you all are doing good now. You are lucky to have the people those support you. Please always chant baba’s name , it only protects us.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo