సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తన బిడ్డలని తన దారిలోకి బాబా ఎలా లాక్కుంటారో ఎవరూహించగలరు?


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నేను 1984వ సంవత్సరంలో లోధీ రోడ్డులోని దయాల్ సింగ్ కాలేజీలో బి.ఎస్.సి చేశాను. ఒకరోజు నేను పరిక్ష ఫలితాల కోసం కాలేజీకి వెళ్తే ఫలితాలు ఇంకా రాలేదని చెప్పారు. నిరాశతో నేను అక్కడి నుండి నా స్నేహితుడి ఇంటికి వెళ్తూ దారిలో మూడు మందిరాలు ఉంటే, వాటిలో మొదటి రెండు మందిరాలకు వెళ్ళి నమస్కారం పెట్టుకొని మూడో మందిరం మొదటి మెట్టెక్కుతూ నాకు పరీక్షలో 75% వస్తే ఈ మందిరానికి వస్తాననుకొని వెనక్కి వచ్చేశాను. ఆలా అనుకోవడమైతే అనుకున్నానుగాని నిజానికి నాకంత శాతం రాదని నాకు తెలుసు ఎందుకంటే నేనేమి అంత బాగా పరీక్షలు వ్రాయలేదు. మరుసటిరోజే ఫలితాలు వచ్చాయి. నా స్నేహితులు నీకు 75% వచ్చాయి కంగ్రాట్స్ అన్నారు. వాళ్ళేదో పరాచికమాడుతున్నారని వారి మాట నమ్మలేక స్వయంగా నేనే వెళ్ళి చూసుకుని సంతోషం పట్టలేకపోయాను. నిజంగానే నాకు 75% మార్కులొచ్చాయి. వెంటనే ఆ మందిరం గుర్తు వచ్చి అక్కడికి పరుగుపెట్టాను. అక్కడ ఆరతి జరుగుతూ ఉంది. ఆరోజు గురువారం కావడం వలన చాలా జనం వున్నారు. ఆ జనం మధ్యనుంచి అక్కడ ఉన్న తెల్లని పాలరాతి విగ్రహం చూశాక నా ఆనందానికి అవధుల్లేవు. అది శిరిడీ సాయిబాబా మందిరమని నాకస్సలు తెలియదు. అలా బాబా నాకు తెలియకుండానే తన వైపుకు నన్ను ఆకర్షించుకున్నారు. అందరూ ఆరతి పాడుతున్నారు, 'నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ' అన్న లైన్ దగ్గర మాత్రం నాకేదో తెలియని తన్మయత్వం కలిగి ఇకపై నేను తరచూ ఈ మందిరానికి వస్తానని అనుకున్నాను. ఆవిధంగా నాకు బాబా మీద భక్తి, విశ్వాసాలు మొదలయ్యాయి.  బి. ఎస్. సి తరువాత నాకు ఎం. ఎస్.సి చేయాలని ఉండేది. బాబా కృప వలన నాకు హిందూ కాలేజీలో సీట్  వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు బాబా మీద భక్తి విశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి. ప్రతి గురువారం మందిరానికి వెళ్ళడం నియమంగా పెట్టుకున్నాను. అప్పట్లో నాకు చదువు అయిపోయాక ఉద్యోగం వస్తే అక్కడికి 1 లేక 2 కిలోమీటర్ల దూరంలో బాబా మందిరం ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఎం.ఎస్.సి ఫలితాలు రాకముందే బాబా నాకు DAB స్కూల్, పీతంపూర్ బ్రాంచ్ లో PGT ఉద్యోగం ఇప్పించారు. అక్కడికి దగ్గరలో రోహిణి సెక్టార్ - 7లో బాబా మందిర నిర్మాణం జరుగుతూ వుంది. నిజానికి ఆ మందిరాన్నిమొదట సెక్టార్ 3 లో కట్టాలనుకున్నారు. కానీ అక్కడ స్థలం దొరకనందువలన సెక్టార్ 7లో కడుతున్నారు. ప్రజలు ఇండ్లు కట్టడం మార్చుకుంటారు కానీ, భగవంతుడు తన (ఈ)భక్తుని కోసం మారడం ఇదే చరిత్రలో మొదటిసారేమో అనిపించింది నాకు. ఇది బాబా అద్భుతమైన లీలనే. ఆ రోజునుంచి నాకు బాబా సేవ చేసుకొనే అదృష్టం దొరికింది. ముందునుంచి నాకు భజన పాటలు పాడాలని వుండేదికాని పాడలేక పోయేవాడిని. కానీ బాబా దయవలన పాడటం మొదలుపెట్టాను. మెల్ల మెల్లగా బాబానే గంటన్నరపాటు ఆపకుండా పాడే శక్తి సామర్థ్యాలను ఇచ్చారు.

నాకింకా చదవాలని వుండేది. ఉద్యోగంతో పాటు బాబా నాకు బి.ఈడి చేసే అదృష్టాన్ని కూడా ఇచ్చారు. ఒక సంవత్సరం తరువాత బాబా నాకు ప్రేరణనిచ్చి ఎం.ఈడి కూడా చేయించారు. అది కూడా ఆయన దయవలన పూర్తి చేశాను. తరువాత పీహెచ్ డీ కూడా చేయాలనిపించింది. ఆసమయంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ గారిని కలిసే అవకాశాన్ని బాబా కల్పించారు. అతనితో నేను నా పీ హెచ్ డీ చేయాలన్న ఆలోచన గురించి చెప్పగా అతను సరే నా దగ్గరే పీహెచ్ డీ చేయీ అన్నారు. మళ్ళీ అంతలోనే ఇంకో ప్రొఫెసర్ మదన్ మోహన్ బజాజ్ ని కలిసే అవకాశం బాబా ఇచ్చి "నీవు పీ హెచ్ డీ మదన్ మోహన్ బజాజ్ దగ్గరే చేయాలి" అని ఆదేశించారు. ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఒకే కాలేజీలో పనిచేస్తారు. పైగా వాళ్లిద్దరూ స్నేహితులే. నేను ఏ పరీక్ష రాయకుండానే మిస్టర్ బజాజ్ దగ్గర నా పీహెచ్ డీ మొదలుపెట్టాను. ఆక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళ నుండి ప్రశంసా పత్రాలు తీసుకోవడం నాకు చాలా అవసరం. కానీ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ గారు నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వరనుకున్నాను. ఎందుకంటే నేను నరేంద్ర గారికి ఒక మాటైనా చెప్పకుండా మిస్టర్ బజాజ్ గారి దగ్గర పీ హెచ్ డీ మొదలుపెట్టాను. కాని బాబా కృప ఏమిటంటే ఆయనే వచ్చి నాకు ప్రశంసా పత్రాలు తప్పకుండా ఇస్తాను అన్నారు. భగవాన్ ఏమి చేసిన మన మంచికే చేస్తాడు అన్నాడు. బాబా లీల చూడండి అతనే నాకు ప్రశంసాపత్రం ఇవ్వడమే కాకుండా నా గురించి చాలా బాగా రాశాడు. తరువాత నాకు పీ హెచ్ డీ లో అడ్మిషన్ అయింది. కాని దైవనిర్ణయం ఏమిటోగాని నాకు ఆ ప్రశంసా పత్రం ఇచ్చిన మూడో రోజే మిస్టర్ నరేంద్ర చనిపోయాడు. అందుకే బాబా నన్ను అయన దగ్గర చేరనీయలేదు. బాబాకు భూత, భవిషత్తు, వర్తమానాలు తెలుసు. తన భక్తులను రక్షించడానికి ఆయన అనేక రకాల లీలలు చేస్తారు. తరువాత బాబా ఆశీస్సులతో బజాజ్ గారి ఆధ్వర్యంలో నా పీ హెచ్ డీ పూర్తయింది.

నేను "సాయి శక్తి" అనే పుస్తకం కూడా రాశాను. దానిలో ద్వారకామాయి బాబా చిత్రపటానికి దోమ తెర కడతారు, దీపం వెలిగిస్తారు. చాలాసార్లు ఆ దీపం దానంతట అదే ఊగుతుంది, చూస్తే గాలి ఏమీ వుండదు. ఈ విషయం గురించి సంస్థానం వాళ్ళు వీడియో కూడా తీశారు. నేను కూడా ఒకసారి ఆ వీడియో సంపాదించాను. ఈ విధంగా సాయిబాబా నా జీవిత పర్యతం నాతోనే వున్నారు. తరువాత బాబా గురించి చాలా బుక్స్ కూడా చదివాను. చాలా పుస్తకాలు కూడా రాశాను.

రవీంద్రనాథ్ కాకరియా,

సోర్స్: సాయి లీల పత్రిక.

2 comments:

  1. ఎవరికైనా ఈ అనుభవం ఆఖర్లో లో చెప్పబడిన వీడియో గురించి తెలిస్తే చెప్పగలరు. వీడియో లింక్ దొరికితే దయచేసి షేర్ చేయగలరు.
    ఓం సాయిరాం 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo