సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీషామా కుమారునితో ఇంటర్వ్యూ......


ఈరోజు ప్రముఖ సాయి భక్తుడైన శ్యామా గారి కుమారుడు శ్రీఉద్ధవరావు గారితో సాయిపథం బృందం నిర్వహించిన ఇంటర్వ్యూని అందిస్తున్నాను. దీనిని సాయిపథం వాల్యూమ్ 2 నుండి సగ్రహించి యధాతధంగా మీముందు ఉంచుతున్నాము. చదివి ఆనందించండి.

శ్రీషామా కుమారునితో ఇంటర్వ్యూ......

శ్రీ సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలోనూ, బాబాతో అత్యంత సన్నిహితంగా, చనువుగా, స్వతంత్రంగా మెలిగిన భక్తుడు - శ్రీ మాధవరావు దేశ్‌పాండే. బాబా ఈయనను 'షామా' ('శ్యామా' అనే పదానికి వ్యవహారరూపం) అని పిలిచేవారు. బాబాతో షామాకు ఉన్నంత చనువు మరే భక్తునికీ లేదు. దీక్షిత్,   హేమాడ్‌పంత్, నార్కే, బూటీ మొదలైన సన్నిహిత సాయిభక్తులు కూడా బాబాను ఏదైనా అడగాలంటే షామా ద్వారానే అడిగించేవారు. ఆచరణలో ఒకవిధంగా శ్రీషామా బాబాకు 'పర్సనల్ సెక్రటరీ'వలే వ్యవహరించేవారని అనటం అతిశయోక్తి కాదు.

బాబాకు అత్యంత సన్నిహితుడిగా, అభిమానపాత్రుడిగా, అందరూ గౌరవించే శ్రీషామా 1940లో దివంగతులైనారు. ఆయన కుమారుడు శ్రీఉద్ధవరావు దేశ్‌పాండే నేటికీ (1988 నాటికి) సజీవులై, శిరిడీలోనే నివసిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు సుమారు 83, 84 సంవత్సరాల వయస్సు ఉంటుంది. శ్రీఉద్ధవరావు కొంతకాలం శిరిడీలో శ్రీసాయి సమాధి మందిరంలో పూజారిగా సేవ చేశారు. 'సాయిపథం' ఆయన్ను కలిసి, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎంతో ఓర్పుగా సమాధానాలు చెప్పి, మరిన్ని వివరాలు తన అనారోగ్యం వల్ల చెప్పలేకపోతున్నానని చెప్పారు.

ప్రశ్న: శ్రీ సాయిబాబాను మీరు ఎప్పుడు చూశారు?
  
జవాబు: నేను పుట్టినప్పటి నుండి నా తండ్రిగారు నన్ను బాబా వద్దకు తరచూ తీసుకొనిపోతుండేవారు. నాకు 11 సంవత్సరాల వయసొచ్చే వరకు బాబాను రోజూ చూస్తుండేవాడిని. నాకు 11, 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాబాగారు మహాసమాధి చెందారు. అప్పట్లో శిరిడీ చాలా చిన్న గ్రామం. మసీదు, స్కూలు, దీక్షిత్ వాడా, సాఠేవాడా, చావడి మాత్రం ఉండేవి. చావడి దగ్గరలో ఒక స్మశానం కూడా ఉండేది.

ప్రశ్న: బాబా చూడటానికి ఎలా ఉండేవారు? ఆయన రూపాన్ని కొంచెం వర్ణించగలరా?

జవాబు: బాబా ఎత్తుగా ఉండేవారు. అంటే, ఇంచుమించు 5.6" నుండి 5.9" మధ్య ఉండేవారు. బాబా ఆజానుబాహుడు. ఆయన చేతులు చాలా పొడవుగా ఉండి, నిలుచుంటే మోకాళ్లు తాకుతూ ఉండేవి. ఆయన మెడకు, కుడి భుజానికి మధ్య(coller- bone) ఒక పుట్టుమచ్చ ఉండేది. ఆయన శరీరఛాయ మంచి దబ్బపండు రంగులో నిగనిగలాడుతూ ఉండేది. బాబాకు గడ్డం ఉండేది. ఆయన చెవులు కుట్టి ఉండేవి. నాకు గుర్తున్నంతలో మెడలో ఒక గవ్వల హారం (కవడీ) ఉండేది. మధు అనే మంగలి బాబాకు క్షురకర్మ చేసేవాడు.

ప్రశ్న: బాబా రోజూ స్నానం చేసేవారా?

జవాబు: లేదు. 2, 3 రోజులకు ఒకసారి స్నానం చేసేవారు.

ప్రశ్న: బాబా స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు చూశారా?

జవాబు: ఆఁ! చాలాసార్లు చూశాను. చుట్టూ గుడ్డలతో తెరలాగా కట్టుకుని లోపల బాబా స్నానం చేసేవారు. తెర వెలుపల బాబా భక్తురాలు తారాబాయి హారతి ఇచ్చేది. మాధవ్‌ఫస్లే బాబా స్నానానికి  వేన్నీళ్లు కాచి, గంగాళంలో తోడి సిద్ధంగా పెట్టేవాడు. స్నానం చేసిన తర్వాత మెత్తటి తుండుగుడ్డతో బాబా ఒళ్ళు తుడుచుకునేవారు. చెవులు, తల చక్కగా తుడుచుకునేవారు. తరువాత కౌపీనం విడిచి, కాకాసాహెబు దీక్షిత్ ఇచ్చిన పీతాంబరం ధోతీగా కట్టుకొని మడతలు పెట్టి గోచి పెట్టేవారు. నలుచదరపు గుడ్డను ముక్కోణాకారంలో మడిచి తలకు చుట్టుకునేవారు. తరువాత జోగ్ బాబా నుదుటిపై అడ్డంగా గంధం దిద్ది, కుంకుమతో బొట్టు పెట్టేవాడు. ఆ తంతు అయిన తర్వాత బాబా మసీదులో కాళ్లు బారచాపుకుని కూర్చునేవారు. భక్తులు ఆయన పాదాలను వెండిపాత్రలో ఉంచి, పూజించి, ఆ పాదతీర్థాన్ని భక్తులకు పంచేవారు. బాబా అందరికీ జీడిపప్పు, మిఠాయిలు పంచేవారు. ఆ మిఠాయిల కోసం గుంపులుగా కాచుకొని ఉండేవాళ్ళు.

ప్రశ్న: బాబాకు ఏవి ఎక్కువ ఇష్టం?

జవాబు: బాబాకు రత్నగిరి మామిడిపండ్లు చాలా ఇష్టం. పూర్ణాలు(పోళీలు) అంటే కూడా ఇష్టపడేవారు. మామిడిపండు ముక్కలు కోసి నాకు ఇచ్చేవారు. బాబాకు ఇష్టమని మనం అనుకోవడమే గాని వాటిని ఆయన తినేది నామమాత్రమే! అంతా అందరికీ పంచి పెట్టేసేవారు. మా తండ్రిగారైన షామాకు, ఫకీర్ బాబాకు, దాదాసాహెబ్ ఖాపర్డేగారికి ప్రత్యేకించి మామిడిపండ్లు ప్రసాదంగా ఇచ్చేవారు.

ప్రశ్న: బాబా ఏ భాషలలో మాట్లాడేవారు?

జవాబు: బాబాకు అన్ని భాషలు తెలుసు. ఎక్కువగా మరాఠి, ఉర్దూ, హిందీ మాట్లాడేవారు. భక్తులు నమస్కరించినప్పుడు, "అల్లా అచ్ఛాకరేగా!" అని అనేవారు. నా తండ్రిగారికి 'విష్ణుసహస్రనామం' పుస్తకం ఇచ్చారు. దాసగణుతో వేదాంతం ముచ్చటించేవారు.

ప్రశ్న: బాబా ఎప్పుడైనా మీ ఇంటికి భిక్షకు వచ్చినట్లు జ్ఞాపకం ఉందా?

జవాబు: లేదు! అయితే ఒకసారి మా తండ్రిగారు చలిజ్వరంతో బాధపడుతూ కాకడ ఆరతికి వెళ్లలేదు. ఆరతి సమయంలో మా తండ్రిగారు కనిపించకపోయేసరికి బాబా, "షామా రాలేదేం?" అని బాపూసాహెబ్ జోగ్‌ను అడిగారు. జోగ్ జ్వరం విషయం చెప్పగానే, బాబా వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చి, మా తండ్రిగారిని పిలిచి, "పోదాం పద!" అని చెయ్యిపట్టుకొని తీసుకెళ్లారు. మా తండ్రిగారు బాబాతో ఎంతో చనువుగా, స్వతంత్రంగా మాట్లాడేవారు. మా తండ్రిగారికి ఎవరితో మాట్లాడినా 'అరెఁ' అనటం - ఊతపదంలాగా - అలవాటు. ఆయన బాబాను "దేవా" అని సంబోధించేవారు. బయటకు బాబాతో ఇంత చనువుగా మాట్లాడినప్పటికీ బాబా అంటే  షామాకు సాక్షాత్తు దైవమేనని ప్రగాఢమైన విశ్వాసం. షామాతో తనకు 72 జన్మల నుండి అనుబంధమని బాబానే ఒకసారి అన్నారు!

బాబాకు, మా తండ్రిగారికి ఉండే అనుబంధం ఎలాంటిదో తెలిపే సంఘటన నాకు ఒకటి జ్ఞప్తికొస్తుంది. బాబాకు ఆరతి ఇచ్చే సమయంలో తాత్యాపాటిల్ మొదలైన భక్తులందరూ లేచి నిలబడేవారు. షామా మాత్రం కూర్చుని ఉండేవారు. అందరూ నిలబడినప్పుడు షామా కూర్చోవటం బాగాలేదని భక్తులు షామాకు సూచించారు. షామా వారి సూచనలు అంగీకరించి, ఆ తర్వాత ఆరతి మొదలవగానే అందరితో పాటుగా లేచి నిలబడ్డాడు. అయితే, బాబా కూడా లేచి నిలబడ్డారు! "బాబా, మీరు కూర్చోండి" అని  బాపూసాహెబ్ జోగ్ కోరాడు. దానికి బాబా, "షామా నిలుచున్నాడు కనుక నేను నిలబడ్డాను. షామా కూర్చుంటే నేను కూర్చుంటాను" అని అన్నారు. ఇక భక్తులు తప్పనిసరై షామాను కూడా కూర్చోమన్నారు. అప్పుడు ఇద్దరూ కూర్చున్నారు. బాబాకు, షామాకు ఉండే అనుబంధం 'కృష్ణార్జునుల బంధం' వంటిది. బాబా చాలామందికి డబ్బు ఇచ్చారు. కానీ, మా తండ్రిగారికి ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించారు. బాబా షామాకు 'విష్ణుసహస్రనామం', ఒక విఘ్నేశ్వర ప్రతిమ ఇలాంటివే ఇచ్చారు. బాబాకు చాలా ప్రియభక్తుడని ఎందరో ప్రముఖులు షామాకు వివిధ కానుకలు ఇచ్చేవారు. నైజాం నవాబు వెండితో చేసిన చిలిమ్ ఇచ్చారు. లోకమాన్య తిలక్ ఒక ధోవతుల చాపు ఇచ్చారు. శ్రీశివానందస్వామి చిరుతలు ప్రసాదించారు.

ప్రశ్న: మీ బాల్యంలో మీరు ఎంతసేపు రోజూ బాబా దగ్గర గడిపేవారు?

జవాబు: సుమారు 5, 6 గంటలు మసీదు దగ్గర ఆడుకునేవాళ్ళం. స్కూలు వదలగానేనేరుగా మసీదుకు పరిగెత్తిపలక బాబా వెనక దాచిపెట్టేవాడిని. ఆ ప్రాంతాలలోనే ఆడుకుని ఎప్పుడో ఇల్లు చేరేవాడిని. సామాన్యంగా బాబా నన్ను చూస్తూనే"ఒరేయ్ ఉద్ధవ్! ఆగునీకు ఖర్జూరం పెడతా!" అనిఅక్కడ ఉన్న ఖర్జూరం లేక మిఠాయి ఏదో ఒకటి నాకు ఇచ్చేవారు. ఎప్పుడైనా బాబా నాతో"కాస్త కాళ్లు పట్టరా" అని అనేవారు. నేను షామా కుమారుడిని అవడంవల్లఅక్కడ చాలా స్వతంత్రంగా తిరిగేవాడిని. నన్ను ఎవరూ అడ్డుపెట్టేవారు కాదు.

ప్రశ్న: బాబా మీకెప్పుడైనా డబ్బులు ఇచ్చారా?

జవాబు: లేదు. మిఠాయిలుపండ్లు వంటి తినుబండారాలు తప్ప నాకెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు.

ప్రశ్న: బాబా ఎలా మాట్లాడేవారుఆయన మాటలు అందరికీ అర్థమయ్యేవా?

జవాబు: లేదు. బాబా పొడిపొడిగా,  అసంఘటితమైన పదాలువాక్యాలలో మాట్లాడేవారు. ఆయన మాట్లాడే మాటలు అన్నీ అర్థమయ్యేవి కావు.

ప్రశ్న: మీరు చూసిన బాబా లీల ఏదైనా మీకు గుర్తుందా?

జవాబు:  అప్పుడు నేను చిన్నవాడిని. పెద్ద పెద్ద విషయాలు నాకెట్లా అర్థమవుతాయికానీవంట చేసే విధానం మాత్రం నాకు గుర్తున్న విచిత్రమైన  బాబా లీల. మాధవ్‌ఫస్లే  అండాలో నీళ్లు నింపిపెట్టివెనక నక్కి కూర్చునేవాడు. లక్ష్మీబాయిబిక్కూభాయిబీమాబాయి నూతిలోని నీటితో బియ్యం కడిగిఆ బియ్యాన్నిబెల్లం ముక్కలను గోనెపట్టా పైన పోసేవారు. బాబా అండాని పొయ్యి మీద పెట్టి ఎసరు రాగానేబెల్లం అందులో వేసేవారు. అన్నం ఉడుకుతుంటే బాబా మసీదు గోడ పక్కనే నిలబడి చూస్తుండేవారు. ఎసరు పొంగితే బాబా తన చేతితో నురుగు తీసి పొయ్యిలో  వేసేవారు. పెద్ద తాంబాలంలో బాదం పలుకులు, ద్రాక్ష, మిరియాలు, లవంగం మొదలైనవి సిద్ధం చేసుకుని బియ్యం ఉడకగానే అవి అందులో వేసి, కఫ్నీ చేతులు పైకి లాక్కొని చేయితోనే కలియబెట్టేవారు. గరిటె వాడేవారు కాదు. అలాగే ఆఖరుగా నెయ్యి వేసి బాగా కలియబెట్టి చెయ్యి బయటకు తీసిచేతికి  అంటుకున్న పదార్థం అంతా శుభ్రంగా తుడిచి అండాలో వేసేవారు. బాబా దైవం. వేడి  ఆయనను ఏం చేస్తుందిఆ వంట కాగానే అండాలో చెయ్యి పెట్టి ఒక పాత్రలో ఆ పొంగలి కొంచెం తీసి లోపలికి వెళ్లి ఆ అన్నాన్ని ధునిలో వేసేవారు. ధుని అంటే ఆయనకు మితిలేని ప్రేమ. బాబా స్వహస్తాలతో చేసిన ప్రసాదం కోసం భక్తులంతా వరుసగా  నిలబడి కాచుకొని ఉండేవారు. పిల్లలమైన మేము కూడా ఆ ప్రసాదం కోసం మర్రి ఆకులు తీసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళం. ఆ ఆకుల్లో ప్రసాదం పడగానే తినడానికి పరుగు  తీసేవాళ్ళం. మేము పరుగెత్తుతుంటే"ఒరేయ్ ఉద్ధవ్! ఆగునెమ్మదిగా" అని బాబా ఆదుర్దాగా కేకలు వేసేవారు. మేము అదేమీ పట్టించుకోకుండా పరిగెత్తి చావడి చేరి అక్కడ కూర్చుని ఆ ప్రసాదం తినేవాళ్లం.


ప్రశ్న: ఎవరైనా మహాత్ములు బాబాను కలుసుకున్నప్పుడు మీరు చూశారా?

జవాబు: ఒకసారి ఖేడ్‌గాఁవ్ నుండి శ్రీనారాయణ మహరాజ్ గారు శిరిడీ వచ్చారు. ఆయన మసీదు బయటే నిలబడి బాబాకు నమస్కరించారు. బాబా కూడా మసీదులో కూర్చుని ఏవో సంజ్ఞలు చేశారు.

లోకమాన్య బాలగంగాధర తిలక్ బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు జరిగిన విషయాలు మాత్రం నాకు స్పష్టంగా గుర్తున్నాయి. నిజానికితిలక్‌గారు వచ్చి వెళ్లిన దగ్గర నుండి జరిగిన సంఘటనలే నాకు ఎక్కువ గుర్తు.

ప్రశ్న: మీకు బాగా గుర్తు ఉందంటున్న ఆ విషయం వివరంగా చెప్తారా?


జవాబు: లోకమాన్య తిలక్ మోటారు కారులో శిరిడీ వచ్చారు. ఆయన వెంట ఇద్దరు అనుయాయులు కూడా వచ్చారు. ఆ సందర్భంగా ఆరోజు ఇక్కడ పూనా వంటవాళ్ల చేత లడ్డూలు చేయించారు. దీక్షిత్‌వాడాలో సుమారు మూడువందల మందికి సరిపడా వంట చేశారు. స్థానిక ప్రజలు తిలక్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఆరోజు అక్కడ దాదాసాహెబ్ ఖాపర్డేఅన్నాసాహెబ్ దభోల్కర్కాకాసాహెబ్ గాడ్గిల్కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. తిలక్ బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళాడు. ఆయన తన పూనా తలపాగా తీసి ప్రక్కన పెట్టి బాబాకు సాష్టాంగనమస్కారం చేశాడు. అప్పుడు బాబా"ఏం దాదాబాగున్నావా?" అని కుశలమడిగారు. దానికి తిలక్"మీ కృపవల్ల బాగానే ఉన్నాను బాబా! ఎన్నేళ్ళ నుంచో తమ దర్శనం కోసం ఎదురుచూస్తున్నాను. ఈనాటికి నా కోరిక నెరవేరింది" అని వినయంగా జవాబిచ్చాడు. కాసేపైన తర్వాత తిలక్ సెలవు కోరినప్పుడు"ఖాళీ కడుపుతో బయలుదేరుతావాఏంశుభ్రంగా భోజనం చేసి బయలుదేరండి!" అన్నారు. మీ దర్శనంతోనే నా కడుపు నిండింది. అయినామీరు నన్ను పస్తుగా పంపుతారా ఏమిటిమీ ఆజ్ఞప్రకారం భోజనం చేసే తమ సెలవు తీసుకుంటాను" అని సమాధానమిచ్చాడు తిలక్. అప్పుడు బాబా మా తండ్రిగారితో"షామా! వీరిని మీ ఇంటికి తీసుకొనిపోయి భోజనం పెట్టు!" అన్నారు. తిలక్ అటు మసీదు దాటగానే మా తండ్రిగారు బాబాతో"దేవా! ఇంట్లో అంత వసతి లేదు. అదీగాకఇల్లాలు ఇంటికి దూరంగా ఉన్నది. అయినా వాడాలో 300 మందికి భోజనం సిద్ధం చేసి ఉన్నారు కదా?" అని విన్నవించుకున్నాడు. బాబా మా తండ్రిగారి అభ్యంతరాన్ని లెక్కచేయకుండా"వీరిని మీ ఇంటికి ఆహ్వానించిఉల్లిపాయలతో పులుసు చేసి భోజనం పెట్టు. మిగతా వాళ్ళందరూ వాడాలో భోజనం చేస్తారులే!" అన్నారు. మా తండ్రిగారు అది దైవాజ్ఞగా భావించి తిలక్‌గారిని సగౌరవంగా మా ఇంటికి తీసుకొని వచ్చారు. భోజనం తయారు చేయించితిలక్ కూర్చొనడానికి ఒక పీటఅనుకోవడానికి ఒక పీటవిస్తరి క్రింద ఒక పీట వేసి భోజనం వడ్డించారు. తాత్యాకోతేపాటిల్ తమ ఇంటి నుండి నెయ్యి, పెరుగు పంపాడు. అప్పుడు మా అక్కకు పద్నాలుగేళ్ళు. ఆమే భోజనం వడ్డించింది. భోజనం వడ్డించగానే తిలక్‌గారు"మాధవరావ్ఇదేమిటిఉల్లిపాయలు చేసావునేను ఉల్లిపాయలు తిననే!" అన్నారు. బాబా ఆజ్ఞానుసారమే తాను ఉల్లిపాయలు చేయించానని మా తండ్రిగారు చెప్పారు. "బాబాగారి ఆదేశమైతే అభ్యంతరమేమితప్పకుండా తింటాను" అంటూ తిలక్‌గారు ప్రీతితో భుజించారు. తరువాత మసీదుకెళ్ళిఅక్కడనుండి వాడాకు వెళ్లారు. వాడాలో మిగిలిన అందరికీ భోజనం వడ్డించారు. నేను వారితో భోంచేశాను. కొంతసేపు తిలక్‌గారు వడ్డన చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు తిలక్‌గారికి కాఫీ ఇచ్చారు. షామా కొడుకును గనుక నాకూ ఇచ్చారు. తరువాత తిలక్ మసీదుకి వెళ్ళాడు. మొదట బాబా దర్శనం చేసుకున్నప్పుడు తిలక్ బాబాకు వంద రూపాయలు దక్షిణ సమర్పించారు. మళ్లీ వంద రూపాయలు రెండవసారి కూడా దక్షిణ ఇచ్చారు. మా ఇంటినుండి వెళ్తూ నా చేతిలో వంద రూపాయలు పెట్టారు. తిలక్‌గారు బయలుదేరడానికి బాబా అనుమతినిచ్చివారిని తిన్నగా మన్మాడ్ వెళ్ళమనిదారిలో ఎక్కడా ఆగవద్దనీ చెప్పారు. దారిలో ఏవలాలో సుమారు పదివేలమంది ప్రజలు తిలక్‌కోసం ఎదురుచూస్తున్నారు. అయినా తిలక్ అక్కడ ఆగకుండా నేరుగా వెళ్లిపోయారు. ఏవో కారణాలుగా ఆయన అక్కడ ఆగితే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తర్వాత తెలిసింది.

సోర్స్: సాయిపథం వాల్యూమ్ 2

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo