సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- మూడవ భాగం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నిన్నటి తరువాయి భాగం.....

మరుసటిరోజు అంటే 4వ తేది శుక్రవారం సాయంత్రం బాబాయిగారిని అన్న ప్రసాదాలయానికి ఒక ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. నేను, ఇంకో ఫ్రెండ్ నాకు తెలిసిన(కేవలం వాట్సాప్ లో అప్పుడప్పుడు పలకరింపు మాత్రమే) ఒక అతనిని కలవడానికి నందదీపం వద్దకు వెళ్ళాము. అక్కడ అతనిని కలిసి మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటలలో అతను ఎటువంటి సందర్భం లేకుండా అసంబద్ధంగా, "బాబా మీకోసం చాలా ఉన్నతమైనది ప్లాన్ చేసుకొని ఉంటారు. మీరు ఏదీ పదేపదే అడిగి ఆయనను బలవంతపెట్టవద్దు. అలా చేస్తే మీ బాధ చూడలేక ఆయన అది ఇస్తారు. అప్పుడు ఆయన ఇవ్వదలుచుకున్నది మీరు మిస్ అవుతారు, లేదా ఆలస్యం అవుతుంద"ని చెప్పారు. మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ మాటలు నేను బాబాను అడుగుతున్న ఒక విషయానికి సమాధానాలు. నిజానికి నా శిరిడీ ప్రయాణానికి నెల ముందునుండి నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యవిషయమై ప్రతిరోజూ నేను బాబాని అడుగుతూ, "నా ఈ శిరిడీ ప్రయాణంలో ఎలాగైనా నాకు మీరు సమాధానం చెప్పండి బాబా!" అని చాలా దృఢంగా బాబాని ప్రార్థిస్తూ ఉన్నాను. అతని నోట ఆ మాటలు వినగానే బాబా నా ప్రశ్నకు జవాబు ఇచ్చారని గ్రహించి వెంటనే, "బాబా! నన్ను క్షమించండి. ఇకపై మిమ్మల్ని పదేపదే అడగను. మీరు ఇవ్వదలుచుకున్నదే ఇవ్వండి" అని మనస్సులోనే బాబాకు చెప్పుకొని అప్పటినుండి ప్రశాంతంగా ఉన్నాను. నేనసలు అతనితో నా సమస్య గురించి మాట్లాడలేదు. అతను చెప్పే మాటలు నాకు సమాధానం అవుతాయని అతనికీ తెలీదు. అంతా బాబా లీల. సర్వాంతర్యామి అయినా బాబా ఏ రూపంలో అయినా మన ప్రశ్నకు సమాధానం ఇస్తారు.

తరువాత మా ఫ్రెండ్ ప్రసాదాలయం నుండి వచ్చాక బాబాయిని రూములో ఉండమని చెప్పి మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాం. తీరా మేము వెళ్లేసరికి బ్రెడ్ బజ్జీ షాప్ మూసి ఉంది. సరే, ఇంకేం చేస్తాం? ఇప్పటికే పల్లకి ఉత్సవానికి సమయమైపోతుంది, ఏదో ఒకటి తిందామని వేరే హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసాము. తరువాత చావడి వద్దకు చేరుకొని పల్లకీ ఉత్సవాన్ని చూశాము. పల్లకీ ఉత్సవానంతరం లస్సీ త్రాగుదామని ద్వారకామాయి మీదుగా వెళ్తున్నాము. ఆశ్చర్యం! అక్కడ బ్రెడ్ బజ్జీ ప్రసాదంగా ఎవరో పంచుతున్నారు. మా ముగ్గురికి ఒకటే ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో మా మనస్సులో కలిగిన చిన్న కోరికకు బాబా ఆలా అనుగ్రహిస్తారని మేమసలు ఊహించలేదు. చిన్న విషయమే అయినా మాకు చాలా అద్భుతంగా అనిపించింది. బాబా మాపై చూపిన ప్రేమను మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసాము. ఆయన కరుణను తలుచుకుంటే హృదయం ద్రవించిపోతుంది.


శుక్రవారంనాడు శేజారతికి క్యూలో వెళ్ళినపుడు సమాధిమందిరం హాలులో బాబాకి ఎదురుగా ముందు వరుసలలో చోటు దొరికేలా బాబా అనుగ్రహించారు. మొత్తం మూడున్నర రోజులలో బాబాను పదిసార్లు దర్శించుకున్నాను. అందులో ఎనిమిదిసార్లయితే 10 నుండి 15 నిముషాలు తగ్గకుండా తమని దర్శించుకొనే భాగ్యాన్నిచ్చారు బాబా. ఒకసారైతే దాదాపు 40 నిమిషాలపాటు దర్శించుకొనే మహద్భాగ్యాన్ని అనుగ్రహించారు బాబా. అంతటి భాగ్యాన్ని కల్పించిన మీకు శతకోటి ప్రణామాలు బాబా! వీలైనంత వరకు ద్వారకామాయి, చావడి, సమాధిమందిరం ఎక్కడ వీలయితే అక్కడ ప్రతి ఆరతికి హాజరు అయ్యాము. ఇలా చాలా హ్యాపీగా గడిచింది సమయం. 

ఇంకో ముఖ్య విషయం. నా శిరిడీ ప్రయాణం మొదలుపెట్టి శ్రీకాకుళం నుండి హైదరాబాదు చేరుకోనేసరికి బాబా నాకు సంతోసకరమైన వార్త అందించారు. అదేమిటంటే, "సద్గురులీల పత్రిక" ఎడిటర్ & పబ్లిషర్ మల్లిబాబు గారు ఫోన్ చేసి "నేను మీ 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు' చూసాను, చాలా బాగుంది. మంచి మంచి అనుభావాలు ప్రచురిస్తున్నారు. మీరు అనుమతిస్తే వాటిని మా పత్రికలో ప్రచురించుకుంటామ"ని అడిగారు. ఆయన మాటలు మన బ్లాగుకి బాబా ఆశీస్సులుగా అనిపించి నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే నేను ఆయనతో "ఇది మన బాబా బ్లాగు. సంతోషంగా పత్రికలో ప్రచురించుకోండ"ని చెప్పాను. 

ఇంతలా అనుగ్రహించిన మీకివే నా హృదయపూర్వక నమస్కారములు బాబా!
సమాప్తం...

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo